…కడితే …అల్లితే
పొద్దుటిపూట పొద్దు
మంచుచుక్కల మధువు
పచ్చని పరిమళం
ఎప్పుడూ నిశ్శబ్దం
విసిరే ఓపిక వరకూ నడక
అనుకోకుండా తగిలే
అల్లు తీగల పందిరి
పగిలిన విత్తు కాయల చీలికలు
కాళ్ళ కింద దుప్పివో పులివో రాయసపు నడకల ఆనవాళ్ళు,
ప్రశాంత ప్రవాహం, ఎప్పుడూ కడుక్కునే గులకరాళ్ళు,
ఒడ్డు మెడని చుట్టుకున్న అన్ని వయసుల వేళ్ళు,
అడుగుల జతలో మునివేళ్ళు దిగగుచ్చుతూ కాళ్ళు
అరచేతుల ఆసరాలో
కొండలెక్కి జారిపోయే సెగకి ఆరిన గడ్డమట్టి
ఒంటికి అంటించే పని.
వర్షపు నీళ్ళలో కడుక్కున్నా వదలని మట్టి మరక విసుగు,
విచ్చుకున్న పూలన్నీ తలజారు మాలమూరల్లో
చిక్కుకుని పసరు కంపు, నాసిక నలుపు, ముక్కు ఎరుపు
ఏ నాటి ధ్యానపు మానులో మురిపెం బంక కక్కుతూ,
రొదచేసే ఎద పాట, పురుగుల రాగం,
పసిరిక పాము వెన్నుపూస మెలిక తిప్పి
రంగుల జంట ఆకులు, వయసు దొరకని
నిట్టాడి పచ్చలు.
జతలుగా వెన్నుని ఆనుకుని ఒకదాని పైన ఒకటి పడే నీడలు,
ఎక్కేకొండ, దిగే లోయ, అడవి, నది, చెట్లూ.
రాత్రి ఆకాశపు హద్దులు, రాతిగుహలూ అదో భయం…
ముందు వడివడి అడుగుల వేగంలో నువ్వు,
భుజం పైన తుపాకీతో వెనక్కి తిరిగి,
వచ్చేయ్ అని లాగేసే చూపు.
పో… జత కలువు పో… చెట్టు కొమ్మల కోలాటం.
ఆకలి చూపు, వెదురు విల్లుల చురుకులు.
అందుకోలేని రాత్రి ఆకాశం పైకి మెడ నెప్పి చూపులు.
జయించలేనిది ఏదీ అడిగే హక్కు లేదు,
ఇచ్చింది ఏదీ తిరిగి తీసుకునేదీ, పొందేదీ కాదు, మోసుకు తిరిగేవే.
ఎక్కుతున్న కొండ, నడిచిన అడివి, కట్టిన జత,
దాటిన నది, దిగిన లోయ, అన్నీ వాటి వాసనే. చుట్టలు చుట్టుకునేది బంధం.
కదిలించే మత్తు, అడవి మొహంలో, మోహపు అడవిలో. మరి కొత్తో…
ఏళ్ళ పరిచయం లాగా, అలవాటు రాగం అందుకుని
అన్నిటి కోసం పాడే పేరు తెలియని పిట్ట గొంతు,
చట్టంలా వచ్చి చుట్టూ తిరిగి జుట్టు పైన వాలిన జీరంగి, మౌనంగా పక్కనే
పెడపట్టులా చెట్టుని చీల్చే విద్య రాదు, రాళ్ళని రుబ్బే విద్యేదో నాకు అబ్బింది.
నువ్వు అడవికన్నా భారం
రాలిన ఇసుక అంతా ఈదురు గాలి.
ప్రకృతిలా చేసి వదిలిన చూపుల్లో
ఊపిరి కుట్లు ఊడి వచ్చే రొద, మానుల ఒరిపిడిలో,
పారిపోయిన పొదలు పలుకులు,
ఒంటరి తనంలేని అడివికి,
మాటలు భారం.
పొడుగైన చెట్లు గాలి వంపులకి చిన్న చెట్లతో రాసుకు
పూసుకునే రాయబారాలు.
వయసు చెట్టు మూడయి తోడయిన నిలువు పానుపు.
రెక్కల గరుడపక్షి చేతిలో వెచ్చని వాగు గుటకల గొంతు
దిగి తడుపుతూ పేరు తెలియని జీవి నిప్పుల్లో కాలి కడుపుని
జోకొట్టే భుజాల తోలు డోలీల మోత.
కట్టెపేళ్ళ రవ్వలు, ఎత్తు చీకట్లో అంకెలన్ని వేసి వచ్చి
మంటలో రాలుతూ, మసి పారుతూ,
ఎదురుగా మెడపైన వేలాడే మొఖాలమంట
రంగుల్లో కలిసిపోయి…
కర్రలకి నిలేసిన వేట తుపాకీ.
నిప్పుల్లో కాల్చుకునే, కాచుకునే, కాళ్ళు.
తుపాకి, గుహ, కొండ, అడవి, జత.
వెలవెల పోయిన కంబళ్ళు, వదిలేసిన టోపీలు, రెండు తోలు బూట్ల జతలు.
మంచి చలిలో…
పులి గాండ్రింపు. భయం లేదు.
మహారణ్యంతో జత కట్టింది గుహలో కొవ్వొత్తి కారే వెలుగు…
లోపలి గోడలపైన శరీరాల ముద్రలు, ఇప్పుడు.
ఖాళీ గోడకి తుపాకీ, మూతి వాకిట నిప్పురవ్వలు చిటపట
గాలిలొ కలిసిపోయిన గొంతుకలు.
అడివి చెడిపిన రాత్రి.