తెలుగునాట రాజకీయ చైతన్యమూ సామాజిక స్పృహా కలిగినట్టనిపించే ఏ prosaic వాక్యాన్నైనా చూసీచూడగానే అది మంచి కవిత్వమనీ దాన్ని రాసిన కవికి commitment ఉన్నదనీ అతను ప్రజల మనిషనీ అందలం ఎక్కించే విమర్శకులకు కొదవ లేదు. ఇది నా తరం మేలుకున్నప్పటి కాలంలో ఏ స్థాయికి చేరిందంటే, నిజాయితీ కలిగిన కవి, మన ఇంటా బయటా కదిలేవీ తననూ పాఠకులనూ కదిలించేవీ అయిన విషయాలను కవిత్వంగా రాస్తే ఆ కవికో “బిరుదనామం” దొరికేది. మూస కవిత్వానికి దూరంగా ఉంటూ నిజాయితీగా రాసి తెలుగు కవిత్వానికి నియంత్రిత కవితాత్మక వాక్యాన్ని (controlled poetic line) పరిచయం చేసిన ఇస్మాయిల్‌ను “చెట్టు కవి” అని కాస్త తక్కువ చేశారు కొందరు విమర్శక మహానుభావులు. ఇవాళ – అంటే ఆధునికానంతర దశలో – ఎంత అస్తిత్వవాద కవిత్వమే ఎక్కువ కనిపించినా, దానిలోనున్న అనుభూతుల పంట ఒక చిన్న సమూహానికే పరిమితమైపోతోందనే గ్రహింపు ఉన్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెరుగుతోంది. కనుక సుకవిత తనకు తాను పరిధులు విధించుకోదు. సుకవి తన అంతరంగానికి తప్ప మరెవరికీ సంజాయిషీ ఇచ్చుకోడు. ఇలా నిజాయితీగా రాసి తన కవిత్వం మీద తాను నిలబడగలిగిన కవి విన్నకోట రవిశంకర్. రవిశంకర్ మన మధ్యే తిరుగుతున్న మన కవి. ఈయనకు ఏటిపుట్టేడాదీ మనకు దైనందినంగా తోచే సాధారణమైన అనుభవాలు – నిద్ర లేవడం, ఇంట్లో భార్యాబిడ్డలను చూసుకోవడం, బయట ప్రకృతిని గమనించడం వంటివి – పునరాలోచించాల్సిన అనుభవాలై మమత్వం వాటిని పెనవేసి అనుభూతులై మిగిలాయి. ఈ కవి రాసినది వైయక్తికమే అంటే వ్యక్తిగతమైన అని కాదు ఉద్దేశం, అనుభవిస్తున్న వ్యక్తి కేంద్రమైన జీవితం, ఇది అందరి జీవితమూనూ. జీవితమంటే మన political self యాత్ర మాత్రమే కాదు, మన social identity పరిణామ కథా కథనమే కాదు కదా. మనను స్పృశించే సంగతుల కథ కూడా. ఈ sensibility మిక్కిలిగా ఉండడం అంత చిన్న విషయమేమీ కాదు. విన్నకోట రవిశంకర్‌లో ఇది కవిత్వమై పరిణమించడంవల్ల మనకు మన నశ్వరమైన జీవితాలూ మనుషులూ మన అనశ్వరమైన eco-system కొత్తగా అందంగా కనిపిస్తాయి.
రవిశంకర్ ఇస్మాయిల్ శిష్యుడు, అంటే ఇస్మాయిల్‌ను అనుకరించాడని కాదు. ఇస్మాయిల్ వేసిన కొత్తబాటను ఎంచుకొని తనను తాను ఆ మార్గాన ఆవిష్కరించుకున్నాడు. కవితానిర్మాణదక్షతలో కొంచెం తిలక్ అక్కడక్కడ తళుక్కుమంటాడు. ఇంకా, సమాంతర పంక్తుల వరసలు (parallel constructs) వాడుకుంటూ తన విషయాన్ని నొక్కి చెపుతాడు. ఈ parallel constructs “వేసవి వాన”లో బాగా ఉండగా తరువాతి సంపుటుల్లో పెద్దగా కానరావు. తరువాతి సంపుటులైన “రెండో పాత్ర”లో, కొత్తదైన “మంచు కరిగాక”లో వాక్యం ఇంకా సరళంగా ఉంటుంది. రవిశంకర్ స్వావిష్కరణ మనకూ అచ్చొచ్చేదే. వేసవి, వాన, మట్టి వాసన, ఇల్లు, తల్లి, భార్య, పిల్లలు, చందమామ, ఆకాశం, మబ్బు, కొండ, కోన, వగైరాలను చాలా మంది కవులు మననం చేసుకుంటారు. రవిశంకర్ ప్రత్యేకతల్లా వ్యక్తీకరణలో సారళ్యమూ చిక్కదనమూ కూడుకొని పాఠకులకు సాధారణంలో అసాధారణతను తెలియజెపుతాయి. “అగ్ని పర్వతం ఒకటి హఠాత్తుగా/మనసు మార్చుకొని/మంచుకొండగా మారిపోయినట్టుగా ఉంది” (వేసవి వాన), ఈ సాధారణంలో అసాధారణతకు (uncommon in the common) ఈ కవి కవితల్లో దాదాపు అన్ని కవితలూ మేలైన ఉదాహరణలే. ఈ రోజుల్లో మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకొచ్చిన విమానప్రయాణానుభవం ఎంతమందికి భయం కలిగిస్తుందో కానీ రవిశంకర్‌కు మాత్రం “పైపైకి వెళ్ళే కొద్దీ/బరువుతోపాటూ వయస్సునూ కోల్పోయి/బాల్యంలోకి కాస్సేపు మరలి పోయాను” అనిపింపజేసింది. ఎంతైనా బతుకీడుస్తున్న కవి ఈయన. బాధ గురించి రాయకుండా ఉండగలడా? “శరీరం వీణ మీద/ఒకో చోట సుఖం ఒకోలా పలికినా/బాధ మాత్రం అన్ని చోట్లా ఒకేలా పలుకుతుంది” అన్నప్పుడు ఇదెంత కరక్టుగా ఉందో అంత కవితాత్మకంగా ఉందని పాఠకులనుకుంటారు. విలియమ్ వర్డ్స్‌వర్త్ అన్న emotion recollected in tranquilityకి మేలుబంతి అనదగ్గ ఈ పంక్తులు చూడండి,
“దుమ్ము పట్టిన ఫొటోని
తుడిచి ముద్దు పెట్టుకున్నట్టే
సజీవమైన నవ్వుల్లో కూడా ఓలలాడగలగాలి
మనుషుల్లాగా, అనుభవాల్ని కూడా
గతిస్తేనేగాని గుర్తించలేకపోవటం
ఎంత విషాదకరం!” (వేసవి వాన – ఆనంద గీతం)
“తనేమిటో నాకు పూర్తిగా తెలిసినా తనను నేను కొత్తగా కనుక్కోవాలి” (వేసవి వాన – దాగుడు మూతలు) అన్న ఈ కవి స్పృహను మెచ్చుకోవాలి. నిజానికీ కవి మనకు తెలిసిన అన్నిటినీ మనం కొత్తగా కనుక్కునేలా చేశాడు. ఇతని కవిత్వం చదివాక జీవితంలో బాధా దుఃఖమూ తగ్గకపోయినా, హాయి, ఆనందమూ పెరుగుతాయి. ఏ కవీ ఇన్నాళ్ళూ పట్టించుకోని దృష్టితో మామూలు అనుభవాల్నే అనుభూతులుగా మలచిన భారం రవిశంకర్ మీద పడింది. ఇతనే “ప్రపంచ భారం మొత్తాన్ని/అట్లాస్‌లా బుజానికెత్తుకోవాలి” అన్నాడు ఒక కవితలో, ఇది కూడా ఈయనే చేశాడు. ఇన్నాళ్ళూ ఏ కవీ చూడని దృష్టితో అందరి జీవితాల్లోని చిన్న చిన్న సంగతుల్నే వేరేగా చూసి మననం చేసుకొని అన్నిటినీ కవిత్వీకరించాడు. కాస్త ఆలోచిస్తే ఇతని కవిత్వంలో ప్రహేళిక మాదిరి తలెత్తే ప్రతి ప్రశ్నా దానికి సమాధానమూ ఒక దగ్గరే కనిపిస్తాయి. “పరిత్యాగి కావటానికి/వదులుకోవల్సిందేమీ లేదు/సంసారికే సర్దుబాటు కావాలి/” (సవాలు, రెండోపాత్ర) అన్న రవిశంకర్‌కు తన కవిత్వమే ఆ సర్దుబాటును మించిన కలస్వనపు సద్దును అందిస్తుందని నా నమ్మకం. కవి మాటల్లోనే చెప్పాలంటే “ఫలదీకృత కణంలోకి జీవం ప్రవేశించినంత రహస్యంగా”నూ సున్నితంగానూ ఇతని కవితలోకి పదాలూ పోలికలూ ప్రవేశించి ఉండాలి. లేకపోతే ఇంత నిశ్శబ్దసంగీతం ఇతని కవితలో పలికేదికాదు.
ఇంకా, రవిశంకర్ కొత్త సంపుటి “మంచు కరిగాక”లో దిగులు పదును తగ్గిన సూర్యరశ్మి వలె తాకుతూ కణతలు నెరిసిన అనుభవాలను జాలిగా పరామర్శిస్తుంది. ఈ కవి ప్రస్థానం ఎంతో పారదర్శకంగా సాగుతూ పాఠకులూ కవితలో నెమ్మదించిన చిక్కదనాన్ని సానుభూతితో చూస్తూ ఒకసారి తమను తామే కవిస్థానంలో ఊహించుకొని చిన్నగా నిట్టూరుస్తారు. “ఊరినీ ఉద్యోగాన్నీ మరిచి/ఒక్క క్షణం కవినౌతాను” అని రవిశంకర్ అన్నట్టుగా, పాఠకులూ ఇది చదివి కవులై తమ దైనందిన జీవితాల్లో ఎంత కవిత్వం దాగి ఉన్నదీ తెలుసుకునేందుకు సంసిద్ధులవుతారు. రవిశంకర్ కవిత్వం ఈ విధంగా కవి అనుకున్నది నెరవేరుస్తోంది. రవిశంకర్ తాను ఇల్లు చేరుకోవడమే కాకుండా తన పాఠకులనూ ఇల్లు చేర్పించాడు. ఇదీ ఇతని విజయం.