విరాగి

వెన్నెలై ఒడి చేర్చుకుంటుందనుకున్న రాత్రి
వడగాడ్పయి విసిరికొట్టిందేం?
చినుకై చల్లబరుస్తుందనుకున్న మేఘం
చిరుగాలి తాకిడికే చెదిరిపోయిందేం?
రెప్పలలో దాచుకున్న స్వప్నాలు
రెక్కలు కట్టుకొని ఎగిరిపోయాయేం?
పలుకై పలవరించాల్సిన ప్రేమ
మాటలే లేక మూగవోయిందేం?

ఎన్నో అడగాలనుకున్నాను
ఆ రాత్రిని, ఈ మేఘాన్ని
ఆ స్వప్నాన్ని, ఈ మౌనాన్ని.
ఎన్నో అడగాలనుకున్నాను
సగమే తెరిచిన నీ తలపు వెనుక
తలుపు తీయని మనసును.

ప్రశ్నల నన్నింటిని పాతిపెట్టి
నెమలీకల జ్ఞాపకాలను
నెలవంకగా ధరించి
విడవనంటున్న వాసనలను
విభూతిగా అలముకొని
చిరుదరహాసం మాటున
చింతలను లయం చేసుకొని
ఎదుట నిలిచిన నీలిమను
కమ్ముకొన్న ఊదారంగును
మూడవ కంటితో చూస్తూ
మౌనతాండవం చేస్తూ
విరాగినై ఇలా!