ఇప్పుడే ఒక కరపత్రం చేతికొచ్చింది. అది మా కాలనీలో అంచెలంచెలుగా పెరుగుతున్న ఒక స్కూల్ రాబోయే సంవత్సరంలో మా పిల్లల కోసం తమని ఎంచుకోమంటూ ఇచ్చిన పిలుపు. ప్రత్యేకతలేంటో తెల్సా, పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కలిగేలా చేసి, విసుగుని, అసహనాన్ని తగ్గిస్తారుట. మంచి మాటకారితనం, తెలివి పెంచుతారట. ఇంకా, ఉద్వేగాలను నియంత్రించుకోవటం నేర్పి, తిరుగుబాటు ధోరణులను అరికడతారట.

వీడెవడో డబ్బా కారు పెట్టుకుని లెఫ్ట్ లేన్లో! ఈ కార్లో కనక అది వుండుంటే ఈ పాటికి దాన్ని చీమని విదిలించినటట్లు పక్కకు తోసేవాణ్ణి. గింగిరాలు తిరుగుతూ ఆ కారు పక్కకు దొర్లి ఏ చెట్టుకు గుద్దుకునో ఆగేది. అది విండ్‌షీల్డ్ లోంచి ముందుకు విసిరేయబడేది. అదృష్టం వుంటే తగలబడేది కూడా. ఆ కార్లో అది ఉన్నది అనుకున్నప్పుడల్లా పాదం ఆక్సిలరేటర్ని బలంగా నొక్కుతోంది. గుద్దుతుందేమో అనిపించినప్పుడు కాలు వెనక్కు లాగుతోంది.

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.

వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? వాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధ పడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు.

డిసిప్లిన్‌కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. బరాక్‌లో అతని బెడ్‌ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్‌ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు.

వీరరాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆ ధీమా, ఆ దెప్పు పెళ్ళాం నుంచి జీవితాంతం భరించాలని తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నాప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు.

ఈమధ్య వచ్చే కథల్లో లోతు మరీ ఎక్కువగా ఉంటోంది నాయుడి కవిత్వంలో లాగ. అర్థం చేసుకోడానికి శ్రమ పడాలి అని గుర్తొచ్చింది. చదువుతూ ఉన్న పుస్తకంలో కథ అసంపూర్ణంగా ఉంది. ఇప్పటి బతుకులో లోతు లేదా? అర్థం చేసుకోలేక పోతున్నానా? కథకురాలు కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు స్పృశించిందా? ఫేస్‌బుక్‌లో అందరూ పుస్తకాన్ని మెచ్చుకున్న వాళ్ళే. బహుశా వేరే రకంగా చెప్పడానికి సంకోచమేమో!?

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.

థియరీ లోను, ప్రాక్టికల్స్‌ లోను, దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే టాపర్. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేట్లుండే మనిషికి అంతంతసేపు ఏకబిగిన కూర్చుని చదివే ఓపిక ఎలా వుందో అర్థమయ్యేది కాదు. బారక్‍లో లైట్‍ని ఆఫ్ చెయ్యడం లేదని రూమ్మేట్లు తరచూ కంప్లైంట్ చేస్తున్నా భట్ మాత్రం రాత్రి మూడింటివరకూ చదువుతూనే ఉండేవాడట. అతను తినేదెప్పుడో, పడుకునేదెప్పుడో కనిపెట్టడం పక్కవాళ్ళక్కూడా కష్టమయ్యేదట.

బ్యాగులోంచి అన్నండబ్బాను బయటికి తీయగానే, నాకు మామూలుగా నా భార్య ముఖం గుర్తొస్తుంది. దానిలో ఉన్న పదార్థాలను బట్టి కొంచెం చిరాకో, ప్రేమో కలుగుతుంటుంది. కానీ ఇవ్వాళ నేను ఏ కళన ఉన్నానో – డబ్బా మూత తీయగానే, కొంచెం ముద్దగా అయినట్టుగా ఉన్న అన్నం కళ్ళబడగానే, నాకు ఉన్నట్టుండి మా ఊళ్ళో చిన్నతనంలో చూసిన ఒక గొల్లాయన గుర్తొచ్చాడు. ఆయన ఒక పగటిపూట తన అన్నంమూటను విప్పుకుని తినడం గుర్తొచ్చింది.

ఈ మాఘమాసంలో పెళ్ళి చేసేస్తాం, ఈ ఏడు మాఘంలో చేసేస్తాం అంటూ ఇంట్లో కూచోపెడతారు, ఆడపిల్లకి చదువు చెప్పించడం ఆపేసి. చదివేవులే స్కూలు ఫైనలు వరకూ లేదా టెంత్ వరకూ అంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా పెళ్ళి కోసం ఈ మాఘం కోసం ఆ మాఘం కోసం చూస్తూ కూచుంటుంది. మాఘమాసాలు ఆగమేఘాల మీద వచ్చివెళ్తూ ఉంటాయి!

పెళ్ళికూతురు ఊర్లోకి ప్రవేశించింది వాను. రెండు వీధులు తిరిగాక, ఒక డాబా ఇల్లు ముందు అయ్యవారు బండాపమన్నాడు. ఇంటిముందు సందడిగా వుంది. గడపలకి మామిడాకుల చెండ్లు కట్టి ఉన్నాయి. వయసాడపిల్లలు గడపల వెనకాల నుంచుని తొంగి చూస్తున్నారు. హాలులో అగరొత్తుల సువాసనలు నాసికలని అలరిస్తున్నాయి. అయ్యవారు దిగి గబగబ ఇంట్లోకి అడుగుపెట్టి పెళ్ళికూతురు తల్లితండ్రుల్ని పిలిచి, పెళ్ళికొడుకుని లోనికాహ్వానించమన్నాడు.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.

బామ్మ దగ్గర కథలు విని రాయడం నేర్చుకోవాలి. నన్నడిగితే ప్రపంచం లోని పెద్ద పెద్ద పేరున్న కథకులందరూ బామ్మ దగ్గర కథ చెప్పడంలో బలాదూరే! ఒక్కసారి గాని వాళ్ళు వింటే ఎంత నేర్చుకోవాలో తెలిసివస్తుంది! బామ్మ దగ్గర కథలు విని కథలు రాయడం మొదలుపెడితే ఇంక వాటికి తిరుగు ఉండదు!

పదిహేను అడుగుల వెడల్పున్న ఆ తార్రోడ్డు మీద, అడ్డంగా పరుచుకుని ఉందో నల్లటి త్రాచు. కొద్దిసేపటి క్రితమే ఏదో భారీ వాహనం దాన్ని తొక్కేసినట్లు, తోక భాగం కొద్దిగా తప్ప మిగిలిన శరీరమంతా అప్పడంలా రోడ్డుకి అతుక్కుపోయింది. తోకలో కొద్దిగా చలనం కనిపిస్తోంది ఇంకా. “మెచ్యూర్డ్ కోబ్రా” అన్నాడు మేజర్ దేవల్ దాన్ని ఒకింత జాలిగానూ, ఎక్కువ నిర్లిప్తంగానూ పరికిస్తూ. “ఏదో పెద్దదాన్నే మింగినట్లుంది. అందుకే ట్రక్కు వస్తున్నా తొందరగా రోడ్డు దాటలేకపోయింది.”

తర్వాతి పొద్దునే లేచావు అలికిడికి. అసలు నిద్రే పట్టదనుకున్నావు కానీ నీ శరీరం నిన్ను మోసం చేసింది. ఒళ్ళంతా లాగేస్తోంది. పొట్ట కాలిపోతోంది. ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. మొదటిసారి తీసుకోలేదు కానీ ఇంకోసారి బలవంతపెడితే వద్దనలేదు నువ్వు. మెల్లగా కిందకొచ్చి సైలెంట్‌గా కుర్చున్నావు. కొంతమంది వంటింట్లో ఉన్నారు. మగవాళ్ళు బైటికీ లోపలికీ తిరుగుతున్నారు. ఎవరూ నీతో కళ్ళు కలపడంలేదు. వచ్చినవాళ్ళకి టిఫిన్‌లూ, టీలూ అందిస్తోంది ఒకామె.

రామ, కృష్ణ, శివ, వెంకట – పదాలలో ఒకటో రెండో పదాలు ఎన్నుకుని ముందో వెనకో ఇంకో విశేషణ పదం కలిపితే తెలుగు మగశిశువుకి నికార్సయిన పేరు తయారవుతుంది. ముప్ఫై ఏళ్ళు దాటిన సగం ముప్పావు తెలుగువారికి అటువంటి పేరే ఉంటుంది. బుద్ధిరామయ్య పేరు అలాగే వాళ్ళ నాన్న రూపకృతి చేశాడు. పూర్వ పదాన్ని ఆయన బుద్ధ అనబోయి బుద్ధి అని బియ్యంలో రాశాడేమో మనకి తెలియదు.

వర్షం గట్టిగా కురుస్తోంది. చేతులు లేని గోనెపట్టా తొడుక్కున్న ఒక వ్యక్తి ఖాళీ రోడ్డు దాటి కఫే వైపు వస్తున్నాడు. ఆ చుట్టుప్రక్కలే ఎక్కడో కుడివైపున పిల్లికూన ఉండాలి. ముంజూరు క్రిందనుండి వెళ్ళి చూద్దునా అని ఇంకా మనసులో అనుకుంటోంది. ఆమె అలా తలుపు దగ్గర బయట నిలబడి ఆలోచిస్తూంటే, ఆమె వెనక ఎవరో గొడుగు తెరిచి పట్టుకున్నారు. మరెవరో కాదు, ఆ హోటల్‌లో పనిచేసే మెయిడ్.

సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.