‘మరేమో ఒచ్చి’ ఏం గోడు చెప్పుకోడానికి ఒచ్చిందో వినాలని ఉన్నా ఆవిడ వెళ్ళిపోయాక బామ్మా అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలాగా వాళ్ళలోవాళ్ళు ఏకరువు పెట్టుకుంటూనే ఉంటారు! భోగట్టా తెలీకపోదు! ఎటొచ్చీ ఆవిడ నోట విండం ఇహ కుదరదు! నేనక్కడ ఉంటే నవ్వుతానని, నవ్వు ఆపుకోనని అమ్మకు భయం! ఆవిడ ఎదురుగా నన్ను చీవాట్లు పెట్టడమూ కుదరదు! అదీ సంగతి!
Category Archive: కథలు
మీ ఆంగ్ల అనువాదాలు మీ బ్లాగులో, ఎఫ్.బీ.లో, చూస్తూనే ఉంటాను. అవి అస్సలు అనువాదాలనిపించవు. ఇంగ్లీషులోనే రాసేరేమో అనిపిస్తాయి. మీ అనువాదాలు చదివినప్పుడల్లా నా రచన ఒక్కటైనా మీరు అనువాదం చేస్తే బాగుండునని తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఈ జన్మకి ఆ కోరిక తీరేనా!? అన్నట్టు, నా పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. తప్పకుండా చదువుతారు కదూ?
ఆ రోజు నుండి నేను హిందూ పత్రికలో అప్పుడప్పుడు కనిపించే ఆవుగారి కార్టూన్ కోసం వెతికేవాడిని. ప్రచురితమైన ఆయన ప్రతీ బొమ్మని గంటల తరబడి నేను చాలా శ్రద్దతో అధ్యయన పూర్వకంగా పరిశీలించేవాడిని. ఆయన కార్టూన్లలోని రాజకీయ వ్యాఖ్యానాలలోని చురుకు, వెటకారం నాకు అర్థం అయ్యేంత వయసు కాదు కానీ చిత్రించే బొమ్మపై ఆవుగారికి ఉన్న నియంత్రణ నన్ను ముగ్ధుణ్ణి చేసేది.
నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్ళంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్ళల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది అని వివరించాడు హఫీద్.
ఆచార్య మహాకాశ్యపులవారికి వీడ్కోలు చెప్పడానికి విశాఖారామ పరిసరాల్లోని అనేక విహారాలనుంచి విచ్చేసిన బిక్కులతో సముద్రగర్భంలోకి చొచ్చుకొని ఉన్న ఆ చిన్నపర్వతమంతా నిండిపోయింది. తెరచాపలతో సముద్రంపై ఊయల ఊగుతున్న నావ వైపుకి పయనిస్తూ ఉన్న చిన్న పడవ నిదానంగా వారికి దూరమయింది. అప్పటివరకు వారికి తోడునీడగా అండగా రక్షణగా నిలబడ్డ మహాక్షుద్రకుడు అక్కడే ఆగిపోయాడు.
ఉయ్యాల బల్లమీద కూర్చుని తనివి తీరేదాకా ఊగింది. తర్వాత దగ్గర్లో ఉన్న అంగటికెళ్ళి ఒకే ఒక్క చాప మాత్రం కొనుక్కొచ్చుకుంది. హాల్లో చాప పరిచి పడుకుంది. ఇది తన ఇల్లు. తను మాత్రమే ఉండబోయే ఇల్లు. ఇలాంటొక ఇల్లు ఉండటం ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంటిలో తనతో ఎవరూ ఉండరు. తాను మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాను అన్నది ఆమెకు వల్లమాలినంత సంతోషాన్ని ఇచ్చింది.
కుస్తీలో జగా ప్రావీణ్యం విని, అతడికి మరి కొన్ని ఉద్యోగావకాశాలు వచ్చి పడ్డాయి. తుపాకీ పట్టుకుని ఒక ఇంటి ముందు గార్డుగా కూచోడం, దానికి మంచి జీతం. ఇంకో ఉద్యోగం మరీ గొప్పది. కావలసినంత తిండి, జీతం, అందరూ తనని చూసి భయపడే ఉద్యోగం. యజమాని చెప్పినపుడు, ఎవరిదన్నా కాలు విరగ్గొట్టడం, మొహం పగలగొట్టడం, మెడ విరిచేయడం… ఇదీ అతని పని అక్కడ.
తను రాస్తాడు. ఇవ్వాళే మొదలుపెడతాడు. చివరికొచ్చేసరికి స్ట్రాంగ్‌గా మారుతోంది ఆఫ్టర్ లంచ్ సిగరెట్. అరుంధతీ రాయ్ అన్నట్లు. మానెయ్యాలి. అరుంధతీ రాయ్‌నా? జోకులా? సిగరెట్లు. కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోతే, తపనని తట్టుకోవడం కష్టం. అసలైనా ఇష్టమైంది, ఈరోజు చేస్తున్నది ఎప్పుడూ ఎందుకని నచ్చదు? ఒకప్పటి జులపాల, బెల్‌బాటమ్‌ల రోజులే బాగున్నాయనిపిస్తాయేం? అవన్నీ తర్వాత. ముందు రాయాలి. ఇవాళ్టినుంచీ. రాస్తాడు. రాయగలడు తను.
లైబ్రరీ దగ్గర రావుగారు చూస్తూ ఉంటాడేమో పర్వాలేదు సాయంత్రం కలవచ్చు అర్జంట్ విషయాలు ఏమున్నాయి. రోజూ ఉండే విషయాలే. ఆయన నిన్న వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు ‘అబ్బాయి రమ్మంటున్నాడు ఎలా వెళ్ళడం. ఇక్కడ పంటలు వచ్చాక రైతు దగ్గర కౌలు వసూలు చేసుకుని వెళ్ళాలి’ అంటాడు రైతు బ్యాంకులో వేస్తాడు డబ్బులు అంటే వినడు. ఎప్పుడూ ఉండేదే ఆయన చెప్పడం నేను వినడం నేను చెప్పడం ఆయన వినడం.
“పెద్దింటి అమ్మడమ్మ కోడలే! చిట్టెమ్మను ఎరగవూ? అమ్మడమ్మకీ చెప్పే. కోడలు పిల్ల చిట్టెమ్మ చిన్నదీ. దానికి తెలీదూ – గ్రహణం నాడు గదిలోంచి బయటికి రావొద్దనూ. నీళ్ళోసుకుందన్నావు. జాగ్రత్తా! అని. ఆవిడేం చెప్పిందో, అదేం విందో! మొదటి కాన్పు! గ్రహణం మొర్రి రాకేమవుతుందీ! పిల్లాడు చూడబోతే పనసపండులా ఉన్నాడు. మీది పెదవేమో చీలిపోయి ఉంది!
మామిడి పళ్ళ కాలం వచ్చిందంటే చాలు ఆ కాలం గడిచేదాకా దాదాపు ఋతువంతా మేము మామిడి చెట్లమీదే గడిపేవాళ్ళం. ఆ మామిడి కొమ్మల మీదికి వెళ్ళే ముందు వంటింట్లోంచి ఉప్పూ, కారం పొట్లాలు కట్టుకోడం మాత్రం మరిచేవాళ్ళం కాదు. డుబ్బుగాడయితే కళ్ళు మూసి, కాళ్ళు మడిచి, చిలకలా ఎగిరినట్లే ఎగిరి చెట్టు మీదికి వాలేవాడు. అప్పుడప్పుడు నేను చెట్టు ఎక్కలేక జారేవాణ్ణి.
ఫెజ్లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచం.
కూవం నదిలా నల్లగా నురగలు కక్కతూ ప్రవహిస్తోంది. నెల రోజల క్రితం చచ్చిపోయిన ఒక గొడ్డు కాలువలో కొట్టుకుని వచ్చింది. దానికి కొక్కెం వేసి లాగి ఒడ్డున వేశాడు డిల్లిబాబు. గద్దలను తెచ్చి ఆ చచ్చిన గొడ్డు మీదకు వదిలాడు. హుషారుగా శవానికి ప్రదక్షిణలు చేశాయి కానీ చీల్చడానికో, పొడిచి లాక్కుని తినడానికో వాటికి చేతకాలేదు. ఎప్పుడూ చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన గొడ్డు మాంసానికే అలవాటు పడ్డాయి. వాటికి ఆహారం అంటే అదే. ఎలుకలను కూడా తిని ఎరగవు.
నేను వెళ్ళేసరికి తాతకీ అమ్మమ్మకీ సంతోషం, మనవడు ఇంజినీర్ అయిపోతున్నాడని కాబోలు. పెద్దవాడినౌతున్నాను కనక ఇప్పుడు నాతో అన్ని విషయాలు చెపుతున్నారు. నేనే అడిగాను అబ్బలనాన్న సంగతి. వేసవిలో రాలేదుట కానీ గణపతి నవరాత్రుల సమయంలో వచ్చాట్ట. అవును ఇంకా ఒక్కడే. ఆయన భార్య ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆవిడ పుట్టింటివారిక్కూడా తెలియదు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, కొంతమందైతే ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు.
అక్కా! ఇలాగ్గానే నే దిగినరోజునే నా ఒడియా స్నేహితుడు మిశ్రా ఇంట్లో ఆవు ఈనింది. భలే మంచి వేళన ఒచ్చేనే! జున్ను పెడతావన్న మాట అన్నా. జున్నేవిఁటీ అన్నాడు మిశ్రా. ఆవు ఈనిందిగా అన్నా. ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయా. వాళ్ళు జున్ను వొండుకోరట. ఆవుకీ పురుడు పాటిస్తారట. శుచి అయ్యేవరకూ పాలు పిండుకొని వాడుకోరట!
ఉన్నట్టుండి నా ఎడమచెవి తీవ్రంగా మండినట్లు ఒక భావన అనిపించింది. ఎందుకా మంట? ఏమిటా కథ? అని లోకంలోకి వచ్చి చూస్తే, మా లెక్కల మాష్టారు నా చెవి పట్టుకుని మెలి తిప్పుతున్నాడు. ‘వెధవా, చెప్పిన లెక్క చెయకపోగా పైగా నన్ను ఎగతాళి చేస్తున్నావుట్రా? లే రాస్కల్? లే!’ నాకు ఏమీ అర్థం అవలేదు.
ప్రతీవారం ఒక రోజు అపార్ట్మెంట్ మెట్లన్నీ కడిగే నియమం ఒకటి ఉంది. కొన్ని ఏళ్ళ వరకు ఇది ప్రతీ శుక్రవారం రాత్రి జరిగే తంతు. ఎదుగుతున్న వయస్సులో అలా మెట్లు కడిగే దృశ్యాన్ని చూస్తే అనాలోచితంగా ఆనందపు రవ్వలు ఎగిసేవి లోపలెక్కడో… వచ్చే వారాంతపు సెలవులని ఊహించుకుంటూ. ఇన్నేళ్ళ తరవాత అదే దృశ్యాన్ని చూస్తే ఇవాళ గురువారమే. ఏళ్ళు గడుస్తుంటే అక్కడక్కడే మార్పు చెందుతున్న జీవిత చిహ్నాలు.
నేను అన్నాను: నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. లే, అంటరానితనాన్ని నిర్మూలించు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమని కలిగించు. హిందువులు తమలో తాము మతం గురించి కొట్టుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వగైరా కులాలన్నింటిని ఒకటి చేయండి. హిందూ ముస్లిములని కలపండి. లోకంలో శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసేస్తే, ఆ పైన అందరం కలిసి ఆరాముగా జీవితాన్ని గడుపుదాం.
ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసి తీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్ళలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?
ఆ రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనలాంటి చక్కని మాటకారిని నేను చూడలేదు. కాలక్షేపం, తత్వం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం అని ఒక అంశంనుండి మరో అంశానికి జంప్ చేస్తూ! జేమ్స్ బాండ్లాగా కార్ నుండి హెలికాప్టర్కి ఎగిరి, ఆక్కణ్ణుండి బోట్లోకి దూకి, ఒడ్డుచేరుకుని, అక్కణ్ణుంచి బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోతున్నట్టు. ఆ రోజునుండి వారానికి మూడు రోజులైనా ఆయన్ని కలవడానికి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలు ఇచ్చేవారు.