వియారెజ్జియో
(పీసా దగ్గర, ఇటలీ)
ఏప్రిల్ 5, 1903
నన్ను మన్నించు, మిత్రమా! నువ్వెప్పుడో రాసిన వుత్తరానికి జవాబు రాయడానికి ఇప్పటికి గానీ కుదరలేదు నాకు. అప్పటి నుంచీ బాగా లేను నేను. నిజానికి నేను జబ్బుపడలేదు కానీ, ఈ ఫ్లూ జ్వరం నా ప్రాణాలు తీసేస్తుంది. ఏమీ చెయ్యాలనిపించదు. గాలి మార్పు వల్ల ఏమైనా బాగుపడతానేమో అన్న ఆశతో ఇంతదూరం వచ్చాను. లోగడ ఇలాగే జరిగింది. కానీ ఇప్పటికీ నేను బాగున్నానని అనలేను. రాయడం ఎంత కష్టంగా వుందో చెప్పలేను. ఈ నాలుగు వాక్యాలైనా రాయగలుగుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా వుంది. పెద్ద వుత్తరమే రాద్దామనుకున్నాను నిజానికి.
నీ ప్రతి వుత్తరమూ నాకు బోలెడంత సంతోషాన్నిస్తుంది. నా జవాబులు నీకు అంత సంతోషాన్నిస్తున్నాయని నేను అనుకోను మరి! చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!
ఇవాళ మరి నేను ఎక్కువేమీ రాయలేను, రెండు ముఖ్యమైన సంగతులు మాత్రం చెప్పాలని వుంది.
ఐరనీ … దీని అదుపులోకి ఎప్పుడూ వెళ్ళకు. మరీ ముఖ్యంగా ఏమీ రాయలేని వేళల్లో! రాయగలిగిన స్థితిలో నువ్వున్నప్పుడు ఆ స్థితిని పూర్తిగా ఉపయోగించుకో. నీ జీవితం మీద నువ్వు పట్టు సాధించడానికి అదే అద్భుతమైన అవకాశం. అలా రాయగలిగిన స్థితి నీకు బాగా పరిచితమైపోయి, తేలికైపోయిన తర్వాత … నీకు ఆ పరిచిత వాతావరణం భయం పుట్టిస్తుంది. ఆ స్థితిలో కాస్త పెద్ద విషయాలు ఆలోచించు. ఆ విషయాల లోతుల్లోకు వెళ్ళు. నువ్వు లోతుగా ఆలోచించే కొద్దీ ఐరనీ నీ జోలికి రాదు.
లోతుగా ఆలోచించేటప్పుడు నువ్వు ఇంకో సంగతి మరిచిపోవద్దు. నీతో పాటు నీ అస్తిత్వం వుందా లేదా అని తరిచి చూసుకో. గొప్ప విషయాల్ని తవ్వితలకెత్తుకునే వేళల్లో చాలా సార్లు మనం మన ఉనికిని మరిచిపోతుంటాం. నీ ఉనికికి సంబంధించిన స్పృహ నీకు ఉంటే, అలాంటి స్థితిలో నీ ఉనికి నిలబెట్టకోవాలన్నదే నా ఉద్దేశ్యం.
ఇక నేను చెప్పాలనుకున్న రెండో సంగతి:
నేను చాలా చదివి ఉండవచ్చు. కానీ వాటన్నిటిలోకీ నన్ను ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండేవి రెండే రెండు. ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా అవి నాతో ఉంటాయి. నా పక్కనే ఉంటాయి. నన్ను గమనిస్తూ ఉంటాయి. ఒకటి: బైబిల్, రెండోది: డేనిష్ కవి యెన్స్ పేటర్ యాకబ్సన్ (Jens Peter Jacobson) రచనలు. ఇతని పుస్తకాలు చదివావా నువ్వు? అతని పుస్తకాలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. అతనివి మంచి అనువాదాలు కూడా ఉన్నాయి. ముందు అతని కథలు చూడు. ఆ తరువాత నీల్స్‌లైన్ అనే అతని నవల చదువు. ముఖ్యంగా ‘మోజోన్స్’ అనే కథ చదువు. ప్రపంచమంతా నిన్ను మాత్రమే చుట్టేసినట్టు ఉంటుంది ఆ అనుభవం. లోకంలోని సంతోషం, సుఖం, ఈ లోకంలో బతకడంలో వుండే అద్భుతమైన సౌకర్యం … అన్నిటికీ మించీ ఈ లోకం విశాలత్వం ఇవన్నీ నీకు తెలిసివస్తాయి. అప్పుడప్పుడయినా ఇలాంటి పుస్తకాల్లో మనం బతికాలి. వాటి నించి నేర్చుకోవాలి. అన్నిటికీ మించి వాటిని మనసారా ప్రేమించాలి. నువ్విచ్చే ప్రేమకి వెయ్యింతల ప్రేమ నీకు బదులుగా వస్తుంది. నీకు జీవితం అంటే ‘ఇదీ’ అని తెలిసివస్తుంది. ఆ పుస్తకాలు చదివాక ఒక్కసారి నీ అస్థిత్వాన్ని పరీక్షించుకో. నీ వ్యక్తిత్వం అనే వస్త్రం ఎన్ని అనుభవాల రంగులతో, అసంతృప్తులతో ఆనందాలతో నిండిపోతుందో చూడు.
సృజన … ఈ అనుభవం లోతుని నీకు ఎవరిచ్చారు అని నువ్వు నన్ను అడిగితే సూటిగా రెండే రెండు పేర్లు చెబుతాను: యాకబ్సన్ అనే కవి, రోడాన్ అనే మహాశిల్పి. వాళ్ళు నాకు సృజన రహస్యాలు చెప్పారు. జీవితం లోతులు చూపించారు. ఎంతగా అంటే, వాళ్ళు నాకు తెలియక పోతే నా జీవితానుభవం అరకొర గా ఉండేది.
ఇప్పటికింతే!
నీ
రిల్కే.