అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి

ఆలూరి బైరాగి (1925-78) తన “నూతిలోని గొంతుకలు” సంపుటిని గురించి, “ఇది సంశయ కావ్యం” అని చెప్పుకున్నాడు. మనిషిలో సంశయం ఎప్పటిదా అని వెతుకుతూ పోతే ఈ సత్సంశయం అత్యంత పురాతనమైనదనీ ఇవాళ్టికీ రూపురేఖలు మార్చుకోకుండా ఉందని తెలుస్తుంది. ఋగ్వేదంలోని తొలి మండలంలోని ప్రముఖమైన 164వ సూక్తం, దీర్ఘతముని సూక్తంలో “కో దదర్శ ప్రథమం జాయమానం” (మొదట పుట్టిన వానిని ఎవడు చూశాడు?) అన్నది ఆ ఋషి సంశయం. “కస్మై దేవాయ హవిషా విధేమ?” (ఏ దేవునికై మేము హవిస్సు అర్పించగలము?) ఇదీ ఋగ్వేదంలోదే (ఋగ్వేదం, 10.121). సత్సంశయం అనాదిగా మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నదే. ఈ సదసత్సంశయం బైరాగిని కడదాకా వదలక చరిత్రనూ సాహిత్యాన్నీ తిరగదోడించీ తిరగ చదివించింది. ఎక్కడా దిక్కు తోచక, ఏ దారీ దొరక్క, అంధతమిస్రం వంటి ఈ ప్రపంచాన్ని ఎలా తరింపజెయ్యాలా అన్న పెనుభారాన్ని మోస్తూ కరుణతో ప్రేమతో కవిత్వం రాశాడు బైరాగి. దేవుడు దిగి వచ్చి ఏంవరం కావాలో కోరుకో అనడిగితే కోరుకోవడం నిజంగానే కష్టం. దేవుడే దిగి వచ్చాడు, ఇదే చాలదూ? ఆధునిక కవులు ఎక్కువగా ఎవర్నీ ఏమీ అడగరు. అడిగీ, ఏదో పొందీ పెద్ద ప్రయోజనమేమీలేదని వాళ్ళకు తెలుసు.

చీకటి నీడలు

ఓం ప్రథమంగా ఆకలిని గౌరవిస్తూ కేకలు పెట్టడం మంచి కవుల లక్షణం. బైరాగి “ఈ ఆకలి హోరు ముందు పిడుగైనా వినిపించదు” అన్నప్పుడు ఆకలే కాక పిడుగూ, తుఫాను, జ్వాలాముఖి వంటి శక్తిమంతమైన ప్రతీకలకు పాఠకులిక్కడే సిద్ధమౌతారు. బైరాగి తొలి కవితా సంపుటి “చీకటి నీడలు” (తొలి ముద్రణ -1948) లోని కనిపించే తొలి కవిత “దీపావళి” లోనే,

“దీపావళి ఉత్సవమండీ
దీపావళి చేద్దాం రండి

నరకాసురుడెందుకు
ప్రపంచ నరకాన్నే మసి చేద్దామా?”

అన్నాడు. ప్రపంచమే నరకమయింది. ప్రపంచంలోనే నరకముందన్న ఎరుకతో బైరాగి కవితారంగప్రవేశం చేశాడు. ఇదే సంపుటిలో “పెను తుఫాను” అనే కవితలో, “చూపుల పొలిమేర దాటి/వ్యాపించిన చీకటిలో” అన్నప్పుడు కనిపించే నిరాశా నిస్పృహలకు ముగింపుగా తుఫాను బిడ్డల్ని ఆహ్వానిస్తూ, “నేడు కాదు/రేపు మీది” అన్న సన్నటి భరోసా కనిపిస్తుంది. జీవిత శిథిలాల్లో వెతకగా “కొంచెం బతుకూ/కొంచెం చావూ” కనిపిస్తున్నాయి, ఎప్పుడంటే పరమ బీభత్సమైన, భయానకమైన దృశ్యచిత్రాలతో ప్రపంచనరకాన్ని ఆవిష్కరించిన తరువాతనే. ఇందులో బైరాగి వర్ణనలెంత నిరాశాజనకమంటే, పఠితలు కవిని ఆదుకునేందుకు ఎవరున్నారనుకునేటంతగా ఉంటాయి. “స్వేచ్ఛాసీమ ఉన్నదే దిశలో” అని ప్రశ్నిస్తాడు కవి “జీవితం” అనే సుదీర్ఘ కవితలో. “విధ్వంసం” అనే కవితలో “స్నేహపు సౌహార్ద్రంతో/మెత్తటి వెచ్చదనంతో ఆడుకొన్న రోజులు గడిచాయి” అన్నప్పుడు ఈ కవి బాల్యమూ బాల్యకాలజ్ఞాపకాలూ ముగిశాయని అర్థమౌతుంది. ఇంకా, “కడుపు మంట” అనే కవితలోనైతే శ్రీశ్రీ “అద్వైతం” కవితకు negative parody రాస్తూ:

“అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే
…టీ కప్‌లో ఈగై చస్తాం”

అనడం ఆశావాదులకు వెక్కిరింపు. ఈ సంపుటిలో చివరిగా బుద్ధుడూ జీసస్‌ల ప్రేరణతో తిరుగుబాటు జ్యోతిని వెలిగించమంటాడు.

నూతిలో గొంతుకలు

“నూతిలో గొంతుకలు”లో (తొలి ముద్రణ 1955) ప్రధానంగా హామ్లెట్ శక్తిమంతమైన అనాసక్తపు డోలాయమాన స్థితినీ, కురుక్షేత్ర యుద్ధరంగాన శోకసంవిగ్న మానసుడయిన అర్జునుడి కింకర్తవ్యవిమూఢతనూ, రాస్కోల్నికోవ్ సోనియాను తోవ చూపించమనడాన్నీ (Dostoyevsky రాసిన నవల Crime and Punishment) కవిత్వీకరించడంలో, చెడి బతికిన సోనియా ప్రేమ ఉన్నతమైనదని ఇట్టే పసిగట్టొచ్చు, ఎలా అంటే, చివరికి హామ్లెట్ కత్తి దూశాడు. కరిష్యే వచనం తవ అన్న అర్జునుడు యుద్ధానికి కృతనిశ్చయుడై ధనుస్సునందుకున్నాడు. సోనియా రాస్కోల్నికోవ్‌కు తోవ చూపి అతని వెంట నిలిచి గెలిచింది. ఈ సంపుటిలో బైరాగి వాడిన భాష ఎంతో సందర్భోచితమైంది. హామ్లెట్ అంతస్సంఘర్షణా అర్జునుడి విషాదయోగం ఒకలా ఉంటే, రాస్కోల్నికోవ్ సోనియాను వెలుగులెక్కడని అడుగుతూ “పంకసంకుల పాపసరసిని పూచినది నీ ప్రేమపద్మం” అన్న పదాల్లోని మార్దవం-ప్రేమ, కరుణల అభ్యున్నతిని నిలబెడుతోంది. జీవించడానికి ప్రేమ, కరుణ అవసరమని ముందే చెప్పాడు బైరాగి. ఈ integrity గొప్ప కవుల లక్షణం.

ఆగమగీతి

ఆగమగీతిలో (తొలి ముద్రణ — 1978) బైరాగి “జీవితం ఉరిత్రాటి ఉచ్చులాగు/ఒంటరి సున్నాలాగు పిలుస్తోన్న రోజు”నే ఒక మహనీయుని రాకను ఊహించాడు. “కానీ ఒకటి/నాక్కొంచెం నమ్మకమివ్వు” అన్న షరతు మీద, “కాలుని మీద కలబడతాను/పరమశివుని శూలాగ్రాన తలక్రిందుగ నిలబడతాను…/ప్రపంచమనే మహాసత్రం నిండిపోతే మరో సత్రం కట్టిస్తాను” అన్నటువంటి గ్రోటెస్క్ (grotesque) పదచిత్రాలు కవికి నమ్మకం (faith) ఎంత అవసరమో చెబుతాయి. “అనల శైల శిఖరాగ్రప్రోజ్జ్వల పద్మం కోసేవారెవరు” అన్న ప్రశ్నకు ఇందులోనే సమాధానం కానవస్తుంది. ఇందులో బైరాగి కవిగా తొలిసారి వెలుగును చూశాడు, చూపించాడు.

కవిగా బైరాగి

నిజానికి బైరాగి కవిత్వంలో రూపాన్ని దర్శించి తన్మయం చెందవచ్చు. ఎంతైనా పలవరించవచ్చు. బైరాగికి దన్నునిచ్చిన ప్రతి ప్రాచ్య పాశ్చాత్య ప్రతీకనూ విడమరుస్తూ చాలా రాయవచ్చు. బైరాగి వాడిన వివిధ సంస్కృత సమాసాల్ని వెతుక్కుంటూనో తెలుగు మాటల ప్రోదిని తడుతూనో ఇంకొంత రాయవచ్చు. బైరాగి కవిత్వంలో అక్కడక్కడా బిగి తప్పిన, వడి సడలిన శబ్దప్రవాహం పాఠకుల అవగాహనను దాటిపోదు, ఇది కవిత్వంలోని పైమెరుగులపై కవికున్న వైముఖ్యమని పాఠకులకు తెలుస్తూనే ఉంటుంది. కవి ప్రవక్తవలే చెప్పిన చండతీక్ష్ణ వాక్కులు, మెత్తని హృది పలికిన మార్దవవు మాటలు, ఇంకా ఇతరేతర నైరాశ్యపు కోటబుల్ కోట్స్ (quotable quotes) గానీ (“జీవిత జ్వరం దహిస్తోంది దేహాన్ని”, “దేహపు చెరలో నరుడొంటరి”, “కాలుని గ్రాసము కాని దెద్దియో?” — ఇవేవీ నాకు అంత ముఖ్యమని తోచదు. బైరాగి మనకేమిచ్చాడన్న ప్రశ్న మనల్ని మనం వేసుకోకతప్పదు. అప్పుడొచ్చే సమాధానం ఒకటే. ఆలూరి బైరాగి యుద్ధాల యుగంలో రాసిన శాంతికవి, కల్లోలయుగాల్లో గళమెత్తిన అశాంతికవి. మానవాళికి శాంతి లేకపోవడమే కవి అశాంతికి కారణమయింది. “విరాడ్విశ్వమందిరాల కవాటాలు మూసిన ధ్వని” విన్న కవికి నూతిలో గొంతుకల ఆర్తారావాలు వినిపించిన చెవులున్న కవికి, “బ్రహ్మాండభాండాల పగిలిన చిల్లపెంకులు” జ్ఞాపకమున్న కవికి, “ఎక్కడ బయల్దేరాం మనం, కడకెక్కడ చేరాం మనం” అని తన ఆఖరి ప్రశ్నగా అడిగిన కవికి, “వాస్తవ ప్రపంచంలో ధ్రువతార ఎక్కడున్నద”ని ప్రశ్నించిన కవికి, “నిలకడగల నమ్మిక” ఎలా కలుగుతుందో తెలుసుకునే బృహత్ప్రయత్నంగా కవిత్వం రాయక తప్పలేదు. మనిషి ప్రాక్తన మరణం మొదలు నూతన జననం వరకూ చరిత్రను లెక్కగట్టిన బైరాగి ఒనర్చిన మఖం అతని కవిత్వం. “రెండు సైకతాల మధ్య కృశకాయ శరన్నదిలా అస్తిత్వపు ప్రాకులాట” అని అస్తిత్వనిర్వచనాన్నందించిన కవి, “అజ్ఞాతంలోంచీ మరల అజ్ఞాతంలోకి పయనమే జ్ఞానం” అని నిర్ధారించిన కవి, ఏదో “సకరుణ మసృణగీతి” దహించిన కవి, “బీళ్ళు దున్నితే పుర్రెలు చాటుతాయి పకపకమని పూర్వుల ఔన్నత్యమహిమ వేనోళ్ళను అందరికిని” అన్న తెలివి ఉన్న కవి, “సంశయ సాంధ్యవేళ”న ఒక “ఎన్నడూ వసివాడని కోమల కలధౌత కాంతి”మత్వానికి ప్రయాణోత్సాహియై, “స్వీయనాభ్యుద్గమగంధం”వంటి కిరణాన్ని మనకు సృజించి ఇచ్చాడు.

బైరాగి మహాకవి

“ఆశించను శుద్ధవివేకపు వరవిద్యుత్కాంతులు
ఆశించను త్యాగరాగరంజిత ప్రణయజ్యోతులు
శాసించ సాహసించను జీవితధ్వాంత భ్రాంతుల
భాసించను అదృశ్య రహస్యాల కడలి లోతులు
ప్రభాపూత పరమప్రాతశ్శాంతిగాని
రాకేందుసుధానందపు నిర్ద్వంద్వ కాంచనకుంద కాంతిగాని
ఆశించను, ఆశించ సాహసించను..” (నూతిలో గొంతుకలు)

బైరాగి ఆశించని విషాయల లిస్టే దీర్ఘమైనది, కవి కవితలో సమాసాల్లాగా. మరేం కావాలీ కవికి?

“నాకు చాలునొక కిరణం
ఒక దుర్బల కాంతికిరణం
ఈ మృణ్మయదీపంలో ఒక నిముసపు ప్రజ్వలనం”

ఆ ప్రజ్వలనమూ ఎంతో సేపు అక్కర్లేదు, అరనిముసంపాటో నిముసంపాటో చాలు. చిన్న ఆలంబన క్షణమాత్రం దొరికినా మనిషి అవతలి ఒడ్డుకి చేరుకోగలడు! ఇవి పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన వ్యక్తి అనే మాటలు కావు. బైరాగి రచనల్లో turning point అనదగ్గది ఆగమ గీతి సంపుటిలోదే అయిన “వాగ్దత్త వసుంధర”. ఇది ఆశాజనకంగా నీడల్ని తుడిచేసే ప్రయత్నాన్ని ప్రస్తావించిన కవిత. “చిల్లర దేవుళ్ళనూ చిన్న చిన్న హిట్లర్‌లనూ తరిమివేశాం/పరహింసా పాపపంకిల ప్రపంచ చరిత్రలోన ప్రప్రథమంగా అసలు ప్రభుత ఉండదు” అన్నప్పుడు కవి భవిష్యవాణిని ఆనాడే విన్నాడని అనిపిస్తుంది. బైరాగికి మానవాళి మీద కాస్తో కూస్తో నమ్మకముంది. ఆ నమ్మకమెటువంటిదీ అంటే, “దుర్బల రక్తమాంసాల్లోంచీ పిండిన వజ్రఖండం వంటి విశ్వాసం”. బైరాగి ఆశించిన కిరణం, బైరాగి ఆగమగీతి ఆలపించిన భావిమహనీయుని ఆవిర్భావం (“వస్తున్నాడొస్తున్నాడరుదెంచక తప్పదతడు”) మానవాళికి మిగిలిన ఒకే ఒక్క దిక్కు. ఇది నీశె (Nietzsche) ఊహించిన అధిమానవుడు (uberman) కాదు. అది చినవీరభద్రుడు చెప్పిన అనేక దారుల్లోంచి వచ్చే మంచి మార్పు. ది హోప్. ఇక్కడితో మనం బైరాగిని వదిలేసి ప్రపంచంవైపు తలలు తిప్పుతాం. ఏ మహాకవినీ మనం మోయనక్కరలేదు. మహాకవులే మనల్ని మోస్తారు, తరింపజేస్తారు. కనుకనే వాళ్ళు మహాకవులు.

బైరాగి ప్రభావం

బైరాగి ప్రభావం తదుపరి కవులలో ఉంది. మొత్తం దిగంబరకవిత్వంలో కనిపించే భాషలోని శక్తి, కొన్ని ప్రతీకలూ ముందు బైరాగి వాడినవే. ఉదాహరణకు, బైరాగి ఆఖరి సంపుటి “ఆగమ గీతి”లోని “వందేమాతరమ్” చదివిన చెరబండరాజు అలాటి కవితే రాశాడు. “ఆగమ గీతి” లోని “మల్లెపూలు”, “అరచిత కవిత” — వీటిల్లో కనబడే కొన్ని భావనల వాక్యాల ప్రతిబింబాలూ ప్రతిధ్వనులూ చినవీరభద్రుడి కవిత్వంలో తళుక్కున తొంగిచూస్తాయి. చినవీరభద్రుడి తొలి సంపుటి” నిర్వికల్ప సంగీతం” బైరాగి కవితాఖండికను quote చేస్తూ మొదలయింది. శ్రీశ్రీ లేని బైరాగిని ఊహించడమంత కష్టం కాదు. టి. ఎస్. ఎలియట్ (TS Eliot) లేని బైరాగినీ కాస్త కష్టమైనా ఊహించవచ్చు. సత్సంశయంలేని బైరాగిని మాత్రం ఊహించలేం. బైరాగి “అరేబియావాడి ఒంటె” మాదిరి అంతా ఆక్రమించుకుంటాడని కృష్ణశాస్త్రి ముందుమాటలో అంటే, వేగుంట మోహన ప్రసాద్ “Hamlet, Arjuna and Raskolnikov rolled into one” అని అన్నాడు. చినవీరభద్రుడు “కన్నీటి సరసున పూచిన కెందామర” అని బైరాగి కవితావాక్యాన్నొకదాన్ని ప్రతిఫలిస్తూ ప్రతిధ్వనిస్తూ దశాబ్దాల క్రితమే తీర్మానించాడు. నేను అంధతమిస్రాన అఖండజ్యోతి అంటాను.


తా.క.:
తెలుగు విమర్శ తెలుగు పాఠకులను ఏ స్థితికి నెట్టిందంటే, బైరాగి తన “నూతిలో గొంతుకలు” కవితను వివరిస్తూ, ఇది “సంశయ కావ్యం. దీనిలో మానవుడు ఏది త్రోవ అనే అడుగుతున్నాడు” అని చెప్పుకోవలసి వచ్చింది. ఇంతేనా, ఇంకా, “ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేటి మానవుని అనుభూతిలో అది కవి తాదాత్మ్యం. స్వీయబాధ వెలువరించటం కవి పరమావధికాదు.” ఏ కవీ తన కావ్యాన్ని తనే ఇంత ప్రాథమికంగా వివరించే స్థితి రాకూడదు. తెలుగుకి ఇది దాపురించింది.