పులి – మేక

ప్రియమైన అమ్మకి,

నువ్వూ నాన్నగారూ ఎలాగున్నారు? మేము బాగానే వున్నాము.

నాన్నగారి ఆరోగ్యం ఎలాగుంది? వేళకి మందులు వేసుకుంటున్నారా? నువ్వు కూడా వేసుకుంటున్నావా? వేసుకోవాలి.

చిన్నప్పుడు నాకు చెప్పేదానివిగా ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు నేను నీకు చెప్పాల్సి వస్తోంది. ‘మాకు చెప్పేటంత పెద్దవాడయిపొయ్యాడు వీడు’ అని నాన్నగారు వాళ్ళతోను వీళ్ళతోను అంటున్నారట. నాకు తెలుసు మీ ఇద్దరికి నా మీద కోపం వచ్చిందని. కానీ ఏం చెయ్యను. మేమిక్కడ ఉన్నామనే కాని నా ఆలోచనలు మీ చుట్టేనమ్మా! ఎలా ఉన్నారో ఏమిటో అనుకుంటూ వుంటాను.

‘ఏం, అంత సంపాదించుకుంటున్నారుగా! ఒక వెయ్యి డాలర్లు పెట్టి టికెట్టు కొనుక్కుని రాలేరా?’ అని ఎవరో అక్కాయి అందట. అని ఊరుకుందా! లేదు. ‘ఇదంతా వాడి పెళ్ళాం పనే! ఆవిడగారు పుట్టింటికి తోలుకుంటోంది’ అని కూడా అన్నదట. విన్నావిడా ఊరుకోవచ్చుగా! తిన్నగా నీ కోడలు ఆఫీసుకెళ్ళి తనతో చెప్పిందంట! ఇకనేం! ఈవిడగారు ఆ రోజు ఆఫీసునుంచి నేను వచ్చేటప్పటికి లంకలో సీత లాగ కొంపలో ఒక మూల ఏడుస్తూ కూర్చునుంది. ఏం, నేనూ నా కుటుంబం సుఖంగా ఉండటం ఇష్టం లేదా ఆవిడకి! ఈ సారి కనబడితే కర్రు కాల్చి నాలిక మీద వాతపెడతానని చెప్పు!

అమ్మా, నాకు తెలియక అడుగుతాను! మీరిద్దరూ ఇక్కడికి వచ్చినప్పుడు మేం ఏం తక్కువ చేశాం? చక్కగా మిమ్మల్ని బిజినెస్ క్లాసు‌లోనే దింపుకున్నాంగా. ఎయిర్‌పోర్ట్‌లో కాలు కిందపెట్టే అవసరం లేకుండా సునాయాసంగా వుంటుందని వీల్‌ఛెయిర్స్ నుంచి అన్నీ సమకూర్చాం. పొద్దున్నే కాఫీ దగ్గిర్నుంచి, మీకు వేరే వేరే టిఫిన్ల నుంచి, అన్నీ దగ్గిరుండి తన చేత్తోనే మీరు ఉన్నన్నాళ్ళూ మీకు నచ్చిన వంటలే చేసి పెట్టిందిగా నీ కోడలు. నీకొక కూర, నాన్నగారికి ఒకటి, నీకు తగ్గ ఉప్పు, ఆయనకి తగ్గ కారం… ఇవన్ని చేసి పెట్టాకే తను ఆఫీసుకు పరిగెత్తేది. నువ్వు చూశావుగా! నాన్నగారు కూడా చూశారుగా! మనింట్లో ఆయన లాగా నేను పడక్కుర్చీలో కూర్చోలేదుగా. కూర్చుని హుకుములు జారీ చెయ్యలేదుగా. సింకులో అంట్ల దగ్గిర్నుంచి ఇల్లు వాక్యూమ్ చేసుకోవడం అన్నీ మేమిద్దరం కలిసే చేసుకున్నాంగా! మీ బట్టలన్ని ఎప్పటికప్పుడు ఉతికి, ఇస్త్రీ చేసి పెట్టింది కాదా నీ కోడలు!

ఔనమ్మా నాకు తెలియకడుగుతాను.

అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు కదమ్మా! ప్రపంచం తెలియనప్పుడు, ఇదే ప్రపంచం అని ఇంట్లో బెబ్బులి చెబితే కాబోలు అనుకున్నాను. కాని కాదు! ఈ ప్రపంచం వేరు. దానికి తగ్గట్టుగా నేను మారాను. ఈ ప్రపంచంలో ప్రేమాభిమానాలతో పాటు డబ్బుకూడా కావాలమ్మా.

నా స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు, ‘తగ్గిన పది రూపాయలతో కట్టించుకో, నేను రేపు ఉదయం పిల్లాడ్ని దింపడానికి వచ్చినప్పుడు ఇస్తానుగా’ అంటే ఆ స్కూల్ క్లర్క్ ఒప్పుకోలేదని నాన్నగారు గింజుకుంటూ నీతో చెప్పినప్పుడు గుమ్మం దగ్గిరే వున్నానమ్మా, విన్నాను. ఆ రోజున ఆ పులి సణుక్కుంటూ, విసుక్కుంటూ, సైకిలు కారేజ్ మీద నన్ను కూర్చోబెట్టుకుని తిట్టుకుంటూ, తీసుకుంటూ స్కూలు దగ్గిర్లో ఆఫీసులో పని చేసుకుంటున్న ఫ్రెండుని పది రూపాయలు అప్పడిగితే ఆయన ‘లేవు’ అని తల తిప్పేసినప్పుడు ఆ ముఖం అవమానంతో ఎర్రబడటం కూడా చూశానమ్మా. చచ్చినట్టు నన్నేసుకుని ఆ మండే ఎండలో సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చి దేవుడి దగ్గిర నా హుండీ పగలగొట్టి పది రూపాయల నాణేలు తీసుకుని మళ్ళీ స్కూలుకి వచ్చి ఫీజు కట్టి నన్ను లోపలికి పంపారు నాన్న. నేను అది మర్చిపోలేదు!

క్లాసు ఫస్ట్ వస్తే సైకిలు కొనిస్తానులే అని ఏడో క్లాసులో చెప్పినా, టెంత్‌‌లో కాని కొనివ్వలేదు. ‘మీ నాన్న దగ్గిర డబ్బుల్లేవురా. నువ్వు ఎంత చదివినా అంతే’ అని నా క్లాస్‌మేట్ ‘చెవిపోగులోడు’ వెక్కిరించినప్పుడు, నేను నీ దగ్గిర చెప్పుకుంటూ ఏడిస్తే, నువ్వు కూడా విసుక్కున్నావు! ఆ ‘కలెక్టరి’ జీతంలో ఎన్నని కొంటారు మీ నాన్న అని! నేను అది మర్చిపోలేదు! ఎన్నటికీ మర్చిపోను కూడా.

పరేడ్ గ్రౌండు‌లో ఫాస్ట్‌గా పరిగెత్తలేకపోతుంటే, ‘ఆ కాన్వాస్ షూస్‌లో ఏం పరిగెడతాడురా వాడు’ అని వాళ్ళందరు ఎద్దేవా చేశారు. నేను పట్టించుకోలేదు. కాని షూస్ విప్పిన వెంటనే నా సాక్స్ బయటకు లాగి, వాటి బొక్కల్లో వేలుపెట్టి ఆడిస్తూ నా క్లాస్ ఆడపిల్లల ముందు నన్ను అవమానించిన రోజు సిగ్గుతో చచ్చిపొయ్యాను, కానీ అప్పటికి కొంత అర్థమవుతూనే వుంది ఈ ప్రపంచం. అందుకే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రాలేదు. బాత్‌రూమ్‌లోకి వెళ్ళి ఏడ్చి మొహం కడుక్కుని వచ్చాను.

నేను అది మర్చిపోలేదు! మర్చిపోను కూడా. అవి పోతే పోనిలే… ఎప్పుడు వుండేవేగా!

అమ్మా, ఈ రోజు ఉదయం ఏమైందో తెలుసా? రోజులాగానే ఈ రోజు వాళ్ళమ్మ జడ వేసేటప్పుడు ‘ఎందుకు అంత గట్టిగా లాగుతావు? నానమ్మ ఐతే ఎంత చక్కగా దువ్వుతుందో తెలుసా? అస్సలు నొప్పే ఉండదు’ అంటూ చిన్నది నిన్ను గుర్తు చేసుకుంది.

వాడూ అంతే! ‘నాన్నా, మనం నానమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం?’ అని అడుగుతుంటాడు.

మొన్న శనివారం మధ్యాహ్నం స్కూల్ నుంచి వాళ్ళిద్దర్ని తీసుకు వస్తున్నప్పుడు, ‘నాన్నా ఐస్‌క్రీమ్ తిందామా’ అని అడిగారు. సరే కదా అని కోల్డ్‌ స్టోన్‌కి తీసుకెళ్ళి ఇద్దరికి తలొక వనీలా కొనిపెట్టాను. చిన్నది అంటుంది, వాళ్ళన్నయ్యతో, ‘నానమ్మ ఐతే చాకోలెట్ ఫ్లేవర్ కొనిపెట్టేది, ఎంత స్వీట్‌గా వుండేదో.’

ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అన్నా చెల్లెళ్ళు ఒక వైపు, వాళ్ళమ్మ మరో వైపు కూర్చునున్నారు. టీవీ మోగటం లేదు. నేను సోఫాలో నా బ్రీఫ్ కేసుని ఒక వైపు పెట్టెసి కూర్చున్నానో లేదో, పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద పడిపోయింది నీ మనవరాలు. గొంతు పెంచకుండా ఎక్కిళ్ళతో ఏడుపు. ‘ఎందుకమ్మా ఏడుస్తున్నావు?’ అని అడిగాను. చెప్పకుండా నా భుజంలోకి ఇంకా గట్టిగా తలదూర్చి ఏడుపు పెంచింది.

‘ఎందుకురా చెల్లి ఏడుస్తోంది?’ అని అడుగుతూ వాడి వైపు చూశాను. వాడు ఏడుపుని బిగపట్టుకుని ఆపుకుంటున్నాడని అర్థమయ్యింది. వాళ్ళమ్మ వైపు చూద్దును కదా ఆవిడ తల తిప్పుకుని కూర్చుంది.

వాళ్ళిద్దర్ని బుజ్జగించి, బుజ్జగించి నెమ్మదిగా వాళ్ళ వెక్కిళ్ళ మధ్య రాబట్టితే తెలిసింది వెళ్ళిపోయారని. ‘మేమిద్దరం వెళ్ళిపోతాంరా, మీ ఇంట్లో వుండలేం!’ అన్నావంట! ‘ఎందుకు?’ అని అడిగితే ‘మేము మీ నాన్నకి బరువైపొయ్యాము!’ అన్నావంట! పక్కనే వున్న సింహం కూడా మాట్లాడకుండా కిటికీలోనుంచి బయట మొక్కల్ని, చెట్లని చూస్తూ కూర్చున్నారంట.

మాలో కొంత మందికి వారం రోజులు పనిచేస్తే కాని జీతాలు అకౌంట్లో పడవు. అవి పడితే కాని పిల్లలకి ఫీజులు, ఇంటికోసం తీసుకున్న లోనులకి మార్ట్‌గేజులు, మంత్లీ పేమెంట్లూ అవీ (మీ భాషలో కిస్తీలు, కారుకి కూడా!) కట్టుకోవాలిగా. శుక్రవారం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్ళేదాకా మా ఉద్యోగాలుంటాయో ఊడతాయో తెలియని అర్భకపు జీవితాలు మావి! మీరు మీ పత్రికల్లో చదువుతునే వుంటారుగా గూగుల్‌వాడు, ఫేసుబుక్కువాడు ఉద్యోగాలు ఎలా ఉన్నట్టుండి పీకి నడిరోడ్డు మీద నిలబెడతారో! అదీ కాక… అన్నీ ఏకరువు పెట్టలేనమ్మా! బిచ్చం వేసినా లెక్కపెట్టి వెయ్యాలి అని నువ్వేగా నేర్పింది! ఆదాయం ఎలాగో ఖర్చులు కూడా అలాగే లెక్క వేసుకుంటే కాని జీవితం నడవదు.

వారం ఎలా గడుస్తుందో మీరూ చూశారు. వారాంతంలో తప్ప మాకు సొంత పనులకు టైముండదు. అందుకే శనాదివారాల్లోనే మా షాపిం‌గ్ అంతా చేసుకుంటాం. మీరు గుళ్ళూ గోపురాలూ తిప్పమంటే నేను కాదనలేదే. మా మేనేజరుతో మాట్లాడి, సెలవు తీసుకుని వెళ్దాం అని అన్నాను. అక్కడ లాగా అలా అనుకుని ఇలా వెళ్ళిపోవడం కుదరదు. అందుకని ఆపై వచ్చే శనాదివారాలు వెళ్దామని అన్నానే కాని వద్దని అనలేదుగా! ఆ మాత్రం దానికే అంత మాట అనాలా?

నీకు గుర్తుందామ్మా?

నా జీవితంలో మొదటి ఉద్యోగంలో జాయిన్ ఐనప్పుడు, ‘ఆ ఆరునెలలు ఇంటర్న్‌షిప్‌లో నిలబడనీ చూద్దాం’ అని పెద్దపులి అన్నారంటే, ఏవిటీ అలా అంటున్నారు అనుకున్నాను. కాని స్టయిపండ్ అకౌంట్‌లో పడ్డ రోజున ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని ఇంటికి వస్తే ఆయనగారేమో ఫోనులో బిజీ! నువ్వేమ్మో బేబి మామ్మతో బిజీ, బిజీ! ఆ శనివారం సాయంత్రం నా సంతోషాన్ని పంచుకుంటూ సరదాగా అలా బృందావనంకి వెళ్ళి భోజనం చేద్దామంటే గుడికి వెళ్ళాలని నువ్వు, పోనీ ఆదివారం సాయంత్రం వెళ్దామంటే, నాన్నగారికి క్లబ్‌లో ప్రోగ్రామ్ వుందన్నారని అన్నావు నువ్వు! నేను అది మర్చిపోలేదు! మర్చిపోను కూడా. ఔను, మీ ఇద్దరికి బట్టలు పెట్టాను కదా! అవి కుట్టించుకున్నారా, కట్టుకున్నారా? నాకు చూసిన గుర్తు లేదు మరి!

ఉద్యోగంలో చేరిన మూడు నెలల తరువాత బైక్ కొనుక్కుని, ఆ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో పూజలు చేయించుకునేటప్పుడు తోడుగా వచ్చిన మా మేనేజరు అన్నమాటలు గుర్తుకువచ్చాయి. ‘మీ నాన్నగారికి బహుశా పదేళ్ళు పట్టిందేమో బైకు కొనుక్కోవడానికి కానీ నీకు పాతికేళ్ళ వయసుకే వాహనయోగం పట్టింది!’ అంతేగా మరి ఆయనకంటే చిన్న వయసులోనే పెద్ద జీతం కాదా మరి!

నా చదువులకి తీసుకున్న బాంక్ లోనులవీ నేనేగా కట్టుకున్నది. నీ మేనకోడలికి అమెరికా సంబంధం కావాల్సి వచ్చింది, మరి ఆయన చెల్లెలికి ‘డాక్టర్’ సంబంధం కావాల్సి వచ్చింది! ఏం చేద్దాం మరి! ఆ గోల పడలేక నాకు నచ్చిన, నన్ను మెచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఖర్చులు నేనే పెట్టుకున్నానుగా! నాకు తెలుసు మీరు పెళ్ళి పీటలమీద కూర్చోకపోతే నేను ఏ రిజిస్ట్రారు ఆఫీసులోనే చేసుకుంటానని భయపడ్డారులే. మళ్ళీ మీ సంఘంలో మీరు తలెత్తుకు తిరగలేరుగా!

‘ఆ పెద్దవాళ్ళిద్దర్ని ఆ అద్దెకొంపల్లో ఎందుకయ్యా, చక్కగా ఒక ఫ్లాట్ కొని అందులో వుండమనక’ అని టైగర్‌గారి స్నేహితుడు ఒకటికి పదిసార్లు ఫోన్లు చేసి పోరితే మీకు ఇష్టం వుండదేమోనని సందేహిస్తే ‘మీ నాన్నగారిని ఒప్పించే పూచీ నాది’ అని ఆయనన్నారు. ఆ మాటన్న తరువాతే మీరుంటున్న ఫ్లాట్ కొన్నాను. తరువాత తెలిసింది నాకు ఆ ఫ్లాట్ కొనే ప్రపోజల్ స్నేహితుడుగారిది కాదని! ఇంకొకటి తెలుసా? ఆ ప్లాట్ కొనే టైమ్‌కి డబ్బులు లేకపోతే నీ కోడలే ముందుకొచ్చి లోన్ తీసుకుని డబ్బులు సర్దింది. నీకేమో ఆమె బొట్టు పెట్టుకోదు, తాళి ఉంచుకోదు, చీర కట్టుకోదు, జీన్సు, గౌన్లు వేసుకుని అలా ఆడా మగా అని లేకుండా అందరితో తిరుగుతుందని కోపం! మీ ప్రపంచం వేరు, మా లోకం వేరు. అది గుర్తించండి.

మాకు ఉన్నంతలో మేము చేసుకుంటున్నాము. మాకు వీలైనంతలో మీకు చేస్తున్నాము. మీకు చెయ్యాలని లేక కాదు. మాకు మీ మీద ప్రేమ లేకా కాదు. ఆరోగ్యంగా కాళ్ళు, చేతులు ఆడుతున్నంత సేపు, ‘దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని తెలుసుకున్నాం కాబట్టే ఇలా వుంటున్నాం. అది అర్థం చేసుకోకుండా, ఇంకో నాలుగు నెలలకి వీసా ఉన్నా, ఉన్నపళాన అలా బయల్దేరి వెనక్కి వెళ్ళిపోవడం మీ ఇద్దరికి సరి కాదు. పైగా నేను ఆఫీస్‌ టూర్‌లో వేరే ఊర్లో వున్నప్పుడు! మీ సుఖం మీరు చూసుకున్నారు గాని, మా కష్టాలు గమనించారా?

నాన్నగారికి బాగోలేదని ఫోన్ చేస్తే ఉన్నపళంగా బయలుదేరి రాలేదా? ఫోన్ల మీద రిపోర్టులన్నీ తెప్పించుకుని తెలిసిన డాక్టర్లని సంప్రదించి సలహాలు తీసుకోలేదా! డబ్బుకి వెరవకుండా ఆ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టలేదా? ఏనాడైనా నీతో ఇంతయ్యిందని మాటవరసకైనా అన్నానా? ఆ వారం పదిరోజులు మీతోనే ఉన్నానుగా. నీ ఒక్కదానివల్ల కాదని ఒక పర్సనల్ హెల్పర్‌ని కూడా పెట్టానుగా ఆ నెల రోజులు. ఐనా ‘వాడికేం పట్టిందీ… ఇలా వచ్చాడు అలా పొయ్యాడు. పట్టుమని వారం రోజులు ఉంటే ఒట్టు’ అని నన్ను మాటలన్నారని తెలిసింది. పైగా ‘ఏవిటో మరీ డబ్బు మనుషులు ఐపోయారు ఈకాలం పిల్లల’ని ఈసడింపులు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మాకు డబ్బులు ఊరికే రావటం లేదు! అలాగే ఆ డబ్బులు లేకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్‌మెంట్లు, బిల్లులు కట్టుకోవడం మీవల్ల కాదు! ఆ పర్సనల్ హెల్పర్ జీతాలు మీకు అందుబాటులో వుండవు! కష్టమైనా, నొప్పించే మాటైనా ఇది కూడా మీకు తెలియాలి! మిమ్మల్ని నేనేమీ ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌‌కి పంపలేదే. దగ్గిరుండి చేయించానే! ఎందుకని? ప్రేమ, అభిమానం వుండబట్టేగా. అన్నీ ఇలా సజావుగా జరిగినవాళ్ళందరూ, జరిగినంత కాలం, ‘ఆఁ, వెధవ డబ్బేం చేస్తుందీ’ అని ఈసడించుకుంటూ ఉంటారు, దాని అవసరం రానంతవరకూ.

నానమ్మ, తాతగారు ఫేస్‌టైమ్‌కి ఎందుకు రావడంలేదు, వాట్సాప్‌ మెసేజ్‌లకు ఎందుకు ఆన్సర్ చెయ్యడంలేదు, ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చెయ్యడంలేదు అని ప్రతిరోజు పిల్లలు అడగడమే! ఆయనెలాగో ‘పెద్దపులి’గా! మాట్లాడరు. నీ కోడలికి తన మూలంగా మీరిద్దరూ వెళ్ళిపొయ్యారని నేను అనుకుంటానని అనుమానం! తనలో తాను కుళ్ళిపోతోంది. ఇంతమందికి ఇలాంటి మానసికవ్యథ అవసరమా అమ్మా? చెప్పు.

ఫోన్లు చేసీ చేసీ మీ మౌనంతో మొండితనంతో విసిగిపోయి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. పైగా ఫోనుల్లో ఇన్ని విషయాలు, ఇంత వివరంగా చెప్పలేను కూడా. మరోమాట, నీకు ఉత్తరం ఒకటికి పదిసార్లు చదువుకునే అలవాటు ఉంది కదా. ఆయనకి కూడా చదివి వినిపించు, లేదా చదువుకోమని చేతికి ఇవ్వు. తాపీగా చదువుకుంటారు. చదువుకుని నిజానిజాలు మీరే ఆలోచించుకోండి. ఇక మీ ఇష్టం.

ఉంటాను మరి. ఆరోగ్యం జాగ్రత్త.


స్కూల్‌కి వెళ్ళడానికి పిల్లలిద్దరూ కారెక్కిన తరువాత గుర్తు వచ్చిందతనికి. దిగి ఇంట్లోకి వెళ్ళి ఉత్తరం రాసిన కవర్‌తో కారు ఎక్కాడు. అతని చేతిలోని కవరుని చూస్తూ కూతురు అన్నది, ‘యూ నో వాట్? గ్రాన్‌‌మా కేమ్ ఇన్‌టు మై డ్రీమ్స్ లాస్ట్ నైట్. ఐ రియల్లీ మిస్ హర్!’