బంకు బాబు మిత్రుడు…

బంకు బాబు అంత చిరాకుపడడం ఇంతవరకు ఎవరూ ఎరుగరు. అతనికి నిజంగా ఎప్పుడైనా కోపం వస్తే, ఏమిటి అంటాడో, ఏమిటి చేస్తాడో ఊహించడం కష్టం.

అలాగని అతనికి కోపం తెప్పించే సందర్భాలు ఎప్పుడూ రాలేదని కాదు. గత ఇరవై రెండు సంవత్సరాలుగా బంకు బాబు కాఁకుర్‌గాఛి ప్రాథమిక పాఠశాలలో బెంగాలీ, జాగ్రఫీ బోధిస్తున్నాడు. ప్రతి ఏడూ పాత విద్యార్థులు పోయి కొత్త విద్యార్థులు వచ్చి చేరుతూనే ఉన్నారు. కానీ, విద్యార్థులు అతన్ని ఏడిపించే సంప్రదాయం మాత్రం మారలేదు. కొందరు నల్లబల్ల మీద అతని బొమ్మ గీసేవారు; కొందరు అతను కూర్చొనే కుర్చీకి జిగురు రాసేవారు; లేదా కాళీపూజ రోజు రాత్రి తారాజువ్వ వెలిగించి, నేలమీద బారుగా అతన్ని వెంటపడి తరిమేలా విడిచిపెట్టేవారు.

అయినా బంకు బాబు వీటి వేటికీ చిరాకు ప్రదర్శించేవాడు కాదు. ఎప్పుడైనా కోపం వస్తే, గొంతు సవరించుకుని, ‘వెధవల్లారా! ఇలాంటి పని చెయ్యడానికి సిగ్గుండాలిరా’ అనేవాడు. అంతే! అంత ప్రశాంతంగా ఉండడానికి ముఖ్య కారణం అతను అతని కోపాన్ని ప్రదర్శించలేకపోవడమే. అతనికి కోపం వచ్చి, ఆవేశంలో ఉద్యోగానికి రాజీనామా ఇస్తే, ఈ వయసులో మరో ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో అతనికి తెలుసు. మరొక ముఖ్యకారణం కూడా ఉంది. ప్రతి తరగతిలోనూ అంతమంది అల్లరి పిల్లల మధ్యలోనూ నలుగురైదుగురు మంచి పిల్లలు తప్పకుండా ఉండేవారు. ఆ కొద్దిమంది పిల్లలకి పాఠం చెప్పడంలోనే అతనికి ఎంతో సంతృప్తి కలిగేది. ముఖ్యంగా బంకు బాబు ఉపాధ్యాయుడిగా అతని జీవితం ధన్యమైనట్టు భావించేవాడు. అప్పుడప్పుడు, ఆ నలుగురు పిల్లలనీ తన ఇంటికి పిలిచి, తినడానికి ఏదో ఇచ్చి, దేశ దేశాల కథలు, ఉత్కంఠగొలిపే సాహస చరిత్రలూ చెబుతూ ఉండేవాడు. ఆఫ్రికాలో జీవన విధానం గురించి, ఉత్తర ధృవం కనుగొనడం గురించి, బ్రెజిల్‌లో మనిషి మాంసం తినే చేపల గురించి, సముద్రం అడుగున మునిగి ఉన్న అట్లాంటిస్ గురించీ చెప్పేవాడు. అతను ఉత్సుకత సడలకుండా కథలు చెప్పడంలో నేర్పరి; శ్రోతలు మంత్రముగ్ధులై వినేవారు.

వారాంతాలలో సాయంత్రం పూట, లాయరు శ్రీపతి మజుందార్ ఇంటికి ఇతరులతో పాటు అతను కూడా క్రమం తప్పకుండా హాజరయేవాడు. కానీ, ‘చాలు! ఇంకెప్పుడూ ఇక్కడికి రాకూడదు’ అని నిశ్చయించుకుని ఇంటికి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అనుకోడానికి, బడిలో పిల్లలు చేసిన అల్లరి సైతం భరించగలిగిన అతనికి, నడి వయస్సులో ఉన్న ఆ పెద్దలు, తనని వేళాకోళం చేసి మాటాడుతున్నప్పుడు భరించశక్యం కాకపోవడమే కారణం. సాయంకాలాలు శ్రీపతి బాబు ఏర్పాటు చేసే ఈ సమావేశాల్లో, మినహాయింపులు లేకుండా ప్రతివాళ్ళూ అతన్ని వేళాకోళం చేసి మాటాడుతూ, అతని సహనం నశించే స్థితికి తీసుకువచ్చేవారు.

మొన్నటికి మొన్న, రెండు నెలలైనా తిరగలేదు, వాళ్ళు దయ్యాల గురించి మాటలాడుకున్నారు. సాధారణంగా సమావేశాల్లో బంకు బాబు నోరు విప్పేవాడు కాదు. ఆ రోజు ఏమయిందోగాని, నోరు తెరిచి ‘నాకు దయ్యాలంటే భయం లేదు’ అన్నాడు. అంతే! అది చాలు, తక్కిన వాళ్ళకి బంగారం లాంటి అవకాశం దొరికింది. రాత్రి అతను ఇంటికి తిరిగి వెళుతుంటే అతని మీద ఒక దయ్యం దాడి చేసింది. చింతచెట్టు ప్రక్కనుండి నడిచి వెళుతుంటే, పొడవుగా, సన్నగా ఉన్న దయ్యం ఒకటి అతని మీద అమాంతం దూకి వీపుమీద ఎక్కి కూచుంది. అంతే కాదు, ఈ దయ్యం అతని ఒంటినిండా, బట్టల నిండా నల్లని సిరా పులిమింది. బహుశా సాయంత్రం సమావేశంలో దానికి ఎవరో సలహా ఇచ్చి ఉంటారు.

బంకు బాబు భయపడలేదు. కానీ పాపం అతనికి గాయాలయ్యాయి. మూడు రోజులపాటు, అతని మెడ నొప్పి వదలలేదు. అన్నింటికన్నా కనిష్టంగా, అతని కొత్త కుర్తా చిరిగిపోయి, దాని నిండా సిరా మరకలు అయిపోయాయి. అదేమి హాస్యం?

తరచుగా అంతకంటే చిన్న చిన్న ‘హాస్యాలు’ అతని మీద వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు. ఒక్కోసారి అతని గొడుగునో, జోళ్ళనో ఎక్కడో దాచేవారు; మరోసారి, అతని కిళ్ళీలో మసాలా దినుసులకి బదులు మట్టి పోసి, నోటికి అందించేవారు; లేదా బలవంతంగా అతనిచేత పాటలు పాడించేవారు.

అలా అయినప్పటికీ, బంకు బాబు ఈ సమావేశాలకు వస్తూనే ఉండేవాడు. రాకపోతే ఏమైనా బాగుంటుందా? శ్రీపతి బాబు ఏమనుకుంటాడు? అతను ఆ గ్రామంలో పేరున్న వ్యక్తే కాదు, అతనికి బంకు బాబు లేకుండా రోజు గడవదు. శ్రీపతి బాబు ఆలోచన ప్రకారం, అందరికీ వినోదం కలిగించాలంటే ఆటపట్టించడానికి ఒక మనిషి ఉండాలి. లేకపోతే సమావేశం ఏర్పాటు చెయ్యడం ఎందుకు? అందుకని బంకు బాబు రాకుండా ఉండడానికి ప్రయత్నించినా, ఏదో విధంగా సమావేశాలకి తీసుకువచ్చేవారు.


ఒక రోజు, అవీ ఇవీ మాటాడుతూ మాటాడుతూ, విషయం ఆకాశంలో ఎగరడం గురించి మళ్ళింది. అంటే, వాళ్ళు ఉపగ్రహాల గురించి మాటలాడుకున్నారు. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఉత్తర దిక్కున మెల్లగా నడుస్తున్న కాంతి బిందువు ఒకటి కనిపించింది. అప్పటికి మూడు నెలలు ముందు కూడా అలాంటిదే కనిపిస్తే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. చివరకు అది రష్యను ఉపగ్రహం ఖోట్కా – కాదు, ఫోష్కానా – అని తేల్చారు. ఏదయితేనేం, అది భూమికి 400 మైళ్ళ ఎత్తున శాస్త్రజ్ఞులకి చాలా విలువైన సమాచారాన్ని అందిస్తూ తిరుగుతోందని తేలింది.

నిజానికి ఆ రోజు సాయంత్రం, ఆకాశంలో కనిపించిన ఆ వెలుగుని ముందుగా చూసి పసిగట్టింది బంకు బాబు. నిధు బాబుని పిలిచి దాన్ని అతనికి చూపించాడు. తీరా, సమావేశానికి బంకు బాబు చేరుకునే సరికి దాన్ని నిధు బాబే ముందుగా చూచినట్టు ప్రచారం చేసుకుని చాలా గర్వంగా మాటాడటం ప్రారంభించాడు. బంకు బాబు ఏమీ అనలేదు.

అందులో ఎవరికీ ఉపగ్రహాల గురించి తెలీదు. అంతమాత్రం చేత దాని మీద తమ అభిప్రాయాలు ప్రకటించడానికి ఎవరూ వెనుకాడలేదు.

“ఏమైనా చెప్పండి, ఉపగ్రహాల గురించి విచారిస్తూ మనం సమయం వృధా చేసుకోకూడదంటాను. ఎవరికో ఒకరికి ఆకాశంలో ఏదో మూల ఏదో చిన్న కాంతి బిందువు కదులుతూ కనిపిస్తుంది. ఇక చూసుకోండి. పత్రికలవాళ్ళకి ఎక్కడలేని ఆవేశం వస్తుంది. దాని గురించి, అది ఎంత గొప్ప విషయమో చెబుతూ వ్యాసం వస్తుంది. దాన్ని చదివి మనం ఇళ్ళల్లో హాయిగా భోజనాలు చేసి, కిళ్ళీ నములుకుంటూ మనమేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు సంబరపడిపోతుంటాం. ఇదంతా వట్టి హంబగ్!” అన్నాడు చాంది బాబు.

రామ్‌కనాయ్ దానిని వ్యతిరేకించాడు. అతనింకా కుర్రవాడు. “మీరూ నేనూ అందులో భాగం కాకపోవచ్చు గానీ అది ఖచ్చితంగా మనిషి సాధించిన విజయం. ఆ మాటకొస్తే, ఘన విజయం” అన్నాడు.

“గొప్పగా చెప్పావులే. అది మనిషి సాధించిన విజయమే… మనిషి కాకపోతే ఉపగ్రహాలు ఎవడు తయారుచేస్తాడు? ఒక కోతిమూక ఉపగ్రహాలని తయారుచేస్తుందని ఎవరైనా ఊహిస్తారేమిటి?”

“సరే! సరే!” అంటు నిధు బాబు కలగజేసుకుని,”కాసేపు ఉపగ్రహాల గురించి పక్కన బెడదాం. ఎందుకంటే అదొక యంత్రం లాంటిది. భూమి చుట్టూ తిరగడమే దాని పని అంటారు. దానికీ బొంగరానికీ పెద్ద తేడా ఉండదు. తాడు బిగించి గట్టిగా లాగి విడిచిపెడితే, అది అలా తిరుగుతూనే ఉంటుంది, స్విచ్ వెయ్యగానే తిరగడం ప్రారంభించిన ఫ్యానులా. ఉపగ్రహం కూడా అంతే. కానీ, రాకెట్టు మాట ఏమిటి? దాన్ని అంత తేలికగా తీసిపారెయ్యలేం కదా?”

చాంది బాబు చీదరించుకున్నట్టు ముక్కు చిట్లించి, “రాకెట్టా? అయితే ఏమిటిట? దానివల్ల ఏమిటి ఉపయోగం? మాట వరసకి మనదేశంలోనే ఒక రాకెట్టు తయారుచేశారనుకుందాం. దాన్ని కలకత్తా మైదానంలో ప్రదర్శనకి పెడితే మనమందరం టిక్కెట్లు కొనుక్కుని మరీ చూసి వస్తాం. అంతవరకు బాగుంటుంది. కానీ…” అని ఏదో చెప్పబోతుండగా రామ్‌కనాయ్ కలుగజేసుకుని, “నువ్వు అన్న మాట నిజం. మన దేశంలో రాకెట్టు వల్ల ఉపయోగం ఏమీ లేదు” అన్నాడు.

భైరవ చక్రవర్తి “మాట వరసకి వేరే గ్రహం నుండి ఏదో జీవి భూమి మీదకి వస్తే?” అని ప్రశ్నించాడు.

“అయితే ఏంటిట? ఒకవేళ నిజంగా వచ్చినా, నువ్వూ నేనూ దాన్ని చూడలేము.”

“అవును. ఆ మాట నిజం.”

అందరూ తమ దృష్టి అప్పుడే వచ్చిన వేడి టీ కప్పుల మీదకి మళ్ళించారు. ఇక వాళ్ళకి ఆ విషయం గురించి మాటాడటానికి ఏమీ లేనట్టు కనిపించారు. కొన్ని నిముషాల నిశ్శబ్దం తర్వాత, బంకు బాబు గొంతు సవరించుకుని, నెమ్మదిగా ఇలా అన్నాడు, “మాటవరసకి నిజంగానే మరొక గ్రహం నుండి ఎవరైనా ఇక్కడకు వస్తే?”

ఆ ప్రశ్నకి నిధు బాబు ఆశ్చర్యపడ్డట్టు నటించాడు. “వినండి, వినండి. బంకం ఏదో చెబుతున్నాడు. ఐతే బంకం, ఇంతకీ ఏమంటావ్? ఎవరొస్తున్నారు ఇక్కడికి? ఎక్కడి నుండి?” అన్నాడు, వేళాకోళంగా.

బంకు బాబు అతనన్న మాటలని మళ్ళీ చెప్పాడు. ఎప్పటిలాగా ప్రశాంతమైన గొంతుతో, “మాటవరసకి వేరే గ్రహం నుండి ఇక్కడికి ఎవరైనా వస్తే?”

అలవాటు ప్రకారం బంకు బాబు వీపు మీద గట్టిగా, మోటుగా ఒక చరుపు చరిచి, భైరవ చక్రవర్తి వెకిలినవ్వు నవ్వుతూ, “ప్రశ్న అంటే అదీ! మరో గ్రహం నుండి వచ్చిన ఆ జీవి ఎక్కడ దిగుతుంది? మాస్కో కాదు, లండన్ కాదు, న్యూయార్క్ కాదు, కలకత్తా కూడా కాదు. ఇక్కడ? ఏది, కాఁకుర్‌గాఛిలో? నీ ఆలోచనలు గొప్పగా ఉంటాయ్. కదూ?” అన్నాడు.

బంకు బాబు సమాధానం చెప్పలేదు. కాని అతని తలలో లెక్కలేనన్ని ప్రశ్నలు తలెత్తాయి. అది అంత అసంభవమా? ఒక వేళ గ్రహాంతర వాసి ఎవరైనా రావడం అంటూ సంభవిస్తే, ఆ జీవి ఎక్కడ ముందు దిగాలి అన్నది అంత ముఖ్యమైన విషయమా? పోనీ కాఁకుర్‌గాఛి లాంటి చోట దిగడం అసంభవమే అనుకుందాం, కానీ అలాంటిది జరగదని నిర్ధారించవలసినది ఎవరు?”

శ్రీపతి బాబు ఇంతవరకు ఒక్క మాట మాటాడలేదు. అతను కూచున్న చోట అటునుండి ఇటు సర్దుకుంటుంటే అందరూ అతని వంక చూశారు. చేతిలోని కప్పు క్రింద పెట్టి, బాగా తెలిసినవాడిలా ఇలా అన్నాడు. “చూడు, మరో గ్రహం నుండి జీవి ఎవరైనా భూమికి రావడం అంటూ జరిగితే, ఇలాంటి దిక్కుమాలిన చోట మాత్రం జరగదని ఘంటాపథంగా చెప్పగలను. అలా వచ్చేవాళ్ళేమీ తెలివితక్కువవాళ్ళు కారు. వాళ్ళు ఖచ్చితంగా దొరలై ఉంటారని నా నమ్మకం. కనుక వాళ్ళు దిగితే తప్పకుండా ఏ పశ్చిమ దేశంలోనో, వాళ్ళ దొరలు అందరూ ఉండే చోట దిగుతారు. అర్థమయిందా?”

బంకు బాబు మినహా అందరూ దానికి అంగీకారంగా తలూపారు.

చాంది బాబు వెటకారంతో మరి కొంచెం ముందుకు వెళ్ళాడు. మౌనంగా కూర్చున్న బంకు బాబుని చూడు అన్నట్టుగా సంజ్ఞ చేస్తూ నిధు బాబుని మోచేతితో నెమ్మదిగా పొడిచి, ఏమీ ఎరగనట్టు, “నా మట్టుకి నాకు, బంకు బాబు చెప్పినది సబబుగా కనిపిస్తోంది. గ్రహాంతరవాసులు రావడం అంటూ జరిగితే, బంకు బీహారీ లాంటి వ్యక్తి ఉన్న చోటుకు ముందుగా రావాలని కోరుకోవడంలో వింతేముంది? ఇక్కడినుంచి ఒక ‘నమూనా’ సేకరిద్దామనుకుంటే, అతన్ని మించిన నమూనా వాళ్ళకి ఇంకెక్కడ దొరుకుతుంది?”

“దొరకమన్నా దొరకదు” అంటు నిధు బాబు జత కలిపాడు. “మెదడు సంగతి సరే, అతని చూపులు చూడండి! నా దృష్టిలో బంకం ఒక అపురూపమైన నమూనా!”

“నిజం! మ్యూజియంలో ఉంచదగ్గ నమూనా. లేదా ఒక జూలో నైనా ఉంచొచ్చు” అన్నాడు రామ్‌కనాయ్ గొంతు కలుపుతూ.

బంకు బాబు మాటాడలేదు, కానీ మనసులోనే అనుకున్నాడు. నమూనా కోసమే వాళ్ళు వెతికితే, వీళ్ళందరూ ఏమి తక్కువ తీసిపోయారు? శ్రీపతి బాబు గడ్డం చూడు, అది అచ్చం ఒంటె గడ్డంలా ఉంటుంది. భైరవ చక్రవర్తి కళ్ళు చూడబోతే, తాబేలు కళ్ళలా ఉంటాయి. నిధు బాబు చుంచులా ఉంటాడు. రామ్‌కనాయ్ మేకలా ఉంటాడు. చాంది బాబు సరే సరి, గబ్బిలంలా ఉంటాడు. ఒక జూ నింపడానికి సరిపడా ఉంటారు…

అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బంకు బాబు కనీసం ఒకసారైనా హాయిగా ఆనందంగా గడపవచ్చని వచ్చాడు. కానీ అలా జరగదని స్పష్టం అయిపోయింది. ఇక అక్కడ ఎక్కువసేపు ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకుని, లేచి నిలుచున్నాడు.

“ఏమయింది? అప్పుడే వెళుతున్నారా?” అని శ్రీపతి బాబు ఆందోళనగా అడిగాడు.

“అవును. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది,” అన్నాడు.

“ఆలస్యం? ఉత్త మాట. అంత ఆలస్యం ఏమీ అయిపోలేదు. అయినా, రేపు శలవు రోజు. కూర్చొండి, కూర్చొండి. మరి కొంచెం టీ తాగి వెళుదురు గాని,” అన్నాడు.

“లేదండీ, నేను వెళ్ళాలి. కొన్ని పేపర్లు ఇంకా దిద్దాల్సి ఉంది. కృతజ్ఞతలు. నమస్కారం.”

“బంకు దా, జాగ్రత్త,” అని హెచ్చరించాడు రామ్‌కనాయ్. “ఇవాళ అమావాస్య. గుర్తుంది కదా. పైగా శనివారం. దయ్యాలకీ భూతాలకీ ప్రీతిపాత్రమైన రోజు!”


వెదురు తోపు సగం దాటాక బంకు బాబుకి ఆ వెలుగు చుక్క కనిపించింది. ఆ తోపు పొంచా ఘోష్‌ది. బంకు బాబు చేతిలో లాంతరు గాని, టార్చిలైటు గాని లేవు. అతనికి వాటి అవసరం కూడా లేదు. అంత చలిలో పాములు బయట తిరగవు. పైగా అతనికి ఆ తోవ కొట్టిన పిండి. సాధారణంగా, అందరూ ఆ తోవలో వెళ్ళడానికి జంకుతారు కానీ, తన ఇంటికి చేరుకోడానికి అది దగ్గర దారి.

గత కొద్ది నిముషాలుగా అతనికి ఏదో వింత అనుభూతి కలుగుతోంది. అదేమిటో ముందు పోల్చుకోలేకపోయాడు. ఈ రాత్రి ఎప్పటిలాగా లేదు. అన్నీ ఎందుకో వింతగా కనిపిస్తున్నాయి. ఏమై ఉంటుంది? ఏమిటి లోపం? అతనికి చప్పున గుర్తుకి వచ్చింది. ఎప్పుడూ అరిచే కీచురాళ్ళు ఎందుకో చప్పుడు చెయ్యడంలేదు. ఒక్కటి కూడా అరవడంలేదు. మామూలుగా అయితే, అతను వెదురు తోపు మధ్యకి వచ్చేసరికి కీచురాళ్ళు అరుస్తూ ఎక్కడలేని సందడీ చేస్తుండేవి. ఇవాళ అంతా భీతిగొలిపే నిశ్శబ్దం ఆవహించింది. కీచురాళ్ళకి ఏమై ఉంటుంది? అన్నీ నిద్రపోతున్నాయా?

ఈ ప్రశ్నలు మనసులో వేధిస్తుంటే బంకు బాబు మరో ఇరవై గజాల దూరం నడిచాడు. అక్కడ అతనికి పెద్ద వెలుగు కనిపించింది. ముందు అక్కడ ఏదో తగలబడుతోందేమో అన్న అనుమానం వచ్చింది. కానీ సరిగ్గా వెదురు పొద మధ్యలో, ఒక చిన్న మడుగు ప్రక్కని, చదునైన నేలమీద చాలా ఎక్కువ మేర ఎర్రగా ఏదో మెరుస్తూ కనిపించింది. దాని సన్నని వెలుగు ప్రతి చెట్టు కొమ్మ మీదా, ప్రతి ఆకు మీదా, ప్రతిఫలిస్తోంది. ఆ మడుగు దాటాక, క్రింద నేల మీద ఇంతకంటే ఎక్కువ ఎర్రగా వెలుగు కనిపిస్తోంది. అది నిప్పులా లేదు. ఎందుకంటే అది నిశ్చలంగా ఉంది.

బంకు బాబు నడక కొనసాగించాడు.

అతని చెవులు గుయ్యిమంటున్నట్టు అనిపించింది. ఎవరో గట్టిగా చెవుల్లో మూలుగుతున్న అనుభూతి కలిగింది. బంకు బాబుకి ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. కాని దానితోపాటు పట్టలేని కుతూహలం కూడా కలిగింది. దానితో అతను మరి కొంచెం ముందుకు నడిచాడు. అలా అతను నాలుగైదు వెదురు పొదలు దాటిన తర్వాత, అతనికి అక్కడ ఉన్న వస్తువు స్పష్టంగా కనిపించింది. అది బోర్లించిన పెద్ద గాజు కుప్పెలా, మొత్తం మడుగు అంతటినీ ఆవరించి ఉంది. దానికున్న చలువగాజు కప్పు వలన, ఇప్పటికీ గాఢమైన ఎరుపు రంగులో ఉన్నా, కళ్ళకి ఇబ్బంది లేకుండా, ఆ ప్రాంతం అంతా ప్రకాశవంతంగా ఉంది.

బంకు బాబు కలలో కూడా అటువంటి దృశ్యాన్ని చూడలేదు.

కొన్ని నిమిషాలపాటు బిత్తరపోయి ఆ దృశ్యాన్ని పరిశీలించిన తర్వాత, ఆ వస్తువు అచేతనంగా పడి ఉన్నప్పటికీ, నిర్జీవం కాదు అని గ్రహించాడు. ఊపిరి పీల్చినపుడు మనిషి గుండె మీదకీ క్రిందకీ కదిలినట్టు, దాని గాజు పైకప్పు పైకీ క్రిందకీ కదులుతూ, ఉండుండి మినుకులాడుతోంది.

మరింత స్పష్టంగా చూడటానికి రెండు అడుగులు ముందుకు వేశాడు బంకు బాబు. కానీ వెంటనే అతని ఒంట్లోనుండి విద్యుత్తు ప్రవహించినట్టు అనిపించింది. మరుక్షణం అతను అచేతనుడు అయిపోయాడు. అతని చేతులూ కాళ్ళూ కనిపించని తాడుతో కట్టినట్టు అనిపించింది. అతని ఒంట్లో శక్తి సన్నగిల్లింది. ముందుకు గాని, వెనక్కి గానీ కదలగలిగే పరిస్థితి లేదు.

కొన్ని నిముషాల తర్వాత, బంకు బాబు ఉన్న చోటే అలా నిశ్చలంగా ఉంటుండగానే, ఆ వస్తువు ఊపిరి పీల్చడం మానినట్టు గ్రహించాడు. వెంటనే అతని చెవుల్లో రొద మాయమయింది. మరొక నిముషం తర్వాత ఒక గొంతు, ఆ రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగింది. ఆ గొంతు మనిషి గొంతులానే ఉంది, కాని బాగా కీచుగా ఉంది.

“మిల్పి-పింగ్ క్రుక్! మిల్పి-పింగ్ క్రుక్!” అంది రెండుసార్లు గట్టిగా.

బంకు బాబు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. దానర్థం ఏమిటి? ఆ భాష ఏమిటి? మాటాడుతున్న మనిషి ఎక్కడున్నాడు? కనిపించడేం?

ఆ తర్వాత ఆ గొంతు పలికిన మాటలకి అతని గుండె మరొక్కసారి గతుక్కుమంది.

“హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?”

అరే! ఇవి ఇంగ్లీషు మాటలు! ఆ ప్రశ్న తనని ఉద్దేశించి వేసినదా? బంకు బాబు ఒక్కసారిగా ధైర్యం కూడ గట్టుకుని, “నా పేరు బంకుబిహారీ దత్తా, సర్. బంకుబిహారీ దత్తా” అని సమాధానం ఇచ్చాడు.

“ఆర్ యూ ఇంగ్లిష్? ఆర్ యూ ఇంగ్లిష్?” అడిగింది ఆ గొంతు మళ్ళీ.

“లేదు సర్! నేను బెంగాలీ, సర్! బెంగాలీ కాయస్థ!” అని అన్నాడు.

దాని తర్వాత కొంతసేపు నిశ్శబ్దం. మళ్ళీ గొంతు స్పష్టంగా వినిపించి, “నమస్కార్!” అంది.

బంకు బాబు అమ్మయ్య అని స్థిమితపడి, అభివాదానికి తిరిగి “నమస్కార్!” అంటు ప్రత్యభివాదం చేశాడు. అంతవరకు అతన్ని కట్టి పడేసినట్టు ఉన్న అగోచరమైన తాళ్ళు కూడా సడలినట్లు అనిపించింది. అతను పారిపోవాలనుకుంటే పారిపోవచ్చు. కానీ బంకు బాబు పారిపోలేదు.

ఆశ్చర్యపోతున్న కళ్ళతో ఆ గాజు కప్పు మూత ఒక పక్కకి తలుపులా తెరుచుకోవడం గమనించాడు.

ఆ తలుపు లోంచి ఒక తల… మామూలు బంతిలా ఉన్న తల… బయటకి వచ్చింది. దాని తర్వాత ఒక వింత ఆకారం బయటకి వచ్చింది.

దాని చేతులూ కాళ్ళూ ఆశ్చర్యం గొలిపేంత సన్నగా ఉన్నాయి. తల మినహాయిస్తే, తక్కిన శరీర భాగం అంతా గులాబీ రంగులో మెరుస్తోంది. చెవులకు మారుగా, రెండు పక్కలా రెండు కన్నాలు మాత్రం ఉన్నాయి. ముఖం మీద ముక్కు ఉండవలసిన చోట రెండు కన్నాలూ, నోరు ఉండవలసిన చోట, తెరుచుకున్న పెదవిలా ఖాళీ ఉన్నాయి. శరీరం మీద ఎక్కడా రోమాలు లేవు. కళ్ళు గుండ్రంగా బంగారు రంగులో ఉన్నాయి. అవి చీకటిలో మెరుస్తూ కనిపించాయి.

ఆ జీవి బంకు బాబు దగ్గరకు నెమ్మదిగా నడిచి కొన్ని అడుగుల దూరంలో ఆగింది. అతని వంక కన్నార్పకుండా తేరిపారి చూచింది. అసంకల్పితంగా బంకు బాబు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. ఒక నిముషం పాటు బంకు బాబును నిశితంగా గమనించిన తర్వాత, దాని మాట తీరు మురళీరవంలా వినిపించింది బంకు బాబుకు.

“మీరు మనుషులా?”

“అవును.”

“ఇది భూగ్రహమా?”

“అవును.”

“ఆహా! నేను అనుకుంటూనే ఉన్నాను. నా పరికరాలు సరిగ్గా పనిచెయ్యడంలేదు. నేను ప్లూటో మీదకి వెళ్ళవలసి ఉంది. నేను ఎక్కడ దిగానో నాకు అర్థం కాలేదు. అందుకని ప్లూటో మీద వారు ఉపయోగించే భాషలో మాటాడాను. మీరు ఎప్పుడైతే సమాధానం చెప్పలేదో నేను భూమి మీద దిగానని అర్థం చేసుకున్నాను. నా శ్రమ అంతా వృధా. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే జరిగింది. నేను కుజ గ్రహానికి వెళ్ళవలసి ఉంటే దారి తప్పి గురు గ్రహం మీద దిగాను. దాని వల్ల ఒక రోజు పూర్తిగా నష్టపోవలసి వచ్చింది. హహహ!”

బంకు బాబుకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆ జీవి అతని చేతులనీ కాళ్ళనీ తన సన్నని వేళ్ళతో ఒత్తుతుంటే బంకు బాబు చాలా ఇబ్బందిగా అటూ ఇటూ కదిలాడు.

“నా పేరు ఆంగ్. నేను క్రేనియస్ గ్రహం నుండి వచ్చాను. మనిషికన్నా చాలా తెలివైన జీవిని.”

ఏమిటీ? నిండా నాలుగు అడుగులు కూడా పొడవు లేని వింత ముఖం, సన్నని అవయవాలూ కలిగిన ఈ జీవి మనిషికంటే తెలివైనదా! బంకు బాబు నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వాడు. ఆంగ్ అతని మనసులోని ఆలోచనలు పసిగట్టాడు.

“సందేహం లేదు. కావాలంటే ఋజువు చెయ్యగలను. మీకు ఎన్ని భాషలు వచ్చు?” ఆంగ్ అడిగాడు బంకు బాబుని.

బంకు బాబు బుర్ర గోక్కుంటూ, “బెంగాలీ, ఇంగ్లీషు… హిందీ… అదీ కొద్ది కొద్దిగానే…” అంటూ తడబడుతూ చెప్పాడు.

“అంటే రెండున్నర భాషలన్నమాట.”

“అవును.”

“నాకు 14 వేల భాషలు వచ్చు. మీ సౌర కుటుంబంలో నాకు తెలియని భాష లేదు. అంతే కాదు, మీ సౌర కుటుంబం దాటి ఇతర గ్రహాలమీద మాటాడే 31 భాషలు వచ్చు. అందులో 25 గ్రహాల మీదకి స్వయంగా వెళ్ళి వచ్చాను కూడా. మీ వయసు ఎంత?”

“నాకు 50 ఏళ్ళు.”

“నా వయసు 833 సంవత్సరాలు. మీరు జంతువులను తింటారా?”

బంకు బాబు ఈ మధ్యనే కాళీపూజ నాడు మాంసం కూర తిన్నాడు. దానిని అతను ఎలా కాదనగలడు?

“మేము కొన్ని శతాబ్దాల క్రిందటే మాంసం తినడం మానేశాం” అన్నాడు ఆంగ్. “దానికి ముందు మేము చాలా జీవుల మాంసం తినేవాళ్ళం. లేకుంటే ఈపాటికి నిన్ను తినేసి ఉండేవాడిని.”

బంకు బాబుకి మింగుడుపడలేదు.

“ఒకసారి దీని వంక చూడండి” అంటూ ఆంగ్ ఒక చిన్న వస్తువుని బంకు బాబుకు ఇచ్చాడు. అది చూడబోతే గులక రాయిలా ఉంది. బంకు బాబు దానిని ముట్టుకోగానే, అంతకు ముందులా అతని ఒంట్లోంచి విద్యుత్తు ప్రవహిస్తున్న అనుభూతి కలిగింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

ఆంగ్ ఒక నవ్వు నవ్వాడు. “కొంత సేపు క్రిందట మీరు కాళ్ళు గాని చేతులు గాని కదపలేకపోయారు. ఎందుకో తెలుసా? ఈ చిన్న వస్తువు నా చేతిలో ఉండడం వలన. ఇది ఎవరినైనా ముందుకు రాకుండా నిరోధిస్తుంది. శత్రువుని భౌతికంగా గాయపరచకుండా అశక్తుడిని చెయ్యడంలో దీనిని మించినది మరొకటి లేదు.”

బంకు బాబు ఈ మారు నిజంగా ఆశ్చర్యపోయాడు.

“మీరు ఇంతవరకు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన చోటు గాని, చూడాలనుకుని చూడలేకపోయిన దృశ్యం గాని ఉన్నాయా?” అడిగాడు ఆంగ్.

బంకు బాబు కాసేపు ఆలోచించాడు. ఆ మాటకొస్తే, ఈ ప్రపంచంలో తను దేనినీ చూడలేదు. ఎప్పటి నుండో భూగోళ శాస్త్రం బోధిస్తున్నా, బెంగాల్‌లో ఏవో కొన్ని పట్టణాలూ పల్లెలూ తప్ప అతను చూసిందేమిటి? అసలు బెంగాల్‌లోనే ఒక్కసారి కూడా అతను చూడని ప్రదేశాలు చాలా ఉన్నాయి. మంచు కప్పిన హిమాలయ శిఖరాలు, దీఘాలో సముద్రం, సుందర్‌బన్స్ అడవులూ, శిబపూర్లో పేరుపడ్డ రావి చెట్టూ…

కానీ ఈ ఆలోచనలు ఏవీ ఆంగ్‌తో చెప్పలేదు. “నేను చూడాలనుకుంటున్నవి చాలా ఉన్నాయి,” అని మాత్రం అంగీకరించాడు. “అన్నిటికన్నా ముఖ్యంగా… నేను ఉత్తర ధృవాన్ని చూడాలనుకుంటున్నాను. నేను ఉష్ణ మండల ప్రదేశం నుండి వచ్చాను. అందుకని…”

ఆంగ్ వెంటనే తన దగ్గర ఉన్న ఒక గొట్టం లాంటిది తీశాడు. దానికి ఒక అంచున గాజు మూత ఉంది. “దీని లోంచి చూడండి.” ఆంగ్ అతన్ని ఆదేశించాడు.

బంకు బాబు గాజు లోంచి చూడగానే అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఇది నిజమేనా? తన కళ్ళముందు కనిపిస్తున్న దృశ్యం నమ్మశక్యమేనా? అతని కళ్ళముందు దిగంతాల వరకు వ్యాపించి ఉన్న మంచు కనిపిస్తోంది. మధ్య మధ్యలో ఎత్తయిన కొండలు, వాటి మీద కూడా మంచు కప్పుకుని ఉంది. పైన ఆకాశంలో, అనంత నీలాకాశం నేపథ్యంలో, ఇంద్రధనుస్సులోని రంగులన్నీ క్షణక్షణానికీ రకరకాల ఆకారాలు ధరిస్తూ పొర్లుతున్నాయి. అదే అరోరా బొరియాలిస్! అదేమిటి, ఆ ప్రక్కన? అది ఇగ్లూ. ప్రక్కనే అవన్నీ ఏమిటి? ధృవాల వద్ద ఉండే తెల్లని భల్లూకాలు. అదేమిటి ఆ వింత జంతువు? అదే, వాల్రస్. నిజానికి అక్కడ ఉన్నవి రెండు. ఒకటి కాదు. ఆ రెండూ పోట్లాడుకుంటున్నాయి. ముల్లంగి దుంపల్లా బోడిగా ఉన్న వాటి కొమ్ములతో ఒకదాని మీద ఒకటి కలబడి పోట్లాడుకుంటున్నాయి. తెల్లని, మెత్తని, మంచుమీద ఎర్రగా కారిన రక్తం…

అది డిసెంబరు నెల. బంకు బాబు చూస్తున్నది కొన్ని మంచు తెరలకి దిగువన ఉన్న ప్రదేశం. అయినా అతనికి చెమటలు పడుతున్నాయి.

“బ్రెజిల్ సంగతి ఏమిటి? అక్కడకు వెళ్దాం అనుకోవడం లేదా?” అడిగాడు ఆంగ్.

బంకు బాబుకి వెంటనే అక్కడి భయంకరమైన మాంసాహార పిరానాలు గుర్తుకొచ్చాయి. ఆశ్చర్యం! అతను ఎప్పటినుంచో వాటిని చూడాలనుకున్న సంగతి ఆంగ్‌కి ఎలా తెలుసు? అనుకున్నాడు. బంకు బాబు మళ్ళీ గొట్టంలోంచి చూశాడు.

అతనికి ఒక్క దట్టమైన అడవి కనిపించింది. చిక్కనైన ఆకుల మధ్యలోంచి పొరపాటున జారి పడిన వెలుగు రేఖ తప్ప అక్కడ అంతా చిమ్మ చీకటి. అక్కడ ఒక మహా వృక్షం, దాని కొమ్మకు వేలాడుతూ ఏమిటది? మై గాడ్! అనకాండా! పేరు ఒక్కసారి అతని మెదడులో మెరుపులా మెరిసింది. అంత పొడవైన పాము ఉంటుందని అతను ఊహించనైనా ఊహించలేదు. అవును అతనెక్కడో చదివాడు ఆ పేరు. అది కొండచిలువ కంటే చాలా చాలా పెద్దదని కూడా.

కానీ ఇంతకీ ఆ చేప ఏదీ? ఓహ్! ఇక్కడ ఒక కాలువ కనిపిస్తోంది. దానికి రెండు గట్ల వెంబడి మొసళ్ళు బారులు తీరి ఉన్నాయి. ఎండలో హాయిగా నిద్రపోతున్నాయి. అందులో ఒకటి కదిలింది. అది నీటిలోకి పోవడానికి ప్రయత్నిస్తోంది. అంతే! బంకు బాబుకు పెద్ద చప్పుడు వినిపించినంత పని అయింది. ఇంతకీ ఏమిటి ఆ చప్పుడు? మొసలి నీటి లోంచి ఒక్కసారి బయటకి ఎగిరి గెంతింది. ఇంతకీ కొద్ది సెకన్ల ముందు నీటిలోకి పోడానికి ప్రయత్నం చేసిన మొసలి అదేనా? బంకు బాబుకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే అతని ఆశ్చర్యానికి గుడ్లు నిలబడిపోయి రెప్పలు పడలేదు. కారణం, ఆ మొసలికి కడుపు భాగంలో మాంసం అన్న జాడ లేదు. దాని ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలిన శరీర భాగానికి అంటుకుని ఆశ్చర్యకరంగా 5 చేపలు కనిపించాయి… భయానకమైన వాడి పళ్ళతో, తరగని ఆకలితో. అవే పిరానాలు!

బంకు బాబు ఇంక చూడలేకపోయాడు. అతని అవయవాలు వణకడం ప్రారంభించాయి. తల దిమ్మెక్కిపోయింది.

“ఇప్పటికైనా ఒప్పుకుంటారా, మీ కంటే మేము మెరుగైనవాళ్ళమని?” అడిగాడు ఆంగ్.

బంకు బాబు పొడిబారిన పెదాలను నాలుకతో తడుపుకున్నాడు. “ఒప్పుకుంటాను. తప్పకుండా ఒప్పుకుంటాను. సందేహం లేదు” అంటూ గొణిగాడు.

“మంచిది. నేను మీ చేతులనీ కాళ్ళనీ పరీక్షగా చూస్తున్నా ఇందాకటి నుండి. మీరు చాలా నాసిరకం జీవజాలానికి చెందినవారు. అందులో సందేహం లేదు. కానీ మనుషులకి చెందినంత వరకు, మీరు చెడ్డవారు కాదు. నా ఉద్దేశ్యం ‘మీరు’ చెడ్డవారు కాదని. కానీ, మీలో ఒక పెద్ద లోపం ఉంది. మీరు భయస్తులు, బలహీనులు. అందువల్లనే జీవితంలో మీరు ముందుకు వెళ్ళలేకపోయారు. అన్యాయం జరుగుతున్నపుడు దానికి వ్యతిరేకంగా గొంతెత్తాలి, నిష్కారణంగా మిమ్మల్ని ఎవరైనా బాధించినా, గాయపరచినా దానికి అభ్యంతరం చెప్పాలి. దానిని మౌనంగా భరించడం తప్పు. అది మనిషికే కాదు, ఏ జంతువుకైనా సరే! ఏదయితేనేం. నేను ఈ సమయంలో ఇక్కడ ఉండవలసింది కాదు. మిమ్మల్ని కలిసినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కువ సమయం వృధా చెయ్యడం వల్ల నాకు ప్రయోజనం లేదు. నేను తక్షణం బయలుదేరాలి.”

“గుడ్ బై ఆంగ్! మీరు పరిచయం…” అని ఇంకా ఏదో చెప్పబోయాడు.

కానీ, సెకండు కన్నా తక్కువ సమయంలో, అంటే కళ్ళెదుట ఏం జరుగుతోందో బంకు బాబు గ్రహించే లోపలే, ఆంగ్ తన నౌకలోకి గెంతడం, వ్యోమనౌక పోంచా ఘోష్ వెదురు పొదలమీంచి ఆకాశంలోకి లేవడం, మరు నిముషంలో మాయమవడం, అంతా జరిగిపోయింది. కీచురాళ్ళు మళ్ళీ చప్పుడు చెయ్యడం బంకు బాబు గ్రహించాడు. అప్పటికి రాత్రి బాగా ఆలస్యం అయింది.

బంకు బాబు ఇంటివైపు నడక సాగించాడు. అతను మనసు ఇంకా అద్బుతమైన ఆ అనుభూతి ప్రభావంలో తేలిపోతోంది. క్రమక్రమంగా ఇంతకు కొద్ది క్షణాలు ముందు జరిగిన అనుభవం ప్రభావం మనసులోకి ఇంకుతోంది. ఒక మనిషి… మనిషి కాదు, అతని పేరు ఆంగ్… ఏదో తెలియని గ్రహం నుండి ఇక్కడికి వచ్చాడు. అటువంటి గ్రహం ఉంటుందని గాని, అతనితో మాటాడే అవకాశం వస్తుందని కాని ఎవడు అనుకున్నాడు? ఎంత అద్బుతమైన విషయం! ఎంత నమ్మశక్యం కాని విషయం! ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన అనుభవం ఎంతమందికి దక్కుతుంది? కాఁకుర్‌గాఛి ప్రాథమిక పాఠశాలలో భౌగోళిక శాస్త్రం, బెంగాలీ బోధించే బంకుబిహారీ దత్తాకి తప్ప! ఈ రోజునుండి, కనీసం ఈ విషయానికి సంబంధించినంత వరకు, ప్రపంచం మొత్తం మీద తనొక ప్రత్యేక వ్యక్తి.

బంకు బాబు తను నడవడం లేదని, ప్రతి అడుగులోనూ పొంగిపొర్లుతున్న ఉత్సాహంతో అతను నిజంగా గెంతులేస్తున్నాడనీ గ్రహించాడు.

మరుసటి రోజు ఆదివారం. శ్రీపతి బాబు ఇంటి దగ్గర అందరూ యథాప్రకారం సమావేశానికి హాజరు అయ్యారు. స్థానిక పత్రికలలో వెలుగును గురించి ఒక వార్త పడింది గాని అది చాలా సంక్షిప్తంగా పడింది. ఆ వెలుగును బెంగాలులో రెండు చోట్ల ఒక నాలుగైదు మంది మాత్రమే చూశారు. కనుక దానిని UFO క్రింద జమకట్టి ఊరుకున్నారు.

ఆ సమావేశంలో పొంచా ఘోష్ కూడా ఉన్నాడు. అతను తన వెదురు తోపు గురించి మాటాడుతున్నాడు. ఆ తోపు మధ్యలో ఉన్న మడుగు చుట్టూ ఉన్న వెదురు చెట్లన్నీ ఆకులు రాల్చేశాయి. హేమంతంలో చెట్లు ఆకులు రాల్చడం వింత కాదు కాని, రాత్రికి రాత్రి అన్ని చెట్లు ఒక్కసారిగా ఆకులు రాల్చడం మాత్రం వింతే. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలో అకస్మాత్తుగా భైరవ చక్రవర్తి “ఈ రోజు బంకు బాబు ఎందుకు ఆలస్యం అయ్యాడు?” అని అడిగాడు.

అందరూ కాసేపు మాటలు మానేశారు. అప్పటి వరకు బంకు బాబు రాలేదన్న విషయం ఎవరూ గ్రహించలేదు.

“బంకం ఇవాళ వస్తాడని నేను అనుకోను. నిన్న నోరు విప్పడానికి ప్రయత్నిస్తే చెవి నులిమిన సంగతి గుర్తుండదూ?” అన్నాడు నిధి బాబు.

“అలా కుదరదు. మన సమావేశంలో బంకు బాబు ఉండవలసిందే. రామ్‌కనాయ్! వెళ్ళి అతన్ని పిలుచుకురా” అన్నాడు శ్రీపతి బాబు.

“అలాగే! నా టీ తాగడం పూర్తవగానే వెళ్తాను” అని టీ ఒక గుక్క తాగబోతుండగా బంకు బాబు గదిలోకి అడుగుపెట్టాడు. ‘అడుగుపెట్టాడు’ అనడం సబబు కాదు. ‘ఒక తుఫాను, అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, పొట్టిగా, నల్లగా ఉండే మనిషి రూపంలో వచ్చింది’ అనడం సముచితం.

వస్తూనే తుఫాను చెలరేగినట్టు ఒక నిముషం పాటు పెద్ద ఎత్తున నవ్వు నవ్వడం ప్రారంభించాడు. అటువంటి నవ్వు ఇంతకుముందు ఎవ్వరూ కనీ వినీ ఉండరు, బంకు బాబుతో సహా. నవ్వడం పూర్తయిన తర్వాత, గొంతు సవరించుకుని ఇలా చెప్పడం ప్రారంభించాడు:

“మిత్రులారా! ఈ సమావేశాల్లో నన్ను మీరు చివరిసారిగా చూడబోతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ రోజు నేను రావడానికి ముఖ్య కారణం పోబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే. మొదటిది – ఇది మీకు అందరికీ – మీరందరూ మాట్లాడేది పరమచెత్త. తమకు తెలియని విషయాల గురించి ఒక్క మూర్ఖులు మాత్రమే అలా మాటాడుతారు. రెండవది – ఇది చాంది బాబుకి – మీ వయసులో ఒకరి గొడుగులు, చెప్పులూ దాచడం కుర్ర చేష్టలే కాదు, చాలా తప్పు. దయచేసి నా గొడుగును, గోధుమ రంగు కాన్వాస్ షూలనీ మా ఇంటికి తెచ్చి ఇవ్వండి. నిధి బాబూ! మీరు నన్ను బంకం అని సంబోధిస్తే, మిమ్మల్ని నేను నిట్‌విట్ అని సంబోధిస్తాను. ఆ పిలుపుకు అలవాటుపడండి. శ్రీపతి బాబూ! మీరు చాలా ప్రముఖమైన వ్యక్తే. సందేహం లేదు. మిమ్మల్ని పట్టుకు వేలాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి. ఈ రోజునుండీ, అందులో నేను ఉండబోవటం లేదు. మీకు కావాలంటే, నా పిల్లిని పంపిస్తాను. అది కాళ్ళు నాకడంలో సిద్ధహస్తురాలు. ఓ, పొంచా బాబు! మీరు కూడా ఇక్కడ ఉన్నారా! మీకు, మీతో బాటు అందరికీ చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. నిన్న రాత్రి క్రేనియస్ అన్న గ్రహం నుండి ఆంగ్ అన్న వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. మీ వెదురు తోపులోని మడుగు ప్రక్కనున్న చదును ప్రదేశంలోనే దిగాడు. అతనూ నేనూ చాలా సేపు మాటాడుకొన్నాం. ఆ మనిషి… క్షమించాలి, ఆంగ్… చాలా స్నేహశీలి.”

బంకు బాబు తను చెప్పవలసినది ముగించి వెళుతూ వెళుతూ భైరవ చక్రవర్తి వీపు మీద ఎంత గట్టిగా చరిచాడంటే, అతనికి ఊపిరాడక దగ్గు వచ్చింది. బంకు బాబు ఆపైన నిటారుగా, తల ఎత్తి దర్పంగా అక్కడ నుండి నిష్క్రమించాడు.

అదే క్షణంలో రామ్‌కనాయ్ చేతిలో ఉన్న కప్పు జారి క్రింద పడి, ముక్కలు ముక్కలై, అందులోని వేడి టీ అందరి మీదా తుళ్ళిపడింది.

(ఇంగ్లీషు అనువాదం: గోపా మజుందార్)