శిల

ఒక శిలగా మారడమే ఎపుడూ నాకిష్టం
ఇంకెవరినైనా సరే పావురమవనీ
గాటు పెట్టే పులిపన్ను కానీ
నాకైతే ఒక శిలగా వుండడమే సంతోషం.

బయటనుంచీ శిల ఒక పొడుపుకథ
దానినెలా విప్పాలో ఎవరికీ తెలియదు. కానీ
లోలోపల అది స్తబ్దంగా నిశ్శబ్దంగా వుండే వుంటుంది
ఓ ఆవు తన భారాన్నంతా దానిపై నిలిపి పైకెక్కినా
ఏ చిన్నారైనా దాన్ని నదిలోకి విసిరేసినా
అది మెల్లగా నిరుద్రేకంగా
నది లోపలికి నిశ్శబ్దంగా మునిగిపోతుంది. అక్కడ
చేపలు దాన్ని తట్టి అది చెప్పేది వినడానికి వస్తాయి.

రెండు రాళ్ళను జత చేర్చి కలివిడిగా రుద్దినపుడు
నిప్పురవ్వలు ఎగరడం నేను చూశాను. అందుకే
బహుశా శిలలో ఏ చీకటీ లేదంటాను.
ఎక్కడినుంచో బహుశా –
ఓ కొండ చాటునుంచి ఓ చందమామ
లోపలి గోడలమీది మన వింత రాతలను
నక్షత్ర రేఖలను చేసేందుకు
కొంచెం కాంతిని పంచుతూ
దానిలో మెరుస్తూ వుండే వుంటుంది!

(మూలం: Stone – Charles Simić)

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...