ఆమె ఇల్లు

‘ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ అన్న పత్రిక ప్రకటన చూడగానే ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది అహల్య. ఆఫీసు అయ్యాక వచ్చే దారిలో ఆ ఇంటిని చూడాలి అనుకుంటూ లంచ్‌బాక్స్, నీళ్ళ సీసా తీసి హేండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని స్కూటీపై ఆఫీసుకు బయలుదేరింది.

ఆమె ఉద్యోగం చేస్తున్న ఆడిటర్ ఆఫీసు మందవెళిలో ఉంది. మఱైమలైనగర్ నుండి బయలుదేరి ఆఫీసుకు చేరుకోవాలంటే ఒకటిన్నర గంట పడుతుంది. సరైన టైముకు ఆఫీసుకు వెళ్ళకుంటే సగం రోజు జీతం కత్తిరిస్తారు. పత్రికల్లో వచ్చే అద్దె ఇళ్ళ గురించిన ప్రకటనలను రోజూ తప్పకుండా చదువుతుంది. ఎన్నో సార్లు ప్రకటనలలో ఉన్న ఇళ్ళకు నేరుగా వెళ్ళి చూసి వివరాలవీ కనుక్కుని వచ్చేది.

మఱైమలై నగర్‌లో రెండు బెడ్రూమ్ ఫ్లాట్ లోన్‌లో కొనుక్కుని ఆ ఇంట్లోకి వచ్చి నాలుగేళ్ళు దాటినప్పటికీ ఆమెలోని ఇల్లు వెతికే ఆశ మాత్రం వొట్టిపోలేదు. పెళ్ళి గురించిన కల ఆమెలో మొదలైనప్పుడే ఇంటి గురించిన ఆశ కూడా చిగురించింది. సొంత ఇంటికోసం కలలు కనని ఆడవారుంటారా ఈ ప్రపంచంలో?

ఆడవాళ్ళకు ఇల్లు అన్నది కేవలం నివసించే చోటు కాదు; అదొక మాయల వనం. ఇంట్లోకి రాగానే ఆడవారు మరో రూపం దాల్చుతారు. మగవాళ్ళు ఎప్పుడూ పసిగట్టలేని వినోదం, రహస్యం, సుగంధం ఇంట్లో ఉంటాయి. మగవాళ్ళు ఇంటిని వాడుకుంటారు; ఆడవాళ్ళు ఇంటిని తీర్చిదిద్దుతారు.


అహల్య వాళ్ళ నాన్నకి విద్యుత్ శాఖలో ఉద్యోగం కావడంతో, ఆమె చిన్నప్పట్నుండే గవర్నమెంట్ క్వార్టర్స్‌లో పెరిగింది. వెలిసిపోయి, పెచ్చులూడే గోడలు, వెయ్యడానికి వీలు కాని కిటికీలు, కప్పలు దూరే స్నానాలగదులు, పొగ తప్పించుకుని బయటకు వెళ్ళడానికి దారే ఉండని వంటగదులు ఉండే ప్రభుత్వ క్వార్టర్స్‌లలో నివాసం అన్నది భరించలేని శిక్షే.

గవర్నమెంట్ క్వార్టర్స్ కట్టేవారు, అవి మనుషులు నివసించడానికి అన్న ఆలోచన లేకుండా కడతారు కాబోలు. ఇల్లు అనే పేరుతో వాటిని కాస్త పెద్దసైజు సమాధుల్లా కడతారు. ఆమెకు ఊహ తెలిసిన రోజునుండి విశాలమైన ఇంట్లో జీవించలేదు. లోయక్ కేంపులో ఉన్నప్పుడు, వాళ్ళ ఇంటిలోకి పద్దాకా పాములు వచ్చేసేవి. అమ్మ భయపడి కేకలేసేది. వర్షం పడితే చాలు, కారే కప్పుతో ఇల్లంతా నీళ్ళమయం. నిద్రపోయే పిల్లల మీద వర్షం పడకూడదని నీళ్ళు కారని ఒక చోటుకు పిల్లల పడకని జరిపేసి కారే చోట్లంతా అలూమినియం గిన్నెలు పెట్టేది అమ్మ.

ఎన్నో రాత్రులు అలా ఆ అలూమినియం గిన్నెలో పడే చుక్కల చప్పుడు వింటూ నిద్రపట్టక పడుకుని ఉండేది అహల్య. గిన్నె అంచు మీద పడిన చుక్కనుండి ఎగిరే తుంపర్లు తన మీద పడినప్పుడు ఒళ్ళు ఝల్లుమనిపించేది. అలాంటి రోజుల్లో వానకు కారని గదులుండే పెద్ద ఇంటి గురించి, వెచ్చని పరుపులున్న పక్క గురించీ కలలు కనసాగింది. ఇంటి గురించిన ఆమె కల ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతూ వచ్చింది.

కారే ఇంటిని గురించి అమ్మ ఎంత విసుక్కున్నా, నాన్న దాన్ని చెవిన పెట్టుకున్న పాపాన పోలేదు. నాన్న తన జీవితకాలంలో తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు. మదురైలో ఇల్లు కొనడం గురించి అమ్మ ఎన్నిసార్లు ప్రస్తావించినా ‘రిటైరయ్యాక మన సొంత ఊరిలో ఉండే తాతలనాటి ఇంట్లో ఉండిపోదాం’ అని చెప్పి అమ్మ నోరు మూయించేవాడు.

ఆ అవసరమే రాకుండా, తన యాభైమూడవ ఏటే నాన్న పోయాడు. అమ్మ పరిస్థితే దారుణం. ఆమెకు ఇప్పుడు అరవై అయిదు ఏళ్ళు. కూతురి ఇంట్లో వచ్చి ఉండను అంటూ ఒక్కో కొడుకు ఇల్లూ తిరుగుతూ అవమానాల పాలవుతూ ఉంది. ‘ఇల్లు లేని వారికి ప్రశాంతమైన నిద్ర ఉండదు’ అంటారు. అమ్మకు ఇప్పటిదాకా ప్రశాంతమైన నిద్ర అన్నదే లేదు. చీకట్లో ఒక ఆకు రాలే శబ్దం వినబడినా చాలు, తక్షణమే లేచేస్తుంది.

ఆ అలవాటు అహల్యకూ వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే హాస్టల్‌లో ఉన్న రోజులు మాత్రమే అహల్య గాఢంగా నిద్రపోయిన రోజులని చెప్పుకోవచ్చు. అందునా ఆ హాస్టల్ ఒక కొండ కింద ఉండేది. పొద్దున పూట చల్లగా వీచే గాలికి లేవాలనే అనిపించేది కాదు. ఇంకాసేపు ముడుక్కుని పడుకునేది.

అప్పుడు తనకు అనిపించేది, ఇలాంటి కొండ కింద ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అని. అలా అనుకోగానే ఆ ఇల్లు ఎలా ఉండాలి, గోడల రంగేంటి, ఎలాంటి సోఫా వెయ్యాలి అని ఆలోచనలు సాగేవి. వంటగదీ హాలూ పెద్దవిగా పెట్టుకోవాలి. పొయ్యికి ఎదురుగా ఒక రివాల్వింగ్ చెయిర్ వేసుకోవాలి, అప్పడే ఎటువైపుకు తిరగాలన్నా సౌకర్యంగా ఉంటుంది అనుకునేది. ఆ గదిలో పెద్ద కిటికీ ఉండాలన్నది తప్పనిసరి. ఇంటి పెరట్లో కూరలకు, ఆకుకూరలకూ పాదులు వేసుకోవాలి. ఆ హాస్టల్ గదిలో అలా పడుకుని తన డ్రీమ్ హౌస్‌ను కట్టుకుంటూ ఉండేది.

కొన్ని సార్లు ‘ఏంటో నేనూ నా పిచ్చీ’ అని ఆమెకు అనిపించేది. అయినా, అలాంటొక ఇంటిని తన జీవితకాలంలో కట్టుకోగలనని ఆమె గాఢంగా నమ్మింది.

ఆమె కల ఈ నాటి వరకు నెరవేరలేదు. ఇప్పుడు ఇల్లు కొనేసింది గాని, అది ఆరొందల ఇరవై చదరపు అడుగుల చిన్న ఫ్లాట్. ఆమె స్తోమతకు తగినది అంతే. ఏదో సొంత ఇల్లు కొనుక్కోగలిగాను అని ఆమె మనసు కుదుటపడినా, కలలో ఆమె కట్టుకున్న ఇల్లు ఆరిపోని గాయంలా సలుపుతూనే ఉంది.

అహల్యకు పెళ్ళయ్యి ఇరవయ్యొక్క సంవత్సరాలు దాటాయి. ఆమె పెద్ద కొడుకు నందు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కూతురు సుభద్ర తొమ్మిదో తరగతి. మూడోవాడు ఆరో తరగతి.

పెళ్ళికి ముందే రెండు విషయాల్లో అహల్య చాలా మొండిగా ఉండాలి అనుకుంది. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగిని పెళ్ళి చేసుకోకూడదు అని. సొంతంగా వ్యాపారం చేసేవాడినే పెళ్ళి చేసుకోవాలి. వాడైతేనే సంపాయించి పెద్ద ఇల్లు కట్టగలడు, బదిలీల బెడద లేకుండా ఒకే ఊళ్ళో ఉండచ్చు.

రెండోది, తాను ఉద్యోగం చేసి సంపాయించాలి అన్నది. ఐదు రూపాయలకు కూడా నాన్న చేతిని ఆశించి నిలుచున్న అమ్మను చూసి తీసుకున్న నిర్ణయం అది. రెండూ తాను అనుకున్నట్టే నెరవేరాయి.


అహల్యకు ఒక ఆడిటర్ ఆఫీసులో అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమె భర్త అంబత్తూర్‌లో ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇంటికి కావలసిని సామాన్లు అమ్మే అంగడి నడుపుతుండేవాడు. పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు అహల్య వాళ్ళని అడిగిన ఒకే ప్రశ్న ‘మీకు సొంత ఇల్లు చెన్నైలో ఎక్కడుంది?’ అని మాత్రమే. ‘పట్టాభిరామ్‌లో సొంత ఇంట్లో ఉంటున్నాము’ అన్నారు. ఆ ఒక్క కారణానికే అహల్య పెళ్ళికి ఒప్పుకుంది.

పెళ్ళయ్యి వచ్చాక తెలిసిందేంటంటే అది ఆమె ఊహించుకున్న ఇల్లు కాదని. పాతకాలపు పెంకుటిల్లు. లోపలికి రావాలంటే తల వంచుకుని రావాల్సిందే. ఇంట్లో వాళ్ళందరూ హాల్లో పడుకుంటారు. పాత కర్రమంచం ఉన్న చిన్న పడక గది. చేయి పైకెత్తితే ఫ్యాన్ తగుల్తుంది. ఇంట్లో బాత్రూమ్ లేదు. ఇంటికి బయట టెంకాయ చెట్టుకు ఆనుకుని టెలిఫోన్ బూత్‌ లాంటిది కట్టబడి ఉంది. బావినుండి నీళ్ళు చేదుకుని వాడుకోవాలి. వంట మొదలుపెడితే ఇల్లంతా పొగ కమ్ముకుంటుంది. పెళ్ళయ్యి వచ్చాక మూడు రోజులు వీటిని చూసుకుని ఏడ్చింది అహల్య. ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరూ పట్టించుకోలేదు.

ఇల్లు చిన్నది అన్న విషయం కంటే ఆ ఇంట్లో ఐదుగురు మగవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు, నలుగురు పిల్లలు అంటూ ఇంతమందితో కలిసి ఉండాలా అన్నది మరింత ఆక్రోశాన్ని కలిగించింది.

పెళ్ళయిన మొదటి వారం సినిమాకు వెళ్తుండగా భర్తతో “మనం సిటీ లోపల ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం” అని చెప్పింది. అతను గమ్మున తలూపాడు.

మరసటి రోజు పొద్దున వంటగదిలో ఉన్న అత్తగారు “ఏంటే… వచ్చి పదిరోజులైనా కాలేదు. ఇంతలోనే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అన్నావంట? ఇంటిలో అందరితో కలిసిపోయి సంసారం చెయ్యలేవా??” అని గొడవ పడింది.

అహల్యకు ఏడుపు కట్టలు తెంచుకుని వచ్చింది. తాను రహస్యంగా చెప్పిన విషయాన్ని ఎందుకిలా వాళ్ళ అమ్మకు చెప్పి తనని అవమానిస్తున్నాడు అని భర్తమీద కోపం వచ్చింది. ఆ రోజంతా అతనితో మాట్లాడలేదు. తన భర్త అమ్మ మాట జవదాటని మనిషని తొందరగానే గ్రహించింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం వెతుక్కుంది.

మందవెళి ఆఫీసులో చేరినప్పుడు ఆమె బాలింతరాలు. దాన్ని కారణంగా చూపించి తొలిసారిగా అక్కడనుండి వేరుగా ఆఫీసుకు దగ్గరగా వేరే ఇంటికి వెళ్ళారు. చాలా చిన్న ఇల్లు, పడక గదంటూ ప్రత్యేకంగా లేదు. ఇరుకైన వంట గది, దానికి ఆనుకుని బాత్రూము.

ప్రతిరోజూ రాత్రిపూట పైన తిరిగే ఫ్యాన్‌కేసి చూస్తూ ‘ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉంటున్నామా’ అని తన స్థితిని తలచుకుని ఏడ్చేది. ఆమె భర్త మాత్రం ఇలా పడుకోగానే అలా నిద్రపోయేవాడు. బిడ్డకు ఉయ్యాల కట్టడానికి ఒక హుక్ కూడా లేని ఇలాంటి ఇంట్లో ఉండాలా అని ఆవేశం కలిగేది. చీరను మడత పెట్టి దానిమీద బిడ్డను పడుకోబెట్టేది.

అప్పట్లో ఇంట్లో కూర్చోడానికి కుర్చీ అయినా లేదు. ఎవరైనా చుట్టాలొస్తే నేల మీద చాప పరిచి కూర్చోపెట్టాల్సి వచ్చేది. అలాంటి సమయాల్లో ఆమె బాధతో నలిగిపోయేది. చుట్టాలు వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. ఆమెకు ఎవరినీ తప్పు పట్టాలో అర్థం అయ్యేది కాదు.

సుభద్ర పుట్టాక ఆ ఇంటినుండి అడయాఱుకు ఇల్లు మారారు. అది మిద్దె ఇల్లు. ఇంటికి ముందువైపు పూలకుండీలు పెట్టుకోడానికి కొంచం స్థలం ఉండేది. అక్కడ నాలుగైదు పూలమొక్కలు కొని పెట్టడమే కాకుండా ఇంటి ఓనర్ వాడకుండా పక్కన పడేసిన కుర్చీని బాగుచేసి వేసుకుంది. ఉద్యోగం నుండి ఇంటికి రాగానే ఆ కుర్చీలో కూర్చుని కాసేపు వీధిని వేడుకగా చూస్తూ ఉండేది.

ఎత్తయిన అపార్ట్‌మెంట్లు లేస్తున్న స్థలాలను, పెద్ద బంగళాలనూ దాటి వెళ్ళేప్పుడు ఆమె మనసు ఒకటే ఆరాటపడిపోయేది. కొన్ని సార్లు రోడ్డు మీద పెద్ద ఇనప గేట్లున్న ఇళ్ళ ముందు నిలబడి అది తన ఇల్లయితే అని ఊహించుకునేది. ఇలాంటి ఇంట్లో ఎప్పుడు బతుకుతానో అని మనసు పదే పదే కొట్టుకునేది. నిస్సహాయత, ‘అది నీ వల్ల కాదు’ అన్న నిజాన్ని ఆమెకు చెప్పి ఆమెను ఎగతాళి చేసేది. పెద్ద ఇళ్ళు కంట పడినప్పుడల్లా ఆమెకు నిట్టూర్పున్నది అనివార్యం అయింది.

సైదాపేట, వడపళని, గిండి, నందనం, క్రోమ్‌పేట, రామాపురం… ఇలా అహల్య ఇప్పటివరకు పదిహేను ఇళ్ళకు పైగా మారింది.


మఱైమలై నగర్‌లో సొంత ఇల్లు కొనుక్కుని పాలు పొంగించిన రోజు ఇంటిని చూసిని అమ్మ “ఏంటే ఇది? పిచ్చుక గూడులా ఉంది?” అని అడిగినందుకు “నీ మొగుడు అది కూడా కొనుక్కోలేక చచ్చిపోయాడ్లే…” అని అక్కసుతో తగువుకు దిగింది. అందరి ముందూ అమ్మ ఏడవసాగింది, అయినా అహల్య ఆమెను ఊరడించలేదు. అమ్మ ఏడవడం మనసుకు సంతోషాన్ని కలిగిస్తున్నట్టే అనిపించింది అహల్యకు.

ఆ రాత్రి సొంత ఇంట్లో పడుకున్నప్పటికీ తనకు నిద్ర పట్టలేదు. ‘ఇది కాదు నేను కలగన్న ఇల్లు. నా ప్రాప్తం ఇంతే. ఈ ఇంట్లో ఉంటూనే సిటీ లోపల ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి’ అని తనను తానే ఓదార్చుకుంది. వెంటనే, అది జరగదని గ్రహించినదానిలా ఏడ్చింది.

“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని కూతురు అడిగినప్పుడు ఆమె జవాబివ్వలేదు.

మనసు లోపల ఆమె కట్టుకున్న ఆ కలల ఇల్లు ఆమెను చూసి గట్టిగా హేళన చేస్తోంది. దాన్ని నెగ్గించుకోవాలి అనే పత్రికల్లో వచ్చే అద్దె ఇళ్ళ ప్రకటనలు వెతకడాన్ని తన వ్యసనంగా మార్చుకుంది.

ఇల్లు అద్దెకు కావాలన్నట్టు కలిసి వివరాలవీ కనుక్కుని ఊరకే ఆ ఇల్లు మొత్తాన్ని చూసి రావడం ఆమెకు సంతోషాన్ని కలిగించేది. కొన్ని సార్లు ఇంటి ఓనర్ తాళం చెవిని ఆమెకే ఇచ్చి ‘మీరెళ్ళి చూసి రండి’ అంటే, ఒక్కత్తే లోపలికి వెళ్ళి చూస్తూ ఈ ఇల్లు తనదే అని భావించుకుని మురిసిపోయేది ఆ కొన్ని నిముషాలు.

ఖాళీగా ఉండే ఇంటిలో నేల మీద పడుకునేది లేదా బాత్రూమ్ కొళాయి తిప్పి తనివి తీరా ముఖం కడుక్కునేది. కొన్ని ఇళ్ళల్లో హేర్‌పిన్‌ తీసి ఏ చెక్క మీదో గోడ మీదో తన పేరు రాసి వచ్చేది. విశాలమైన ఇల్లు మనసుని విశాలమైనదిగా మారుస్తుంది అని తన నమ్మకం. ఇలా పదిహేను ఇరవై ఇళ్ళను ఊరకే చూసి రావడం మాత్రమే అలవాటుగా చేసుకున్నాక ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది.

ఒక ఇంటి ఓనర్ ఆమె తాలూకు వివరాలు అడిగితే ఆమె ఒక కొత్త కథ అల్లి చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, తనకు ఒకే ఒక కూతురు అనీ చెప్పింది. కొన్ని సార్లు ఇప్పుడే మొదటిసారి చెన్నైకి మారుతున్నాం అని, ఇదివరకు దింటుక్కల్‌లో ఉండేవాళ్ళం అనీ అబద్ధం చెప్పింది. ఒక ఇంట్లో ‘మేము పదిహేనేళ్ళుగా సింగపూర్‌లో ఉన్నాము, ఇప్పుడు చెన్నైకు వచ్చేశాము’ అనీ కట్టు కథ చెప్పింది. ఈ కట్టు కథలు, అబద్ధాలూ ఆమెకు చాలా నచ్చాయి. వాటిని ఎంతగానో ఆస్వాదిస్తూ ఆమె చెప్పిన కట్టు కథలు నిజమైతే బాగుండు అని బెంగపడుతుండేది.

నచ్చిన కొన్ని ఇళ్ళను తన ఫోన్‌లో ఫోటోలు తీసి పెట్టుకుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూసుకుంటూ ఉండేది. ఈ రహస్య అన్వేషణ ఆమెకు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది.


ఆ రోజూ అంతే, అశోక్‌ నగర్‌లో ఉండే ఒక ఇల్లు అద్దెకు అడిగేందుకు వెళ్ళి ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. ఇంటి ఆవరణం నిండా చెట్టు, మొక్కలు. ఒక పెద్దాయన తలుపు తీశాడు. ఆమె ప్రకటన గురించి చెప్పగానే ఇంటి లోపలికి రమ్మన్నాడు.

స్తంభాలతో పాత పద్ధతిలో కట్టిన ఇల్లు. లోపల ఒక గదిలో మగవాళ్ళ చొక్కా వేసుకున్న ఒక వృద్ధురాలు పడకనుండి నీరసంగా లేచి కూర్చుంటూ ఉండటం కనబడింది.

“ఎవరు ఆమె?” వృద్ధురాలు బలహీనమైన గొంతుతో అడిగింది.

“ఇల్లు చూడటానికి వచ్చింది” అని జవాబిస్తూ పెద్దాయన తాళంచెవి కోసం వెతుకుతూ ఉన్నాడు. మంచం మీదనుండి ఆ వృద్ధురాలు దిగే ప్రయత్నం చేసి విరమించుకోవడం చూసింది అహల్య.

చేతిలో తాళం చెవితో నిల్చున్న పెద్దాయన “నా వైఫ్. కిడ్నీ ప్రాబ్లం. పదేళ్ళుగా మంచాన పడింది. పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు. నేనూ ఈమె మాత్రమే ఉన్నాము. అందుకే పై పోర్షన్ అద్దెకు ఇస్తున్నాము. చూసి రండి” అని తాళాలు అహల్యకు ఇచ్చాడు.

వెడల్పయిన మెట్లు. పెకి ఎక్కి వెళ్ళగానే మామిడి చెట్టు కొమ్మ ఇంటి కిటికీకి రాసుకుంటూ ఉండటం చూసి సంబరపడింది. ఒక మావిడాకుని తెంపుకుని వాసన పీల్చుకుంటూ తాళం తీసింది. విశాలమైన హాల్లో ఉయ్యాల బల్ల, గోడకున్న నిలువెత్తు అద్దం. ఈ ఇంట్లో ఇదివరకు ఎవరుండేవారో గానీ ఇల్లు టేస్ట్‌ఫుల్‌గా కట్టుకున్నారు.

బాత్రూమ్ తలుపు తీసింది. చందనం రంగులో పెద్ద బాత్‌టబ్ ఉంది. సినిమాల్లో మాత్రమే ఇలాంటి టబ్‌లో నురగ కప్పుకున్న హీరోయిన్‌ స్నానం చెయ్యడం చూసింది. స్నానాల గదే ఒక హాల్‌ సైజులో ఉంది. వంటగదికి వెళ్ళి చూసింది.

ఒక వైపు గోడకు బాలకృష్టుడు వెన్న కుండను దొర్లించుతున్నట్టు అందమైన చిత్రపటం. పెద్ద చెక్క అల్మరా, లోపల సొరుగులు. గోడలకి లేత ఆకుపచ్చ రంగు.

ఆ ఉయ్యాల బల్లమీద కూర్చుని హాయిగా ఊగుతుంటే, వాకిట్లో పెద్దాయన కాఫీ గ్లాసు పట్టుకుని నిల్చుని ఉండటం చూసింది. ఊగడం ఆపేసి, మొహమాటంగా లేస్తుంటే పెద్దాయన నవ్వి “బాగా ఊగండి… మొహమాటం దేనికి? కాఫీ తీసుకోండి” అన్నాడు.

“ఇల్లు చాలా బాగుంది” అంది అహల్య.

“డాన్సర్ రేవతి సుబ్రహ్మణ్యం ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు బెసెంట్ నగర్‌లో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. మీకెందరు పిల్లలు… ఎక్కడ ఉద్యోగం?” అడిగాడు పెద్దాయన.

ఏం అబద్ధం చెప్పాలా అని అహల్య ఆలోచించింది. తర్వాత “కెనరా బేంక్‌లో ఉద్యోగం చేస్తాను. హస్బండ్ మదురైలో ఇంజినీర్. ఒకే కొడుకు, మెడిసిన్ చదువుతున్నాడు.”

“నెల అద్దె ఇరవై వేలు. అడ్వాన్స్ రెండు లక్షలు” అన్నాడు పెద్దాయన.

“ఇప్పటికిప్పుడే అడ్వాన్స్ ఇవ్వలేను. హస్బండ్ వచ్చే నెల ఐదో తారీకున వస్తారు. టోకన్ అడ్వాన్స్ ఇస్తాను.” అంది.

“ఏం పరవాలేదు. నాకు మీరు బాగా నచ్చేశారు. ఇల్లు మీకు నచ్చిందా?”

సంతోషంగా తలూపింది అహల్య.

“టోకన్ అడ్వాన్స్ ఇచ్చి తాళాలు తీసుకోండి” అన్నాడు పెద్దాయన.

అలాగేనని తలూపుతూ అక్కడినుండి బయిటికి వచ్చింది.


ఈ ఇంటిని ఎలాగైనా అద్దెకు తీసుకోవాలి అని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. ‘ఎందుకు ఆ ఇల్లు, ఎవరు ఉండటానికి?’ ఆమెలో ఆలోచనలు, ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. ఆ రోజు రాత్రంతా దాని గురించిన ఆలోచనలే.

మరుసటి రోజు బేంక్‌నుండి ఇరవై వేలు తీసుకుని వెళ్ళి ఆ ఇంటికి టోకన్ అడ్వాన్స్ ఇచ్చి వచ్చింది.

పెద్దాయన తాళంచెవులు ఆమె చేతబెట్టి “మీ సామాన్లవి ఎప్పుడు వస్తాయి?” అనడిగారు.

“పది రోజులవుతుంది.”

“మా పోర్షన్‌తో సంబంధం లేకుండా పై పోర్షన్‌కి వెళ్ళడానికి రావడానికీ వేరుగా గేట్ ఉంది. అది వాడుకోవచ్చు. మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏదైనా అవసరమైతే మొహమాటపడకుండా అడగండి” అన్నాడు పెద్దాయన.

ఇంటి తాళంచెవులు తీసుకుంటుండగా ఒక క్షణం ‘నాకు ఇదేం పిచ్చి!’ అనిపించింది అహల్యకు. తాళంచెవి పట్టుకుని మిద్దె మెట్లెక్కి పైకి వెళ్ళినప్పుడు ఇది తన ఇల్లు అని సంతోషించింది.

ఉయ్యాల బల్లమీద కూర్చుని తనివి తీరేదాకా ఊగింది. తర్వాత దగ్గర్లో ఉన్న అంగటికెళ్ళి ఒకే ఒక్క చాప మాత్రం కొనుక్కొచ్చుకుంది. హాల్లో చాప పరిచి పడుకుంది. ఇది తన ఇల్లు. తను మాత్రమే ఉండబోయే ఇల్లు. ఇలాంటొక ఇల్లు ఉండటం ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంటిలో తనతో ఎవరూ ఉండరు. తాను మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాను అన్నది ఆమెకు వల్లమాలినంత సంతోషాన్ని ఇచ్చింది.

ఆ రోజునుండి ఆమె ఆఫీసు అవ్వగానే నేరుగా ఈ ఇంటికి వచ్చేస్తుంది. ఒక సంచిలో కొన్ని బట్టలు తెచ్చి పెట్టుకుంది. రెండు స్పూన్‌లు, ఒక ఫ్లాస్క్, ఒక గ్లాస్, పండ్లు కోసుకోడానికి ఒక కత్తి… ఇలా కొన్ని వస్తువులు మాత్రం తెచ్చి పెట్టుకుంది.

ఇల్లు వస్తువులతో నింపేయకుండా ఇలా ఖాళీగా ఉండటం వలన అనిపించే విశాలత్వం ఆమెకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. యాపిల్ పళ్ళు కొనుక్కొచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుని పాటలు వింటూ ఆస్వాదిస్తూ తినేది. ఒంటరిగా గవ్వలు విసిరి పాచికలాడేది. చిన్న మట్టి కడవ తెచ్చి అందులో నీళ్ళు పోసుకుని తాగేది.

ఒక రోజు బాత్‌టబ్‌లో నీళ్ళు నింపి, సోపు కలిపి అందులో తనివితీరా స్నానం చేసింది. అద్దంలో తనను తాను చూసుకుంటుంటే వయసు కరిగిపోయినట్టు అనిపించింది. ఇంటికి తెలియకుండా ఒక ఇల్లు తీసుకుని రహస్యంగా ఇలా ఇక్కడ గడపటం ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే సమయంలో ఎవరైనా కనిపెట్టేస్తే అన్న భయం కూడా లోలోపల ఉంటూనే ఉంది.

ఇంట్లో ఒక్కరూ ఆమెలోని ఈ మార్పుని గమనించలేదు. ఆదివారం రోజున కూడా తనకు ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళి ఆమె ఆ ఇంటిలో గడిపింది.

ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ చందనం వాసనగల అగరువత్తులు కొనుక్కొచ్చుకుంది. ఇంట్లో అగరువత్తులు వెలిగించి పెట్టి ఉయ్యాలబల్ల మీద పడుకుంది. అగరొత్తుల పరిమళం ఇల్లంతా వ్యాపించింది. ఎంత అద్భుతమైన సుగంధమో అనుకుంటూ ఆ గుబాళింపును ఆస్వాదిస్తూ పడుకుని ఉండిపోయింది. తనకు కొత్తగా రెక్కలు మొలిచినట్టు ఆనందించింది. ఆ ఆనందంలో ఆమెకు ఏడవాలనిపించింది.

ఇరవై రోజులు ఆమె తన ఇష్టమొచ్చిన రీతిలో ఆ ఇంటిని ఏలింది. చిన్న పిల్లలా నేల మీద పడి దొర్లాడేది, నిద్రపోయేది. ఎక్కువ సమయం తనదైన ఇంట్లో గడపాలి అని ఏవేవో కారణాలు కల్పించుకుని ఇంట్లోవాళ్ళకి అబద్ధాలు చెప్పసాగింది.

తనకంటూ ఏర్పరచుకున్న ఆ ఇంటికి ఒక రోజు తన కూతుర్ని మాత్రం తీసుకొచ్చింది అహల్య.

తనకేమీ అర్థంకాక “ఎవరి ఇల్లమ్మా ఇది?” అడిగింది సుభద్ర.

“నా ఇల్లు.” చెప్పింది.

“మనం ఇక్కడికి మూవ్ అవుతున్నామా?”

“లేదు. నాకంటూ ఒక ఇల్లు కావాలనిపించింది. అందుకే వెతికి పట్టాను” అని చెప్పింది అహల్య.

“ఎందుకూ?” అని బిక్కమొహం పెడుతూ అడిగింది కూతురు.

“అది నీకు ఇప్పుడు అర్థం కాదు. ఇల్లు బాగుందా?” అని అడిగింది కూతుర్ని.

అమ్మ ఏదో తప్పు చేస్తోంది అన్నట్టు భావించి ఆమెను కొరకొరా చూస్తూ “నీకు ఎందుకు ఇల్లు? ఇక్కడ ఏం చెయ్యబోతున్నావు?” అని కోపంగా అడిగింది సుభద్ర.

“ఏమీ చెయ్యను. అయితే ఇది నా ఇల్లు. నేను మాత్రం ఉండే ఇల్లు. ఆ ఆలోచన ఇచ్చే సంతోషాన్ని మాటలతో వివరిస్తే అర్థం కాదు” అంది అహల్య.

“నేను వెళ్తున్నాను” అంటూ మెట్లు దిగింది సుభద్ర.

తన రక్తం పంచుకుని పుట్టినప్పటికీ తన తండ్రి పోలికలే వచ్చాయి అని అనుకుంటూ “మీ నాన్నకు చెప్పకు” అంది అహల్య.

సుభద్ర ఏ సమాధానమూ ఇవ్వలేదు.


ఆ రోజు రాత్రి భర్త ఆగ్రహం నిండిన గొంతుతో “నీకేం పిచ్చి పట్టిందే? ఎంత పొగరుంటే విడిగా ఇల్లు అద్దెకు తీసుకుంటావు? ఒక్కదానివే ఉంటున్నావా… లేక ఎవడైనా ఉన్నాడా?”

“అది మగవాళ్ళ అలవాటు. నేను ఒంటరిగానే ఉంటున్నా” అంది అహల్య.

“ఏఁవిటే… సంపాయిస్తున్నానన్న పొగరా? ఈ ఇంట్లో నీకు ఏం తక్కువైందనీ?” అని నిలదీశాడు.

“నాకంటూ ఒక ఇల్లు కావాలి. అది నేను కట్టుకోలేకపోయాను. ఇది మీ ఇల్లు. ఇక్కడ నేనొక పనిమనిషిని, వంటమనిషిని… అంతే” అంది.

ఫట్‌మని ఒక దెబ్బ పడింది ఆమె చెంప మీద. కర్ణకఠోరమైన బూతులు తిడుతూపోయాడు అహల్య భర్త.

అతనితో సరికిసరిగా తగువు పడలేక వెక్కి వెక్కి ఏడుస్తూ “ఒక ఇంటిని కూడా నేను అనుకున్నట్టు అమర్చుకోలేక పోయాను. ఇప్పటికే నా వయసు 44 ఏళ్ళు. సగం జీవితం అయిపోయింది. నాకంటూ నేను ఏదీ కోరుకోకూడదా… అది తప్పా?” అంది.

“ఎప్పుడైతే నువ్వు పుస్తకాలు చదవడం మొదలుపెట్టావో అప్పుడే అనుకున్నాను నీ బుద్ధి గడ్డితిని ఇలా వక్రిస్తుందని! నీకెందుకే మొగుడూ పిల్లలూ?” అని గట్టిగా అరిచాడు. పిల్లలు కూడ భర్తతో కలిసి ఆమెను తిట్టారు.

“ఆ ఇల్లు ఖాళీ చేసుకుని వస్తేనే నీకు ఈ ఇంట్లో చోటు… లేదంటే బయటకు పో” అని ఆమె బట్టలు తీసి విసిరేశాడు.

ఆమె పక్షాన ఒకరూ మాట్లాడలేదు. అహల్య తన అద్దె ఇంటి తాళం చెవిని విసిరికొట్టింది.

ఆ రాత్రికి రాత్రే అద్దెకు ఇల్లిచ్చిన పెద్దాయనను హీనాతి హీనంగా తిట్టి, గొడవపడి అహల్య ఇచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి తీసుకొచ్చాడు అహల్య భర్త.

“అమ్మకు మతి స్థిమితం తప్పింది. ఇక ఉద్యోగానికి వెళ్ళనక్కర్లేదు” అంది కూతురు.

పెద్ద కొడుకు తల్లిని “తింగరిది” అని తిట్టాడు.

పక్కమీద ఆలా ముడుచుకు పడుకుని ఏవేవో ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది అహల్య.


పది రోజుల తర్వాత ఆమె రాజీపడి ఆఫీసుకు బయల్దేరినప్పుడు ఆమె స్కూటీని అప్పటికే అమ్మేశాడు భర్త.

“బస్సుల్లో కిందామీదా పడి అష్టకష్టాలు పడితే అప్పుడు తెలుస్తుంది కుటుంబంలో కష్టాలంటే ఏంటని!” అన్నాడు.

బస్సులో ఆఫీసుకు వెళ్తూ వస్తూ ఉన్న అహల్య హఠాత్తుగా ఒక రోజు సాయంత్రం తాను అద్దెకు తీసుకున్న ఆ ఇంటిని చూడాలని ఆటోలో వెళ్ళి దిగింది. ఆ ఇంటిలో ఎవరో అద్దెకు దిగేసినట్టున్నారు. పిల్లల బట్టలు దండేనికి ఆరేసి ఉన్నారు. బయట నిలబడి ఆ ఇంటినే చూస్తూ ఉండిపోయింది.

ఆ ఇంటినుండి తప్పించుకుని చక్కని సుగంధం బయటకు వస్తోంది. అది ఆమె కొనిపెట్టిన చందనం అగరొత్తుల పరిమళమే. ఆ పరిమళం ఆమెకు పెద్ద నిట్టూర్పునిచ్చింది, బాధనీ కలిగించింది. కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంటూ వీధిలో తిరిగి నడవసాగింది.

చావు ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్నట్టు ఉంది ఆమె నడక.

[మూలం: అవళదు వీడు (2020) కథా సంపుటంలోని అవళదు వీడు (2014) కథ.]


రచయిత గురించి: ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. దక్షిణ తమిళనాడులో విరుదునగర్ జిల్లా మల్లాంగిణరులో ఏప్రిల్ 13, 1966లో జన్మించారు. తండ్రి షణ్ముఖం, పశువుల డాక్టర్. అమ్మ పేరు మంగయఱ్కరసి. భార్య, పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.