సంపాదకునికి ఉత్తరం

డియర్ ఎడిటర్:

తెలుగు లోకం నిండా సాహిత్యం పొంగి పొర్లుతోంది. పుస్తకాలు పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి ప్రతి రోజూ. రచయితలందరూ ఎమర్జెన్సీ సర్వీస్‌లు, డయల్ 100 కంటే ఎక్కువగా పాఠకులకు అందుబాటులో ఉంటున్నారు. సోషల్ మీడియా నిండా వీళ్ళే కనిపిస్తున్నారు.

చూస్తుంటే సాహిత్యానికి, రచయితలకు మంచి రోజులొచ్చినట్టే పైకి అనిపిస్తుంది. వీటి మధ్య పాఠకుడికి గ్రహస్థితి మాత్రం బాలేదనే సంగతి మరుగున పడిపోయింది.

పాఠకులు, రచయితలనే రెండు వర్గాలుండేవి ఒకప్పుడు. ఇప్పుడు రెండూ ఒకటే. రచయితలే పాఠకులు, పాఠకులే రచయితలు. ఈ ఇద్దరూ కల్సి మూడోవర్గంగా, అంటే సమీక్షకులుగా కూడా రోజూ ఏదో ఒక పుస్తకం కోసం అవతారమెత్తుతారు. ఎత్తక తప్పదు. ఎందుకంటే, మన పుస్తకం కోసం మరెవరో మరోచోట ఈ అవతారమెత్తే ఉంటారు ఆ రోజుకి.

ఒకప్పుడు, రచయితలు ఎక్కడో పాఠక ప్రపంచానికి దూరంగా ఉండేవాళ్ళు. పత్రికల ద్వారా, మార్కెట్లో దొరికే నవలల ద్వారా అందుబాటులో ఉండి, వాళ్ళు పాఠకుల ఉత్తరాలకు రిప్లయ్ ఇస్తే అదో పండగగా భావించే రోజుల నుంచి, సోషల్ మీడియా పుణ్యమా అని, రచయితలందరూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌లో చేరి, ఆకాశానికెత్తే రివ్యూల కోసం దేబిరిస్తూ ‘ఛీ, ఆ రోజులే బాగున్నాయిరా బాబూ’ అనుకునే స్థితికి తెచ్చారు సగటు పాఠకులను.

పుంఖానుపుంఖాలుగా వచ్చి పడుతున్న నవలల, కథా సంకలనాల క్వాలిటీ ఎలా ఉన్నా, పొగడటానికి రివ్యూయర్లు రెడీగా ఉండటంతో సమీక్షలలో రచనల బాగోగుల విమర్శ నశించి రివ్యూలు కేవలం ప్రమోషన్‌లుగా మిగిలిపోవడం మొదలై చాలా రోజులైపోయింది. రివ్యూ అంటేనే పొగడ్త అనేది ఇప్పుడు మారి కూర్చున్న నిర్వచనం. ముందుమాటలో గాని, సమీక్షలో గానీ విశ్లేషణ ఉండదు, రచయిత సరి చూసుకోవలసిన విషయాలు ఉండవు. అద్భుతం, అనన్య సామాన్యం, ఆచంద్ర తారార్కం… ఇదే వరస!

చాలామంది కనీసం తెలుగు సరిగా రాయలేకపోయినా నవలలు రాసే పనిలోకి దిగుతున్నారు. అదేమంటే, RTS ఉందిగా, అందులో రాసి, ఎడిట్ చేయిస్తాం అనే జవాబు. ఇల్లు కట్టడానికి, ఇళ్ళు కట్టడానికి తేడా తెలియనివారు కూడా రచయితల అవతారం ఎత్తుతున్నారు. ఎవరైనా రాయవచ్చు, రచయితలుగా మారవచ్చు. కానీ రాసిన దాంట్లో పస ఎంత ఉందనేది ఎవరికి వారు ప్రశ్నించుకునే వాతావరణమే లేదు. అలా ప్రశ్నించుకునే అవకాశం రివ్యూలు ఇవ్వడం లేదు. ప్రతి నాసిరకం కథనీ, నవలనీ ఆకాశానికెత్తి ఆహో ఓహో అనడం. ముందు చెప్పినట్టు, ప్రతీ రచయితకూ ఇంకో నలుగురు రచయితలుంటారు ఇలా మార్కెటింగ్ చేయడానికి.

దీని వల్ల అంతిమంగా నష్టపోయేది రచయితే అనే ఎరుక ఎవరికీ లేకుండా పోతోంది.

సోషల్ మీడియా వల్ల రచయితలూ పాఠకులూ అందరూ ఒకే చోట ఉండటం వల్ల, ఎవరి పుస్తకం మీదా ఎవరూ ఉన్నదున్నట్టు రాయరు. పొగిడి తీరాలి. లేదంటే తిరిగి తన పుస్తకానికి మంచి రివ్యూలు రావనే భయం. అందరూ దూరం పెడతారేమో అనే జంకు.

కొంతమంది సీనియర్ రచయితలు, కవులు, ఫేస్‌బుక్ పోస్టులను కూడా లిస్ట్‌లో ఉన్న అందరికీ విడిగా పంపించి మరీ, లైకుల కోసం కామెంట్ల కోసం నిరీక్షిస్తుంటారు.ఇహ వీళ్ళ కథో, పుస్తకమో పబ్లిష్ అయిందా, ‘నాలుగు మంచి మాటలు’ రాయమని లిస్ట్‌లో ఉన్న వాళ్ళ వెంట పడతారు. వాళ్ళు రాసేవరకూ వీళ్ళు నిద్రపోరు.

ఇక మరి కొంతమంది, ఆయా రచయితలతో తమకి ఉన్న వ్యక్తిగత పరిచయం స్థాయిని బట్టి, వాళ్ళ పుస్తకం ఇంకా విడుదల కాక ముందే భీభత్సమైన బెదిరింపులతో పరిచయాలు రాస్తుంటారు: ‘ఫలానా రచయిత పుస్తకం రాబోతుంది, ఆయనొచ్చాడంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళందరి తోలూ వొలుస్తాడు, మీ తాట తీస్తాడు, మీ తలలు కోటగుమ్మానికి వేలాడదీస్తాడు’ …ఈ వరసలో.

ఇంతా చేసి బయటికొచ్చాక, అదేమైనా అద్భుతమైన పుస్తకమా అంటే, అబ్బే! పట్టుమని పది పేజీలు చదివించలేని, పదిమందిని కూడా ఆకట్టుకోలేని నాసిరకం! ఇదే మాట చదివిన వారెవరైనా బయటకు చెప్తారా అంటే చెప్పరు. వాళ్ళని రచయితలంతా కలిసి ట్రోల్ చేయడం, గుంపు రాజకీయాలతో అన్యాపదేశంగా పోస్టులు పెట్టి వేధించడం పరిపాటిగా మారడంతో ఎందుకొచ్చిన పీడ! అని బాగుందని చెప్పక పోయినా, బాగా లేదని కూడా చెప్పక మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నారు చాలామంది.

వీళ్ళందరినీ మించి ఇప్పుడు ‘రివ్యూ’ రాయడాన్ని వృత్తిగా, బతుకుతెరువుగా మార్చుకుని సంపాదిస్తున్నవారూ తయారయ్యారు. వీళ్ళు ఎక్కువగా ఇన్స్టా‌గ్రామ్‌లో ‘Book Reviewer’ అనే బయోతో ఉంటారు. డబ్బు తీసుకుని, ఎంత చెత్త పుస్తకాన్ని అయినా, పొగుడుతూ, అద్భుతంగా ఉందని ఆకాశానికెత్తుతూ, సినిమా దృశ్యాలు, పాటలు జోడించి రీల్స్ చేస్తూ పుస్తకాన్ని నలుగురిచేతా కొనిపించడం వీళ్ళ పని.

చివరికి ఒక పుస్తకం బాగుందని ఇలా పదిమంది చెప్తే నమ్మి కొన్న పదకొండోవాడు కొద్దో గొప్పో మంచి సాహిత్యం చదివినవాడై ఉండి ఖచ్చితంగా మోసపోతాడు.

ఇక ఎడిషన్ల విషయానికొస్తే, ఫలాన పుస్తకం ఇన్నేసి కాపీలు అమ్ముడుపోయాయి అని ఊదరగొట్టి, పాఠకుల్లో ఆసక్తి కలిగించడం ప్రముఖ పబ్లిషర్ల ప్రథమ కర్తవ్యం. వేసిన నాలుగు రోజుల్లోనే 500 కాపీలు అమ్ముడుపోయాయి, రెండో ముద్రణకి వెళ్తోంది నవల అని ప్రకటిస్తారు. నిజానికి అక్కడ వేసేది రెండొందల కాపీలే. ఈ విషయం సదరు రచయితకు కూడా తెలిసే జరుగుతుంది, ఎందుకంటే రచయిత డబ్బుతోనే కదా ఆ పుస్తకాలు వేసేది. ఎన్ని కాపీలు వేశారు, ఎన్ని అమ్ముడుపోయాయి అనేది ఎవరు తనిఖీ చేస్తారు? పబ్లిషర్లు చెప్పింది నమ్మాల్సిందే కదా? ఈ తప్పుడు లెక్కలు చూపించి, పుస్తకానికి ఇమేజ్ సృష్టించడం ఎంతవరకు న్యాయం? పుస్తకం అమ్ముడుపోవడానికి ఎంత వరకైనా వెళ్తారా?

ఇద్దరు ముగ్గురు పబ్లిషర్లు తిరగ్గొట్టిన నవలను, చివరికి లక్షల కాపీలు అమ్ముడుపోయేలా మార్కెటింగ్ గిమిక్స్‌తో ప్రచారం చేస్తున్నారు. కిరాణా దుకాణాల్లో పెట్టి అమ్మించి, జూనియర్ కాలేజీల్లో టెంట్లు వేసి అమ్మించి, ఆ నవల చదవకపోతే జీవితం వ్యర్థం అనేలా దాదాపుగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం ఇంకొక పంథా.

ఎప్పుడూ కొద్దిమందే రాస్తూ ఉండకుండా, కొత్త రక్తం రావడం, కొత్త భావాలు రావడం స్వాగతించదగ్గదే. అయితే ఏం రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనే స్పృహ లేకుండా, ఊహకొచ్చిన ప్రతి దాన్నీ కాయితం మీద పెట్టేసి, అచ్చేయడం, దాన్ని వంద రకాలుగా మార్కెట్ చేసి అమ్మేయడం… ఇదంతా చివరికి సాహిత్యాన్ని ఒక ‘కమాడిటీ’గా మార్చి పారేసింది. ఉప్పు, పప్పు, బాస్మతి రైస్, మొబైల్ ఫోన్… మరియు తెలుగు సాహిత్యం.

ఎవరైనా రివ్యూయర్ పొరపాటున ‘ఈ పుస్తకంలో ఫలానా అంశం అంత నప్పలేదు, రచయిత కొంత జాగ్రత్త పడవలసింది’ అని రాస్తే, రచయితలు దాన్ని ఏ రకంగానూ స్వీకరించే స్థితిలో లేరు. ‘ఓహో, మీకు అలా అర్థమైందా? ఆ పాయింట్ వల్లే నా పుస్తకం బాగుందని మరో పదిమంది చెప్పారు నాకు తెల్సా?’ అని జవాబు చెప్పడం. అంతటితో ఆగక ‘నా పుస్తకం హిట్ అయిందని చాలామంది ఏడుస్తున్నారు’ అని వీధి తగాదాల స్థాయిలో అన్యాపదేశంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, తమ స్నేహితుల చేత నెగటివ్ కామెంట్స్ రాయించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లాంటి దబాయింపు పన్లు… మొత్తంగా ఇదంతా ఒక రొచ్చుగుంటలా మారింది. ఈ వర్ధమాన తెలుగు రచయితల ప్రవర్తన మాఫియా స్థాయికి ఎదిగిపోయింది అనాలేమో.

ఎవరో ఒకరు పుస్తకాలు రాయడం, వాటిని పబ్లిషర్లు చక చకా అమ్మేసి, ‘ఇన్ని కాపీలు అమ్మాము, సూపర్ హిట్ అయింది’ అని అమ్ముడుపోయిన కాపీల ఆధారంగా పుస్తకంలోని సాహిత్యం నాణ్యతను జస్టిఫై చేసి ప్రచారం చేయడం కరెక్టా?

కాలానికి నిలబడేవి కొన్ని పుస్తకాలే. అవేమిటనేది అందులో సాహిత్యమే చెపుతుంది తప్ప, అమ్ముడుపోయిన కాపీలు, వాటిని పొగడ్తలతో ముంచెత్తే రివ్యూలూ కావు.

బి. వి. ఎస్. మనస్విని
హైదరాబాద్.