బీబీ తోరీ కల

[సుగ్రా హుమాయున్ మిర్జా (1882-1958) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత, సంపాదకులు, సమాజ సేవకులు. సరోజినీదేవి సమకాలీనులైన ఈమె దక్కన్ మహిళల ప్రగతికి, అభ్యుదయానికి విశేషంగా కృషి చేశారు. బుర్ఖా లేకుండా హైదరాబాద్ వీధుల్లో తిరిగిన తొలి మహిళ ఈవిడేనని చెప్తారు. బాలికల విద్యని ప్రోత్సహించారు. మహిళల కోసం ప్రత్యేకించిన అన్నీసా, జేబ్-అన్నీసా లాంటి పత్రికలను స్థాపించి, సంపాదకత్వం వహించారు. గాంధీ, నెహ్రూ, జిన్నాలు మొదలుకుని ఆనాటి రాజకీయ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. దేశవిదేశాలు తిరిగి ఆ ముచ్చట్లను సఫర్‌నామాలుగా రాశారు. కథలు, కవిత్వం కూడా రాశారు.

‘బీబీ తోరీ కా ఖ్వాబ్’ సుగ్రా బేగమ్ 1952లో రాసిన చిన్న కథ. మహిళాభ్యుదయమే ఉద్దేశ్యంగా పెట్టుకుని చేసిన రచన అన్నది స్పష్టం. ఇది ఇప్పటివారికి నీతికథగా అనిపించవచ్చు. ఈ అనువాదం చేయడం వెనుక నా ఉద్దేశ్యం–బాలికల విద్య, మహిళల ప్రగతి విషయంలో అప్పటితో పోల్చుకుంటే మనం చాలా ముందంజలో ఉన్నాం. అయినా, కొన్ని విషయాల్లో అంతే వెనకబడి ఉన్నాం– ఇంతటి టెక్నాలజి, విజ్ఞానం, అవగాహన అందుబాటులో లేని రోజుల్లో కూడా స్త్రీలని చైతన్యపరచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలాంటి పద్ధతులు అవలంబించారు అన్నది గుర్తింపుకు తేవడం.

ఇరవయ్యవ శతాబ్దం మొదటిలోనే బుర్ఖాని నిరాకరించగలిగిన మనిషి, మతాన్ని కూడా భూతద్దంలో చూపించచ్చు. కానీ, సుగ్రా బేగం అలా కాకుండా, ఆనాటి స్త్రీలు ఉన్న కుటుంబ, సామాజిక పరిస్థితులను విపరీతంగా సవాలు చేయకుండానే, వారిని ఉత్తేజపరచడానికి చూశారు. అందుకే, ఈ కథలో మీరు గమనిస్తే, ఖుదా ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. స్త్రీ ఏదన్నా చేయడానికి కుటుంబంలో వారి ‘అనుమతి’ అవసరమవుతుంది. అయినా, అటు మౌల్వీలని, ఇటు స్వాములని సవాలు చేస్తుంది. భారతదేశం సుఖశాంతులతో ఉండడానికి హిందూ-ముస్లిముల సఖ్యత ఎంత అవసరమో, అంటరానితనాన్ని నిర్మూలించి కులాల మధ్య వ్యత్యాసాలని రూపుమాపడమూ అంతే అవసరమని ఈ రచన గుర్తిస్తుంది.

పాత లైబ్రరీల్లో, చీకటి మూలల్లో దుమ్ముపట్టిన అరల్లో వెతగ్గావెతగ్గా మాత్రమే దొరికే అమూల్య సాహిత్య సంపదను, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టి, ఉర్దూ సాహిత్యానికి, భాషకీ ఎనలేని సేవ చేస్తున్న రేఖ్‌తా.ఆర్గ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. – పూర్ణిమ.]


దరక్షందా బేగం: అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. ఇప్పటి వరకూ బీబీ తోరీ దావత్ నుంచి తిరిగి రాలేదు. ఖుదాకే తెలియాలి కారణమేమిటో. మోటర్ కానీ దారిలో ఖరాబు కాలేదు కదా. చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు వెంట. అసలే వానాకాలం. ముసురు పట్టి వాన పడుతున్నది కూడా. పిల్లాడికి జలుబు చేస్తుందో ఏమో.

వాళ్ళ పనిమనిషిని పిలిచి తెల్లవారగానే అటు వైపు కబురేంటో తెలుసుకోడానికి బయటకు వెళ్ళి టెలిఫోన్ చేయమంది. షహరియార్ అదూల్ వాళ్ళ బంగ్లాకి టెలిఫోన్ చేసి బీబీ తోరీ ఇంకా ఎందుకు రాలేదో కనుక్కోమంది. పనిమనిషి అలా బయటకు వెళ్ళగానే ఇలా మోటరు దర్వాజా దగ్గరకి వచ్చేసింది. బీబీ తోరీ మోటరు దిగి వచ్చింది.

దరక్షందా బేగం: బేటా, ఇంత ఆలస్యం ఎందుకైంది? నేను నీ కోసం గాభరాపడుతూ ఉన్నాను.

బీబీ తోరీ: అమ్మీ జాన్, పూల అలంకరణ ఖతమ్ అయేసరికి ఆలస్యమైపోయింది. నేనే అందరికన్నా ముందు బయలుదేరిపోయాను. పిల్లాడు కూడా ఉన్నాడుగా నాతో అని. మెహఫిల్ ఇంకా నిండుగా ఉంది, అతిథులెవరూ వెళ్ళిపోలేదు. నాది ఒక్కటే పెద్ద పని. మిగతావన్నీ చిన్న పనులు.

దరక్షందా బేగం: అచ్ఛా, నువ్వింక పడుకో. మీ ఆయన కూడా పరేషాన్ అయ్యారు.

ఆమె తన పడకగదిలోకి వెళ్ళి పడుకుండిపోయింది. తెల్లవారగానే బీబీ తోరీ తన తల్లి, తన వలీదా దగ్గరకి వచ్చి అంది: అమ్మీ జాన్, రాత్రి నాకో వింత కల వచ్చింది. మీరు దీన్ని వివరించి, అర్థం చెప్పండి. ఆపైన నేను మౌలానా ఖ్వాజా హసన్ నిజామీకి కల రాసి పంపించేదా?

దరక్షందా బేగం: చెప్పు, ఏం కల కన్నావ్? ఖుదా శుభం కలిగించుగాక! ‘ఓ మహమ్మద్, నేనొక కలను కన్నాను, అది అలీకి వినిపించాలనుకుంటున్నాను’ అన్న ప్రార్థనతో మొదలుపెట్టు.

బీబీ తోరీ ఈ విధంగా చెప్పింది: నేను చాలాసేపు మెలకువగా ఉండి ఎప్పటికో గాఢనిద్రలోకి జారుకున్నాక ఈ కల వచ్చింది. నేను ఒక రైలులో కూర్చుని వెళ్తున్నాను. దూరంగా ఒక కొండకొమ్ము నుంచి పొగ వస్తుండడం కనిపించింది. ఒక గొంతు, చాలా నీరసంగా నిస్సహాయంతో వినవస్తూ ఉండింది. నాకు మాటలు అర్థం కాలేదు. రైలు స్టేషనులో ఆగింది. నేను కిందకు దిగి నగరంలోకి వెళ్ళాను. అక్కడ ప్రతీ వ్యక్తీ ఒకటే మాట చెప్పారు: ‘ఆ కొండ నుంచి ఎప్పుడూ పొగ వెలువడుతుంది. ఆ గొంతు వినిపిస్తూ ఉంటుంది.’ అందరికీ భయం, అందుకే ఎవరూ పైకి వెళ్ళరు. నేను నా ఇద్దరు నౌకర్లని తోడు తీసుకుని కొండపైకి ఎక్కాను. అక్కడ నాలుగు వైపులా చూశాను. ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటిముందు వేలాడుతున్న ఒక పంజరంలో చూడచక్కనైన పిట్ట ఒకటి బందీగా ఉంది. నేను విన్న గొంతు ఆ పిట్టదే. దాని నోట్లోంచి వస్తున్న పొగే కొండంతా పరుచుకుంటూ ఉంది.

దృఢమైన శరీరంగల ఒక యువకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. మామూలు పిట్టలు కూడా కొన్ని సరదాగా ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నాయి అక్కడ. వాటితో అతను ఆడుకుంటూ ఉన్నాడు. బందీగా ఉన్న అందమైన పిట్ట నన్ను చూడగానే మెడ తిప్పుతూ, అరవడం మొదలెట్టింది. నేను దాని దగ్గరకి వెళ్ళాను. స్వేచ్ఛగా తిరుగుతున్న పిట్టలు నన్ను చూడగానే బెదిరిపోయి ఎగిరి చెట్టుపైకి వెళ్ళి కూర్చున్నాయి. అక్కడే కూర్చుని ఉన్న ఆ యువకుడు నా దగ్గరకు వచ్చి చాలా దురుసుగా నన్ను అడిగాడు, ‘మీరు ఎవరు? ఇక్కడకి ఎందుకు వచ్చారు?’ నేను జవాబివ్వలేదు. పంజరం దగ్గరికి వెళ్ళాను. పంజరం కిందకు దించబోయాను.

అతను అన్నాడు: మీరు దీన్ని తీసుకెళ్ళలేరు. ఇది నా రాజ్యం. నేను దీని మాలిక్‌ను.

నేను అన్నాను: నువ్వెంత ఖరీదు చెప్తే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ పిట్టను ఇవ్వు.

అతను అన్నాడు: ఎట్టి పరిస్థితుల్లోను నేను మీకు ఈ పిట్టను ఇవ్వలేను. ఈ పిట్టకి మనుషుల మాటలు వచ్చు. గడిచిన కాలపు కబుర్లు చెప్పగలదు.

నేను అన్నాను: నేను దీన్ని తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు నన్ను ఆడదానినని అనుకోవద్దు. నేను ఆడరూపంలో ఉన్న మగవాడిని.

నేను నా పిస్తోలు తీసి అతనితో అన్నాను: చూడు, నువ్వు నన్ను తీసుకెళ్ళనివ్వకపోతే దీనితో నీ అంతు చూస్తాను.

అతను పిస్తోలు చూడగానే భయపడిపోయి వణికిపోయాడు. ఆ మగమనిషి బలవంతుడు. అయినా వెంటనే పంజరం తీసి నాకు ఇచ్చేశాడు. నేను పంజరాన్ని తీసుకుని, నా నౌకర్ల చేతికి ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరాను.

పిట్ట నాతో అరుస్తూ అంది: నన్ను విడుదల చేయి. చూడు, నేను నీకు ఎన్ని తమాషాలు చూపించగలనో!

నేను పంజరం తెరిచాను. పిట్ట ముందు ముందు నడుస్తుంటే, నేను వెనుక వెనుకే నడుస్తూ ఉన్నాను. పిట్ట నన్ను ఎంతో వైభవంగా ఉన్న ఒక ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇంటి ముందు చాలా అందమైన తోట ఉంది. చాలా అందంగా ఉండి ముద్దొస్తూ ఉన్న ఒక అమ్మాయి మంచం మీద రోగంతో పడుకొని ఉంది. ఆమె ‘ఓ ఖుదా, వేడుకుంటున్నాను’ అని అంటూ ఉంది. బక్కచిక్కి ఉన్న ఒక ఆడమనిషి ఆ అమ్మాయి మంచం చివర కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇంకొందరు ఆడమనుషులు అటూ ఇటూ తిరుగుతున్నారు.

లావుగా, వికృతంగా ఉన్న ఒక ఆడమనిషి నా దగ్గరకు వచ్చి, నాతో అంది: నువ్వెవరు? ఎందుకు వచ్చావ్?

నేను అన్నాను: ఖుదా పంపిన ఫరిష్తాను నేను. ఈ రోగికి వైద్యం చేయడానికి వచ్చాను.

తర్వాత ఆ రోగి దగ్గరకి వెళ్ళాను. ఆమెనే అడిగాను: ఏమిటి నీ బాధ?

ఆమె ఎంతటి వేదనలో ఉందంటే జవాబు కూడా ఇవ్వలేకపోయింది. బక్కపల్చని ఆడమనిషి వైపుకు సైగ చేసింది, ఆమెని వివరాలు అడగమని. నేను ఆమెను పిలిచి అడిగాను: అంతా నిజం చెప్పు, నేను ఆమెకి సహాయం చేయడానికే వచ్చాను.

ఆ బక్కపల్చని ఆడమనిషి వెక్కి వెక్కి ఏడుస్తూ నాతో ఇలా అంది: మీరు నిజంగానే కరుణ నిండిన ఫరిష్తా, ఈ నిర్జన ప్రదేశంలోకి వచ్చారు. లేకపోతే ఇక్కడికి ఎవరు వస్తారని? ఈ రోగి నా కూతురే. నాకు మిగిలిన ఏకైక సంతోషం. నా ముసలితనంలో ఆసరా. నా కంటి వెలుగు. నా గుండెకి హాయినిచ్చేది ఈ అమ్మాయే. అది నా కడుపులో ఉన్నప్పుడు ఆమె తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. రోజులన్నీ దీన్ని చూసుకునే గడిపాను. బాగా ధనవంతుడు, అదృష్టవంతుడైన ఒకడికి ఇచ్చి పెళ్ళి చేశాను. నా దగ్గర ఉన్నదంతా వాడికే ఇచ్చాను. వాడా డబ్బంతా వెదజల్లాడు. కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరూ పోయారు. నా బిడ్డ తన బిడ్డలు పోయారన్న దిగులుతో జబ్బుపడింది. భర్త వెనకకు తిరిగివచ్చి భార్యని చూసే పరిస్థితి లేదు.

చూడండి, ఆ లావుపాటి నల్ల ఆడమనిషి, అటూ ఇటూ సంతోషంగా తిరుగుతుందే, ఆమే పిల్లల పాలదాయి. ఇప్పుడు ఇంటికి మహారాణి అయ్యి కూర్చుంది. రేపు ఇంటి ఖర్చులూ ఆమె చేతికే వెళ్ళిపోతాయి. నెలకి పది రూపాయలు ఇస్తాడు, అందులోనే జబ్బుకి కావాల్సినవన్నీ చూసుకోవాలి. నేనే విధవ తల్లిని, నాకు వారసులు లేరు. డబ్బూ లేదు. నేను నా కూతురుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఎలా జబ్బుకి వైద్యం చేయించాలి? దిగులుగా ఉంది.

ఇవి చెప్పేసి ఆమె ఏడుపందుకుంది. నాకు ఈ వేదనాభరితమైన కథ విని చాలా బాధ వేసింది.

నేను అన్నాను: నిన్నూ మీ అమ్మాయినీ నా వెంట తీసుకెళ్తాను. వైద్యం చేయిస్తాను. వెంటనే తయారవ్వండి.

ఆమె తన అల్లుడు దగ్గరకి వెళ్ళింది. అతను అనుమతి ఇచ్చేశాడు. ఆమె వెళ్ళిపోవాలనే అతనికీ ఉంది, మైదానం సాఫు అవుతుందని. క్షయ రోగం ఆమెకి. ఎవరు చేయిస్తారు వైద్యం?

కానీ అమ్మాయి మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఆమె తల్లితో అంది: అమ్మీ, ఇప్పుడు బతికి బట్టకట్టేలా లేదు నా పరిస్థితి. వేరేవాళ్ళ చోటులో చనిపోవడం దారుణం. నేను ఇక్కడ ఉండడమే మంచిది. భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన చేతుల మీదుగా పోతే మంచిది. ఈ బీబీ కేవలం ఖుదా కోసం దిక్కూ మొక్కూ లేనివాళ్ళకు సహాయం చేయడానికి బయలుదేరింది. అలాంటప్పుడు నేనెలా వెంట వెళ్తాను? నన్ను ఇలానే చావనీ, విసిగించకు.

నేను ఇదంతా విని ఆ అమ్మాయితో అన్నాను: నిన్ను ఊరడించడానికి వచ్చిన చెలిమిని అనుకో. పరాయి అనుకోకు. నేను ఒక నెలా పదిహేను రోజుల్లో నీకు వైద్యం చేయించి, మళ్ళీ మీ ఇంట్లోనే దిగబెట్టేసి వెళ్తాను. నువ్వు నాకీ ఉపకారం చేయి. ఎందుకంటే ఖుదా నా మీద ఇంత దయ చూపిస్తున్నది, నీలాగా అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేయడానికే. నేను సహాయం చేయాలనుకోవడం, దానికోసం బయలుదేరడం, సహాయం చేసే అవకాశాలు దొరకడం – ఇవ్వన్నీ ఖుదా దయ వల్లే. నీకు గానీ సహాయం చేయగలిగితే, దాని వల్ల నీకు మంచి జరిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. పద, నాతో పాటు పద.

అతి కష్టం మీద ఆ బీబీ నాతో రావడానికి సిద్ధమైంది. వాళ్ళని వెంటబెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరాను.

పిట్ట వచ్చి చేతిపై కూర్చుండిపోయింది. పద, అక్కడున్న ఇళ్ళన్నీ చూద్దువు గానీ, అంది. ఒక ఇంటి లోపలకి నేను వెళ్ళాను.

ఒక ఆడమనిషి కూర్చుని ఉంది. ఆమె నలుగురు మగపిల్లలూ బాగా జబ్బుపడి ఉన్నారు. ఇద్దరు చిట్టి చిట్టి ఆడపిల్లలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు. చలిగా ఉంది, వాన పడుతోంది. ఒంటి మీద నూలుపోగు లేదు. నేను ఆ ఆడమనిషి దగ్గరకి వెళ్ళి పరిస్థితులు విచారించాను.

ఆమె చెప్పింది: నా భర్త చనిపోయాడు. నాలుగు నెలలు అవుతోంది ఇప్పటికి. దిక్కూ మొక్కూ లేదు. సహాయం చేసేవాళ్ళు లేరు. బిచ్చమెత్తుకోవడానికి బయటకి వెళ్ళలేను. మర్యాదస్తురాలిని, మంచి దారిలో నడిచేదానిని. ఒక్కదాన్నే ఉన్నాను. ఎన్నో రోజులుగా దిగులుపడుతూ ఉన్నాను.

నేను అన్నాను: నేను చెప్పేది నువ్వు వినేట్టు అయితే, నేను నీకు సహాయం చేయగలను.

ఆమె అంది: మీరేం చెప్పినా వినడానికి తయారుగా ఉన్నాను.

నేను అన్నాను: ఈ నలుగురు మగపిల్లలని ఈ క్షణాన్నే దవాఖానాకి పంపించు. నా నౌకర్లు బయటే ఉన్నారు. ఆడపిల్లలని అనాథ శరణాలయానికి పంపించు. నువ్వు నాతోపాటు రా, నాతో ఉండు. నేను నీకు బట్టలు, తిండి పెడతాను. నీ పిల్లలకి నయమైపోయాక వాళ్ళకి ఎక్కడో చోట నౌకరీలో పెట్టిస్తాను. నువ్వు హైరానా పడకు.

ఆమెని కూడా ఆ బండిలో కూర్చోబెట్టుకున్నాను. అబ్బాయిలని దవాఖానాకు పంపించి వేశాను. అమ్మాయిలని అనాథ శరణాలయానికి పంపి నేను అక్కడ నుంచి బయలుదేరాను.

పిట్ట వచ్చి నన్ను ముద్దాడి, మళ్ళీ ఎగురుతూ ఒక గలీ లోకి నన్ను తీసుకెళ్ళింది. అక్కడ పెద్ద పేరున్న ఒక మతగురువు విలాసంగా పడుకుని ఉన్నారు. శిష్యురాళ్ళలో కొందరు ఆయన నెత్తికి నూనె పెడుతున్నారు. కొందరు బాదం పప్పుతో మిఠాయి చేస్తున్నాను. ఇంకొకరు కాళ్ళు ఒత్తుతున్నారు.

అక్కడ కూర్చుని ఉన్న ఒక ఆడమనిషి అంది: గురువుగారు ఇప్పుడు మెలకువగానే ఉంటారు.

నేను బెదురు లేకుండా ఆయన గదిలోకి వెళ్ళి అన్నాను: అజీ, మౌల్వీ సాబ్! లేవండి, ఇది నిద్రపోయే సమయం కాదు. ఇస్లామ్ ప్రమాదంలో ఉంది. లేవండి, తబ్లీఖ్ ఇస్లామ్ సమూహం తయారుచేయండి. లా అలీ అలీషా నినాదాలు చేయండి. మీరు విశ్రాంతిలో ఉన్నారు. నిరాశకి చిరునామా మీరు.

మౌల్వీ సాబ్ వెంటనే లేచి కూర్చున్నారు. రెండు చేతులతో గడ్డం గోక్కున్నారు. బోడిగుండుపై చేయితో రుద్దుకోవడం మొదలెట్టారు.

మౌల్వీ అన్నారు: ఎవరు మీరు, నా విశ్రాంతిని భంగపరిచారు?

నేను అన్నాను: నేను మీ విశ్రాంతిని భంగపరచలేదు. నిజమైన విశ్రాంతి, ఆనందం మీకు కలగడానికే నిద్ర లేపాను. అసలు మీలాంటివారు మెలకువగా ఉంటే ఇస్లాముకి ఇలాంటి కష్టం వచ్చేదేకాదు. లేవండి, వెంటనే లేచి, ఇప్పటికిప్పుడు తక్కిన గురువులందరినీ పిలవండి. ఒక జల్సాకి పిలుపునివ్వండి. ఒక్కొక్క మతగురువుని, మౌల్వీని ఒక్కొక్క గ్రామానికి, జిల్లాకి, నగరానికి పంపండి. తిరుగుబాటు లేవకుండా అంతమొందించండి. ఇస్లాముని ఏకం చేయడానికి ధనం అవసరం అవుతుంది. మీ మగవాళ్ళకి హుకుం ఇవ్వండి, చందాలు ఇవ్వమని.

మౌల్వీ సాబ్ తన గడ్డాన్ని రెండు చేతులతో సాఫు చేసుకుంటూ ఏదో ఆలోచనలో పడిపోయారు. వెంటనే తన శిష్యులని పిలిచారు. జల్సాకి పురమాయించారు. ఒక్కో మౌల్వీని ఒక్కో ఊరికి పంపారు.

నేను వాపసు బయలుదేరుతుండగా మౌల్వీ సాబ్ నాకు ధన్యవాదాలు చెప్పారు. ‘నాలాంటి నిద్రపోతున్నవాణ్ణి లేపావు, ఖుదా నీకు మంచి చేయుగాక’ అని అన్నారు.

బీబీ తోరీ: అమ్మీ జాన్, ఆయన గడ్డం ఎంత పొడుగుందో… నాకు ఇప్పటికీ నవ్వు వస్తోంది. ఇద్దరు ఆడవాళ్ళు ఆయన గడ్డాన్ని దువ్వుతూ ఉన్నారు.

దరక్షందా బేగం: చాలా శుభసూచకమైన కల, అయిపోయిందా?

బీబీ తోరీ: లేదు, ఇంకా మిగిలే ఉంది. గెడ్డం గుర్తురాగానే నవ్వు వచ్చిందంతే! అందుకే కల మధ్యలో ఆపాను.

పిట్ట నాతో అంది: పద నిన్ను వేరే చోట్ల తిప్పుతాను.

అది నన్ను ఒక నిర్జన శ్మశానంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక సమాధి దగ్గరకు వెళ్ళాము. చూశాను కదా, అక్కడ ఒక ఆడమనిషి. ఆమె చాలా సన్నని సెగపై కాలుతూ ఉంది. ఆమె వేడి భరించలేక ఆ సమాధి నుంచి బయటకు వస్తే పాములు ఆమె నోటిని, నాలుకని కాటువేస్తాయి.

నేను ఆ ఆడమనిషిని గుర్తుపట్టి అన్నాను: మీరు నమాజీ కదా? రోజు రోజు తప్పనిసరిగా నమాౙులు ఖచ్చితమైన సమయాల్లో చదివేవారు. ఖురాన్ ఎప్పుడూ చదివేవారు. చుట్టుపక్కల వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి వెళ్ళేవారు. మీరు మూడుసార్లు హజ్‌కి వెళ్ళొచ్చారు. అయ్యో, మరి ఖుదా ఎందుకు మిమ్మల్ని ఇలా కాలుస్తున్నాడు?

ఆ ఆడమనిషి చెప్పింది: నిజానికి నేను నమాౙు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. రోౙా కూడా తప్పనిసరిగా ఉండేదాన్ని. ఎప్పుడన్నా రోౙా చేయడం కుదరకపోతే మళ్ళీ వీలు కుదరగానే చేసేదాన్ని. హజ్‌కి వెళ్ళాను. చేయాల్సిన దానాలన్నీ చేశాను. కానీ అమాయకుల వీపు వెనుక మాట్లాడేదాన్ని. వాళ్ళ మధ్య గొడవలు పెట్టేదాన్ని. అబద్ధాలు చెప్పడం నా పని. నేను వయసు మళ్ళినదాన్ని కాబట్టి బాగానే పేరుంది. ప్రతీ వ్యక్తీ నేను చెప్పిందే నిజమనుకునేవారు. నా కారణాన ఇళ్ళల్లో గొడవలు ఎక్కువగానే జరుగుతూ ఉండేవి. తల్లీ కూతుళ్ళు విడిపోయారు. తోబుట్టువుల మధ్య తగాదాలు వచ్చాయి. ఆలూమగలూ విడిపోయారు. జనాలకి డబ్బులు అప్పు ఇచ్చేదాన్ని. లాభాల కోసం బేరాలు ఆడేదాన్ని. వచ్చిన వడ్డీతో అప్పుడప్పుడూ మంచి పనులు చేసేదాన్ని. కానీ ఎవరికీ అప్పులు మాఫీ చేయలేదు. ఎప్పుడూ! మా అత్తగారు చాలా మంచి మనిషి. ఆవిడ అన్నారని ఉన్నదీ లేనిదీ కల్పించి చెప్పి భర్తని ఆమెకి దూరం చేశాను.

ఖుదా దర్బారులో నా వంతు రాగానే నా పేరు నల్లని అక్షరాలతో రాసుండడం కనిపించింది. నేను అది చూసి పరేషాను అయ్యాను. అలా ఏ కారణం చేత జరిగిందోనని కనుక్కుంటే జవాబొచ్చింది: నువ్వు నన్ను కొలిచావు, కానీ నేను ఎంతో ఇష్టంగా సృష్టించుకున్నవాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టావు. ఎందరి మనసులనో కష్టపెట్టావు. చాడీలు చెప్పి ఎంత మందిని సతాయించావో వాళ్ళందరినీ క్షమాభిక్ష అడుగు. వాళ్ళు క్షమించేస్తే నేను కూడా కరుణిస్తాను. నువ్వు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. ఒకవేళ నా పట్ల అపరాధం చేసుంటే నేనే క్షమించి ఉండేవాణ్ణి.

ఇది విని నాకు మతి పోయింది. నేను ఇప్పుడు లోకంలోకి వెళ్ళలేను, వాళ్ళందరిని క్షమాపణలు అడగలేను. మీరే లోకులకు చెప్పండి, నమాౙు రోౙా చేయడం ఖుదాని ఆరాధించడమే. అయినా ఎవరి మనసూ నొప్పించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. చాడీలు అసలే చెప్పకూడదు. ఇద్దరి మధ్య గొడవలు పెట్టకూడదు. వీటికి మించిన అపరాధాలు ఏమీ ఉండవు.

నేను అన్నాను: మంచిది, ఇక నేను లోకానికి తిరిగి వెళ్తాను. నువ్వు ఎవరెవరికి తగాదాలు పెట్టావో వాళ్ళ పేర్లు చెప్పు.

అక్కడనుంచి బయలుదేరి నేను ఇంకో సమాధికి చేరుకున్నాను. అక్కడ తక్కువ వయసుగల అందమైన బీబీ ఒకామె సింహాసనం మీద కూర్చుని ఉంది. పూలు, అత్తరు సువాసనలతో ఆమె గుబాళిస్తోంది. దేవకన్యలు ఆమె సేవలో ఉన్నాయి. నేను ఆమె దగ్గరకి వెళ్ళాక, ఆమె చాలా హుందాగా అంది: రండి బెహన్, కూర్చోండి.

నేను అన్నాను: మీరు లోకంలో ఏమేమి మంచి పనులు చేశారు, వేటి వల్ల మీకు ఇంతటి దర్జా లభించిందో కనుక్కోవాలని వచ్చాను.

ఆమె అంది: నేనేమీ గొప్ప పనులైతే చేయలేదు, వాటికి బదులుగా ఇది దొరికిందనుకోవడానికి. కేవలం ఖుదా దయ వల్లే నాకీ దర్జా దొరికింది. నా దగ్గరకి ఒక అనాథ పిల్లవాడు వచ్చాడు. నేను నెలనెలా ఐదు రూపాయలు ఖర్చు చేసి ఫీసు కట్టి స్కూలులో చదివించాను. వాడు చదువుకుని ప్రయోజకుడయ్యాడు. వాడికి నౌకరీ ఇప్పించాను. పెళ్ళి చేయించాను. ఇవ్వన్నీ చేస్తూ ఏదో ప్రతిఫలం ఆశించలేదు. నేను నా అత్తగారిని ప్రత్యేక శ్రద్ధతో చూసుకున్నాను. ఆవిడని గౌరవించాను. ఆవిడ జబ్బుపడినప్పుడు ఎంతగానో సేవలు చేశాను. ఆవిడ ఆత్మ నాకు తోడుగా ఉంది. ఇక మీరు లోకులకు చెప్పండి, దేవుడు సృష్టించినవారిని వీలైనంతవరకూ నీతి నియమాలతో సేవించమని, అప్పుడే మరణానంతర జీవితం బాగుంటుంది. బెహన్, నేను నా కర్మలన్నింటిలోనూ ఇవే నీతి నియమాలను పాటించాను. నేను నీతి గల పనులు చేశానని, నా వేరే పాపాలని కూడా ఖుదా ఈ కారణం వలనే మన్నించి వేశాడు.

పిట్ట నన్ను ఒక నది ఒడ్డుకి తీసుకుపోయింది. అక్కడ ఒక సాధువు కూర్చుని ఉన్నాడు.

నేను అన్నాను: నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. లే, అంటరానితనాన్ని నిర్మూలించు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమని కలిగించు. హిందువులు తమలో తాము మతం గురించి కొట్టుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వగైరా కులాలన్నింటిని ఒకటి చేయండి. హిందూ ముస్లిములని కలపండి. లోకంలో శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసేస్తే, ఆ పైన అందరం కలిసి ఆరాముగా జీవితాన్ని గడుపుదాం. మతం, జాతి, దేశాల ప్రగతి మీలాంటి వారి చేతుల్లోనే ఉంది.

సాధువు నా మాటలు విన్నాడు.

నేను పిట్టని అడిగాను: అచ్ఛా, అసలు ఇది చెప్పు, నువ్వెవరు? ఎవరి ఆత్మవి? మనుషుల భాష ఎలా నేర్చుకున్నావు?

పిట్ట చెప్పింది: మా నాన్న బతికి ఉన్నప్పుడు ఒక రైతు. అడవిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని, పొలం గట్టు మీద ఉండేవాళ్ళం. నేను మా నాన్న పనులన్నీ చేసి పెట్టేదాన్ని. రాత్రంతా కూర్చుని ఆయన కాళ్ళు పట్టేదాన్ని. అమ్మకి సేవ చేసేదాన్ని. మా బాబాయి ఒకరు కటిక పేదవాడు. ఆయన కోసం రమ్‌జాన్‌లో ప్రతీరోజూ రోౙా విడిచాక ఆయనకు ఇఫ్తారీ భోజనం పంపేదాన్ని. ఆయన ఇంటి వరకూ నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఆయన రోౙా విడిచాక నన్ను ఎంతగానో ఆశీర్వదించేవారు. మా బాబాయికి జబ్బుచేసి పరిస్థితి చాలా దారుణంగా అయింది. నేను ఆయనకు వైద్యం చేయించాను. మందులు తాగించాను. ఆయన కొన ఊపిరి వరకూ ఎనలేని సేవలు చేశాను. ఆయన లెక్కలేనంతగా నన్ను దీవిస్తూనే ఉన్నారు.

ఆ దీవెనల వల్ల నేను లోకంలో బతికి ఉన్నంత వరకూ అత్యంత గౌరవ మర్యాదలతో జీవితం గడిపాను. నగరాల బాద్‌షా ఒకరు వేటకని బయలుదేరాడు. మా పొలం గుండా వెళ్తుండగా నన్ను చూసి, నన్ను తనకివ్వమని మా నాన్నని అడిగాడు. వెంటనే, నాకు సంబంధం కుదిరిపోయింది. అలా నేను నగరాల రాణిని అయ్యాను. పరిపాలన నా చేతుల్లో ఉంది. అదృష్టం నా గులాము. సంపద నా గుప్పిట్లో. పరువు మర్యాదలు నాకోసం వెంపర్లాడేవి. భోగాలలో మునిగాను. అంతటి భోగంలోనూ పేదల గురించి ఆలోచించాను. నేను ఎక్కడినుంచి వచ్చానన్న సంగతి అసలు మర్చిపోలేదు. పొగరూ గర్వాలని దగ్గరికి రానివ్వలేదు. మా పేదరికంలో మమ్మల్ని బాగా సతాయించిన చుట్టాలకి పెద్ద పెద్ద హోదాలు ఇప్పించాను. మంచి పనులే చేశాను. మంచితనంతోనే చేశాను.

నేను లోకం విడిచాక ఖుదా-వంద్-కరీమ్ నా పట్ల సంతోషంగా ఉన్నాడు. నా పేరు పూలతో రాసుందని చూసి నౌకర్లని, గులాములని సంతోషంగా వెంట తీసుకొచ్చాను. ఖుదా నాకేం కావాలో అడిగాడు. నేను, నాకు పిట్టలా మారాలని ఉందని చెప్పాను. స్వేచ్ఛగా, హాయిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. మనుషుల మాటల మాట్లాడాలని కోరుకున్నాను. వెంటనే నన్ను పిట్టగా మార్చేశాడు. మనుషుల మాటలు వచ్చేశాయి. ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంటాను.

పంజరంలో ఉండడానికి కారణమేమిటంటే, ఒకసారి నాది ముత్యాల గొలుసు ఒకటి పోయింది. నేను నా దగ్గర పనిచేసే ఆడమనిషి మీద నింద వేశాను. ఆమెకి కఠినశిక్ష విధించాను. దానికి బదులుగానే నేను కొన్ని రోజులు బందీగా మారాను. మీరే నన్ను విడిపించారు. నాకు ఎప్పుడన్నా చాలా కోపం వస్తే నా నోటి నుంచి పొగ వస్తుంది. అదే చుట్టూరా వ్యాపిస్తుంది. నా గొంతులో ఎంత బలం ఉందంటే అది ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్ళగలదు. నేను అన్ని విధాలుగా సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను. కొండ శిఖరం మీద నేను కూర్చుని అరుస్తుండగా మీరు నా సాయం కోసం వచ్చారు.

బీబీ తోరీ: అమ్మీ జాన్, ఇంతే, ఇక్కడ వరకే కల చూశాను. అంతలోనే కళ్ళు తెర్చుకున్నాయి. చూస్తే, తెల్లారిపోయింది. నమాౙ్ చదవడానికని లేచాను. పిట్టాలేదు, పేదలూ లేరు.

దరక్షందా బేగం: బేటీ, చాలా శుభసూచకమైన కల. ఇన్‌షా అల్లా నీ ద్వారా తన సృష్టిలోని జీవాలని అనుగ్రహించదలిచాడన్న మాట. నువ్వు పేదలకి సాయం చేస్తావు. దీపంలా వెలిగిన ఆ పిట్టకి విడుదల దొరికింది. నువ్వు ఏది అనుకుంటే అది ఖుదా పూర్తి చేస్తాడు. నీ కలంలోను, గొంతులోనూ ఖుదా అలాంటి దివ్య తేజస్సునే నింపుతాడు. నువ్వు ఒక నగరానికి ఉత్తరం రాస్తే ఇంకో నగరంవాళ్ళు దాన్ని అమలుపరుస్తారు.

ఈరోజు నుంచి నీకు అనుమతి ఇస్తున్నాను, పేదల ఇంటికి నిరభ్యంతరంగా వెళ్ళు. వాళ్ళ పరిస్థితులు గమనించు, నీకు చేతనైనంత సాయం చేయి. నువ్వు పెద్దింటి అమ్మాయినని, ధనవంతుల భార్యనని అనుకోవద్దు. నిన్ను నువ్వు మట్టి అనుకో. నిన్ను నువ్వు మట్టి అనుకున్నప్పుడు నీలోంచి చెట్లు మొలుస్తాయి. నీడ వస్తుంది, పళ్ళూ పూలూ వస్తాయి. దీని వల్ల నీ గౌరవం పెరుగుతుంది. నీ భర్తనుంచి కూడా అనుమతి తీసుకో. ఆ ఖుదా-వంద్-కరీమ్, నీకు దివ్యమైన ప్రేరణ కలిగించాడు. ఇది కల కాదు, మార్గనిర్దేశం. దీన్ని పూర్తి చేయడం నీ కర్తవ్యం. ఖుదా దృష్టిలో నీ దర్జా ఎక్కువ. అందుకే ఇలాంటి కల వచ్చింది. లేకపోతే, ఇంత పొడుగాటి కల ఎవరికీ గుర్తు కూడా ఉండదు.

(1952)

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...