ఎప్పట్లాగే సాయంత్రం నిశ్శబ్దంగా చీకట్లోకి జారుతుంది. నింగిపెంకును పొడుచుకుని వచ్చే కోడిపిల్లల్లా చుక్కలు. పగటి పూట అనుభవాలన్నీ మూటగట్టుకుని రాత్రి కోసం ఒక పాటను సిద్ధం చేసుకుంటూ కీచుపిట్ట. గడిచిన కొన్ని నెలలు వారాలు రోజుల్లాగే ఆ గదిలో కిటికీ వారగా మంచం మీద ఒకే ఒక్క శబ్దంలా ఆమె. ఇన్నాళ్ళ నీ ప్రేమ నీ అలక నీ దుఃఖం అన్నీ ఆమెలోనే చిక్కుకుపోయాయి. విడిగా నువ్వేమీ మిగుల్చుకోలేదు.
మధ్యాహ్నం ఎండలో కమిలిన నిన్ను పైటచెంగుతో తుడిచి గ్లాసుడు నీళ్ళిచ్చే ఆదరువు. ఎడా పెడా తుఫాన్ల బారినపడే నీ ఒంటిని తడిమి నిన్ను తిరిగి మనిషిని చేసే భరోసా. దిగంతాల కలగా చెదిరిన నాన్నను కంట్లో దాచుకుని నీ తలపై గొడుగులా అల్లుకున్న కాంతి. అక్కడే కథలు కథలుగా ఆమె నీ పూర్వీకులను గానం చేసింది. నీ అడుగులు అక్కడే మొలిచాయి. నీ ప్రాణం అక్కడే కప్పబడి ఉంది. ఆకులు రాలిన మొండి చెట్టుగా ఆమె ఇంకా అక్కడ మిగిలివుంది.
ఓరగా వేసిన తలుపులోంచి ఎప్పుడు ఎగిరిపోయిందో గాలిపిట్ట. గదిలో వెలిగీ వెలిగీ ఆరిపోయిన శబ్దదీపం. లోపలంతా దట్టమైన చీకటిపొగ. మరణం ఒక విరోధాభాస. పల్లవిని కోల్పోయిన పాటను పాటను పోగొట్టుకున్న పల్లవినీ ఒకే దుఃఖకవితగా రాసిపెడుతుంది. ఒట్టి దేహమే కానీ అదీ లేకపోతే భూమి ఖాళీ గది.