నాడు-
ఎందుకిలా?
అడిగిందా ఇల్లాలు
గాయపడ్డ హృదయంతో.
ఆమె గానం
నన్ను మైమరపించింది
ఆమె నృత్యం
నన్ను ఉల్లాసపరచింది
ఆమె జ్ఞానం
నన్ను ఆకట్టుకుంది
నా ఆనందం నీ ఆనందమనుకో
చెప్పాడతడు ప్రశాంతంగా.
బిగి సడలిన శరీరాన్ని చూసుకొని
నిట్టూర్చిందామె
నేడు-
ఎందుకిలా?
అడిగాడతడు
గాయపడ్డ హృదయంతో.
పంజరం నుండి బయటపడ్డ పక్షిని నేను
నా గానం నా మైమరపుకే
విజయతాండవం చేయగల స్వేచ్ఛ నాది
నా నృత్యం నా ఉల్లాసానికే
ప్రపంచాన్ని నడిపించగల ఎరుక నాది
నాతో నడవగల సత్తా ఉందా?
ప్రశ్నించిందామె తొణకని చిరునవ్వుతో.
బిగి సడలిన బంధాన్ని చూసుకొని
నిట్టూర్చాడతడు