నూతిలో గొంతుకలతో నలభయ్యేళ్ళ ప్రయాణం

నలభై యేళ్ళు దాటిపోయాయి, ఆలూరి బైరాగి గురించి ఒక పూర్తి వ్యాసం రాసి.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరిన కొత్తలో అంటే 1984 ప్రాంతాల్లో “వెలుగు నీడల్లో బైరాగి” అనే శీర్షికతో ఆ వ్యాసం రాశాను. అది అప్పటి చాలా మంది ప్రముఖులకి నన్ను పరిచయం చేసిన వ్యాసం. ఆ తరవాత 1993లో వెలువడిన “ఆధునికత-అత్యాధునికత” అనే నా వ్యాసాల సంపుటిలో కూడా చేరింది. 1980ల తరవాతి కవిత్వానికి — ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యానికి — సంబంధించి అందులో చేసిన కొన్ని ప్రతిపాదనలు కనీసం రెండేళ్ల పాటు విస్తృతమైన చర్చలకు దారితీశాయి. 1980ల తరవాతి కవిత్వాన్ని విశ్లేషించడానికి ఇంతకుముందున్న పరికరాలు సరిపోవనీ, కొత్త సాధనాలతో, కొత్త సాహిత్య చరిత్ర దృష్టితో ఆలోచించాలన్నది అతి ముఖ్యమైన ప్రతిపాదన. సాధారణీకరించిన ఆధునిక దృక్పథాలని పక్కనపెట్టి, నిర్దిష్టంగా 1980ల తరవాతి సామాజిక రాజకీయార్థిక మార్పులని పునాదిగా తీసుకొని అత్యాధునికత వైపు తీసుకెళ్లే నిర్దిష్టత, సంక్లిష్టత, నిమగ్నత, భాషకి సంబంధించిన భిన్నత్వం — ఈ కొత్త సాధనాలు.

అలాగే, కవిత్వ నిర్మాణం వైపు దృష్టి పెట్టి, వస్తువుతో దానికుండే సంక్లిష్ట బంధాన్ని చర్చిస్తే తప్ప కొత్త కవిత్వం అర్థం కాదన్న వాదనని కూడా ఈ విమర్శ వ్యాసాలు ముందుకు తీసుకొచ్చాయి. దాంతో, ఇది రూపవాద విమర్శ అన్న నింద కూడా పడింది. అయితే, వస్తువూ, రూపంలో రెండూ సమాన వేగంతో నిర్వహిస్తే తప్ప అది అత్యాధునిక కవిత్వంగా నిలబడదని చెప్పడం ఈ వ్యాసాలలోని అంతస్సూత్రం. ఆ అంతస్సూత్రాన్ని పట్టుకోడానికి సంప్రదాయిక ఆధునిక సాహిత్యానికి కొంత ఎక్కువ కాలమే పట్టింది. కనీసం 1990ల నాటికి ఈ వాదన సాధ్యమైనంత నిలకడని సాధించిందని అనుకోవచ్చు. అయితే, ప్రధానమైన సమస్య ఈ వాదన కాదు, నిజానికి అప్పటిదాకా ప్రధాన స్రవంతి గుర్తించని నారాయణ బాబు, శిష్ట్లా, బైరాగి లాంటి కవులని ప్రధాన స్రవంతి వరసలో నిలబెట్టడం ఎక్కువ మందికి నచ్చలేదు. ముఖ్యంగా, బైరాగి కవిత్వం అప్పటివరకూ విమార్గ కవిత్వంగానే (deviantగా) చూడడానికి అలవాటుపడ్డ సాహిత్య వాతావరణంలో బైరాగి గురించి అంత విస్పష్టమైన ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది.

అనేకానేక చిక్కుముడుల దశాబ్దంగా పేరుపడిన 1980ల గురించి మాట్లాడడానికి, ఆ దశాబ్ది సాహిత్యాన్ని చిత్రీకరించడానికి (characterizing) కావలసిన సరుకూ సరంజామానీ కొంత వరకు సమకూర్చి పెట్టిందన్న ప్రశంసనీ, 1980ని అత్యాధునిక దశ (post-modern)గా glorify చేసిందన్న అపనిందని కూడా ఈ వ్యాసాల సంపుటి భరించింది. అందులో చాలా వివాదాస్పదమైన వాదనల్లో ఒకటి — 1980ల తరవాతి కవిత్వంలో కనిపించే సందిగ్ధ సంఘర్షణకి పునాది శ్రీరంగం నారాయణబాబు, తిలక్, బైరాగిల కవిత్వతత్వంలో ఉందని. ఉదాహరణకి ఇదొక ఆలోచన:

“ఈ కవులలో అక్కడక్కడా బైరాగిలో ఉండే అస్తిత్వ వేదన, నారాయణబాబులో ఉండే అధివాస్తవిక రోదన, తిలక్‌లో ఉండే రూపశ్రద్ధ కనిపిస్తాయి. అంతమాత్రాన్న వీళ్ళని అభ్యుదయ సంప్రదాయం నుంచి విచ్ఛిన్నమైన వాళ్ళని భావించడానికి వీలు లేదు.” (ఆధునికత-అత్యాధునికత, పేజీ: 8)

ఆ ప్రస్తావనతో ఆగకుండా, దాన్ని గట్టిగా ప్రతిపాదిస్తూ, ఒక సుదీర్ఘ విశ్లేషణ కూడా ఈ సంపుటిలో జతచేయడంతో చర్చకి కావలసిన ఆధారాలు ఇచ్చినట్టయింది. ఇదంతా 1984 ప్రాంతాల్లో అంటే నాలుగు దశాబ్దాల క్రితం. బైరాగిలో రెండు ప్రపంచ యుద్ధాల తరవాతి అస్తిత్వ వేదననీ, 1980ల నాటి అస్తిత్వ వేదనకీ ముడిపెట్టడం ఎలా అన్న వెతుకులాట ఈ వ్యాస సంపుటిలో మళ్ళీ మళ్ళీ వినిపించే వాదన.

ఇన్నేళ్ల తరవాత ఆలూరి బైరాగి కవిత్వాని గురించి, మిగిలిన వచన సాహిత్యాన్ని గురించీ, అన్నింటికీ మించి ఆయన ప్రవేశం వల్ల అందివచ్చిన ఆలోచనా ప్రవాహాల్ని గురించి ఇప్పుడు ఒక పునః వీక్షణం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకి సమాధానం ఈ తాజా వ్యాసం. ఇందులో కొంత విశ్లేషణా, ఇంకొంత పాఠకుడిగా లేదా ఒక రచయితగా బైరాగితో నేను ఈ నాలుగు దశాబ్దాల పైబడి చేస్తూ వచ్చిన ప్రయాణం గురించీ చెప్పాలని నా ప్రయత్నం.


1984 ప్రాంతాల్లో రాసిన వ్యాసానికి పునాది నా తొలియవ్వన ప్రాయంలో ఉంది. అప్పుడు నేను తెలుగు కంటే ఎక్కువగా ఇంగ్లీషు, హిందీ కవిత్వాలు చదువుకుంటున్న కాలం. ఇంగ్లీషులో టీయస్ ఎలియట్ (1888-1965), హిందీలో గజానన్ మాధవ్ ముక్తిబోధ్ (1917-1964) నాకు పంచప్రాణాలో, లేకపోతే వాటిలో ఒకటి రెండు ప్రాణాలో అయివుంటారు. ఇప్పటికీ వాళ్ళ కవిత్వాల మీద అదే ఇష్టం. ముఖ్యంగా ముక్తిబోధ్ కవిత్వం నా చేతికి అందినప్పుడు నాకు పదమూడేళ్లు ఉంటాయి. ఇప్పటికీ కొన్ని కవితలు కంఠోపాఠమే!

తెలుగులో అలా నేను మొట్టమొదటిసారి పైకి చదువుకుంటూ, ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి వినిపిస్తూ కవిత్వం అంటే ఇలా ఉండాలన్న ఒక నిలకడ ఏదో చూపించిన వాడు మాత్రం ఆలూరి బైరాగి. ఆ తరవాత శ్రీరంగం నారాయణబాబు, ఇంకాస్త కాలం తరవాత అజంతా. ఆలోచనలు కుదురుకుంటున్న పదహారూ, పదిహేడేళ్ళ ప్రాయంలో ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్. మధ్యమధ్యలో చలం మ్యూజింగ్స్ నో, రావిశాస్త్రి వచనాన్నో కవిత్వ పంక్తులుగా మార్చుకొని చదువుకోవడం — ఇదంతా చిత్రమైన సాధన. గజానన్ మాధవ్ ముక్తిబోధ్ అంటున్నాడు చూడండి:

मैं तुम लोगों से इतना दूर हूँ
तुम्हारी प्रेरणाओं से मेरी प्रेरणा इतनी भिन्न है
कि जो तुम्हारे लिए विष है, मेरे लिए अन्न है।

నేను మీకెంత దూరమంటే
మీ ప్రేరణలూ నా ప్రేరణలూ వేరే వేరు.
ఎంత వేరంటే
మీకు విషమయ్యేది, నాకు అన్నమవుతుంది.

ఎప్పుడో 1917లో పుట్టి, నేను పుట్టిన సంవత్సరం 1964లో కన్నుమూసిన కవి ముక్తిబోధ్. పైగా, అక్కడెక్కడో మధ్యప్రదేశ్‌లో పుట్టిన వాడు. హిందీలో రాసిన వాడు. జీవితమంతా వైఫల్యాల పుట్టగా గడిపినవాడు — నాకు ఎందుకు ఆదర్శమయ్యాడో తెలీదు. వైఫల్యాల్ని ప్రేమించే గుణమేదో అతనే నేర్పించాడేమో! లేదా, ఎమెర్జెన్సీ అనంతర పరిణామాలని చూస్తున్న వ్యక్తిగా నా బతుకు ఎలాగూ విఫలమే అయిపోతుందన్న ఒక స్థిర సంశయమేదో నన్నూ పీడిస్తుండడం వల్ల కావచ్చు. మానసికంగా ఇదేమీ అంత ఆరోగ్యకరమైన స్థితి కాకపోవచ్చు కానీ, ఆ సంశయమే నన్ను శ్రీశ్రీ వైపు పూర్తిగా వెళ్లనివ్వకుండా, బైరాగి వాక్యాల్లో తలదాచుకునే సాన్నిహిత్యానికి కారణమైంది. ఆ విధంగా బైరాగి నాకు కేవలం ఒకానొక కవి కాదు, ఇంకో దారి నుంచి నన్ను నడిపిస్తూ వచ్చిన మార్గదర్శి. ఇలా అంటున్నానంటే, బైరాగిని నేను విమర్శనాత్మక దృష్టితో చదవలేదని కాదు. కానీ, తనని నేను నా తొలియవ్వన ప్రాయంలో చదివానన్న విషయం మరచిపోకుండా ఉంటే, అందులో కచ్చితంగా కొంత మోహత్వం (romanticization) ఉండే ఉంటుంది. కానీ, నా లోపలి పాఠకుడు విపరీతమైన సంశయవాది కూడా! బహుశా, అంత తీవ్ర సంశయమే నన్ను శ్రీశ్రీని దూరం చేసింది, రెండు మూడు సార్లు వ్యక్తిగతంగా కలిసి, అనేక గంటలు గడిపిన అనుభవం శ్రీశ్రీతో ఉన్నప్పటికీ! నా చుట్టూ నా విద్యార్థి రాజకీయాల వల్ల శ్రీశ్రీ పరమశిష్యులే ఉన్నప్పటికీ! రాజకీయార్థిక పునాదిని వెతుక్కోవాల్సిందే అని పనిమాలా మార్క్సిస్టు తత్వ గ్రంథాలు వాటి ఇంగ్లీషు మూలాల్లోనే చదువుతూ ఉన్నప్పటికీ — అప్పటికి కమ్యూనిస్ట్ మానిఫెస్టో కూడా బట్టీ కొట్టే తాపత్రయంలోనే ఉన్నప్పటికీ.

బైరాగిని ఇంతగా ఆరాధించడం మా ఇంటి కమ్యూనిస్టు వాతావరణంపై ఒక తిరుగుబాటే. నా చేతుల్లో బైరాగి “నూతిలో గొంతుకలు” “చీకటి నీడలు” కనిపించడం నాన్నగారికి ఎందుకో పెద్దగా నచ్చేది కాదు. “భరోసా ఇచ్చే కవి కావాలిరా మనకి ఈ కాలంలో” అనే ఆయన వాక్యం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకో మరి, సాహిత్యం ఇచ్చే భరోసా వేరే విధంగా ఉండవచ్చు అన్న నమ్మకమేదో నా లోపల గూడుకట్టుకోవడం మొదలయిన కాలం అది. ఆ దశలో నేను బైరాగినో, ఎలియట్‌నో, ముక్తిబోధ్‌నో చదివి ఉండకపోతే, తీవ్ర నైరాశ్యంలో, పూర్తి స్థాయి అభ్యుదయ వ్యతిరేకతలో కూరుకుపోయే వాణ్ని అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

ఆ దశలోనే బైరాగిని నేను రెండు రకాలుగా చదివాను అనుకోవచ్చు. అందుకే బైరాగి మీద నా తొలి వ్యాసానికి “వెలుగు నీడల్లో బైరాగి” అని శీర్షిక పెట్టాను. ఒక కోణం: వెలుగు వైపు వేలెత్తి చూపిస్తే, ఇంకో కోణం: నీడల వైపు పరుగెట్టిస్తుంది. ఈ రెండీటీ మధ్యా వంతెన కట్టుకోవడం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను. బహుశా, అది నా బెజవాడ జీవితం వల్ల సాధ్యమై ఉండవచ్చు. ఒక కవి కవిత్వం చదివేటప్పుడు ఆ కవి స్థలమూ కాలమూ కీలకమని నమ్ముతాను. ఖమ్మంలో చదివిన బైరాగి, బెజవాడలోనో, ఇప్పుడు అమెరికాలోనో చదువుతున్న బైరాగికి భిన్నం. అలాగే, 1980 లలో చదివిన బైరాగి, 1984 తరవాత చదివిన బైరాగి, తెలంగాణ తరవాత చదివిన బైరాగి, మళ్ళీ ఇప్పుడు ప్రవాస జీవితంలో చదువుకుంటున్న బైరాగి వేరే వేరు. ఇందాక ముక్తిబోధ్ అన్నట్టు — ఆ ప్రేరణలు వేరు. ఈ ప్రేరణలు వేరు. ఎలా వేరు అనే వెతుకులాట ఇప్పుడు ఈ పునః వీక్షణం.


తొమ్మిదో తరగతి ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ ఊరు బెజవాడ దగ్గిర నిడమానూరు వెళ్తూ, మూడు పుస్తకాలు నాతోపాటు తీసుకెళ్లాను, అవే ఎందుకు తీసుకెళ్లానో నాకు గుర్తు లేదు. ఒక తెలుగు పుస్తకం, ఒక ఇంగ్లీషు పుస్తకం, ఇంకో హిందీ పుస్తకం ఎప్పుడూ తోడుగా ఉండేవి. ఒకటి: Somerset Maugham “Of Human Bondage”, రెండు: కృష్ణ బలదేవ్ వైద్ హిందీ నవల “ఉస్కా బచ్ పన్ “, మూడు: అనుకోకుండా చేతికి తగిలిన ఆలూరి బైరాగి “నూతిలో గొంతుకలు.” మొదటి రెండూ అప్పటికే ఒకసారి చదివినవే. మళ్ళీ ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఎందుకంటే, చాలా పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివే అలవాటుండేది. కాబట్టి, ఆ రెండు పుస్తకాలూ కచ్చితంగా ఎప్పుడైనా మళ్ళీ చదువుకోవాలనే సరదా ఉండేది. వాటి పాత్రల్లో బాగా లీనమైపోయి, కొన్ని సంభాషణలు కూడా నోటికి వచ్చేవి. బైరాగి పూర్తిగా కొత్త పేరు. కేవలం ఈ టైటిల్ -– నూతిలో గొంతుకలు — కోసం, పైగా చిన్న పుస్తకం కావడం వల్ల మధ్యమధ్యలో విరామ సంగీతం కోసం తీసుకెళ్ళా. ఆ పుస్తకమే తరవాతి కాలంలో మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటానన్న కనీసమైన expectation కూడా లేదు.

సాయంత్రాలు ఇంకా ఎండ కాస్తూ ఉండగానే, ఆ ఊరిని ఆనుకుని ప్రవహించే కృష్ణానదిలో కాళ్ళు తడుపుకుంటూ తిరగడం ఇష్టం. చేతిలో ఒక పుస్తకమేదో కచ్చితంగా ఉండేది. ఆ సాయంత్రపు ఇసక మీద పడుకొని, ఆకాశంలోకి చూస్తూ, కృష్ణమ్మ నీటి చప్పుడు వింటూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేయడం సాయంత్రపు చర్య. అలాంటి ఒక సాయంత్రం “నూతిలో గొంతుకలు” చదవడం మొదలుపెట్టాను. అప్పటికి దీర్ఘ కావ్య లక్షణాలుండే కవిత్వం పట్ల ఏదో ఒక ఆకర్షణ ఉండేదనుకుంటా. బైరాగి కవిత్వ నిర్మాణం ఇక్కడ కనికట్టు. అది దీర్ఘ కవితా కాదు, అట్లాగని చిన్న కవితా కాదు. తాను బాగా చదువుకున్న హిందీ కవిత్వం నుంచో, ఇంగ్లీషు కవిత్వం నుంచో, ముఖ్యంగా ఎలియట్ లాంటి కవుల నుంచి బైరాగి ఈ ప్రత్యేక నిర్మాణం వైపు వచ్చి ఉండాలి.

కవిత్వంలోకి పాఠకుణ్ణి ఆహ్వానించే చిన్న కిటుకు ఏమిటంటే: ఆ పాఠకుడి మనసుకి దగ్గిరగా ఉండే ఒక సన్నివేశంలోకి — అది జీవితంలోంచి కావచ్చు, చదువులోంచి కావచ్చు — తీసుకెళ్ళడం! “నూతిలో గొంతుకలు” ఎలియట్ వాక్యంతో మొదలవడంతో నాకు ఆ కవిత్వంలోకి పాస్ పోర్టు దక్కినట్టయింది. అదీ నాకెంతో ఇష్టమై, పదేపదే చదివిన వేస్ట్‌లాండ్ (Wasteland) నుంచి.

And voices singing out of empty cisterns
And exhausted wells

వచనంలోంచి కవిత్వంలోకి ప్రవేశించిన వాళ్ళ ఒక అలవాటు ఏమిటంటే — కవిత్వంలో కూడా వచనంలో లాంటి తార్కికతని (logical coherence) వెతుక్కుంటారు. కచ్చితంగా అలాంటి లక్షణమే నన్ను “నూతిలో గొంతుకలు”ని ఒక దీర్ఘ కావ్యంలాగా చదివించింది. బహుశా, Wasteland కూడా నేను అదే విధంగా చదివి ఉంటాను. ఈ లక్షణం గురించి ఈమధ్య 100 Years of the Wasteland: Indian Responses (2023) అనే వ్యాస సంపుటిలో నా చేత ప్రసిద్ధ కవి సచ్చిదానందన్ ఒక వ్యాసం రాయించారు. అందులో Wastelandకి బైరాగికీ ఉన్న బంధాన్ని గురించి ఇలా రాశాను:

Within the Telugu literary culture, Bairagi was an unresolved puzzle. Many editors and critics found it difficult to read and appreciate Bairagi’s poems. Being a polyglot who was exposed to multiple languages including English, Bairagi used a syntax that was intensely strange and complex. In the world of Romanticism, both personal and collective, Bairagi represented a portrait of a young artist of purely subjective notions — struggling forever with questions of being and belonging. There was, of course, a sense of uncertainty about an urban identity. But above all, there was a strong sense of disillusionment that immediately echoed the Wasteland. Indeed, many of Bairagi’s poems remind me and other poets of my generation of Eliot’s poem. Undoubtedly, both Eliot and Bairagi, with their intense emotionality, speak elaborately to our inner world -– a world butting against the edges of our bodies and minds.

ఇది రెండేళ్ల కిందట రాసిన వ్యాసం. కానీ, అందులో ఆ 1980ల నాటి వ్యక్తిత్వం ఉందా అంటే తప్పకుండా ఉందనే చెప్తాను. బైరాగి గురించి అలాంటి సంవేదనే మిత్రుడు వాడ్రేవు చినవీరభద్రుడిలోనూ కనిపిస్తుంది. కొద్దిపాటి చిన్న తేడాలతో మా ఇద్దరి మీదా బైరాగి నీడ ఒకేలా పడిందేమో అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, 1980ల నాటి నా సంవేదనపైన బైరాగి “నూతిలో గొంతుకలు”తో పాటు చదువుతూ ఉండిన సోమెర్సెట్ మామ్ నవల, అలాగే, కృష్ణ బలదేవ్ వైద్ నవలా — నా ఆలోచనలని కలుపుతూ వెళ్ళాయి. నిజానికి కృష్ణ బలదేవ్ వైద్ కథలు “ఉస్కే బయాన్” చదువుతున్నప్పుడూ, అందులో ఒక కథ నేను అనువదిస్తున్నప్పుడూ నాలోకి బైరాగి మాటిమాటికీ తొంగిచూస్తూనే ఉన్నాడు. ఈ రెండీటీలో ఒక సంశయ మనస్కుడి లోపలి ప్రపంచం చుట్టూ కథ. దానికి కవిత్వ రూపమిస్తే అది బైరాగి అని అనుకునే వాణ్ని. ఆ మూడు లోకాలకూ నాకూ మధ్య లంకె ఇంకోటి: అప్పుడే పట్నం చేరుకున్న నాలోపలి పల్లెటూరి పిల్లాడి భయాలూ, సందేహాలూ. ఈ వాతావరణం నన్ను బైరాగికి సన్నిహితంగా తీసుకెళ్లిందని కచ్చితంగా చెప్తాను.

ఇప్పుడు మరోసారి “నూతిలో గొంతుకలు” చదువుతున్నప్పుడు -– అంటే ఇంత వయసు తరవాతా, ఇన్ని సరిహద్దులు దాటి వచ్చాక — అలాంటిదే ఇంకో రకం భయం ఇంకో విధమైన సందేహం నన్ను ఆవరించి ఉంది. అప్పుడది పల్లె నుంచి పట్నం వలస వచ్చిన భయమైతే, ఇప్పుడది దేశం నుంచి ఇంకో దేశానికి ప్రవాసం వచ్చిన భయసందేహాలు. కవిత్వం అదే, కానీ, దాని చుట్టూరా నన్ను చుట్టుముట్టే వాతావరణం వేరే. ఇప్పుడు ఆ కవిత్వాన్ని చదివించే ప్రేరణా వేరే. ఇది ఒకసారి అర్థమైన తరవాత — 1990కి ముందు నేను బైరాగి గురించి చేసిన ఆలోచనల్లోకి మరోసారి వెళ్తే, వాటి 2025 కొనసాగింపులు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి.

అలా ఆలోచిస్తున్నప్పుడు బైరాగి నాకు రెండు రకాల రిఫరెన్సులు ఇస్తున్నాడు. ఒకటి: ఎప్పుడూ వెంటాడే సంశయాలకు బుక్‌మార్క్ లాంటి అనుభవ సంకేతాలు; రెండు: సంశయాల్నీ, వైరుద్ధ్యాల్నీ గుర్తించే కొన్ని పరిచిత సాహిత్య పాత్రలు, ఉదాహరణకు: అర్జునుడు, హామ్లెట్, రాస్కల్నికోవ్.

మొదటి పని చాలా మంది కవులు చేస్తూనే ఉంటారు. కొన్ని అనుభవ శకలాల్లోంచి జీవన తాత్వికతని చెప్తూనే ఉంటారు. ఉదాహరణకు ఈ కవిత, బైరాగి కవితల్లో మొత్తంగానో కొంతగానో అతన్ని ఆవిష్కరించే ఒకే ఒక్క కవిత ఎంపిక చేయమంటే ఇదే నాకు దొరికే సాక్ష్యం.

నిద్రాభంగం

పువ్వుల్లో పురుగులాగు
నైరాశ్యపు చెరగులాగు
నిశ్శబ్దంలో మృత్యువు ప్రాకింది.
వెన్నెల్లో కడలినురుగు
పొంగుతోన్న పాలమెరుగు
జీవిత పల్లవం, పాప నిద్రిస్తోంది.
మూసిన కనురెప్పల్లో
స్వప్నలోక సౌందర్యం
చలియించే పాపమోవి
పైన చిన్న నవ్వొకటి ఉదయించింది.
మండుతున్న కళ్ళల్లో
భీషణ రౌరవజ్వాలలు
బిగిసిన మృత్యువు పెదిమల
పైన వికృతహాసమొకటి గికురించింది
తమతమాళ వాటికలో
ఏవో నల్లని ఛాయలు కదులాడాయి.
మబ్బుల ముట్టడి లోపల
చిక్కుకొన్న తెలితారలు పెనుగాడాయి.
పేరుకొన్న నిశ్శబ్దం
కదలొద్దని పలుకొద్దని వారించింది.
ప్రేమలేఖలై చిరిగిన
మబ్బుల్లో వెన్నెలొకటి
భయపడుతూ తొంగితొంగి చూచింది.
పక్కపైన బిక్కబోయి
నిద్రచెడిన పాపొక్కతె కూచుంది.

ఈ కవితలోని అనుభవమూ, దాన్ని తన తాత్వికతగా మలచి చెప్పాలనే తపనా ఇందులో కనిపిస్తాయి. నిద్రచెడిన పాప బైరాగి మాత్రమే కాదు, ఈ కవిత చదువుకుంటున్న నేను కూడా.

కానీ, రెండోది: అర్జునుడు, హామ్లెట్, రాస్కల్నికోవ్ లాంటి వాళ్ళతో సంభాషణ బైరాగి మాత్రమే సాధించిన కవిత్వ వస్తు, శిల్ప విన్యాసం. నాలోని పాఠకుడు ఈ రెండీటీని సమ్మిళితం చేసుకొని ఆలోచించడానికి బైరాగి బోలెడంత వెసులుబాటు కల్పిస్తున్నాడు. ఇది బైరాగికే ప్రత్యేకమైన లక్షణంగా చూస్తున్నాను కాబట్టి, ఈ మిగతా వ్యాసంలో దాన్ని గురించి కొంత వివరంగా చెప్తాను.


అర్జునుడు, హామ్లెట్, రాస్కల్నికోవ్-

బైరాగితో పాటు ఈ ముగ్గురూ నాతో సహప్రయాణం చేస్తూనే ఉన్నారు ఇన్నేళ్లుగా-

అటు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లోనూ, ఇటు ఇప్పుడు యునివర్సిటి ఆఫ్ పెన్సిల్వేనియాలోనూ ఇండియన్ లిటరేచర్ క్లాసిక్స్ (Indian literature classics) కోర్సులో నేను బాగా ఇష్టపడి చెప్పే పుస్తకం — బర్బరా స్టోలర్ మిల్లర్ అద్భుత అనువాదం భగవద్గీత. అందులోనూ అర్జునుడి విషాద యోగం చెప్పే పద్యాలు ఎప్పటికీ సమకాలీనమే. ఇవి చెప్తూ చెప్తూ నేను ఒక అర్థాంతరన్యాసంలా (digression) బైరాగి కవిత “అర్జున విషాద యోగం” ప్రస్తావిస్తూ ఉంటాను. అందుకోసం బైరాగి కవితలోని కొన్ని భాగాలని ఇంగ్లీషు తర్జుమా చేసుకున్నాను.

అయితే బైరాగి ఈ కవితలో చేసిన శిల్ప విన్యాసం ఏమిటంటే: కురుక్షేత్ర దృశ్య వర్ణన. అంతకుముందే మహాభారతంలోని యుద్ధపర్వంలో (ఇంగ్లీషు అనువాదం The Book of War) నుంచి కొంత చదివి ఉన్న విద్యార్థులకు ఇది వెంటనే కళ్ళకి కట్టినట్టుండే దృశ్య వర్ణన.

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ఈ అష్టాదశాక్షౌహిణులవర చతురంగబలం
నిలబడింది బలివేదిక వద్ద యజ్ఞ పశువుల్లా-

అని భౌతిక వర్ణనతో మొదలై, ఎలియట్ మహాకవి చెప్పిన objective correlative స్థితిలోకి తీసుకువెళ్తాడు బైరాగి, ఆ భౌతిక స్థితిని మనఃస్థితికి అన్వయించుకుంటూ-

బ్రతుకు చీలుబాట మీద నిలబడి యున్నాను నేడు
ఎటుబోతే పూలతోట, ఎటుబోతే వల్లకాడు?
ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి నా కర్తవ్యం?
ఈ అగ్ని పర్వతంపై ఏ దిక్కున గంతవ్యం?
దేనివలన జనులండరు తరతరాల సుఖిస్తారు?
మన మహోచ్చ నిర్ణయాన్ని సంప్రీతిని స్మరిస్తారు?

ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలానంతర బైరాగి అప్పటి కురుక్షేత్ర అర్జునుడి మనః ప్రవేశం చేసి, చెప్పిన పంక్తులివి. ఇదే నాకు 1984లో అర్థమైన విషయం కూడా. అప్పుడు బైరాగి విశ్లేషణలో రాసిన వాక్యాలు ఇవి:
కవిగా బైరాగి తనని తాను ఏ పాత్రల్లో వెతుక్కుంటున్నాడో ఇక్కడ గమనించాలి. యుద్ధరంగానికి వెళ్లలేని హామ్లెట్ నిస్సహాయత, యుద్ధాన్ని గెలిచి భయం చేతిలో ఓడిపోయిన రస్కల్నికోవ్ నిట్టూర్పులు, యుద్ధభూమిలో కర్మకూ, జ్నానానికీ మధ్య ఊగిసలాడిన అర్జునుడి పశ్చాత్తాపంతో బైరాగి తన మానసిక ప్రపంచాన్ని ముడివేస్తున్నాడు.

ఈ 2025లో క్లాస్ రూములో నిలబడి నేనూ అలాంటి మనోభావనలతోనే ఊగిసలాడుతున్నానా?! నేను లంకె పెడుతున్న భగవద్గీతలోనూ, బైరాగి కవితలోనూ ఇప్పటి జెన్‌-జీ (Gen-Z) తరం కూడా అలాంటి ఊగిసలాటలో ఉందా?!

ఉంది, ఉందనే అంటాను. బైరాగి కవితని పరిచయం చేశాక ఒక విద్యార్థిని రాసిన ఈమైల్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది:
మీరు పాఠం చెప్పి వెళ్లిపోతారు. నేను ఆ గతానికీ, వర్తమానానికీ మధ్య నలుగుతూ ఉంటాను. నాతోపాటు మిగిలిన వాళ్ళూ అంతే అనుకుంటాను. ఇంకా ఎన్ని యుద్ధాలు చేస్తూ ఉంటాం?! ఇప్పుడు మళ్ళీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (Black Lives Matter) దాకానో, పాలస్తీనా దాకానో వచ్చాం. అవే ప్రశ్నలు కదా?! సమాధానం వెతుక్కునే రోజు వస్తుందా?!

నలభయ్యేళ్ళ కిందట నా తొలియవ్వన కాలంలో నన్ను నేనూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగిన ప్రశ్నలే, ఇప్పుడు ఈ విద్యార్థిని తనని తానూ, తను చుట్టూ ఉన్న వాళ్ళనీ అడుగుతోంది కదా?! ప్రశ్నలూ, వాటి స్వగతాలూ, విషాద యోగాలూ ఏం మారాయి?!

ఈ మార్పు కోసం పాడే ఆగమగీతి దాకా బైరాగి మనకి తోడుగా వస్తాడు. మనలోపల ఇంకో బైరాగి అలాగే చీలుబాటల్లో నిలబడి ఉండి, ఇదిగో నాకూ, తనకీ మహాయిష్టమైన ఇంకో మహాకవి రిల్కే కవిత వినిపిస్తూ ఉంటాడు ఇలా — ఇది బుద్ధుడి గురించి రాసిందే కానీ, బైరాగి అన్ని కవితల్లో మాదిరిగానే ఇందులోనూ మనం ఉంటాం.

అతడేదో వింటున్నటులే ఒక సంపూర్ణ శాంతి
దూరంగా మనం ఆగగా వినిపించదు మనకిక.
అతడు నక్షత్రం మన కనుల కేమి కనుపించదింక
దూరేతర నక్షత్రాల విస్తారం అతని క్షాంతి.
అతడు శేషం, మనం అతని మ్రోల నిలుచున్నది
అతడు కనగలందులకా? ఏమవసర మతనికి అది
మనం అతని మ్రోల ప్రణమిలినా అతడు
ఒక గంభీర ధీర మృగంలా అసలు లక్ష్యపెట్టడు.
ఏమనగా దేనికి ప్రణమిస్తున్నామో నేడు,
అది అతనిలో భ్రమియించింది వేల ఏండ్లనాడు
మన కనులకు తడి తేగల దాని నతడే మరచినాడు
మనకు శాస్తి, అతడు తనలో తాను నిండియున్నాడు.
– ఆంగ్లమూలం: రేనర్ మేరియా రిల్క
– అనువాదం: ఆలూరి బైరాగి


అఫ్సర్

రచయిత అఫ్సర్ గురించి:

కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.

 ...