మంజుఘోష

ఓయీ కవీ!

గురజాడ జాడ నడవఁగ
దొరకొంటివి గాదె! యిపుడు దూరమ్మై యా
కఱకైన కత్తి మొనతో
విరచింతువు కవితలరయ విడ్డూరంబౌ!

చుట్టున్ ‘జీకటి’, దానియందు ‘భయ’ మంచున్ వ్రాతు వద్దానిలో
నెట్టో ‘రక్తముఁ’ జూపి యీ ప్రజల నోయీ బీల్చ నీవూపిరిన్
కట్టా! కైతలు ప్రేత భూతగణ రాగాలాపనాటోపముల్
ఇట్టెట్టీ వొనరింతువో కవివరా! యెట్టీవు నిద్రింతువో!

ఈ వైప్లవ్య పథోన్ముఖత్వమును బోధింపన్ ప్రజాభావముల్
బ్రోవై క్లిష్టికి దారితీయుననియేన్ – బోదేల నీ బుద్ధి, ధా
త్రీవైక్లబ్యము గుండె జీల్పదొకొ, శాంతిన్ గోరి, కీలాలముల్
నీవై దోహదమీయ బారుటకు, నేనెంతేని యల్లాడెదన్!

అంకితమిత్తు నా కవిత నార్తజనావలి కంచుఁ జెప్పి నీ
వంకిలి లేక రక్త ఝరులైన మహా కృతులోలి సేయఁగా
నంకెకు రావు సౌఖ్యములనంత జగత్ప్రలయాంతకంబు నౌ
టింక నిజమ్ము; శాంతివెలయింపగ నిద్ది పథంబు కాదురా!

కట్ట గోచియులేని కడుపేద నడువీధి
         నాఁకటి కేడ్వగా నవల దిరిగి
చూడఁ గన్నులులేని వాఁడు వారగ వచ్చి
         నినుదాకి తూలఁగా నిప్పు లుమిసి
వట్టిపోయిన గుండె పసికూన సాఁకలే
         కొక్కర్తు పాల్వేడ నోకిలించి
చిల్లర లేదంచుఁ జెప్పు రిక్షావాని
         చిరుపైసలకుఁ గూడ చీదరించి

కవిత వ్రాతువు వారిపై కరుణ యనెదు
కవివరేణ్యుఁడ నేనంచు గర్వపడెదు
కవిత యార్జించి యిచ్చిన కాసులందు
విసరివైచితె వారికి వీసమైన!

ఆవేశాన రచించు రక్తకవితల్ అయ్యా శుభమ్మీవు, ద్వే
షావిర్భావపు కారణా లసలు భాషాదేవి నీకెన్నడేన్
భావవ్యోమపథానఁ గానఁబడదో, భావింపవో సౌమ్యగా
నావీణావరపాణి మౌళితల చంద్రార్ధప్రభా స్నిగ్ధయే!

పుట్టను బుట్టియున్, ములుకు ముట్టి గతించిన జంటకేడ్చు నా
పిట్ట యెలుంగు విన్న ముని బిట్టడలన్ గడకయ్యె కావ్య మ
ప్పట్టున నెన్ని గుండెలకుఁ బ్రాకెనొ, యా కరుణాస్రవంతి, చూ
పట్టదె నిల్వు నీరవుట భావుక చిత్తము తత్కథా శ్రుతిన్!

తమ స్వార్థాగ్నికి నింధనమ్ములుగ విద్యార్థుల్, కవుల్ కొల్లలై
సమయన్ జూతురు రాజకీయ కుహనాసంస్కారు లావంతయేన్
గమనింపన్ దగదో జగమ్ముగతి, యింకన్ నీ కలానన్ కవీ
గమకింపంగదవోయి యీ భువిని ప్రాగ్భారంబుగా శాంతికిన్
రమణీయామృత నవ్యవార్షుక పృషల్లాక్షణ్యవర్ణాదృతిన్!

ఓయీ చదువరీ!

నిను కదలింపలేనిది, మనీషను గుర్తెరిగింపరాని వ్రా
తను దరికొల్పుమగ్ని శతధా, యెది నీదగు గుండె లోతులన్
కణకణ మండు భావముల గాయములన్ మృదువాక్యధార మా
న్చిన దది కైత, దానిఁ గొని జేర్చుము మౌళి సదా సహస్రధా!

రమ్ము, కవిత్వసంపద చిరమ్ము; ప్రభుత్వములేల యేల, స్వాం
తమ్ము నిరంతరమ్ము సుఖితమ్ము తదీయ మహార్థ ప్రాప్తి; వి
శ్వమ్ము మనోహరాకృతి, ప్రసన్న మజస్రము భావుకాళికే
రమ్ము; కవిత్వ సంపద చిరమ్ము గ్రహింతము విశ్వదర్శనన్!