ఇన్నేళ్ళుగా దాచిన సమావేశాల రహస్యం గురించి నాకెలా తెలిసింది? దానికి సమాధానం- యుద్ధం. ఈ యుద్ధం, యుద్ధానికి కారణమైన రహస్యాన్ని తప్ప తక్కిన రహస్యాలన్నిటికీ తెర దించింది. ఆత్మవిమర్శలో నిమగ్నమైన ఈ ప్రపంచం, ఆ ఒక్క రహస్యాన్నీ పక్కన పెట్టేసింది. ఎక్స్-క్లబ్ సభ్యులు పదిహేనుమందిలో తొమ్మండుగురు యుద్ధరంగంలోని ఆసుపత్రులలో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. తక్కిన వారికి ఉన్నచోటే పని మరింత పెరిగింది.

ఆయన ఒక పెద్ద తాడు చివర్న కొక్కెం కట్టి చందమామ మీదకి విసురుతున్నాడు. తెల్లనిగోళం తన చేతుల్లోకి వచ్చి పడేవరకూ ప్రయత్నించాడు. చాలా అలసిపోయాడు. అంత పెద్ద గోళం అమాంతం వచ్చి పడేసరికి బరువు మోయలేక నానా యాతన పడ్డాడు. అక్కడికి దగ్గరలోని భవనాల నీడలో నక్కినక్కి చూస్తున్న వ్యక్తిని పిలిచాను, ఆ పెద్దాయనకి సాయం చేయమని. అప్పటికే చందమామ నుంచి జారిన నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి.

ముసలివాడికి సమయం ముగిసింది. లాంతరు వెలుగు పూర్తిగా పెంచి పెద్దగా పొలికేక పెడుతూ గదిలోకి దూకాను. ముసలివాడు అరిచాడు – ఒకే ఒకసారి. క్షణం ఆలస్యం కాకుండా ముసలివాడిని మంచం మీద నుండి కిందకు తోసి బరువైన పరుపు వాడి మీదకు లాగాను. కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అయితే అది ఇప్పుడు గోడ దాటి వినిపించదుగా. చివరకి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. ముసలివాడు చచ్చిపోయాడు.

మనోరమ నాకన్నా బాగా పెద్దమ్మాయి. దానికి చాలా విషయాలు తెలుసు. అది మగపిల్లల బళ్ళో చదూతూంది. నే నాల్గోక్లాసు చదూతూన్నప్పుడు నాన్న తనతోపాటు నన్నూ కానుకుర్తివారి సత్రంకి తీసుకెళ్ళేడు. అదిగో – ఆవేళ అక్కడ మొట్టమొదటి సారి మనోరమని చూశా. మాటాడే. నాటకం చూడ్డానికే కాదు, డబ్బులు దండడానికీ వచ్చేనని చెప్పింది.

మొత్తానికి ఇళ్ళకన్నా, ఇళ్ళు చూపించిపెట్టే ఏజంట్ల వెదుకులాట అనేది అతి ముఖ్యం అయిపోయింది నాకు. ఆ పనిలోనే ఒకరోజు కాస్త పాపభీతి, దైవభక్తి మెండుగా ఉన్నట్టు కనపడే ఒక ఏజెంట్‌ దొరికాడు. నేను అతడిని కలవడానికి వెళ్ళిన సమయంలో అతను ఒక దేవత పటం ముందు నేలమీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు.

ఒకచోట నీళ్ళలోకి దిగి, వేగంలేని అలలతో ఆడుతున్నాం. నాయర్‌కి ఈత వచ్చు. నాకూ ప్రకాశం బారేజ్ దగ్గరి ఘాట్‌లలో ఈదిన అనుభవం ఉన్నా, సముద్రంలో ఇదే మొదటిసారి… ఇంతలో, కొద్దిదూరంలో ముగ్గురు విదేశీ వనితలు. అంతే. మా చూపులు అటే తిరిగిపోయాయి. వాళ్ళు పరుగెడుతున్నారు. అలలకి అల్లంత దూరంలో ఉండగానే ఒక్కొక్కటిగా బట్టలు వలిచేసుకుంటూ దభేల్ దభేల్మంటూ నీళ్ళలోకి దూకారు. ఆ నవ్వులూ కేరింతలూ… నాయర్ ముఖంలో ఒక వెర్రి సంతోషం.

పాఠకులంటే ఎంతో చిన్నచూపు ఉంటే కాని ఓ రచయిత ఇలాంటి కథ రాయలేడు. మనుషులను సెన్సిటైజ్ చేయడం ఓ కుట్ర. రాజకీయాలకంటే సాహిత్యమే ఆ పని ఎక్కువ చేస్తుంది. దాన్ని రాజకీయం వాడుకుంటుంది. ఈ కథలో పేదరికం, వివక్ష, వెర్రి ప్రేమ ఇలాంటి వాటిని ఓవర్ రొమాంటిసైజ్ చేయడం ద్వారా పాఠకుడి ఆలోచనలతో కాకుండా ఎమోషన్‌తో ఆడుకోవాలనే ఆలోచన ఈ కథను, రచయితను ఇద్దరినీ అధమ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లుంది.

చిన్నప్పుడు నిజానికీ అబద్ధానికీ తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది. ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టడంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లమ్మక్క వేలు పట్టుకుని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలి వచ్చే పనివాళ్ళ కేకలు. వొద్దన్న పనులు చేస్తుంటే కలిగే ఆనందం, నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది.

టెస్ట్ స్ట్రిప్ మీద రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ కేరీ-ఆన్‌ లోంచి విడిచిన బట్టలని తీసి బాత్‌రూమ్‌లో ఒక మూల పడేసింది. మేకప్ తుడుచుకుని, మొహం కడుక్కుని, నైట్‌డ్రెస్‌లోకి మారి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పటికే మోగన్ నించి రెండు మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టడంవల్ల ఆమెకి తెలియలేదు. హబ్బీ అని, మోహన్ అనీ కాక ఆ పేరుతో భర్తనంబర్ లిస్ట్ చెయ్యడం తప్పితే, అతని ఇష్టానికి విరుధ్ధంగా చేసిన పని ఏదీ ఆమెకు గుర్తుకురాదు.

ఒకరోజు కొత్తబట్టలు కట్టుకుని మా ఇంటికి వచ్చింది మా అక్కను కలవడానికి. ఆ రోజు ఏ పండగా కాకపోవడంతో ఆ రోజు తన పుట్టిన రోజని గ్రహించాను. మధ్యాహ్నమల్లా కూచుని మంచి ఆర్ట్ పేపరు మీద వాసు రాసిన పాటని పొందికగా రాసి, మూడో చరణంలో ‘మూర్తి’ అన్న పదాన్ని కోట్‌లలో పెట్టి వాళ్ళమ్మగారు లేని సమయం చూసి వాళ్ళింటికి వెళ్ళి ‘ఇది నీకు నా పుట్టినరోజు కానుక’ అని చెప్పి బుచ్చిరత్నానికి ఇచ్చేను. అది చదివి నమ్మలేనట్టు నావంక చూసింది.

నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు.

భలేగా ఉంది లెక్కల టీచరు! పొడుగ్గా, రెపరెపలాడే వాయిల్ చీరలో – ఎంత తెలుపో! మోచేతివరకూ చేతులున్న జాకెట్టు, నల్లతోలు బెల్టుతో రిస్టువాచీ, రెండో చేతికి నల్ల గాజులు, చెవులకు పొడుగ్గా వెండి లోలాకులు, మెళ్ళో సీతాకోకచిలక లాకెట్టుతో సన్నటి వెండి గొలుసు, కళ్ళకు సురమా కాటిక!

ఒద్దు ఒద్దనుకుంటూనే ఒక ఉత్తరాన్ని తెరిచాను. కుదురుగా ఉన్నాయి అందులోని పంజాబీ అక్షరాలు. మరో ఉత్తరం తెరిచాను. అదే చేతి రాత. అదే పొందిక. ఇంకోటి… ఆ గుర్‌ముఖి అక్షరాలు చదవడం రాదు కాబట్టి, ఆమె రాసింది నాకు తెలిసే ప్రమాదం లేదు. కానీ అవి ప్రేమలేఖలని గుర్తుపట్టడానికి, చదవాల్సిన పని లేకపోయింది! ప్రతి ఉత్తరానికీ కుడి చివరన స్పష్టంగా, సంతకానికి బదులు లిప్‍స్టిక్ రాసుకున్న పెదాలు ఒత్తిన ముద్రలు…

నావంటివాడు ఉంటే గింటే రాజకీయ కార్టూనిస్ట్‌గానే ఉండాలి. వార్తలు చదవడం, ఆలోచించడం, వాటి ఆలంబనతో రాజకీయ కార్టూన్లు గీయడం. ఎంత మన్నికైన పని! ఆ వెటకారాన్ని, సునిశిత వ్యంగ్యాన్ని ఊహించడంలో ఎంత మజా ఉంటుంది. బుర్ర ఎంత పదునుగా పని చేస్తుంది.

నా బాడీ షాపింగ్ ఐ. టి. బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పాను. ఇద్దరమూ బ్రోకర్స్‌మే అని నవ్వాడు. నాకు కాస్త ఇరిటేషన్ వచ్చింది. ఆవిడ మటుకు పెద్ద ఇన్వాల్వ్ అవ్వకుండా మా మాటలు వింటూ కూర్చుంది. తన బర్త్‌డే ఆరోజు అని మాటల్లో తెలిసింది. ఇంతలో అతనికి కాల్ రావటంతో ఇప్పుడే వస్తానని బయటకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం కాసేపు మౌనంగా కూర్చున్నాం, మా డ్రింక్స్ మేము తాగుతూ. నలభై అనిపించేలా లేదు. స్లిమ్ ఫిగర్.

అందరం సంబరంగా 2020కు స్వాగతం చెప్పాం. చిట్టచివరి సారిగా మొరాకన్ విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఎంతో హాయిగా సంతృప్తితో నిద్రాదేవత ఒడిలో సేదదీరాం. తెల్లవారగానే చుట్టూ కమ్ముకున్న కొత్త సంవత్సరపు పరిమళాలను మనసారా ఒంటపట్టించుకుంటూ తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయం దారి పట్టాం.

ఆమెను ఏమని పిలివాలో నాకెప్పుడూ తోచేది కాదు. పేరు పెట్టి పిలిచినా, ఆంటీ అన్నా, అమ్మాయ్ అన్నా ఆమె ముఖంలోని నవ్వులో పెద్ద తేడా ఉండేదేమీ కాదు. ఆటలంటే ఆమెకి చాలా ఆసక్తి ఉండేది. ఇంట్లో రకరకాల బోర్డ్ గేమ్స్, ఆటవస్తువులు ఉండేవి. చెస్, క్యారమ్స్, చైనీస్ చెక్కర్స్, బాడ్మింటన్ ఇలాంటి ఆటలన్నీ ఆమె నేర్పినవే. బ్లాక్ అండ్ వైట్ టివిలో క్రికెట్ ఆటలు లైవ్ మాత్రం వదలకుండా చూసేది. అవి టెస్ట్ మ్యాచ్ లైనా సరే.

జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. ఏదో చెప్పడానికో ఏదైనా అడగడానికో కాదు, ఉత్తగా కారణాలు ఏమీ లేకుండా ఒక్కసారి నిన్ను చూసి దగ్గరగా హత్తుకొని గుండెని తేలిక చేసుకొని వెళ్ళాలనుకుంటున్నా.

కోతి ముందుకు వచ్చి ఆ బైక్ పక్కన చేరి అతను బిగిస్తున్న నట్టుని తడిమి చూసింది. వంగి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి కొరికింది. అతను దాన్నే చూస్తున్నాడు. ఇందాక పైకి లేస్తూ చేతిలో ఉన్న స్పానర్ కింద పడేశాడు. ఆ కోతి వంగి స్పానర్ చేతికి తీసుకుని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని చూసింది. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది, నోట్లో పెట్టుకుని తర్వాత దాన్ని బోల్ట్ మీద పెట్టి అతనిలాగే బిగిస్తున్నట్టు అభినయం చేసింది.

నిర్వహణలో పాలుపంచుకోవడం ప్రారంభించాక అధికారి మొదటిసారిగా అధికారపు రుచిని తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆ అధికారం ఎలా వస్తుంది అన్నదీ కనుక్కుంటాడు. ఇంకా ఇంకా అధికారానికి వాడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసం తనను తాను మార్చుకుంటూ పోతాడు. కొన్నేళ్ళలో వాడు అధికార వ్యవస్థలో ఉండి మిగిలినవాళ్ళలాగా మూసలోకి సరిపడేలా మారిపోతాడు. వాడు ఎంతో కాలంగా కలలుగని తెచ్చుకున్న లక్ష్యాలన్నీ ఎక్కడో తప్పిపోతాయి.