ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు.
Category Archive: కథలు
“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.
మన యిండియన్లదంతా మెమొరీ పైన నిలబడిన హిస్టరీనే అమృతా! దేన్నీ రికార్డు చేసేది మనవాళ్ళకు తెలియదు. మావూర్లో సంక్రాంతి పండగనాడు ప్రతి యింటోళ్ళూ బ్రాహ్మణుడ్ని పిలిచి పెద్దలకు తర్పణమొదల్తారు. అప్పుడా బ్రాహ్మణుడు వాళ్ళను కనీసం వాళ్ళ మూడు తరాలవాళ్ళ పేర్లయినా చెప్పమని మొత్తుకుంటాడు. వాళ్ళకు వాళ్ళ తాత పేరయినా సక్రమంగా జ్ఞాపకముండదు. అందరిండ్లల్లో జమిందార్లు, వీరులు, శూరులూ వుంటారా చెప్పు గుర్తు పెట్టుకునేదానికి?
నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.
నిద్ర మధ్యలో మెలుకువ ఒచ్చింది ఆమెకి. కుడివైపుకి తిరిగి చూసింది. పక్కన పడుకునివున్న అతడి కళ్ళు తెరచి వున్న గవాక్షంగుండా కనిపించని దూరాలలోకి చూస్తున్నాయి. దగ్గరగా జరిగింది. “ఏమిటా ఆలోచనలు నిద్రవేళ?” అంటూ అతడి చెక్కిలిపైన చేతిని వేసి తన వైపుకి తిప్పుకుంది. ఆ రాత్రివేళ ఒకానొక అడవిలో ఓ పర్ణశాలకి పహారా కాస్తూన్న తన కవల సోదరుడు ఆలోచనలనిండా నిండివున్నాడని అతడు చెప్పలేదు.
రెండు గదుల పెంకుటిల్లు. బయట వరండాలో రెండు అరుగులు. నవారు కుర్చీ. ఓ నులక మంచం. వంటింటి సామాన్లు, ఆమె చీరలు కాకుండా, అన్నిటికంటే ఆకర్షించింది అక్కడ ఉన్న చిన్న చిన్న వెదురు బుట్టలు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రంగుల గవ్వలు. గవ్వలతో చేసిన బొమ్మలు. పక్కన ఓ ట్రంక్ పెట్టె. దానిని తెరవాలనిపించలేదు. వాటినన్నిటిని చూస్తుంటే ఆమె ఆ ఇంటిని ఎంత ఇష్టంగా చూసుకుందో కనిపిస్తుంది.
రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి దేవతల యాస ఏదో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది.
కొన్ని పాతజ్ఞాపకాలు ఏనాటికీ మరుపురానివి! ఆరోసారో పదహారోసారో చూస్తున్న ‘రోమన్ హాలిడే’ లాంటివి. మహాకవిని వోక్స్‌వేగన్ బగ్‌లో మేడిసన్ తీసుకొని వెళ్ళటం, జీడిమామిడి చెట్లకింద కూచొని మరోకవితో డైలన్ థామస్‌ని చదవటం, టెన్సింగ్ నార్కేకి షేక్ హాండ్ ఇవ్వడం, ఇండియా నించి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్ని మంగలి షాపుకి తీసికెళ్ళి తెల్ల అమ్మాయి చేత క్షవరం చేయించటం, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్ పట్టించడం, వగైరా!
సూర్యాస్తమయం నేనున్న చోటుకు వ్యతిరేక దిశలో అయింది కాని, అస్తమయం తరువాత వెల్లివిరిసే సంధ్యాకాంతులు పరిసరాలను సువర్ణభరితం చెయ్యడం గమనించాను. అవును – ఒక్కోసారి సూర్యాస్తమయ దృశ్యం కన్నా దాని తరువాత జరిగే వర్ణలీల మరింత మనసుకు హత్తుకొంటుంది.
బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలై, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి.
ఏరా దామూ బడికి రాలేదూ అనడిగితే ఈ రోజు లచ్చిమి ఈనింది అని, ఇంకో రోజు రాజుకి దెబ్బ తగిలింది అని ఏదో ఒక కారణం చెప్పేవాడు. మేకలన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎందుకురా మేకలకు పేర్లు పెట్టావ్ అంటే, ‘మేకల భాష తెలీదు కదా టీచరమ్మా వాటికి అవి ఏమి పేర్లు పెట్టుకున్నాయో! ప్రతి మేకకి ఏదో ఒక పేరు ఉంటది కదా, మరి మేక అని ఎట్లా అంటా, అందుకే నేను ఒక పేరు పెట్టుకున్నా’ అని అన్నాడు. వాడి దగ్గర అదో రకమైన మేకల వాసన.
బ్రిడ్జి దగ్గర కాలవలో వేటకెళ్ళొచ్చిన పడవలు లంగరులేసి వున్నాయి. వెనక్కి తిరిగి మసీదు సెంటరుకొచ్చా. కోటయ్య కాజాల షాపు దగ్గర చాలా రష్‌గా వుంది. ఫేమస్ బేకరీకెళ్ళాను. లోనికి పోవడానికే ఖాళీ లేనట్టు కిక్కిరిసి పోయివుంది. అర్ధగంట ఆగితే గానీ లోనికి పోవడానికి కుదర్లేదు. వేలం వెర్రిగా కేకులు తీసుకుపోతున్నారు జనం. పెద్ద ప్లమ్ కేక్ తీసుకున్నాను. దాని పైన అందంగా ‘హేపీ న్యూ యియర్’ అని రాసి ఇచ్చాడు.
పుట్టుకొచ్చే మనవసంతానాన్ని సాకడం, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆ పిమ్మట సుధామయి తాలూకు అల్లుళ్ళు, కోడళ్ళతో ఇహిహీ అంటూ పూసుకోవడం… ఈ లంపటానికి ముగింపు ఉందా? ఇప్పటికే నా జీవితం ఒక నాటకమయిపోయింది. పాస్ మార్కుల నటనకూడా నావల్ల కావటం లేదు. ఇహ నటించటం నావల్ల కాదు. లేటుగా వచ్చినా నా బుఱ్ఱకి వెలుగు నీటుగా వచ్చింది. మీ బతుకులు మీకు కావలసినట్లు మీరు బతుక్కోండి. నాకిక బాధ్యతలు వద్దు, హక్కులూ వద్దు.
నాకు చిన్నతనం నుండి పరిచయం, అలవాటు, చనువూ ఉన్న ఏరు ఇది. నా చిన్ననాటి స్నేహితురాలు. వర్షాకాలంలో ఆమె తెంపరితనం. రాత్రివేళల్లో ఆమె మౌనం. మంచుకాలపు వేకువ జాముల్లో ఆమె సిగ్గు. ఎంత దగ్గరది ఈ ఏరు నాకు! వంపు తిరిగి ఆదీ అంతమూ లేకుండా అనంతమైన ఒక డొంకదారిలా ప్రవహిస్తూ సాగే ఆమెలో నాకు తెలియని వేలాది రహస్యాలు ఉన్నట్టు అనిపిస్తోంది.
ఆవరణలో పెద్ద మామిడిచెట్టు, దానిపక్కనే మొదలుకంటూ అడ్డంగా కొట్టేసి, ప్రస్తుతం మొద్దులా మిగిలిన మరో చెట్టు ఆనవాలు. ముందుకు నడిచాను. రెండు పిల్లులు గబాల్న నా ముందునుండి పరిగెత్తాయి. హాల్ మధ్యలో నాలుగు కేన్ చైర్స్, ఒక చిన్న కాఫీ టేబుల్. పక్కగా కొద్దిపాటి ఎత్తులో పియానో. దానికి కొంచెం దూరంలో కిటికీ. దానికి అటు ఇటు పుస్తకాల షెల్ఫులు.
గదిలోంచి బయటకి నడుస్తున్నపుడు, నేలకు కాళ్ళు ఆనుతున్నట్టు అనిపించలేదు ఆమెకి. అసలు ఏమీ అనిపించలేదు. కొద్దిగా తల తిరుగుతున్నట్టు, వాంతి వస్తుందేమోనన్న భయం తప్పితే. చేస్తున్న పనులన్నీ అచేతనంగా జరిగిపోతున్నాయి: సెల్లార్ లోకి వెళ్ళడం, లైటు వెయ్యడం, ఫ్రీజర్ తలుపు తెరవడం, చెయ్యి పెట్టి ఏది ముందు తగిలితే దాన్ని అందుకోవడం. అందినది బయటికి తీసి అదేమిటా అనుకుంది.
విమానం గాలిలోకి ఎగరగానే నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం.
ఈ కథకి ఒక రకంగా ప్రేరణ నేను చిన్నప్పుడెప్పుడో పత్రికలోనో, ప్రభలోనో చదివిన కథ. కథ పేరు గాని, రచయిత పేరు గాని గుర్తు లేవు. కానీ కథ మాత్రం బాగా గుర్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, అందులో ఒక పసివాడి తల్లి చనిపోతుంది. వాడు బయట ఆడుకుంటూంటాడు. లోనికి వచ్చి, ఆమెను కుదిపి కుదిపి మాటాడటానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఎవరో వచ్చి వాడికి ఇష్టమైన కుక్కపిల్లతో ఆడుకోమని దూరంగా తీసుకుపోతారు.
గజరాజుకి ఏభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, తన కొడుకులకి, తమ్ముళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయేయి. ఎవరికి ఇంకా సంతానం కలగలేదు. గజరాజు తల్లి కాలధర్మం చెందింది. ఒక చెల్లెలు భర్త చనిపోయి నిస్సంతుగా అన్నగారి దగ్గరకు వచ్చేసింది. పుట్టింటి వారిచ్చిన రెండెకరాలే కాకుండా అప్పుడప్పుడు కూడబెట్టుకున్న మిగులు సొమ్ముతో అన్నగారి ద్వారా కొనుక్కున్న ఇంకో రెండెకరాలు, భర్త ద్వారా జల్లూరులో ఐదు ఎకరాలు ఆమె ఆస్తి.
ఏమో తెలియదు కాని, దాని శబ్దాలు వినే కొద్ది కొన్ని రోజులకు అర్థమైంది, అది చేస్తున్నవి శబ్దాలు కావు, అది పాడుతుందని. ఆ పాట ఎంత తీవ్రతతో ఉంటుందంటే దాన్ని వింటున్నప్పుడు ఒక్కోసారి దుఃఖం వచ్చి ఏడ్చేవాడిని. ఇంకొన్నిసార్లు ఆనందం లోపలనుంచి పొంగుకొచ్చేది. అప్పుడప్పుడు అది ఏదో శాంతి మాత్రం జపిస్తున్నట్లు అనిపించేది. దాని పాట వింటూ ప్రపంచాన్ని మనుషుల్ని మరిచిపోయేవాడిని.