ఐనా నేను పైకి లేస్తాను!


చరిత్రలో నను
మీరు వక్రీకరించి లిఖించవచ్చు
నన్ను ఆ మురికిలోనే తొక్కేయవచ్చు
కానీ మళ్ళీ నేను ధూళిలా పైకి లేస్తాను.

నా లెక్కలేనితనం నిన్ను ఇబ్బంది పెడుతుందా?
ఎందుకోయ్ అలా బాధలో మునిగిపోయావ్?
నా ముంగిట్లో నూనెగనులుప్పొంగినట్లు
నేను ధీమాగా నడుస్తాననే కదూ!

గతితప్పని
సూర్యచంద్రుల్లా
అలల్లా కచ్చితంగా
ఆశలు ఎగసిపడుతున్నప్పుడు
నేను పైకి లేస్తాను.

నేను తలవంచుకు
కనులు దించుకు
కన్నీటిలా జారే భుజాలతో
ఆత్మగత రోదనలో చితికి
తుత్తునియలైతే
చూడాలని అనుకున్నావా?

నా పొగరుబోతుతనం నిన్ను బాధిస్తుందా?
నా సొంత పెరటిలో బంగారు గనులు తవ్వుతున్నట్లు
నే నవ్వడాన్ని
సహించలేక భరించలేకపోతున్నావా?

నీ మాటలతో నన్ను కాల్చివేయచ్చు
నీ చూపులతో నన్ను ముక్కలు చేయచ్చు
నీ విద్వేషంతో నన్ను చంపివేయచ్చు
కానీ మళ్ళీ,
నేను గాలిలా
ఇంకా పైకి లేస్తాను.

నా కాంక్షాపటుత్వం నిన్ను కలవరపరుస్తుందా?
నా కటిప్రదేశాన వజ్రాలు పొదిగినట్టు నేను నర్తించడం
నీకు సంభ్రమం కలిగిస్తుందా?
చరిత్రపుటల అవమానపు గుడిసెల నుంచి నేను పైకి లేస్తాను.
బాధాతప్త గతాన్నుంచీ నేను పైకి లేస్తాను.

పొంగి పెల్లుబికి ఎగసిపడే
విశాల ఉత్తుంగ తరంగాల నల్లసంద్రాన్ని,
భయోద్రిక్త రాత్రులను వదలి
నేను పైకి లేస్తాను.

చీకటి పొడలేని అద్భుత ఉదయంలోకి
నేను పైకి లేస్తాను
నా అనువంశిక సంపదలను తెస్తూ.
నేను బానిసల స్వప్నాన్ని, ఆశని.

నేను
పైకి
పై పైకి
ఇంకా పైకి లేస్తాను.


విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...