అసంపూర్ణం

గీస్తూనే ఉన్నాను
అంతిమంగా రూపొందేది
అసమగ్ర చిత్రమేనని తెలిసినా

వెతుకుతూనే ఉన్నాను
మిగిలిపోయిన తెలుపులో
హరివిల్లు రంగులను

ఎదురుచూస్తూనే ఉన్నాను
నక్షత్రలోకపు కాంతేదో
వెలుగును నింపుతుందని

నడుస్తూనే ఉన్నాను
చేరవలసిన గమ్యం
చిరునామా తెలియకపోయినా

అడ్డుకట్ట వేస్తూనే ఉన్నాను
పొంగుతున్న సముద్రం
పోటెత్తి విరుచుకు పడకుండా

రెక్కలు అల్లాడిస్తూనే ఉన్నాను
ఎగరడానికి కాదు కేవలం
మునిగిపోకుండా ఉండడానికి

తపన పడుతూనే ఉన్నాను
నులివెచ్చని శ్వాసను నిలుపుకునేందుకు
శాశ్వతంగా విశ్రమించక తప్పదని తెలిసీ!

కలగా కంటూనే ఉన్నాను
జీవితానందపు కడపటి దృశ్యాన్ని
అసంపూర్ణంలో సంపూర్ణత్వాన్ని!


నల్లపనేని విజయలక్ష్మి

రచయిత నల్లపనేని విజయలక్ష్మి గురించి:

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి డా. నల్లపనేని విజయలక్ష్మిగారి రచనలు అనేక పత్రికలలో వెలువడ్డాయి.

 ...