ఇద్దరు కళాకారులు

సాధారణంగా, జె. కరుణాకర్ పొద్దున నిద్రలేవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇష్టాగోష్ఠిలో రాత్రుళ్ళు చాలా సేపటి వరకు, కొన్నిసార్లు తెల్లవారు ఝాము నాలుగు గంటలవరకు కూడా మాటలు కొనసాగుతూనే ఉంటాయి. మేడపై వాలుగా వేయబడిన కొబ్బరాకుల పైకప్పు ఆ సభాస్థలం. అందులో పొడవుగా వేసివున్న బెంచీల మధ్యలో ఒక పొడవైన మేజాబల్ల. అక్కడక్కడ విరిగి, మచ్చలు పడిన పాత బల్లలే అన్నీ కూడా! మధ్యాహ్నం మూడు, మూడున్నర ప్రాంతంలో ఆయన వచ్చి కుడివైపు మూలలోనున్న తన కుర్చీపై కూర్చుంటారు. సాధారణంగా చొక్కా లేకుండా కేవలం ఒక లుంగీ కట్టుకొని, గాలికి ఎగిరే పొడవైన తెల్లని జుట్టుతో, నిద్రకళ్ళతో వచ్చి కూర్చుంటారు. కొన్నిసార్లు చన్నీళ్ళతో స్నానంచేసి, తలను శుభ్రంగా దువ్వుకొని, మడత నలగని జుబ్బా, పేంటు వేసుకుని కూడా రావడం కద్దు! ఎలా వచ్చినా అది ఆరోజు ఆయనున్న మనోస్థితినిబట్టే తప్ప అక్కడికి వచ్చేవారి స్థాయిని బట్టి కాదు.

వారి సభలో నిత్యమూ దొరికే గంజాయి దమ్ము కొరకు వచ్చి కూర్చొనే గుడిసెలవారి నుండి, ఆయన మాటల్లో అలవోకగా ఉట్టిపడే వ్యంగ్యాత్మక విమర్శలు, బూతులు, ఛలోక్తులు వినడానికి వచ్చే అభిమానుల వరకు అక్కడ ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారు. చాలాసార్లు ఆయనకోసం చిలుముగొట్టంతో బాటు, గంజాయికోసం వచ్చేవాళ్ళు కూడా కాచుకొని ఉంటారు. అరుదుగా ఒక్కోసారి ఆయనొక్కడే వచ్చి, ఏకాంతంగా కూర్చొని, తన మీసాలను సవరించుకుంటూ, లోతైన చూపులతో పైకప్పుకేసి చూస్తూ కూర్చొని ఉంటారు.

ఆ సభ మనుషులతో కిక్కిరిసి సమకాలీన సమస్యల గురించి తారాస్థాయిలో చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ఒక్కోసారి ఉన్న పళంగా ఆయన తన పూర్తి ఏకాంతంలోకి జారిపోతుంటారు. ఆయనకు సన్నిహితులైన వాళ్ళకు బాగా తెలుసు ఆయనెంత ఏకాంతమైన మనిషో! రోజుకు వేయిమంది వచ్చివెళ్ళే దేవాలయంలో గర్భగుడిలో చీకట్లో నిల్చుని ఉండే మూలవిరాట్ లాంటి ఏకాంతమది. అక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఆ ఏకాంతంతో ఆకర్షించబడ్డవాళ్ళే అయుంటారు. ఆయనకు దగ్గరి మిత్రుడు, పాఠకుడు అయిన కె. ఎస్. రావు ఒకసారి చెప్పినట్టు ‘ఆయన తన జీవితంలో ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడింది లేదు, రాసిందీ లేదు’.

ఆరోజు ఉదయం తన అలవాటుకు భిన్నంగా ఆయన తెల్లవారుఝామునే లేచి, నిద్రలో నడిచేవాడిలా వెళ్ళి మేడపైనున్న పాకలోకి వచ్చి తడుముకుంటూ గుండు బల్బ్ వేసుకుని తన కుర్చీలో కూర్చొన్నారు. కాసేపటికే తన ఆలోచనల్లో మునిగిపోయి, ముందురాత్రి ఒక ఆటో డ్రైవరు విడిచి వెళ్ళిన ఎర్రని తుండుగుడ్డను అభావంగా చూస్తూ కూర్చున్నారు. ఎప్పటికో తన ఉనికిని గుర్తించి, పెద్ద నిట్టూర్పుతో ఒళ్ళు కదిపి సర్దుకుని చుట్టూ చూసినపుడు రాత్రుళ్ళు వినబడే చిమ్మెటల సందడిని విన్నారు.

నగరంలో ఆయనుండే ఈ వీధి చుట్టూ గుడిసెలున్న ప్రాంతం! ఎక్కడినుంచో వినబడుతున్న ఒక పాపాయి ఏడుపు శబ్దం. అసహ్యంగా శబ్దం చేసుకుంటూ వెళ్ళిన ఆటో! చాలా దూరంలో మొరుగుతున్న కుక్కల శబ్దం! ఈ శబ్దాలన్నింటిని ఈలపురుగులు తమ ఝంకారంతో కలుపుకొంటూన్నాయి. ఇలాంటి నగరాల్లోకూడా రాత్రులను ఈ ఈలపురుగులు తమ అరుపులతో ఎలా నింపుతున్నాయో అని లోలోపలే ఆశ్చర్యపోయారు. అందరూ చిన్నప్పుడు రాత్రుల్ని చిమ్మెటల మోతగానే గుర్తిస్తారు. బయటంతటా నిండి ఉన్న చీకటిని, విశాల ఆకాశాన్ని, నక్షత్రాలను ఒక్కటిగా కూర్చే నిర్విరామ శబ్దమది!

వింటున్న ఈలపురుగుల శబ్దం యౌవనంలోని జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. అమ్మను, ఆమె మెత్తటి చర్మపు వెచ్చదనాన్ని, ముక్కవాసన వచ్చే చాప, దిండ్లను జ్ఞాపకం చేస్తూంది. ఇప్పుడు వెంటనే బయలుదేరి పోయి బస్సెక్కి, కడలూర్‌లో దిగి తన ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏముంటుంది అక్కడ? ఇప్పుడక్కడ తన బాల్యం, ఆనాడున్న మనుషులు, చెట్లు ఏవీ ఉండవు. ఆనాటి మట్టి కూడా ఉండదు. ఆ నేల మీద కాలం ఒక సినీమాలా, దృశ్యాలను పరుగెత్తించింది. కాని గడిచిపోయిన దృశ్యాలేవీ తిరిగిరావు!

‘ఏనాడు లేని ఈ జాగృతి, అర్థం లేని చంచలమైన ఆలోచనలు… ఈనాడెందుకు!?’ అని ఆలోచించారు. గొంతెండిపోయిందని గ్రహించి, లేచి మట్టి కూజాలోనుండి నీళ్ళను గాజుగ్లాసులోకి ఒంపుకొని తాగారు. గొంతులో నీళ్ళు చల్లగా దిగుతూ ఉంటే హాయిగా అనిపించింది. ఎందుకని? చిలుము గొట్టం ఆ మేజా పైననే పడి ఉంది… ఒకసారి పొగ తాగొచ్చు! కానీ ఇప్పుడు చిరాగ్గా ఉంది. పొగ తాగి ఆలస్యంగా నిద్రించిన ఏ రోజూ ఆయన తొందరగా మేలుకున్నది లేదు. ఇవాళేమైంది?

మెలకువ వచ్చినప్పుడు నిద్రలో కన్న కల జ్ఞాపకానికి వచ్చింది. కాని అది కల కాదు. ఒక జ్ఞాపకంలా సాగుతోంది. కలలో తనకు భయంకరమైన గుండెనెప్పి. అరుస్తున్నాడు, ఎవరికీ అది వినబడటంలేదు. అందరూ తన చుట్టూనే తిరుగుతున్నారు. కాని ఎవరికీ తన అరుపులు వినపడటంలేదు, తన వైపు చూడడం కూడా లేదు. వారికి సంబంధించినంత వరకు, ఆయన అదివరకే లేనివాడైపోయారు. మెలకువ రాగానే పెద్ద నిట్టూర్పుతో, వీధిదీపపు వెలుతురు పరుచుకుని ఉన్న పక్కింటి గుడిసె పైకప్పును కిటికీలోనుంచి చూస్తూ అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత నిద్ర పట్టలేదు.

చిరునవ్వుతో మీసాలను తడుముకున్నారు. నిన్న ఒక సీనియర్ కామ్రేడ్ మరణం గురించి చెప్పాడు కెఎస్, గుండెపోటట. పొలానికి వెళ్ళిన అతను ఆ పొలంగట్టు పైనే గుండె ఆగి చనిపోయి ఉన్నారనేది ఆ విషయం! నలబైయేళ్ళకు మునుపు కొన్ని సంవత్సరాలు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అంతే కాదు, ఆయనతో కలిసే మదురై, చిన్నమనూరు పరిసరప్రాంతాలలో తలదాచుకుని తిరిగారు కొన్నాళ్ళు. ఎక్కువగా చదువుకోకున్నా పార్టీ పట్ల, సిద్ధాంతాలపట్ల నిజమైన విశ్వాసంతో మెలిగిన కమ్యూనిస్టు ఆయన.

‘కమ్యూనిస్టులందరూ చచ్చిపోవలసిన సమయం ఎప్పుడో వచ్చేసిందయ్యా… అనవసరంగా ఎందుకిన్నాళ్ళు ఆలస్యం చేశాడు? శ్మశానం రారమ్మంటోంది, పార్టీ పోపొమ్మంటోంది…’ అని వేలాకోలమాడి నవ్వుతో ఆ దుఃఖాన్ని దాటుకుని వచ్చిన గొప్ప వ్యక్తి. కానీ లోపల గాలంముల్లు గుచ్చుకొంటూనే ఉంది. అంత భయమా? ఎవరి గురించి భయం? దేని గురించి భయం? తన మరణం గురించి! అన్ని ప్రాణులకూ తన మరణం అన్నది చాలా పెద్ద విచారం. అందరికంటే రచయితకు ఇంకా పెద్ద విచారం. మరణం గూర్చి భయంలేనివాడు ఉండీ లేనివాడితో సమానం. లేకుండా అయిపోయిన ఒకడు ఎలా ఉండగలడు? వాడిని చూసేవాళ్ళకు ఏమని అనిపిస్తుంది? ఇదేం ఆలోచన? నేనొక భౌతికవాదిని కదా? అని నవ్వుకుంటూ, ‘లేదు. నేను స్వార్థవాదిని’ అని గొణుక్కున్నారు.

క్రింద కారు హారన్ వినిపించింది. ఆ హారన్ సౌండ్ కొన్నిసార్లు విన్నాకే ఆ కారు తమ ఇంటిముందే ఆగి ఉందని అర్థమయింది. లేచి చూసినప్పుడు, తెల్ల బట్టలు వేసుకున్న ఒక మనిషి, ఆ పొడవాటి పెద్ద కారులోంచి దిగి, గేటు దగ్గర నిల్చుని ఉండటం, కారు హెడ్‌లైట్లు వెలుగుతుండటం కనిపించింది. తడబడుతూ మెట్లు దిగి ఇంటి ముందుకు వచ్చారు ఆయన. అంతలోనే ఆయన భార్య లేచి, లైటు వేసి, తలుపు తీసి, బయటి గేటుకున్న తాళం తీసి, గేటును తెరిచింది.

వచ్చినది యువరాజ్. గుండుతల మీద పది రోజుల నెరిసిన జుట్టు, గీసుకోని గడ్డం. గుండ్రటి నల్లటి ముఖం. తెల్లని జుబ్బా, పంచె. నలబై సంవత్సరాల క్రితం తేనీ అన్న ఊళ్ళో జరిగిన పార్టీ సభలలో తన సోదరులతో కలిసి పాడటానికి వచ్చిప్పుడు పరిచయమై, మనసును ఆకట్టుకున్న అదే అందమైన పసిపిల్లాడి కళ్ళు, బోసి నవ్వు. చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి.

“రావయ్యా! ఏమిటి, ఇంత పొద్దునే వచ్చావు…” అన్నారు.”ఆశ్చర్యంగా ఉందే!”

“ఇంత పొద్దున మీరు లేవడమే ఆశ్చర్యం, జె.కె” అని అంటూ యువరాజ్ లోపలికి వచ్చారు.

“ఏమో! మెలకువ వచ్ఛేసింది… లోపలికి రా…”

యువరాజ్ లోపలికి వచ్చి కూర్చున్నారు. యువరాజ్ రాకతో ఇల్లు కొంచెం సందడినందుకుంది. ఊరినుండి వచ్చిన ఆయన కూతురు, కొడుకు లేచివచ్చి నమస్కరించారు. యువరాజ్ వారి బాగోగులను అడిగి కనుక్కున్నారు. కాఫీ, టీ ఏదీ తాగనని అన్నారు.

“ఇప్పుడు వాడు ఆచార్యస్వామి వంటివాడు. పళ్ళు మాత్రమే ఇవ్వాలి. దానిలో ఒక పండును తీసి, ఆశీర్వదించి, మనకు ప్రసాదంలా విసురుతాడు. ఏఁవయ్యా?” అని అన్నారు కరుణాకర్. “వేకువఝామునే స్నానం చేశావు కదా. దాదాపుగా వేదాంతివి అయిపోయినట్టేనా…”

యువరాజ్, ఆ వేళాకోళాన్ని పట్టించుకోలేదు.

“బయలుదేరండి, జె.కె. మనమొక చోటికి వెళ్తున్నాం…”

“ఎక్కడికయ్యా?”

“పక్కనే! వెంటనే వెళ్ళొచ్చేయచ్చు.”

“ఇప్పుడేనా? నేను ముఖం కూడా కడుక్కోలేదు…”

“ముఖం కడుక్కొని, స్నానం చేసిరండి. నేను వెయిట్ చేస్తుంటాను.”

“స్నానం చేయడమా, మంచికథే! నేను మధ్యాహ్నాలే స్నానం చేస్తాను. ఇట్లే రమ్మంటే వస్తాను.”

“లేదు జె.కె. స్నానంచేసే వెళ్ళాలి. నాకోసం…”

“ఏమిటయ్యా! ఆశ్రమం గీశ్రమం కట్టడానికి ఏదైనా స్థలం చూసి వచ్చావా? కొంపదీసి సినిమా పాటలు చెయ్యడం మానేస్తున్నావా ఏంటి? విరహతాపంతో రగిలిపోయే కోట్లాది ప్రేమికుల్ని అనాథల్ని చెయ్యకయ్యా… మహా పాపం… వాళ్ళ ఉసురు పోసుకోవడం!”

“చెబుతాను. తయారై రండి జె.కె…” యువరాజ్ తన చేతిలోనున్న ప్లాస్టిక్ సంచిని ముందుకు చాపారు.

“ఏమయ్యా! ఆటలాడుతున్నావా?”

కరుణాకర్ ఆ సంచిని తెరిచారు. తెల్లని పంచె, జుబ్బా. “ఏ కాషాయం దుస్తులో తెచ్చేశావేమో అని భయపడ్డాను… మంచి కాలం.”

“తొందరగా వెళ్ళి రండి, జె.కె.”


కరుణాకర్ కారులో వెనుక సీట్‌లో కూర్చోగానే, పక్కనే యువరాజ్ కూర్చొన్నారు. కారు బయలుదేరింది.

“ఏం పాట పెట్టాలి, జె.కె.?” అడిగారు యువరాజ్.

“ఏదో ఒకటి పెట్టు. నేను పాటలు విని చాలా కాలమైంది.”

“హిందూస్తానీ పెడతాను” అని అంటూనే యువరాజ్ గుండేచా సోదరుల రికార్డును డ్రైవర్‌కు ఇచ్చారు. లోతైన కంఠస్వరాలు కారులో నిండాయి. అలలు అలలుగా వ్యాపిస్తున్న శుద్ధరాగాలాపన! కరుణాకర్ ఏదో అడుగుతారన్నట్లు యువరాజ్ ఆయనకేసి చూశారు. అయితే ఆయన దారి పక్కన కరుగుతున్న ఉదయపు నీలికాంతులను చూస్తూ ఉన్నారు. చేతులు మాత్రం మీసాలను దువ్వుతూ ఉన్నాయి. సంగీతం నిలిచినప్పుడు మాత్రం కరుణాకర్ ఉలిక్కిపడి ఒక నిట్టూర్పును విడిచారు. ఆయన మానసికస్థితికి సరిపోయే రికార్డులనే యువరాజ్ ఎంపిక చేసి వినిపిస్తున్నారు.

కారు, తిరువణ్ణామలై ఊరిలోకి ప్రవేశించేటప్పుడైనా కరుణాకర్ ఏదైనా అడుగుతారేమోనని యువరాజ్ ఎదురుచూశారు. కరుణాకర్ ఒళ్ళు విరుచుకుంటూ తిరువణ్ణామలై పర్వతాన్ని తదేకంగా చూస్తున్నారు. కారు రమణాశ్రమం వైపు వెళుతూ ఉంది. సిమెంట్ ద్వారాన్ని దాటగానే వారి కారును గుర్తుపట్టిన ఆశ్రమవాసులు చాలామంది ప్రవేశద్వారం వద్దకు వచ్చి తొంగిచూశారు. అప్పుడు అక్కడ యాత్రికులు ఎక్కువమంది లేరు. ఉన్నవాళ్ళలో కూడా ఎక్కువ శాతం ఉత్తరాదివాళ్ళు, వచ్చిన ఈ ఇద్దర్నీ గుర్తు పట్టలేదు.

కారు దిగి మీసాలను నిమురుతూ, చెట్ల కొమ్మల మీద వాలున్న నెమళ్ళను చూస్తున్న కరుణాకర్‌తో యువరాజ్, “ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా?” అనడిగారు.

“ఊఁ” అన్నారు కరుణాకర్.

“ఎప్పుడు?” కుతూహలంతో అడిగారు యువరాజ్.

వెనక్కి తిరుగకుండానే కరుణాకర్ “చాలా రోజుల క్రితం” అన్నారు.

ఆశ్రమ నిర్వాహకులొకరు గబగబా వచ్చి, “రండి, రాజా సార్. రండి…” అన్నారు. ఆ వ్యక్తికి కరుణాకర్ తెలియదు. ఆయనకు ఒక నమస్కారం పెట్టారు.

“ఈయన జె. కరుణాకర్. ప్రఖ్యాత రచయిత” అని పరిచయం చేశారు యువరాజ్.

ఆ ఆశ్రమ నిర్వాహకుడికి రచయిత అన్నది సరిగ్గా అర్థమైనట్టులేదు. “అలాగా! రండి.”

యువరాజ్ బాగా ఉత్సాహంగా ఉన్నారు. చేతిలో ఉన్న పూజాసామగ్రిని తరచూ చేతులు మార్చుకొంటున్నారు. ఆశ్రమవాసులు ఆయన చుట్టూ చేరి చూపుతున్న ప్రేమని, వినయాన్నీ అనాసక్తంగా దాటేస్తూ మెట్లెక్కి లోపలికి వెళ్ళారు. కరుణాకర్ మీసాలను నిమురుకుంటూ, లోతైన మౌనంతో ముందుకు నడిచారు. ఆయన ఏదైనా చెబుతారని, ఎదురుచూస్తూ ఆయన్ని ఓరకంటితో చూశారు యువరాజ్.

ఇద్దరూ మౌనంగా రమణమహర్షి గది లోపలికి వెళ్ళారు. పొద్దుటి చల్లదనం ఆ గదిలో కొద్దిగా ఇంకా మిగిలే ఉంది. ఫోటోలో రమణమహర్షి కౌపీనంతో, చేతిలో పెద్ద దండం పట్టుకుని, పులి తోలుపై కూర్చుని ఉన్నారు.

“కూర్చుందామా?” అన్నారు యువరాజ్.

కరుణాకర్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. యువరాజ్ కొంచెం జరిగి నేలపై కూర్చున్నారు. హాల్లో ఉన్న కొందరు లేచి పక్కకు జరిగి కూర్చున్నారు. మరికొందరు తలుపు దగ్గర నిల్చుని వేడుక చూస్తున్నారు.

యువరాజ్ రమణమహర్షి చిత్రపటాన్ని నిశితంగా చూస్తూ ఉన్నారు. ఆయన తల కొంచెం కదలడం మొదలైంది. తలవంచి చేతులను పుస్తకంలా తెరచి చూశారు. మళ్ళీ తల పైకెత్తి పెదవులను బిగించి, రమణుని చూశారు. ఒకసారి గొంతును సవరించుకున్నారు. ఆ గొంతు సవరింపు శబ్దానికి కరుణాకర్ ఉలిక్కిపడి ఆయన్ని చూసి, చిరునవ్వుతో మీసాలను మెలివేశారు.

యువరాజ్ మెల్లగా రాగాన్ని సరిచూసుకొన్నారు. శుద్ధ దన్యాసి. ‘హిమగిరి తనయే హేమలతే’ అని కంఠస్వరాన్ని పెంచి పాడారు. జానపద గీతాలకు నప్పే, కొంత శ్రుతి తప్పినట్టుండే, వశీకరణ శక్తి కలగలిసిన కంఠస్వరం… వినసొంపుగా ఉంది. తరువాత, ‘అఖిలాండేశ్వరి’, ఆపైన ‘శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి’… పాడగా పాడగా ఆయన కంఠస్వరం ఖణేలుమంటూ వినిపించసాగింది. ప్రారంభంలో తొడపై గట్టిగా తాళమేస్తూ పాడిన ఆయన, క్రమంగా వేలితో తాకుతూ మెల్లగా తాళం వేయసాగారు. ‘జననీ జననీ’ పాడినపుడు, గొంతు గాద్గదికమైంది. పాడలేక ఊపిరి తీసుకొన్నారు. జలజలమంటూ కన్నీరు కారుతుండగా భుజాలు కదిలేట్లుగా ఏడవటం మొదలుపెట్టారు.

యువరాజ్ ఏడవటాన్ని అభావంగా చూస్తూ కరుణాకర్ కూర్చున్నారు. గడపలో ఉన్న మనుషుల ముఖాల్లో ఆశ్చర్యం, నవ్వు ముప్పిరిగొనగా వేడుక చూస్తూ ఉన్నారు. ఒక వృద్ధ విదేశీ స్త్రీ, నడుముపై చేతులు పెట్టుకొని, ముఖంలో ముడుతలు కదులుతూ చూస్తూ ఉంది. యువరాజ్ ఏడుపు మరింతగా బలంగా వినిపించసాగింది. ఒక స్థాయిలో ఎక్కిళ్ళు పెడుతూ, అలానే నేలపై పడుకున్నారు. కొంతసేపటికి ఆ ఎక్కిళ్ళు మెల్లగా అణగి, ఒట్టి నేలపై పసిబిడ్డలా పడి ఉన్నారు.

ఆశ్రమానికి చెందిన ఒక పెద్దాయన వచ్చి యువరాజ్ భుజాలను తాకి, “రాజా సార్” అని పిలిచారు. యువరాజ్ మేల్కొని లేచి, ఏమీ అర్థం కానివాడిలా ఆయన్ను, రమణుల చిత్రపటాన్ని చూశారు. దీర్ఘ నిశ్వాసంతో తన కళ్ళను, చెంపలను తుడుచుకొంటూ, పైకి లేచి తన జుబ్బాను కిందకు లాగి సర్దుకున్నారు. ఆయన ముఖం తేటపడింది. రమణులను చూసినప్పుడు ఆయన ముఖంలో సన్నని చిరునవ్వు మొలకెత్తింది.

“రండి” అన్నారు ఆ పెద్దాయన చిరునవ్వుతో! “ఇదే చోట కూర్చుని పాల్ బ్రంటన్ రోదించారు. జూలియన్ హక్స్‌లీ రోదించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఎందరో, ఇక్కడికి వచ్చి ఈ విధంగానే కన్నీరు కార్చారు…”

హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన యువరాజ్, “జె.కె. సార్ ఎక్కడ?” అన్నారు.

పెద్దాయన తిరిగి చూసి, “ఇదో ఉన్నారే” అన్నాడు.

కరుణాకర్ తన చూపులను రమణులమీద నిలిపి కూర్చొని వున్నారు. రమణులను ఆయన తదేకంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది.

“జె.కె.!”

కరుణాకర్ తెప్పరిల్లారు. గబగబా లేస్తూ “ముగించావా?” అన్నారు. “వెళ్దామా? ఆకలేస్తోంది!”

“వెళ్దాం.”

ఇద్దరూ సెలవు తీసుకొని, మెట్లుదిగి, కారువైపుకు నడిచారు. మళ్ళీ నెమళ్ళను, చెట్లను చూస్తూ, మీసాలను మెలితిప్పుతూ నడిచారు కరుణాకర్.

కారు రోడ్డుపైకి రాగానే, రోడ్డుమీద నడుస్తున్న మనుష్యులను చూస్తూ, “ఒకప్పుడు ఈ ఊరిలో కుష్టురోగులు అధిక సంఖ్యలో ఉండేవారు” అన్నారు కరుణాకర్. యువరాజ్ ఏమీ మాట్లాడలేదు. ఆయన వెనక్కు తిరిగి దూరమౌతూన్న రమణాశ్రమాన్ని, ఆ ఆశ్రమాన్ని తనలో పొదువుకుని ఉన్న కొండని చూస్తూ ఉన్నారు. కారు నగరం మధ్యకు రాగానే, డ్రైవరును పంపి పళ్ళు తెప్పించి, కారులో కూర్చునే తిన్నారు. కరుణాకర్ కొంత అసహనానికి లోనై ఉండటాన్ని గమనించిన యువరాజ్, కారు బయలుదేరగానే పాటలు పెట్టబోయారు.

“వద్దు” అన్నారు కరుణాకర్.

తిరువణ్ణామలై ఊరిని దాటగానే పెద్ద నిట్టూర్పును విడుస్తూ కరుణాకర్, కాస్త వెనక్కి వాలి సర్దుకుని కూర్చొన్నారు. ఎగతాళి చేస్తున్నట్లు నవ్వుతూ, “ఏమిటయ్యా! అంత బాధ? అంతలా ఏడ్చావు?” అన్నారు.

“తెలియదన్నా… ఏడవాలని అనిపించింది అంతే…”

“అదృష్టవంతుడివి నీవు!” అన్నారు కరుణాకర్. “అలా ఏడ్వడం నాకు వీలు కాదు.”

వణుకుతూ ఆ మాటలను పలికిన ఆ గొంతు యువరాజ్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆతురతతో ఆయనవైపు తిరిగి, “ఎందుకు జె.కె?” అన్నారు.

కరుణాకర్ కళ్ళు గాలి తగిలిన నిప్పుకణికల్లా వెలిగి చల్లబడ్డాయి. “కపటత్వమే కరిగి ఏడ్చును” అన్నారు.

యువరాజ్ ముఖచ్ఛాయలు మారాయి. లోగొంతుకతో “ఏంటలా అనేశారు?” అన్నారు.

“ఎందుకంటే, అది అంతే.”

“నా దగ్గర ఏం కపటత్వాన్ని చూశారన్నా? చెప్పండి” అన్నారు.

“ఏదో చెప్పాను. వదిలేయ్.”

“లేదన్నా! మొదటినుంచి నేనేంటో తెలిసినవాళ్ళు మీరు. చెప్పండి. ఏ అర్థంలో ఆ మాటన్నారు?”

“ఏదో చెప్పేశానయ్యా! అదే పట్టుకుని ప్రాణాలు తీయకు!”

కరుణాకర్ వెనక్కి వాలి కూర్చొని, మీసాలను గట్టిగా మెలిబెట్టసాగారు. మెల్లగా నీళ్ళు నిండిన కళ్ళతో యువరాజ్ ఆయన్నే చూస్తూ కూర్చుని ఉన్నారు. కారు హైవేలో సాఫీగా సాగుతూ ఉంది. కొంతసేపైన తర్వాత కరుణాకర్ తిరిగి చూసినప్పుడు, యువరాజు గడ్డం మీద జారుతున్న కన్నీటిని గమనించారు. అర్థంకాక అట్టే చూశారు. మళ్ళీ తిరిగి కూర్చున్నారు. ఒక మలుపులో కరుణాకర్ తిరిగి చూసి, “కొబ్బరి బోండాలు తాగుదామా?” అన్నారు. కారు ఆగింది.

కరుణాకర్ తలుపు తీసుకుని దిగుతూ “రావయ్యా!” అన్నారు.

“లేదు. మీరు తాగిరండి.”

“ఏమయిందయ్యా నీకు?”

యువరాజు తలవంచుకొని కూర్చున్నారు.

కరుణాకర్ కొబ్బరి బోండాం తాగి వచ్చాక కారు బయలుదేరింది.

యువరాజు పెదవులు ముడుచుకుని ఉన్నాయి.

“జె.కె.”

కరుణాకర్ తిరిగి చూశారు.

“నామీద ఏ కొంచెమైనా ప్రేమ ఉంటే చెప్పండి. నాలో ఏం కపటాన్ని చూశారు?”

కరుణాకర్ మాట్లాడక మౌనంగా ఉన్నారు.

“కపటమంటూ ఉంటే, అది సంగీతంపై నేను పెంచుకొన్న మక్కువలోనే ఉండాలి. ఎందుకంటే సంగీతమే నేను. మిగిలినవన్నీ నాకు పైపైనుండే మెరుగు పూతలే. చెప్పండి. ఎందుకలా అన్నారు?”

“ఏయ్! వదలవయ్యా! కెలుక్కుంటున్నావు!”

“ఎంతో దూరాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అన్నిటినీ ఇక్కడనుంచే మొదలుపెట్టాలి. ఆదిలోనే తప్పు ఉందంటే… నాకు తెలిసి తీరాలి!”

“ఏఁవయ్యా! అది సుబ్రమణ్య భారతి పాట. ఊరికే సహవాస దోషంవల్ల అలా నోటికి వచ్చేసింది. ఎవరిని ఉద్దేశించింది కాదు.”

“నిజంగానా?”

“నిజంగానేనయ్యా! సత్యమే చెప్తున్నా. సరేనా?”

యువరాజ్ ముఖం కొంత తేటపడింది. కాసేపటి తర్వాత, తన ముందున్న కారు సీటు మీద చేతి వేళ్ళతో తాళం వేయడాన్ని కరుణాకర్ తదేకంగా చూస్తూ ఉన్నారు. చెన్నై పొలిమేరలను చేరేంతవరకు మాటలేవీ నడవలేదు.

హఠాత్తుగా కరుణాకర్, “పొద్దున గుండెనెప్పి వచ్చినట్లు ఒక కల వచ్చిందయ్యా” అన్నారు.

యువరాజ్ కంగారుపడి, “కలా? నిజంగానే నెప్పి ఏదైనా వచ్చిందేమో జె.కె. దేనికైనా మంచిది మనం నేరుగా ఇటేవెళ్ళి మన శౌరిరాజన్‌ను చూద్దాం…”

“ఊర్కోవయ్యా. అది కల మాత్రమే…”

“లేదు. అలా వదిలేయకూడదు. వేకువఝామున వచ్చిందంటే…”

“అరె. ఊర్కోవయ్యా!” అన్నారు కరుణాకర్. “అందుకే ఇవాళ అంత పెందరాళే మేలుకున్నాను. ఇప్పుడు బాగా నిద్ర వస్తోంది.”

“ఇంటికెళ్ళగానే గోష్ఠిలో పడిపోకుండా పోయి నిద్రపొండి.”

“చూద్దాం.”

“కాదన్నా! ఎందుకు చెబుతున్నానంటే…”

“నలబై ఏళ్ళుగా మాట్లాడి, రాసి, విని లెక్కలేనన్ని మాటలు బుర్రలో నిండిపోయి ఉన్నాయి. పొగ వేస్తే దోమలు పారిపోయేటట్లు, ఒక్కోటీ ఎగిరిపోతాయి. ఆ తరువాత కొంతసేపు ప్రశాంతత…” కరుణాకర్ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నారు. “మాటలు నింపుకున్నవాడు అంత సులువుగా ఏడవలేడు!”

కారు నగరంలోకి చేరుకుంది. ఎండకు మెరుస్తున్న కిటికీలతో, పైన రాయబడిన బోర్డులతో కట్టడాలు దూరమవుతున్నాయి. చుట్టూ శబ్దాలు చేస్తు సాగుతున్న కార్లు. బరువుకు ఒక వైపుకు ఒరిగి వెళ్తున్న బస్సులు. పొడవైన నీడలు పరుచుకున్న సందులలో విప్పదీసిన పాత చక్రాలు, ఇనుప కుప్పలు, డీజిలు మరకలు… అలసి, సోలిపోయి చెమటలు కారుతున్న మనుషులు…

‘ఆ ఈలపురుగులు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? ఎక్కడున్నాయి అవి? రాత్రి కోసం చూస్తూ ఉన్నాయా? ఈ మొత్తం పగలు వాటికి ఒక ఝంకారమేమో…’ కరుణాకర్ తలవిదిలించి ఆ ఆలోచనలను వదిలించుకోడానికి ప్రయత్నించారు.

ఇంటిముందు కారు ఆగగానే, “మళ్ళీ కలుద్దామయ్యా” అంటూ “పరాగ్గా కిందకు దిగకు. వీధి వీధంతా ఒక్కటై చుట్టుముట్టేస్తారు” అంటూ కరుణాకర్ కారు దిగారు.

యువరాజ్ కొంత ఇబ్బందిగా చిరునవ్వు నవ్వారు.

హఠాత్తుగా కరుణాకర్ బిగ్గరగా నవ్వుతూ “ఒట్టి అమాయకుడివయ్యా నువ్వు. ఒకడు తనకు ఏడవటం చేతకావట్లేదు అన్నప్పుడు, ఎందుకని అడగొచ్చా?” అంటూ తలుపును మూసేముందు, “ఒకవేళ అలా అడగ్గలిగేవాడిగా నువ్వు ఉన్నందువల్లనే నీకు ఏడవడం చేతనవుతుందో ఏమో!” అన్నారు.

ఆయన మెడమీదకు జారి ఎగురుతున్న జుట్టుతో రొమ్ము విరుచుకుంటూ, పైకెత్తిన తలతో, గర్వంగా నడుచుకుంటూ తన ఇంటి మెట్లెక్కడం యువరాజ్ చూశారు. డ్రైవర్ భుజం మీద చేయి వేసి బయలుదేరమని సైగ చేశారు.

(మూలం: ఇరు కలైజ్ఞర్గళ్, జనవరి 27, 2006)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...