గరళం

తలను విదుల్చుకుంటూ, కణతలు నొక్కుకుంటూ
ఎక్కడలేని బాధనంతా నెత్తికెక్కించుకుంటావ్
అనవసరపు చెత్తనంతా బుర్రలోకి దోపుకుంటావ్
ఒరే సన్నాసీ, ఎందుకొచ్చిన కష్టమిది.

వాడికది సులభమని
నువ్వు కష్టంగా కదులుతుంటావ్
వాడు నవ్వాడని నువ్వేడుస్తావ్
వాడినెవడో పొగిడాడని
మూడు రాత్రుళ్ళ నిద్ర ఏట్లో పోస్తావ్

వాడి గెలుపు నీ ఓటమని
విరుచుకు పడిపోతావ్.
నీకు నువ్వుగా బతకలేక,
ఒకడికిచ్చిన బలి నీ జీవితం.

పోలికల పోరాటాలతో ప్రతీవాడు నలిగిచస్తున్నప్పుడు
పోటీ ప్రపంచపు రథచక్రాల కిందపడి
తలకాయలిప్పుడు టెంకాయలై పగులుతున్నప్పుడు
నా పిచ్చిగొప్పల మనుష్యుడా,
జీవితం ఇప్పుడు చల్లని నీటికుండ కాదురా
నడిరోడ్లో ముక్కలైన మట్టిబెడ్డ.