సంకల్పం-సంభవం

ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.

ఆ చెట్టును ఆసరాగా చేసుకొన్న ప్రతి ప్రాణీ సంతృప్తితో, ఉల్లాసంగా వుంటే, ఆ చెట్టుకు మాత్రం ఒక్క రోజు కూడా సంతృప్తి లేదు. తాను ఇంకేదైనా అయివుంటే బాగుండేదని దానికనిపిస్తూ ఉండేది. ఏదైనా గొప్ప పనికి తను ఉపయోగించుకోబడాలని దాని కోరిక.

అది తెలిసిన పక్కనున్న చెట్టు అంది: “మంచిది. వొక రోజు నువ్వు ఓడకు తెరచాప స్థంభమవుతావు. అంతకన్నా ప్రత్యేకత యేముంటుంది చెప్పు?”

కానీ, చెట్టుకు అది నచ్చలేదు. “థూ! ఓడకు తెరచాప స్థంభం అవడమా! దానికంటే ప్రత్యేకత కావాలి నాకు, ధన్యవాదాలు తమరికి!”

ప్రతి సంవత్సరం చెట్లను కొలిచేవాళ్ళు వచ్చి, అడవిలోని పొడవైన చెట్లకు గుర్తులుపెట్టి వెళ్తారు. చెట్లను నరికే పనివాళ్ళు వచ్చి, గుర్తులుపెట్టిన చెట్లను పడగొట్టి, కొమ్మల్ని నరికేసి, ఓడల తయారీదార్లకు వాటిని బట్వాడా చేస్తారు. ఇదంతా నీచంగా వుందని చెట్టు అనుకొంది.

ఒకరోజు ఆ చెట్టుకు గుర్తింపు చిహ్నం వేశారు. “ఆహా! ఈసారి నీ వంతు కూడా వచ్చింది కదా?” అంది పక్కనున్న చెట్టు. కానీ, మన చెట్టు నవ్వేసింది, “వాళ్ళకంటే తెలివైనదాన్ని నేను.” వొక ఉడుత తోకతో ఆ గుర్తింపు చిహ్నాన్ని తుడిచేసింది.

మరుసటి యేడు వచ్చిన గిజిగాళ్ళు ఆశ్చర్యపోయాయి. “అరే! నువ్వింకా ఇక్కడే వున్నావే!”

అహంకారంతో బదులిచ్చింది చెట్టు. “అవును. వాళ్ళు నన్ను నరికేయాలని చూశారు. కానీ నేను వాళ్ళకి లొంగుతాననుకున్నారా?”

“కానీ, అందమైన ఓడ తెరచాపకి స్థంభం అయ్యి, సముద్రాలగుండా ఠీవిగా ప్రయాణం చెయ్యాలని, కొత్త కొత్త ఓడరేవులనీ ప్రజలనీ చూడాలని నీకు అనిపించదా?” ఒక గిజిగాడు అడిగింది.

“ఊహూఁ! నాకదంతా యిష్టంలేదు. సముద్రం యెక్కడైనా ఒకే రకంగా వుంటుంది. నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి. అదే నా లక్ష్యం.” చెప్పింది చెట్టు.

“బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీతో కబుర్లుచెప్పే సమయం లేదు మాకు.” చెప్పిన పక్షులు తమ పనిమీద వెళ్ళిపోయాయి.

చెట్టు కోరిక నేరవేరే సమయం వచ్చింది. ఒకరోజు వేరే చెట్లుకొట్టే పనివారు వచ్చారు. పొడవైన చెట్లను ఎంచుకోవడానికి బదులుగా, తమకు తోచిన వాటికి గుర్తుల్ని పెట్టుకుంటూ, నరకడం మొదలుపెట్టారు.

గిజిగాళ్ళు తమ మిత్రుడికి చెప్పాయి. “జాగ్రత్త, నీకు నచ్చినా, నచ్చకపోయినా వీళ్ళు ఈరోజు తప్పకుండా నిన్ను నరుకుతారు.”

“నాకిది నచ్చింది. ఈ ప్రపంచానికి నేను ఉపయోగపడాలి.”

ఇది విన్న ఒక పనివాడు అన్నాడు. “మంచిది, నీ యిష్ట ప్రకారమే కానీ.”

ఒక్క గొడ్డలి వేటుతో దాన్ని పడగొట్టాడు. “ఓడకు తెరచాప స్థంభంగా నిన్ను ఉపయోగిస్తారనుకోను. నువ్వు అలాంటి దానికి పనికిరావు. కాగితం తయారీకి ఉపయోగిస్తారు నిన్ను.”

“కాగితం అంటే ఏంటి?” తన రెమ్మల మీద అటూ యిటూ ఎగురుతోన్న గిజిగాళ్ళనడిగిందా చెట్టు. “మాకు తెలియదు. మేం పిచ్చుకల్ని అడుగుతాం.” చెప్పాయి అవి.

పిచ్చుకలు తమకు తెలిసింది చెప్పాయి. “కాగితం తెల్లగా వుంటుంది. మనుషులు దాని మీద రాస్తారు, చదువుతారు. యింతకు ముందు పాతగుడ్డల్తో వాటిని తయారు చేసేవారు. ఇప్పుడు చెట్లు సులభంగా దొరుకుతున్నాయి కాబట్టి, వాటి నుంచి కాగితాల్ని తయారుచేస్తున్నారు.”

“ఓ! జనం నన్ను చదువుతారు కదా?” చెట్టు ఆతురతతో అడిగింది. “అవును” అని చెప్పాయి అవి. అది విని చెట్టు మంత్రముగ్ధురాలయింది. దాని ఆనందానికి అవధులు లేవు. అంత సంతోషపడడానికి యేమీ లేదని పిచ్చుకలు హెచ్చరించాయి.

“అయ్యో! కాస్త ఆగు. వాళ్ళు నిన్ను పత్రికలకు ఉపయోగించే కాగితంగా మారుస్తారు, పుస్తకాల్లో వుండే కాగితం కాదు.”

“ఏదైతే యేంటి? నా మీద వాళ్ళు ముచ్చటైన మంచి విషయాల్నే రాస్తారు కదా.”

“బహుశా కావచ్చు.” చెప్పాయి పిచ్చుకలు. “కానీ, సాధారణంగా, వాళ్ళు మంచి విషయాలు మాత్రమే రాయరు.”

చెట్టును లాక్కెళ్ళడానికి మనుషులొచ్చారు. పాపం! చెట్టు నరక యాతన అనుభవించింది. మొదట దాన్ని ముక్కలు ముక్కలుగా కోశారు. తర్వాత మిగతా చెట్లతో కలిపి దాన్ని పిండిమరలోకి నెట్టారు. బాగా దంచారు. మెత్తటి గుజ్జుగా చేసేందుకు దానిలోని రసాన్నంతా పిండేశారు. ఇలా అంతు లేకుండా, రకరకాలుగా దాన్ని చిత్రహింసలు పెట్టి, చివరికి కాగితంగా మార్చారు.

‘ప్రపంచం ఇలా వుంటుందని నేనెప్పుడూ వూహించలేదు.’ చెట్టు పైకే అనుకొంది. కాగితంగా మారిపోయిన తతిమ్మా చెట్లు కూడా ముక్తకంఠంతో యేకీభవించాయి, “ప్రపంచాన్ని గురించి యిప్పటిదాకా గోరంతని కొండంతలు చేసి చెప్పారు.”

కొమ్మల్లో పక్షుల కిలకిలారావాలు, తన నీడలో పిల్లల ఉరుకుల పరుగుల కేరింతలు-దాన్నంతా గర్వంతో చూస్తున్న అడవిలోని ఏటవాలు కొండలు, ఆనందకరమైన సూర్యరశ్మి–ఆ రోజుల గురించి తలపోసి యేంటి లాభం? అంతటి చిత్రవధకు గురవుతూ, అలాంటి ఆలోచనల్లోకి జారుకోవడంలో అర్థమేంటి?

తర్వాత వాళ్ళు ఆ చెట్టును మైళ్ళ పొడవున్న చుట్టగా చుట్టి, ఒక ఓడలోకి ఎక్కించారు. అక్కడది పాపం ఒక వారం పాటు సముద్ర వికారం వంటి రోగాలతో బాధపడింది. ప్రచండమైన ఈదురు గాలులు దాని తల మీదుగా వీయడంతో అది రెపరెపలాడిపోయింది. అది వింటూ కాగితపుచుట్టలుగా మారిన ఆ చెట్లన్నీ, అడవిలో నిర్భయంగా సుడిగాలుల్ని ఎదురొడ్డి నిలచిన రోజుల్ని తలచుకొని నిట్టూర్చాయి.

కాగితపుచుట్టగా మారిన మన సరుగుడు చెట్టుకి ఓడ అడుగున కొయ్య మీద కూర్చొనే దురదృష్టం కలిగింది. అంతే కాదు, ఆ కొయ్య దాని పాత మిత్రుడే. ఆ కొయ్య గర్వంతో చెప్పింది.

“ఓడలో కొయ్య అవడం కన్నా గొప్ప జీవితం యేదీ లేదు. పగలు సూర్యుడి వెలుగులో, రాత్రి వెన్నెల వెలుగులో ప్రయాణికుల్నీ, సరుకుల్నీ మేము కొత్త దేశాలకి తీసుకొని పోతాము. ప్రపంచానికి మేమెంత ఉపయోగపడుతున్నామో చెప్పలేను.”

చెట్టు ఏడవడం మొదలు పెట్టింది. “ఒక ఓడకొయ్య కాగితం కంటే ముఖ్యమని నువ్వు నాకు చెబుతున్నావా?”

ఆ కొయ్య నవ్వుతో ఊగిపోయింది. “అవును. ఇది నాకు నచ్చింది. కాగితపు జీవితం కేవలం ఒక రోజు మాత్రమే. రెండో రోజుకు అది పనికిరాదు. కానీ, ఓడలోని కొయ్యలు ఎన్నో యేళ్ళు వుపయోగపడుతాయి. ఓ! ఇంకో విషయం మర్చిపోయాను. కొన్నిసార్లు ఈ ఓడ క్యాప్టన్ నాకు ఆనుకుంటాడు తెలుసా? యెంత గొప్పగా వుంటుందో ఒకసారి ఊహించుకో.”

అంతులేని విషాద సముద్రంలో మునిగిపోయింది చెట్టు. ఓడ రేవు చేరాక, కాగితపు చుట్టలని వడ్డున దింపారు. మన కాగితపుచుట్ట చివరికి వొక వార్తాపత్రిక గోడౌన్‌కి చేరింది. అడవిలో వుంటే చక్కటి గాలి వుండేది. గాలి ఆడని యీ గోడౌన్‌లో వుండటం తేడాగా వుంది. అక్కడున్న ప్రతి కాగితపు చుట్టా భోరుమని ఏడ్చింది.

ఒక రోజు రాత్రి మన చెట్టును (కాగితాన్ని) అచ్చువేసే స్థలానికి తీసుకెళ్ళారు. అచ్చుయంత్రం బరువు కింద అది ఊపిరి తీసుకోలేక స్పృహ కోల్పోయింది. ఉదయం స్పృహ వచ్చాక, తన శరీరం మీద అక్షరాలు ముద్రించి వుండటాన్ని చూసిందది. పిచ్చుకలు చెప్పింది నిజమైంది.

దాని మీద ముద్రించి వున్నవి వ్యాపార ప్రకటనలు, మొరటుగా వున్న రేఖా చిత్రాలు: ‘సువాసన వెదజల్లే నస్యం’, ‘పురుషత్వ పిచ్చుక లేహ్యం’, ‘సమ్మోహక సుగంధ పొగాకు’, ‘వొక రూపాయికి ఖరీదైన 16 వస్తువులు’, ‘కేశముల తొలగింపుకు నవీన పరికరము’. వీటితో పాటు, ‘చెంగల్పట్టులో పట్టపగలు హత్య’, ‘చెట్టెక్కుతూ పడి చనిపోయిన వ్యక్తి’, ‘ఢీ కొట్టిన రైళ్ళు’, ‘గాలిలో నివసిస్తున్న యోగి’, ‘యెగురుతున్న పాపాయి’ వంటివి. ఆలోచన రేకెత్తించే ఒక్కపదం కూడా కనిపించలేదు.

తన మీద ముద్రించి వున్న ఆ ప్రకటనలను చూసి, ఆ చెట్టు యెంత విషాదంతో వున్నదో, సర్వజ్ఞాని సర్పదేవుడు, ఆదిశేషుడు కూడా చెప్పలేకున్నాడు. తను తెరచాప స్థంభం కాలేకపోయినందుకు దాని హృదయం బాధతో మూలిగింది. ఈ దురవస్థ నుంచి ఏదో విధంగా తప్పించుకోగలిగితే బాగుండు. తన మనస్సును యిక అటూ యిటూ పరిగెత్తనివ్వదు, అనుకుంది.

తర్వాత, వాటన్నిటినీ మోపు కట్టి, ఉదయపు చలిలో, అమ్మకం కోసం రైల్వే స్టేషన్‌కు పంపారు. ఒకడు అర్థణా పెట్టి దాన్ని కొన్నాడు. దాన్లోని సంగతులన్నీ చదివాడు. అందులో పనికొచ్చేదేదీ లేదని ప్రకటించి, దాన్ని సీటు కిందికి తోశాడు. ఇంకొకడు తీసుకొని చదివి, యింటికెళ్ళే దారిలో చేపలు కొని, వాటిని ఈ పత్రికలో చుట్టాడు. చేపల దుర్వాసనతో అది రాత్రంతా అడవిలోని తన జీవితాన్ని గురించి తలపోస్తూ గడిపింది.

మరుసటి రోజు పొయ్యి వెలగకపోతే, పనిమనిషి ఆ కాయితాన్ని మంటలోకి విసిరేసింది. నిమిషంలో అది కాలిపోయింది బుస్సుమంటూ…


అది కథ అని మర్చిపోయిన విద్యార్థులు, ఆ చెట్టు అడవిలో వుంటే పొందివుండే ఆనందాల గురించి, వాస్తవంలో అది అనుభవించిన నరకయాతన గురించీ చర్చించారు.

విద్యార్థుల చేత ‘మహా శత్రువు’గా పరిగణింపపడి, ‘యెప్పటికీ చావని టీచరు’ అని మారుపేరు కలిగిన ఆ టీచరు అడిగాడు. “ఈ కథలో నీతి యేమిటి?”

‘మనిషి తానొకటి తలిస్తే దైవం యింకొకటి తలిచింది’ లేదా, ‘తలరాతను మార్చలేవు’ వంటి గంభీరమైన తాత్వికమైన సమాధానాల్ని పిల్లల నుండి ఆశించాడతను.

కానీ, ఇంకా కథలోనే నిమగ్నమై వున్న ఒక పిల్లవాడు చెప్పాడు. “నీతి యేమిటంటే, యీ నీచమైన వార్తాపత్రికల్ని నిషేధించాలి.”

ఊహించని యీ స్పందనతో అవాక్కయిన టీచరుకు ఏం చెప్పాలో తోచలేదు.

వాడు చిన్నపిల్లవాడు కాబట్టి, సరదాగా యిలా జవాబిచ్చాడని మనం అనుకోకూడదు. అంతే కాదు, మన పెద్దవాళ్ళని కూడా అలాంటి వార్తాపత్రికలు రోజూ చిత్రవధ చేస్తున్నాయి. తప్పుడు సమాచారమిస్తాయి. నాసిరకం కాగితం, ముద్రణ సరిగా వుండదు. మన ప్రయాసకు తగ్గ ఫలితం వుండదు వాటి వల్ల. అందువల్ల ఆ పిల్లవాడి అభిప్రాయాన్ని మనం బలపరచాలి కదా?


అమ్మని అమ్మాళ్: అమ్మని అమ్మాళ్ గురించి యే విధమైన సమాచారమూ దొరకలేదు. తొలి తమిళ మహిళా కథకురాలని మాత్రం చెప్పచ్చు. యిది తొలి తమిళ కథ అని కూడా దిలీప్ కుమార్, సుచిత్రా వంటి తమిళ రచయితలు కొందరు అంటున్నారు. ఈ కథ గురించి ప్రముఖ తమిళ-యింగ్లీషు అనువాదకురాలు శుభశ్రీ క్రిష్ణస్వామి యిలా అన్నారు. ‘It begins much like a parable, and I settled in for a comfortable read, a smile very much on display. But the intelligent and unexpected end shook me out of my complacency’.

‘సంకల్పముం సంభవముం’ వివేకబోధిని మాస పత్రిక 1913 మార్చి సంచికలో ప్రచురణ అయ్యింది.