రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్ళలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…
Category Archive: అనువాదాలు
టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.
‘ఒక రోజు’ అనే ఈ పంక్తి ఇప్పుడు మొదలవ్వాలి. అయితే చంద్రానికి ఇలా దేన్నీ సాదాసీదాగా చేస్తే నచ్చదు కాబట్టి–ఒక దివ్యమైన శుక్రవారం అని ప్రారంభం కానుంది ఈ పంక్తి. ఎంత విభిన్నంగా చెయ్యాలనుకున్నా ఈ పంక్తి ఒకరోజు అనే మొదలవ్వడాన్ని తప్పించడం వీలు కాలేదు చూడండి. వచ్చే పంక్తే దివ్యమైన శుక్రవారం… ప్చ్… సరే రండి తర్వాత పంక్తికి… వచ్చే పంక్తిలో కథ రాకెట్ వేగాన్ని పుంజుకోబోతుంది…
ఒక అద్దం, ఒక లక్ష్యం: ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో.
నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపివేసింది, నువ్వు చంపివేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు.
మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మ, మంచివాడు, చెడ్డవాడు, చాదస్తుడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంత పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి, అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నీకీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్.
ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.
కరుణను ఎన్నో విషయాలు బాధపెట్టేవి. తను ఒక్కతే కూతురు. చిన్నతనం చాలా వరకూ ఒంటరిగానే గడిచింది. వాళ్ళ నాన్నకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రోజు రోజూ చావుకు దగ్గరవుతూ చివరికి ఒకరోజు చచ్చిపోయినప్పుడు, తనకు ఎవరూ తోడు లేరు. తనకు అన్న, తమ్ముడు అంటూ ఎవరూ లేరు. ఆ లోటు పూరించడంలో తనకు బాగా దగ్గరగా వచ్చింది నేను, శ్రీనివాస్ మాత్రమే.
నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.
“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”
ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.
రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది.
మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది.
మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.
ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్ళలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.
ఇవి సాధారణమైన వెండినాణేలు– గుండ్రటి అంచులు, అచ్చుపోసిన అంకెలు, తగరపు మెరుగు. అయితే, వాటి మీద ఏదో కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. కొత్తవాళ్ళకి శ్మశాన శాంతిని ప్రసాదించే ఆ నాణేలు మాత్రం విశ్రాంతిని ఎరగవు. వాటిల్లో ఉన్న ఏదో దురద వాటిని చేతి నుంచి చేతికి, పర్సు నుంచి పర్సుకీ మార్చుతూనే ఉంటుంది. ఎంతవరకూ అంటే… అహా అలాకాదు, మొదటినుంచీ వరసలో వద్దాం.
ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, ఇతర వృత్తికారులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారి కథలు. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.
ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.
మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.
ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నాను, బాల్యంలో నేను ‘చడ్డీ రాస్కెల్’ని. ఉదయం లేచిన వెంటనే అమ్మానాన్నలు ఇద్దరూ ‘పాయిఖానాకు వెళ్ళు’ అని ఎంత చెప్పినా ‘రావటం లేదు’ అని జవాబిచ్చి రెండు రెండు రోజులు వెళ్ళకుండా ఉండిపోయేవాణ్ణి. గబ్బువాసన వచ్చే ‘పాయిఖానా’ ఆ చిన్న వయస్సులో ఎలా ఇష్టమవుతుందో చెప్పండి? దానికి బదులుగా మిఠాయి అంగడికి వెళ్ళమంటే రెండు రెండు సార్లు వెళ్ళటానికి సిద్దంగా ఉండేవాడిని.