రోజూ మాట్లాడుకుంటారు
లక్షల పదాలను కోసుకుని
గంటల కొలది నెమరు వేసుకుంటూ
అర్థాలను ప్రేమించుకుంటారు.
ఇష్టాల దప్పిక తీరేలా
కోరికలను పిలుచుకుని
కొత్త రుచులతో
మనసు ఆకలిని తీర్చుకుంటారు
ఒకరి అందాన్ని మరొకరు
రెట్టించుకుంటూ పొగుడుకుంటూ
నిలువెత్తు నిజాలని
హృదయంలో నాటుకుంటారు.
ఒంటరితనం వెంటపడితే
రహస్యపు లోతులకు వెళ్ళి
నులివెచ్చని జ్ఞాపకాలను
తీయగా తలచుకుంటారు.
కాలాన్ని తమకి తగినట్లు మలిచేలా
సమయ సందర్భాలకు పరచి
ఒకరి కళ్ళతో మరొకరిని చూస్తూ
రోజులని నిండుగా నింపుకుంటారు.
రోజూ ఒకరికి ఒకరు ప్రతిబింబంగా
మనసులు ప్రతిరూపాలుగా
చిన్న మాటకే చెదిరిపోతుంటారు
తిరిగి లోతు నిజాలకు లొంగి ఒకటౌతారు.