ఉదయాలన్నీ అందమైనవని
చెప్పలేం
సాయంత్రాలన్నీ సొగసులొలకబోస్తాయనీ
అనుకోలేం
రోజులన్నీ
సీతాకోకలై రంగులను చల్లుకుంటూ ఎగరవు
పొద్దున్నకు సాయంత్రానికీ
నడుమ దూరాలు ఒకేలా దర్శనమివ్వవు
కన్న కలలలో
కొన్ని కత్తిరింపబడుతూ
మరి కొన్ని పండకుండానే
రాలిపడుతూ
ఘడియలన్నీ
వెలిసిపోతున్న నీడలను
కొలుచుకుంటూ
అదృశ్యమైపోతున్న
సంవత్సరాలను చూసి
నిట్టూరుస్తూ
చుట్టూ గుమిగూడిన
సమూహాలు
వింత శబ్దాలు చేస్తూ
చెవులనేనా
గుండెలనూ కల్లోలపరుస్తూ
దారిలో కలిసిన నదులు
కాళ్ళు తడుపుకోవడానికి తప్ప
కళ్ళు తుడుచుకోవడానికి
పనికిరానపుడు
ఎన్నో ఒంటరితనాల మధ్య సైతం
ఒక బ్రతుకాశేదో
మునుముందుకు
ధైర్యంగా నడిపిస్తూ
అప్పుడు జీవితం
రెక్కల సత్తువను
బలపరుచుకుంటూ
ఆకాశాన్ని తాకుతూ
సంపూర్ణంగా వికసిస్తూ