ఒక బారక్ దగ్గర నడక వేగం తగ్గించి, వెనక్కి తిరిగి కాస్త కరుకుగా “ఏయ్, ఛుప్!” అన్నాడు లీడర్ ఉపాధ్యాయ్. చెప్పిన సమయానికి ట్రైనింగ్ రెజిమెంట్ హెడ్ క్వార్టర్స్‌కి చేరుకున్న మా చిన్న గుంపుని, మా స్క్వాడ్ చేరబోతున్న కంపెనీకి మార్చ్ చేయించి తీసుకెళ్ళే బాధ్యతని, డ్యూటీ హవల్దార్ నించి అందుకున్నవాడు మా లీడర్. అంతవరకూ తమిళంలో గుసగుసలాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటున్న వాళ్ళు సైలెంటయారు. వరండాలో దర్జాగా కూర్చున్న ఒకతని ముందుకి వెళ్ళి ఎటెన్షన్లో నిలబడ్డాడు లీడర్.

మాటామంతీ లేకుండా ఎవరి మానాన వాళ్ళు అలా ఓ చోట ఎవరి గోలలో వాళ్ళుంటే నాకు నచ్చదు కాక నచ్చదు! ఒకళ్ళం కూచున్నాం అనుకో – మనలో మనం ఏదో ఆలోచిస్తూనో, ఊహించుకుంటోనో, ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుంటోనో ఉంటాం. అది వేరూ! అందరూ ఒకేచోట కూచుని ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలి. నవ్వాలి. నవ్వించాలి! ఏఁవిటో ఈ పెద్దవాళ్ళు!

“రండి సార్, మొత్తానికొచ్చారు ఈ పేదోడి పార్టీకి!”

“నువ్వే పేదోడంటే మనదేశం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ పొసిష‌న్లో ఉన్నట్టేబ్బా!”

“బావున్నారాండీ?”

“ఆ కీర్తీ, బావుండామ్మా, మీ మ్యారేజ్ సిల్వర్ జూబిలీ అని మీ ఆయన ఓ పట్టుబడితే, కలిసి పోదామని వచ్చా.”

“థాంక్సండీ! ఈసారి ఖచ్చితంగా మేడమ్‌ని కూడా మా ఇంటికి తీసుకురావాలి మీరు.”

ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్‌ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది. గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను.

అసలు కాలేజీ చదువు చదవడమనేదే నాకు సమయం వృథా తప్పా మరేం లేదు అని నాకు అకస్మాత్తుగా అనిపించింది! నేనొక కళాకారుడిని. నావంటి వాడికి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చదివి ఆ పట్టా పొందడం వల్ల ఏమిటి ఉపయోగం? నిజానికి నాకు కావలసిన చదువు ఏదయినా ప్రసిద్ధ చిత్రకళా విశ్వవిద్యాలయాల నుండి పుచ్చుకోవలసిన ఫైన్ ఆర్ట్స్‌ పట్టా కదా?

వర్ణా నది ఒడ్డున పట్నానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది భీమా ఊరు. ఒంట్లో ఎంత బలమున్నా, అది ఆ చిన్న వూర్లో అతని కడుపు నింపలేకపోయింది. ముంబయికి వచ్చాడు. ఊరంతా గాలించినా తగిన పని దొరకలేదు. ముంబయిలో పని దొరికి, బాగా సంపాదించాలనీ, భార్యకు కాసుల పేరు చేయించాలనీ కన్న కలలు చెదిరిపోయాయి. పని మీద ఆశ వదులుకుని శివారులో ఉన్న అడవి దగ్గర ఒక చిన్న ఊరికి చేరాడు. అక్కడికి చేరాక దగ్గర్లో ఒక క్వారీలో రాయి కొట్టే పని దొరికింది.

ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఫిక్‍ర్‍ తౌన్‍స్వీకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో.

టోలెమీ అనే ఒకటో శతాబ్దపు శాస్త్రవేత్త తను రాసుకున్న నోట్సులో మైసోలస్ అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పిటిడ్ర అనే వాణిజ్యం నగరం గురించి ప్రస్తావించాడు. బహుశా ఆ పిటిడ్రనే ప్రిథుండ కావచ్చు. బౌద్ద స్తూపాలు నేలలో సగం పూడ్చిన గుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రిథుండ అంటే పెద్ద గుడ్డు. అలాంటి ఓ పెద్ద స్తూపం ఉన్న నగరంగా ప్రిథుండను ఊహించాలి.

ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది?

వంటింటి అటకమీంచి ఆవకాయ గూనలు పెద్దవీ చిన్నవీ అన్నిటినీ దింపించాలా, కడిగించాలా, ఎండబెట్టాలా! ఒక వహీవా? అన్ని వహీల ఆవకాయా పెట్టాలా! పచ్చావకాయ, బెల్లమావకాయ, ఎండావకాయ, అడకాయ, మాగాయి, తొక్కుపచ్చడి, కాయావకాయ, మెంతావకాయ. మళ్ళీ అందులోనూ కొన్నిటిలో వెల్లుల్లి వేసీ, కొన్నిటిలో వెయ్యకుండానూ!

నిర్మానుష్యమైన రోడ్డు హక్కుగా లాక్కుంది ఒంటరి గుండెని. చెవుల్లో చలి, గుండెలో మంచు, మొద్దుబారిపోయిన మొహం. గ్లోవ్స్ ఉన్న చేతిలో వెచ్చగా ఒదిగిన సిగరెట్ స్టబ్ చివరి వెలుతురులు చిమ్ముతుంది. అడుగుల కింది ఎండుటాకులు అన్నీ మంచు నీళ్ళల్లో ఒదిగిపోతున్నాయి. కొండలు, నిశ్చలంగా నిల్చున్న చెరువు. సాయంత్రమైందని ఈ రోజుకి ఇక చాలు అని సోలిపోతున్న సూర్యుడు. వీటన్నిటికీ సాక్షిగా నేను. నన్ను కూడా వీటిగాటిన కట్టేస్తూ తాము సాక్షులుగా పక్షుల గుంపులు.

తిరిగి హోటలుకు వెళ్ళేటపుడు ఆ దేశపు పార్లమెంటు భవనము, సాయుధ రక్షకుల పర్యవేక్షణలో ఉన్న రాజప్రాసాదమూ కనిపించాయి. రబాత్‌ నగరాన్ని నడకరాయుళ్ళ స్వప్నసీమ అనవచ్చు. నగరంలో తిరుగుతోంటే ఆత్మీయంగా అనిపిస్తుందే తప్ప సంభ్రమాశ్చర్యాలు, మనమీద నగరం వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భావన కలగనే కలగవు.

విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచి పెట్టాడని, రాహువు కపటంగా దేవతల ఆకృతిలో వచ్చి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశాడని, ఆ విషయం పసిగట్టి విష్ణువుకు ఆ విషయాన్ని చేరవేశారని తెలుసుకున్న రాహువుకు సూర్యచంద్రుల మీద తీరని పగ కలిగిందనీ వివరించాను. అలా రాహువు పగసాధింపు చర్య నేటికీ కొనసాగుతుందని చెప్పాను. ప్రతీ రోజూ ఈ రాహువు సూర్యచంద్రులను వాళ్ళ సంచలనంలో కొంతసేపు పీడిస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలం అంటారు.

రాత్రిళ్ళు భోజనానంతరం ఇలా మా ఇంట్లో చెప్పుకునే కబుర్లు భలే ఉంటాయిలే. ఆరోజు మేము కలుసుకున్న కొత్త వ్యక్తులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల లేదా కార్యాలయాల్లోని ఉన్నతాధికారుల దౌర్జన్యాలను, అతి వేషాల గురించి తమాషా పడుతూ వారి హెచ్చులని వెక్కిరించుకుంటూ ముచ్చటించుకుంటాము.

మొన్న నేను ప్లాజాకి వెచ్చాలు కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు మా అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కాన్సియార్జ్ వచ్చింది. నాన్నతో అవీ ఇవీ మాట్లాడి వెళ్ళింది. మాకు దగ్గిరలోనే ఉన్న కుట్జివ్‌ గ్రామాన్ని రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి అని చెప్పిందట. ఇళ్ళళ్ళో ఉన్న స్త్రీలని బలాత్కరించారని చెప్పింది. అని వూరుకున్నా బాగుండేది. ఒంటరి తల్లిని రేప్ చేయబోతున్న రష్యన్ సైనికుడికి ఆవిడకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడ్డం పడితే వాడిని కాల్చి చంపి ఆ తల్లిని చెరిచాడట.

మీరు చెప్పమంటే, నేను మార్లాతో మాట్లాడి ఆమె తొందరపడి కేస్ ఫైలు చెయ్యకుండా ఉండేట్లు చూస్తాను. నేను చెప్పినట్లు ఆమె చెయ్యక్కర్లేదు. అసలు నేను అలా చెప్పకూడదు కూడా. నా ఉద్దేశంలో ఆమె పనిలో పొరపాటు లేదని. ఈ కాగితాలు చూడండి. ఆమెకు తన డెస్కు దగ్గరే ఉండి, హాస్పిటల్ కంప్యూటర్ మీద ఎడిషనల్ పని చేసుకోటానికి ఆమెకు పర్మిషన్ ఇవ్వబడింది. ఇవిగో అంతకు ముందున్న చీఫ్, ఒక వైస్ ప్రెసిడెంటు సంతకాలు పెట్టిన కాగితాలు.

అవధాని తండ్రి యెడల భయభక్తులతో, తల్లి చాటున పెరిగిన బిడ్డ. మారుతున్న కాలానికి ఎదురీదే ధైర్యం లేక శాస్త్రానికి పిలకని ఉండనిచ్చి, కాలానికి అనుగుణంగా క్రాఫింగ్ చేయించుకున్నాడు. పాఠశాలలో లఘు సిద్ధాంత కౌముది, రఘువంశం అధ్యయనం చేసేడు. సహాధ్యాయులు చాలామంది బ్రాహ్మణేతరులు కావడంతో పౌరోహిత్యానికి కాని, అర్చకత్వానికి కానీ బ్రాహ్మణులకి ఉంటూ వచ్చిన గిరాకీ ఇటుపైన ఉండదేమో అనే భయం పట్టుకుంది అవధానికి.

సాలిపురుగు శ్రద్ధగా తన పట్టుని అల్లుతుందన్నమాట. ఎంత సన్నదారమో. దాని ఒంటినుంచి వొస్తుందా దారం మరి! అర్థచంద్రాకారాల దారాలని మజ్జి దారానికి వేళ్ళాడబెడుతూ చకచకా అటోసారి ఇటోసారీ అతికేస్తూ అల్లేస్తుంది! దాని పనివాడితనాన్ని అమ్మ పనివాడితనాన్ని మెచ్చుకున్నట్టు మెచ్చుకోవలిసిందే!

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.