అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.

ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.

ఏటవాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ బండ్లను అక్కడ ఉన్న సైనికులు తోసి సాయం చేస్తున్నారు. కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలుకానంతగా అలసిపోయాడు. రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను.

పాట మొదలుపెట్టడం ఆలస్యం, బ్రిగేడ్ కమాండర్ భార్య మొహం విప్పారడం అంత దూరంనుంచీ స్పష్టంగా కనపడింది. అది అప్పటికి ఎన్నోసార్లు విజయవాడలో ఎన్నో స్టేజీల మీద పాడిన పాట! పాట ముగియబోతోంది. బ్రిగేడ్ కమాండర్ భార్య లేచింది. వెంటనే కమాండింగ్ ఆఫీసర్‌తో సహా, ఆఫీసర్ల వరసల్లో కూర్చొన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. బ్రిగేడ్ కమాండర్ కూడా లేచి, భార్యతో సహా స్టేజ్ వైపుకు నడిచి వచ్చారు.

పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.

స్త్రీల పాటలలోని కుచ్ఛల కథ లాంటివి చదివితే రామాయణ కథ మరోలా ముందుకు వస్తుంది. రావణాసురుడి దగ్గర్నుంచి రాముడు సీతను పుష్పకవిమానంలో తెచ్చిన తర్వాత సీత రావణుడి బొమ్మని గీసుకుని తలగడ కింద పెట్టుకుని పడుకుందిట! రావణాసురుడు మాటాడుతూ ఉండేవాడట!

నాలుగో ఫ్లోర్‌లో ఓ స్టూడెంట్ గ్రూప్. లేదంటే ఇప్పుడిప్పుడే జాబ్‌లో చేరిన బాపతు అయి వుండచ్చు. ఒకమ్మాయి‌ భుజం‌ మీద పదే‌ పదే బలవంతంగా చెయ్యేస్తున్న ఓ సన్నటి, నల్లటి కుర్రాడు. ఆ అమ్మాయి మెల్లగా ముందుకు జరుగుతోంది నవ్వుతూ, చెయ్యి తప్పిస్తూ. వాడు చెయ్యి గట్టిగా బిగించాడు ఇంకా దగ్గరికి లాక్కుంటూ. చుట్టూ వాళ్ళ‌ బ్యాచ్‌లో ఎవరూ పట్టించుకోవట్లేదు వాడిని. వాళ్ళు పట్టించుకోరనే ధైర్యంతో వాడలా చేస్తున్నాడా?

మరియమ్మ వచ్చి స్టేజ్ మీద నిలబడింది. శంకరన్ కుర్చీకి ఎదురుగా. అతడికి పుట్ట నుంచి జెర్రి వేగంగా బయటకొచ్చి శరీరమంతా సరసరమని పాకుతున్న అనుభూతి. పవిత్రన్ మాస్టర్ సైగ చేయగానే ఆమె ఆ లంగాను కుప్పగా జారవిడిచింది. గదంతా చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లంగా ఆమె కాళ్ళ కింద వంకరగా గీసిన సున్నాలా వచ్చి పడ్డది. కాలితో రంగు వెలిసిన ఆ లంగాను కాస్త దూరంగా నెట్టింది. స్టేజ్ మీద కూర్చుంది.

ఆ నవ్వు నాకు చిత్రంగా మా ఊర్లో చాకలి రాజయ్య గాడిద నవ్వులా అనిపించింది. ఆ గాడిద నవ్వడం నేను ఒకే ఒక్కసారి చూశా. నా చిన్నప్పుడు దొంగలు ఒకసారి చాకలి రాజయ్య గాడిదను ఎత్తుకెళ్ళారు. కానీ దాన్ని తోలుకు వెళ్ళలేక దాన్ని, దానితో పాటు దానిపైన దొంగతనం చేసి వేసిన బరువైన వస్తువుల్ని కూడా ఊరి చివరి వదిలేసి వెళ్ళారు. ఉదయాన్నే దాన్ని వెతుకుతూ వెళ్ళిన రాజయ్యకి తన గాడిద ఊరి చివర బీడు పొలాల్లో గడ్డి తింటూ కనిపించింది.

ఇప్పుడే ఒక కరపత్రం చేతికొచ్చింది. అది మా కాలనీలో అంచెలంచెలుగా పెరుగుతున్న ఒక స్కూల్ రాబోయే సంవత్సరంలో మా పిల్లల కోసం తమని ఎంచుకోమంటూ ఇచ్చిన పిలుపు. ప్రత్యేకతలేంటో తెల్సా, పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కలిగేలా చేసి, విసుగుని, అసహనాన్ని తగ్గిస్తారుట. మంచి మాటకారితనం, తెలివి పెంచుతారట. ఇంకా, ఉద్వేగాలను నియంత్రించుకోవటం నేర్పి, తిరుగుబాటు ధోరణులను అరికడతారట.

వీడెవడో డబ్బా కారు పెట్టుకుని లెఫ్ట్ లేన్లో! ఈ కార్లో కనక అది వుండుంటే ఈ పాటికి దాన్ని చీమని విదిలించినటట్లు పక్కకు తోసేవాణ్ణి. గింగిరాలు తిరుగుతూ ఆ కారు పక్కకు దొర్లి ఏ చెట్టుకు గుద్దుకునో ఆగేది. అది విండ్‌షీల్డ్ లోంచి ముందుకు విసిరేయబడేది. అదృష్టం వుంటే తగలబడేది కూడా. ఆ కార్లో అది ఉన్నది అనుకున్నప్పుడల్లా పాదం ఆక్సిలరేటర్ని బలంగా నొక్కుతోంది. గుద్దుతుందేమో అనిపించినప్పుడు కాలు వెనక్కు లాగుతోంది.

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.

వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? వాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధ పడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు.

డిసిప్లిన్‌కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. బరాక్‌లో అతని బెడ్‌ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్‌ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు.

వీరరాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆ ధీమా, ఆ దెప్పు పెళ్ళాం నుంచి జీవితాంతం భరించాలని తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నాప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు.

ఈమధ్య వచ్చే కథల్లో లోతు మరీ ఎక్కువగా ఉంటోంది నాయుడి కవిత్వంలో లాగ. అర్థం చేసుకోడానికి శ్రమ పడాలి అని గుర్తొచ్చింది. చదువుతూ ఉన్న పుస్తకంలో కథ అసంపూర్ణంగా ఉంది. ఇప్పటి బతుకులో లోతు లేదా? అర్థం చేసుకోలేక పోతున్నానా? కథకురాలు కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు స్పృశించిందా? ఫేస్‌బుక్‌లో అందరూ పుస్తకాన్ని మెచ్చుకున్న వాళ్ళే. బహుశా వేరే రకంగా చెప్పడానికి సంకోచమేమో!?

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.

థియరీ లోను, ప్రాక్టికల్స్‌ లోను, దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే టాపర్. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేట్లుండే మనిషికి అంతంతసేపు ఏకబిగిన కూర్చుని చదివే ఓపిక ఎలా వుందో అర్థమయ్యేది కాదు. బారక్‍లో లైట్‍ని ఆఫ్ చెయ్యడం లేదని రూమ్మేట్లు తరచూ కంప్లైంట్ చేస్తున్నా భట్ మాత్రం రాత్రి మూడింటివరకూ చదువుతూనే ఉండేవాడట. అతను తినేదెప్పుడో, పడుకునేదెప్పుడో కనిపెట్టడం పక్కవాళ్ళక్కూడా కష్టమయ్యేదట.

బ్యాగులోంచి అన్నండబ్బాను బయటికి తీయగానే, నాకు మామూలుగా నా భార్య ముఖం గుర్తొస్తుంది. దానిలో ఉన్న పదార్థాలను బట్టి కొంచెం చిరాకో, ప్రేమో కలుగుతుంటుంది. కానీ ఇవ్వాళ నేను ఏ కళన ఉన్నానో – డబ్బా మూత తీయగానే, కొంచెం ముద్దగా అయినట్టుగా ఉన్న అన్నం కళ్ళబడగానే, నాకు ఉన్నట్టుండి మా ఊళ్ళో చిన్నతనంలో చూసిన ఒక గొల్లాయన గుర్తొచ్చాడు. ఆయన ఒక పగటిపూట తన అన్నంమూటను విప్పుకుని తినడం గుర్తొచ్చింది.