విశాఖ


చిత్రం: జింకా రామారావు

క్రీ.శ. 2022. పావురాళ్ళ కొండ, విశాఖపట్నం.

“ఏముందిక్కడ? వెళ్దాం, వెళ్దాం అని పట్టుబట్టి తీసుకొస్తావ్, పగిలిపోయిన ఇటుకలు, విరిగిపడిన స్తంభాలు, రాతిలో చెక్కిన రెండు మూడు తొట్లు, ఎక్కడ చూసినా బీరుబాటిల్ ముక్కలు!” విసుగు ధ్వనించింది మాధవి గొంతులో. అలిసిపోయిన ఆమె ముఖం మీద అంత చల్లటి వాతావరణంలో కూడా చెమటచుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయ్.

ఆ కొండ చివరన ఉన్న రాతినేలలాంటి పెద్ద బండ. అలసటగా వచ్చి పక్కన కూర్చుంది.

భూభాగంపైకి దాడి చేసి లోపలికి చొచ్చుకొచ్చినట్లుగా ఉన్న నీలి సముద్రం ఆకాశంలోని లేత ఊదారంగుతో పోటీ పడుతున్నట్లు మరింత చిక్కగా కనిపిస్తుంది. మాకూ సముద్రానికీ మధ్య ఆకుపచ్చటి నేల. ఇసుక తీరం చెట్ల వెనుక నక్కి చూస్తున్నట్లుంది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సముద్రాన్ని చూస్తూ ఉండిపోయాం.

“ఇక్కడ చరిత్ర ఉంది మధూ. గతించిపోయిన అనేకకాలాలు, మనుషుల పరిమళాలతోనో, వేదనతోనో నిండిపోయిన ప్రదేశాలు ఇవి. ఒక్కసారి ఊహించు. ఓ రెండువేల సంవత్సరాల క్రితం ఓ ఇద్దరు బౌద్ధ సన్యాసులు మనం కూర్చున్న ఇదే రాతిపైన కూర్చొని వారికోసం రావల్సిన నావ కోసం ఎదురు చూస్తున్నట్లు. అది కూడా సాధారణ పరిస్థితుల్లో కాదు. నిన్నటిదాకా పువ్వుల్లో పెట్టి చూసుకున్న రాజ్యం, ఒక్కసారిగా గొంతు మీద కాలుపెట్టి నలిపితే, నిన్న భక్తితో పాదాలకు నమస్కరించిన భటుడు ఈ రోజు కంఠాన్ని కరవాలంతో నరకబోతుంటే ఇక్కడికి వేల మైళ్ళ దూరం నుంచి వారిని చుట్టుముట్టిన అనేకానేక విపత్కర పరిస్థితులనుంచి తప్పించుకొని తమ నేల, ప్రాంతం, మనుషులనుంచి దూరంగా వేరే రాజ్యానికి పారిపోతున్నప్పుడు వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు.”


క్రీ. పూ 184. కుక్కుటారామం, పాటలీపుత్ర నగరం, మగధ.

యథా ఇదం తథా ఏతం, యథా ఏతం తథా ఇదం
అజ్ఝత్తఞ్చ బహిద్ధా చ, కాయే ఛన్దం విరాజయే

ఈ జీవించి ఉన్న శరీరం ఎలానో ఆ మృతశరీరం అలానే. అది ఎలానో, ఇది అలానే. అందుకని తన మరియు ఇతర శరీరాలమీద వాంఛను దూరం చేయాలి. (విజయ సుత్తం, సుత్తానిపాత.)

సోచన్తి జనా మమాయితే, న హి సన్తి నిచ్చా పరిగ్గహా
వినాభావసన్తమేవిదం, ఇది దిస్వా నాగారమావసే

ఇది నాది అనుకోవడం వలననే జనులు శోకిస్తారు. పొందినవి ఏవీ శాశ్వతాలు కావు. అవి శాంతినీయవు. ఇది తెలుసుకొని ఎలాంటి బంధాలు లేని జీవితం గడపాలి.

మరణేనవి తం పహీయతి, యం పురిసో మమిదన్తి మఞ్ఞతి
ఏతమ్పి విదిత్వా పణ్డితో, న మమత్తాయ నమేథ మామకో

ఇది నాది అనుకునేదంతా మరణంతో వదిలివేయబడుతుంది. దీనిని తెలుసుకొని ధర్మాన్ని అనుసరించే పండితుడు దేనిని నాది అని తలచకూడదు. (జరా సుత్తం, సుత్తానిపాత.)

పాళీభాషలో పఠించబడుతున్న సుత్తాలతో పవిత్రమైన కుక్కుటారామం పరవశిస్తున్న సమయంలోనే ‘జై పుష్యమిత్ర!’ అంటూ ఒక్కసారిగా ఆయుధాలతో చుట్టుముట్టిన సైనికులను చూసి బిక్కుల ముఖాల్లో ఆశ్చర్యం పొడచూపింది. అంతలోకే వారి శరీరాలు కత్తిపోట్లతో నేలకూలాయి. బిక్కుల చావుకేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతున్నప్పుడే మౌర్య సేనాని పుష్యమిత్ర శుంగుడు రాజఠీవితో ఆచార్య మహాకాశ్యపుని సమీపించాడు. ఆయన తల నరకబోతున్న సైనికుడ్ని వారించి, అతను కూర్చున్న రాయిపైన కాలుపెట్టి, “కాశ్యపా, నేటితో మీ ధర్మసామ్రాజ్యం అంతమైపోయింది. మగధ ఇప్పుడు మాది. యజ్ఞయాగాలతో ఇక ఈ రాజ్యం సుభిక్షం కాబోతుంది. జరగబోయే నరమేధ యజ్ఞంలో బిక్కులందరూ సమిధలు కాబోతున్నారు. మూర్ఖ మౌర్యుడైన బృహద్రథుడి తల నేల మీద బంతిలా దొర్లుతూ మా బ్రాహ్మణ రాజ్యానికి దారివేసింది. ఇక ఈ సువిశాల మౌర్య… ఛ! శుంగ మహాసామ్రాజ్యానికి చక్రవర్తిని నేను” అన్నాడు పరిహాసంగా నవ్వుతూ.

మహాకాశ్యపుడు ప్రశాంతంగా పుష్యమిత్రుని కళ్ళలోకే సూటిగా చూస్తుండిపోయాడు. ఆయన నిర్వికారం పుష్యమిత్రుణ్ణి మరింత రెచ్చగొట్టింది.

“మీరు దుఃఖంలేని వారని, దుఃఖనిరోధానికి మార్గాన్ని కనుగొన్నవారని లోకం చెబుతుంది. అలలుగా పొంగే శోకాన్ని చూపించి మీకు మరణాన్ని ప్రసాదిస్తాను!” అంటూ కళ్ళు పక్కకి తిప్పి, “వీరపాలా! ప్రాణాలతో ఇంకా మిగిలి ఉన్న ఈ నలుగురు బిక్కులను, ఈ కాశ్యపుడిని అశోక చెరశాల తెరిపించి అందులో బంధించండి. ఈ రోజు మొదలు త్రిపిటకల పారాయణంతో కలుషితమవుతున్న వీరి నాలుకలను రోజుకొకటి చొప్పున ఈ కాశ్యపుడి ఎదురుగానే కోసేయండి. అప్పటికి బౌద్దాన్ని వదలకపోతే వారి తలలను నరికించండి. ధర్మప్రచారం వీరితోనే ఇక ముగిసిపోవాలి. అసలు దుఃఖమంటే ఏమిటో తెలియాలి ఈ మహాకాశ్యపునికి, ఆ తరువాతే మరణం.” హుంకరింపుతో ఆజ్ఞాపించి అక్కడినుంచి విసవిస వెళ్ళిపోయాడు పుష్యమిత్ర శుంగుడు.

ఆ ఆవేశమే కుక్కుటారామం పూర్తిగా ధ్వంసం కాకుండా ఆ రోజు పుష్యమిత్రుడినుంచి కాపాడింది.

ఆ సమయంలో స్తూపం క్రింద రహస్య భూగృహాన్ని శుభ్రపరిచే పనిలో ఉన్నాడు చంద్రకీర్తి. పవిత్రమైన బుద్ధుని భిక్షాపాత్ర అక్కడే వందల సంవత్సరాలుగా భద్రపరచబడి ఉంది. ప్రస్తుతం దాని సంరక్షణా బాధ్యత చంద్రకీర్తిదే. ఆ రోజు ఆ భూగృహంలో ఉండటం వల్లే ప్రాణాలను కాపాడుకోగలిగాడు. అతనివే కాదు ఆచార్యులవారివి కూడా.


రాత్రి కాగానే ఎవరి కంటా పడకుండా బుద్దుని భిక్షాపాత్రను రహస్యంగా దాచుకొని మామూలు దుస్తులలో ఆచార్యులవారికి అత్యంత విధేయుడైన ఉపాసకుడు సునిధి ఇంటికి చేరుకున్నాడు చంద్రకీర్తి. పాటలిలో ఇప్పుడు ఒక్క బిక్కువు కూడా లేడు. వేలమంది ఊచకోత కోయబడ్డారు. కొట్టుకుపోతున్న బిక్కుల శవాలతో గంగానది ఎర్రగా మారిపోయింది. ప్రాణాలు దక్కించుకున్నవారు చీవారాలు వదిలి రక్షిత ప్రాంతాలకు పారిపోయారు. మంత్రులు, నగర ధర్మమహామాత్రలు పుష్యమిత్రశుంగుని పాదాల దగ్గర సాగిలపడ్డారు. ఒక్కరోజులో పరిస్థితులన్నీ మారిపోయాయి.

“కుక్కుటారామం నుంచి మీరు ప్రాణాలతో బయటపడటం గొప్ప ఆశ్చర్యమే!” అన్నాడు సునిధి చంద్రకీర్తి పాదాలకు నమస్కరిస్తూ.

“ఆచార్యులవారిని, మరో నలుగురిని బంధించి తీసుకెళ్ళారు సునిధీ. వారిని అశోక చెరసాలలో బంధిస్తారట. వారిని తప్పించే మార్గమేదైనా ఉందంటావా?” అన్నాడు చంద్రకీర్తి. ఆచార్యులవారిని ఎలాగైనా కాపాడాలనే తపన కనిపిస్తుంది అతని గొంతులో.

“ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు సాయం చేయగలిగినవాడు, అశోక చెరసాలలో బందీగా ఉన్న ఆచార్యులవారిని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగే ఉపాయమేదైనా ఉంటే చెప్పగలిగేవాడు, ఈ సువిశాల మౌర్యసామ్రాజ్యంలో మహాక్షుద్రకుడు ఒక్కడే” అన్నాడు సునిధి.

“మహాక్షుద్రకుడే ఎందుకు? ఇలాంటి పరిస్థితుల్లో అతను మనకు సాయం చేయడానికి ఒప్పుకుంటాడా?” అన్నాడు చంద్రకీర్తి సంశయంగా.

“అతను అశోక చెరసాలలో ప్రత్యేకంగా బందీలను బాధించడానికి నియమించబడ్డ గిరిక వంశస్తుడు. నాకు మంచి మిత్రుడు. అతనికి ఆ చెరసాల రహస్యాలపట్ల అవగాహన ఉంది. బృహద్రథుడి అంగరక్షకుడిగా కొంతకాలం పని చేసినవాడు. మగధరాజ్య భౌగోళిక, రాజకీయ పరిస్థితుల గురించి స్పష్టత ఉన్నవాడు. అంతేకాక పుష్యమిత్రుడి కుయుక్తుల కారణంగా తన కుటుంబాన్ని, ఉద్యోగాన్నీ కోల్పోయిన వ్యక్తి. చాలా కాలంగా రహస్యంగా జీవిస్తున్నాడు. కాబట్టి ఆచార్యులవారిని రక్షించడానికి అతన్ని ఆశ్రయించడమే ఉత్తమం. ఇప్పుడే అతనికి సమాచారం పంపుతాను” అంటూ చంద్రకీర్తిని అక్కడే ఉండమని చెప్పి, బయటకు నడిచాడు సునిధి.


మహాకాశ్యపుడితో పాటు మిగిలిన బిక్కులను లాక్కొచ్చి చెరసాలలోకి అడుగుపెట్టిన పుష్యమిత్రుడి ఎదురుగా నిలబెట్టారు భటులు. నాలుకలు కోయబడ్డ బిక్కుల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పుష్యడి ముఖంపైన విజయగర్వంతో కూడిన చిరునవ్వు.

“కాశ్యపా, నిరంతరం ధర్మం, ధర్మం అంటూ సమాజంలో అడుక్కుతినే బిక్కులు ఒక్కరు కూడా పాటలిలో లేకుండా తరిమికొట్టాం. మీకిదే చివరి అవకాశం. ధర్మాన్ని విడిచి, వేదాన్ని ఆశ్రయించండి. ధర్మమనే పదాన్ని, బుద్ధుడనే నామాన్ని పలికేవాడే లేని రాజ్యాన్ని సృష్టిద్దాం. అయినా బ్రాహ్మణ పుటక పుట్టి బౌద్ధాన్ని ఆశ్రయించడమేంటి కాశ్యపా, ఇప్పటికైనా తిరిగి బ్రాహ్మణ మతాన్ని స్వీకరించండి. లేకుంటే మీ తల కూడా తెగిపోతుంది. వాయువ్య సరిహద్దుల్లో యవనుల గోల లేకుండా ఉంటే బిక్కుమేధంలో మునిగిపోయేవాడ్ని. ఈ సారి నేను వచ్చేసరికి బహుశా నువ్వొక్కడివే ప్రాణాలతో ఉంటావు. నీ నాలుక, తరువాత నీ తల తెగకుండా ఉండాలంటే అప్పటికైనా నువ్వు ఈ కాషాయాన్ని విడిచిపెట్టాల్సిందే గుర్తుంచుకో. వీరపాలా! ఏం చేయాలో తెలిసిందిగా, ఈ మహాకాశ్యపుడి తల మాత్రం నాకు వదిలిపెట్టండి” అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు పుష్యమిత్రశుంగుడు.


క్షుద్రకుడి ముఖంలో ఎలాంటి భావాలు కనపడలేదు. ‘ఇప్పుడు మనం మన ప్రాణాలపైన ఎలాంటి ఆశ పెట్టుకోకుండా ఉంటేనే ఈ పని చేయగలం’ అని మాత్రమే అన్నాడు. సునిధి కూడా ఏది ఏమైనా సరే ఆచార్యులవారిని రక్షించడానికే మొగ్గుచూపడంతో క్షుద్రకుడు ప్రణాళికను సిద్ధంచేశాడు.

“పాటలీనగర దక్షిణ ప్రాకారానికి సమీపంలో దాదాపు వంద సంవత్సరాలుగా మూతపడి వున్న ఆ చెరసాలకు భూలోక నరకమని పేరు. ఇప్పటికీ దాన్ని తలుచుకొని వణికిపోతారు కొంతమంది. అశోక చక్రవర్తి బందీలను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయడానికి ఎక్కడెక్కడినుంచో తెప్పించిన యంత్రాలతో అత్యంత పటిష్టంగా నిర్మించాడు. దానికి రెండు రహస్య సొరంగమార్గాలు ఉన్నాయి, ఒకటి గంగానది వైపు, రెండోది హిరణ్యబాహునది వైపు. మనకిప్పుడు రక్షణ తక్కువ ఉండే హిరణ్యబాహునది వైపు మార్గం ఎంచుకోవడం శ్రేయస్కరం. దాదాపు ఆరువందల అడుగుల మార్గం అది. దాని ద్వారాన్ని పెద్దపెద్ద బండరాళ్ళ మధ్య ఎవరికీ కనబడని విధంగా బలమైన చెక్కలతో నిర్మించారు. ఓ సారి ప్రవేశించాక అక్కడ నుండి ఆచార్యులవారిని రక్షించడం పెద్ద కష్టం కాదు. అక్కడ నుంచి బయటపడ్డాక పాటలి నుంచి సుదూరంగా వెళ్ళిపోవాలి. ఎటు వెళ్ళాలి అనేది కూడా ముందుగానే నిర్ణయించుకోవడం మంచిది.”

“మనకిప్పుడు పుష్యమిత్రుడిని ఎదిరించి ఆశ్రయం ఇవ్వగల రాజ్యాలు ఏమన్నా ఉంటాయా?”

“ఉజ్జయిని, విదేహ, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, మద్ర ప్రాంతాలలో పుష్యమిత్రుడి అనుకూలురే అధికారంలో ఉన్నారు. తక్షశిల మనకు రక్షణ ఇవ్వగలదు. కాని యవనుల ఆడపడుచైన బృహద్రథుడి భార్యతో సహా ఆ కుటుంబంలోని అందరినీ అంతమొందించడం వల్ల ఆగ్రహంతో ఉన్న యవనులు చేస్తున్న అలజడులను అణచడానికి రేపు సాకేత, మధుర మీదుగా మద్ర రాజధాని సాకల వైపు పుష్యమిత్రుడు తన సైన్యంతో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనం తక్షశిల వైపుకి ప్రయాణం చేయలేం. వైశాలి, కపిలవస్తుల్లో తలదాచుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో కొంత కష్టమైనా సరే మీరు సింహళ రాజ్యం చేరుకోవడమే అన్ని విధాల శ్రేయస్కరం.”

“అంత దూరప్రయాణం ఈ పరిస్థితుల్లో…”

“తప్పదు సునిధీ, దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. గంగలో పయనిస్తూ తామ్రలిప్తి చేరి అక్కడ నుండి ఓడలో సింహళవైపు పయనం కావడం. కాని ఆ వైపు సైనిక పర్యవేక్షణ చాలా ఎక్కువ. అంతేకాక అంగ, వంగ రాజ్యాలు పుష్యమిత్రుడితో స్నేహసంబంధాలనే కోరుకునేవారు. ఆచార్యులవారిని బంధించే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ప్రమాదకరమైనా సరే, మనమిప్పుడు హిరణ్యబాహునదినే నమ్ముకోవాలి. నిమ్మళమైన ప్రవాహంతో ఉన్న హిరణ్యబాహులో 15 యోజనాలు ప్రయాణిస్తే పటీల గ్రామం వస్తుంది. అక్కడ నుండి దుర్గమమైన అటవీ మార్గంలో దాదాపు ముప్ఫయి అయిదు యోజనాల దూరంలో మల్హర విహారం మహానది ఒడ్డున ఉంది. అది మనకు అత్యంత సురక్షితమైనది. దానిని చేరుకోగలిగితే మనం బయటపడ్డట్టే. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని విశాఖారామం వైపు పయనమై తూర్పు సముద్రాన్ని చేరి అక్కడ సింహళానికి వెళ్ళే నావను అందుకోవచ్చు. కాకుంటే ఈ మార్గంలో దట్టమైన అడవులు, పర్వతాల గుండా ప్రయాణం చేయాలి. నాకా ప్రాంతమంతా సుపరిచితమే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొనిపోగలను. ఎల్లుండి అమావాస్య, రాత్రి మొదటిజాము ముగిసిన వెంటనే మన ప్రణాళికను అమలు పరచాలి. మీరు ఆ సమయానికి వేరువేరు మార్గాల ద్వారా నేను చెప్పిన ప్రదేశానికి చేరుకొనండి. పడవకు సంబంధించిన ఏర్పాట్లు నేను చూస్తాను.”

ఎంత నిశ్శబ్దంగా వచ్చాడో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమించాడు మహాక్షుద్రకుడు.


బిక్కుల శవాల మధ్య అచేతనంగా పడి ఉన్న మహాకాశ్యపుల ముఖాన నీరు చిలకరించి, ‘ప్రాణాలతో ఉన్నారు ఆచార్యులవారు’ అంటూ ఆయనను రెండుచేతులతో ఎత్తి, వడివడిగా సొరంగమార్గం నుంచి బయటకొచ్చి హిరణ్యబాహునది ఒడ్డునున్న పడవలో జాగ్రత్తగా పడుకోబెట్టాడు మహాక్షుద్రకుడు.

“సునిధీ! నువ్వు రేపు పాటలీ వదలి తామ్రలిప్తి వైపు పయనం సాగించు. నీ మీద ఎవరికి ఎలాంటి అనుమానముండదు. అక్కడి నుండి సింహళ రాజ్యానికి వర్తమానం పంపు. మేమక్కడ విశాఖారామం వద్ద ఎదురు చూస్తుంటాం. పద చంద్రకీర్తీ” అంటూ పడవ ముందు భాగంలో కూర్చున్నాడు. పడవ నడిపే నావికులు లేకుండా ఎలా అంటున్న చంద్రకీర్తి సందేహాన్ని విని పెద్దగా నవ్వి, సమాధానమేమీ చెప్పకుండా సునిధికి వీడ్కోలు చెప్పాడు మహాక్షుద్రకుడు.

“ఆచార్యులవారికి జావ పట్టండి భంతే. ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. స్పృహ ఉంది కాని ఏదో మగతలో ఉన్నట్లుగా ఉన్నారు. బహుశా బిక్కులను ఆయన ఎదురుగా అనేక చిత్రహింసలతో క్రూరంగా చంపడం ఆచార్యులవారిని మానసికంగా చాలా బలహీనపరిచినట్లుంది. పటీలాలో మా పినతండ్రి కుటుంబం ఉంది. వైద్యంలో వాళ్ళు దిట్టలు. ఒకటి రెండు రోజుల్లో ఆచార్యులను పూర్తిగా కోలుకొనేలా వారు చేయగలరు” అంటూ తన పక్కన ఉన్న పెద్ద పాత్రనుంచి ఓ మాంసపు ముద్దను తీసి కర్రకు కట్టి నీటిలో పెట్టాడు క్షుద్రకుడు. పడవ వేగం ఇంకాస్త హెచ్చింది.

ఎలాంటి తెడ్లు వేయకుండా వేగంగా వెళ్తున్న పడవను ఆశ్చర్యంగా చూస్తున్న చంద్రక్రీర్తిని చూస్తూ, “నేను మచ్చిక చేసిన మొసళ్ళు దీన్ని లాగుకొని వెళుతున్నాయి. ఇంత వేగంగా ఈ ఎదురు ప్రవాహంలో తీసుకెళ్ళగలిగే నావికులు ఎవరూ ఉండరు. నేను పదేళ్ళు మగధరాజ్యంలో వేగుగా పనిచేశాను. మాకు గుర్రాలు, ఏనుగులు కంటే ఇలాంటివే ఎక్కువ దగ్గర” అంటూ చిన్నగా నవ్వాడు మహాక్షుద్రకుడు.

మల్హర విహారం చేరాక, అప్పటి వరకు రహస్యంగా జాగ్రత్తగా దాచిన పవిత్రమైన బుద్ధుని భిక్షాపాత్రను ఆచార్యులవారికి భద్రంగా అప్పగించి ఆ రకంగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు చంద్రకీర్తి. ఆ పాత్రను ఆసనం పైన ఉంచి దానికి సాగిలపడ్డారు ఆచార్యులవారు.

భిక్షాపాత్ర చూడగానే ఆయన ప్రాణం లేచివచ్చినట్లయ్యిందేమో ఆ సంతోషం ఆయన ముఖంలో కనిపించింది. ఇంతవరకూ ప్రయాణంలో ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడని ఆచార్యులవారు మొదటిసారిగా నోరు విప్పి అన్నారు:

“చంద్రకీర్తీ! భిక్షాపాత్రను ఎంత నిబద్ధంగా కాపాడామో, అంతే నిబద్ధంగా దమ్మాన్ని కూడా కాపాడాల్సిన భాద్యత మనపైనే ఉంది. దమ్మం కోసం నేలకొరిగిన బిక్కుల నెత్తురు వాసన ఇంకా నాకు పచ్చిగానే తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో కఠినమైన పరిస్థితులను దమ్మం ఎదుర్కోవలసి రావచ్చు. మనం లేకపోయినా, భవిష్యత్తు తరాలకు దమ్మం అందాలంటే దాన్ని లిపిబద్ధం చేయాలి. లేకుంటే అది మన నాలుకో, కంఠమో దేహం నుంచి వేరుపడినట్లు సంఘం నుంచి దూరమైపోతుంది. త్రిపిటకలలోని ప్రతి గాథ, సుత్తం రాతప్రతులలో జాగ్రత్త చేయబడాలి. అది ఆ బుద్ధభగవానుడే పుష్యశుంగుడితో నాకు చెప్పించినట్లున్నారు. సింహళ చేరగానే ఆ ప్రయత్నాలు మొదలుపెడదాం” అన్నారు మరోసారి పవిత్ర భిక్షాపాత్రకు నమస్కరిస్తూ.

“అలాగే భంతే” అన్నాడు చంద్రకీర్తి.

మౌఖిక సంప్రదాయంలో బతికే అవకాశం లేనప్పుడు ఎంత శ్రమతో కూడుకున్నదైనా సరే దమ్మం ఎక్కడో ఓ చోట సంపూర్ణంగా లిపిబద్ధం చేయబడటం మంచిదే అనిపించింది చంద్రకీర్తికి కూడా.

ఆచార్య మహాకాశ్యపులవారికి వీడ్కోలు చెప్పడానికి విశాఖారామ పరిసరాల్లోని అనేక విహారాలనుంచి విచ్చేసిన బిక్కులతో సముద్రగర్భంలోకి చొచ్చుకొని ఉన్న ఆ చిన్నపర్వతమంతా నిండిపోయింది. తెరచాపలతో సముద్రంపై ఊయల ఊగుతున్న నావ వైపుకి పయనిస్తూ ఉన్న చిన్న పడవ నిదానంగా వారికి దూరమయింది. అప్పటివరకు వారికి తోడునీడగా అండగా రక్షణగా నిలబడ్డ మహాక్షుద్రకుడు అక్కడే ఆగిపోయాడు.

సచే లబేద నిపకం సహాయం సద్దించరం సాదువిహీరిదీరం
అబిబుయ్య సబ్బాని పరిస్సయాని చరేయ్య తేనత్తమనో సతీమా

మంచినడత, తెలివితేటలు ఉన్న సహాయకుడు లభిస్తే అన్ని అపాయాలను అధిగమించవచ్చు. అట్టివానితో చెలిమి మనసుకి ఆనందాన్నిస్తుంది. స్మృతిని పెంచుతుంది. (328 నాగవర్గం దమ్మపదం)


“మరి సింహళ వెళ్ళగానే త్రిపిటకలు లిపిబద్దమయ్యాయా?” అంది ఆసక్తిగా నా వైపు చూస్తూ మాధవి.

“లేదు మధూ! దానికి ఇంకో వంద సంవత్సరాలు పట్టింది. ఇక్కడి లాంటి పరిస్థితే శ్రీలంక రాజులు కూడా ఎదుర్కొన్నాక గాని వారు దీన్ని సీరియస్ విషయంగా తీసుకోలేదు. హూణులు, శకులు, అరబ్బులు, యవనులు చేసిన దాడులను మనం ఎలా విదేశీ దండయాత్రలుగా చూస్తామో, అలా శ్రీలంకవారికి చోళ, చేర, పాండ్య లాంటి తమిళరాజులు. వీరిని నియంత్రించడానికి అనేక యుద్దాలు జరిగాయి. ఆ కాలంలో శ్రీలంక బౌద్దాన్ని యుద్దాన్ని చెరో చేత్తో పట్టుకొని నడిచినట్లనిపిస్తుంది వాళ్ళ చరిత్రను చదివితే. చివరికి వట్ఠగామి అభయ అనురాధాపురానికి రాజు కాగానే క్రీ.పూ. 89లో రాతప్రతులను పూర్తి చేశారు. కాకుంటే వారిలో అలాంటి ఆలోచన కలగడంలో మహాకాశ్యపుడు, చంద్రకీర్తి లాంటి వారి అనుభవాలు కూడా కారణమై ఉండొచ్చు. మత సంబంధమైన అంశాలను అనేక శ్రమలకోర్చి మొదటిసారిగా రాతప్రతుల్లోకి మార్చింది బౌద్ధమే. దీనికి సంబంధించి శ్రీలంకలో ఒక సినిమా కూడా వచ్చింది ఆలోకో ఉదపాది అని.”

“మరి శుంగులు భారతదేశం నుంచి బౌద్దాన్ని, అదే ధర్మాన్ని తరిమేయగలిగారా?”

“దాదాపు. ఓ వేయి సంవత్సరాల తరువాత పుష్యమిత్రుడి ఆశ నెరవేరిందనే చెప్పుకోవాలి. 12వ శతాబ్దం నాటి నుండి దాదాపు 18వ శతాబ్దం చివరివరకు భారతదేశం బౌద్ధం అనే సంగతే మర్చిపోయింది. బుద్ధుడు బ్రాహ్మణ పురాణాలలో విష్ణు అవతారంగా మారిపోయాడు. కాని బ్రిటిష్‌వారి రాకతో పరిస్థితి మారింది. బౌద్ధానికి సంబంధించిన అనేక విహారాలు, చైత్యాలు, స్తూపాలు వారి పురాతత్వ తవ్వకాలలో బయటపడ్డాయి. చరిత్రపట్ల వారికి ఉండే ఆసక్తి అశోకుడి శాసనాలను చదివించగలిగింది. అసలు ప్రాచీన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు మౌర్యుల నుండి గుప్తుల దాకా రాజధానిగా ఉన్న పాటలీపుత్ర అనే నగరం ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియలేదు. ఏషియాటిక్ సొసైటి స్థాపించిన సర్ విలియమ్ జోన్స్ పాలిబోత్ర అని మెగస్తనీస్ రాసింది పట్టుకొని దానిపైన అనేక పరిశోధనలు చేశాడు. మెగస్తనీస్ పాలిబోత్ర అనేది గంగా, ఇరానీబోస్ అనే నదుల సంగమ స్థలంలో ఉందని చెప్పడం, ఇంకో గ్రీకు రచయిత అలహాబాద్ నుంచి దూరం ఇవ్వడం వలన చివరికి దాన్ని పాట్నా దగ్గరగా తేల్చారు. కాని ఈ ఇరానీబోస్ అనేది ఏ నది అనేది తెలుసుకోవడం కష్టమైంది. దీనికి పరిష్కారం 8వ శతాబ్దంలో విశాఖదత్తుడు రచించిన ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం నుంచి విలియం జోన్స్‌కి లభించింది. దానిలో పాటలీ నగరం గంగ, హిరణ్యబాహు అనే నదుల సంగమ స్థానంలో ఉందని చెప్పబడింది. ఆ హిరణ్యబాహే గ్రీకుల ఇరానీబోస్. అది ఇప్పుడు పాట్నాకి పడమరగా 35కి.మీ. దూరంలో ఉన్న శోణానది. అది గత రెండువేల సంవత్సరాలలో 35కి.మీ. పడమటివైపుకి జరిగింది. చరిత్రను అన్వేషించడంలో ఉన్న మజాను బ్రిటీష్‌వాళ్ళు బానే ఆస్వాదించారు భారతదేశంలో. బ్రాహ్మణ మతమైతేనేం, లేదా వేరే ఏ కారణాలైతేనేం కాని, నేను బౌద్ధుడిని అనేవాడు ఒక్కడు కూడా లేకుండా దాదాపు ఏడు వందల సంవత్సరాలు సుప్తావస్థలో ఉన్న బౌద్ధం మళ్ళీ భారతదేశం స్వాతంత్ర్యం పొందేనాటికి జాతీయ జెండాపై ధర్మచక్రమై రెపరెపలాడింది. నాణాలపైన, కరెన్సీపైన సారనాథ స్తూపంలోని నాలుగు సింహాల శిల్పమే జాతీయచిహ్నం అయింది. ఇంకా తమాషా ఏంటంటే ధర్మం అనే పదాన్నే దూరం పెట్టాలనే బ్రాహ్మణవాదులు చివరకు హిందూ ధర్మం అనే పదం క్రిందే మతాన్ని ఏకీకరణచేసే పరిస్థితి. బౌద్ధులకు మాత్రమే సంబంధించిన కాషాయం, హిందూధర్మానికి ప్రతిరూపమైంది, మనుధర్మశాస్త్రంలో కాషాయంపై నిషేధం ఉన్నా సరే. ఇంకో సాంస్కృతిక సత్యం ఏంటో తెలుసా మధూ, నువ్వు కట్టుకున్న చీర కూడా బౌద్దం డిజైన్ చేసిన చీవారమే.”

“ఏంటి నిజమా?” అంది మాధవి.

“అవును మధూ! బిక్కులు, బిక్కుణిలు ధరించే కాషాయ దుస్తులను చీవారాలు అంటారు. గత రెండున్నర వేల సంవత్సరాలుగా అది బౌద్ధ సంఘ సంప్రదాయం. ఆ చీవారమే క్రమంగా చీరగా మన భారతీయ స్త్రీ సంప్రదాయ వస్త్రంగా నిలిచిపోయింది కుచ్చిళ్ళు పెట్టుకోవడంతో సహా.”

“ఓ! అంటే బౌద్ధం భౌతికంగా దూరమయ్యిందే కాని మానసికంగా భారతీయులను అంటిపెట్టుకొనే ఉందన్నమాట, వారికి తెలియకపోయినా.”

“హాఁ! అంతే మధూ.”

“అది సరే కాని, నిజంగానే చరిత్రలో అంత తీవ్రమైన ఘర్షణలు జరిగాయా?”

“మన దేశంలో మొదటి మత ఘర్షణలు నమోదైంది అశోకుడి కాలంలో మగధ రాజధాని పాటలిలోనే. ఆ రోజుల్లో మగధ రాజకీయాలకే కాదు అనేక మతాలకూ కేంద్ర స్థానంగానే ఉండేది. అజీవకమతంవారు బుద్ధుని ప్రతిరూపంగా చూసే చిహ్నాలను ఉద్దేశ్యపూర్వకంగా అపవిత్రం చేశారని కోపోద్రిక్తుడైన అశోకుడు, అజీవకుల తల నరికి తెచ్చినవాళ్ళకి తలకు ఒక బంగారు నాణెం ఇస్తానని ప్రకటిస్తాడు. కాని ఆ సందర్భంలో అజీవకుడిగా భావించి శ్రమణుడైన అశోకుని తమ్ముడి తల కూడా తీసుకురాబడంతో దాన్ని రద్దు చేస్తాడు అశోకుడు. పుష్యశుంగుడు సాకలలో ఒక్కో బౌద్ధ బిక్కువు తలకు వంద వరహాలు ప్రకటించాడని అంటారు. సాకల అంటే ఇప్పుడు పాకిస్తాన్ లోని సియోల్ కోట్.”

“అజీవకులు అనేది ఒక మతమా?” ఆశ్చర్యంగా అడిగింది మాధవి.

“మతమే, ఆ రోజుల్లో మత విధానం రెండు భాగాలుగా ఉండేది. ఒకటి బ్రాహ్మణ లేదా వైదిక సంప్రదాయం, రెండోది శ్రమణ సంప్రదాయం. శ్రమణుల్లో 63 వాదాలవారు ఉన్నారంటారు. వీరందరికి ఉండే కామన్ పాయింట్ యజ్ఞాన్ని వ్యతిరేకించడం. వీరిలో బౌద్ధులు, జైనులు (నిర్గ్రంధులు), అజీవకులు, లోకాయతులు, అచలికులు, జటిలలు, చార్వాకులు ముఖ్యమైనవారిగా చెప్పుకోవచ్చు. వీరు కర్మకాండల్ని, యజ్ఞాలను, ఆర్భాటాలను వ్యతిరేకిస్తారు. ప్రశ్నకు, జ్ఞానానికి, తత్వ విచారణకు విలువనిస్తారు. సామాజిక అసమానతల్ని పెద్దగా పట్టించుకోరు. కాకుంటే ఈ శాఖలన్నీ భిన్న కారణాలతో ఒకదానికొకటి విభేదిస్తూ ఉండేవి. అజీవక మత స్థాపకుడు మక్ఖలి గోశాలి. ఈయన వర్థమాన మహావీరునికి సహచరుడుగా కొంతకాలం ఉన్నాడని చెబుతారు. అజీవకుల నియతి వాదం కర్మసిద్దాంతాన్ని బలంగా వ్యతిరేకిస్తుంది. నువ్వు చేసే మంచి, చెడు నువ్వు పొందేదాన్ని నిర్ణయించలేవు. కేవలం నీవు ఏమి పొందాలి అని నిర్ణయించబడి ఉందో దాన్ని మాత్రమే నువ్వు పొందుతావు. అంతే కాని, నువ్వు చేసే ప్రయత్నాల వల్ల కాదు అని చెబుతారు. అంటే మానవ ప్రయత్నం వల్ల మానవుడు ఏదీ పొందలేడు, అది మోక్షమైనా, నిర్యాణమైనా సరే అనేది వీరి వాదన. అజీవకులు ఆ కాలంలో బలమైన మతమే. భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు అజీవకుల కోసం చెక్కించినవే. ఈ రోజుకంటే మతస్వేచ్ఛ ఆ రోజుల్లో ఓ రకంగా ఎక్కువే. భార్య ఒక మతం అయితే, భర్త ఇంకో మతంలో ఉండేవారు. అంతెందుకు అశోకుడి తల్లి అజీవిక.”

“మతం, రాజకీయం – దేనికోసం ఏది పనిచేస్తుందంటావు?”

“మంచి ప్రశ్నే. మతం ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటుందో, అప్పుడల్లా రాజకీయాల చేతిలో అది కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు. ఒక్కసారి మతం లోని మూఢత్వపు రుచిలో జనాన్ని ముంచడం వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలు అర్థమయ్యాక రాజకీయం దాన్ని వదులుకోలేదు. నిజానికి మతం యొక్క అవసరం సమాజానికో, మనిషికో లేకపోతే ఇంతకాలం మతం మనగలిగేది కాదు. మతం కొన్నిరోగాలకు ఒక వైద్యం లాగానే పనిచేస్తుంది. కాని కొన్నిసార్లు రోగం కంటే వైద్యమే భయకరమైన జబ్బుగా మారిపోతుంది.”

“భలే చెప్తావోయ్ నువ్వు, అయినా ఆ మగధ రాజ్యం పాకిస్తాన్ దాకా ఉండటం నిజమేనా?” ఆసక్తిగా అడిగింది మాధవి.

పెద్దగా నవ్వుతూ అన్నాను, “ఇప్పుడు భారతదేశం నుంచి తమిళనాడు, కేరళ తీసేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్‌లో కొంత కలిపితే ఎంతో అంత విశాలమైనది మౌర్యసామ్రాజ్యం. దానికవతల యవనులు అంటే గ్రీకు రాజ్యం ఉండేది. ఇక వెళ్దామా మరి?”

“ఆగాగు, లాస్ట్ డౌట్ విశాఖారామం అంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతమే అని భావిస్తున్నావా నువ్వు?” అంది మాధవి నవ్వుతూ.

“విశాఖపట్నం చుట్టూ వెలుగు చూసిన బౌద్ధక్షేత్రాలే పదుల సంఖ్యలో ఉన్నాయి మధూ, వెలుగు చూడనివి వందల్లో ఉండచ్చు. కాని ఎవరూ కూడా విశాఖ పట్నం పేరుకు బౌద్ధాన్ని లింక్ చేయరు ఎందుకో. బౌద్ధంలో ఉండే దశమాతలలో విశాఖ ఒకరు. ఆమె పేరుతో ఈ ప్రాంతాల్లో ఏదైనా పెద్ద ఆరామం ఉండి ఉండచ్చు, అది బావికొండో, తొట్లకొండో, మనం ఉన్న పావురాళ్ళ కొండో లేదా ఇంకోటో కావచ్చు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఆధారాలు ఏం లేకపోయినా ఆ పేరు వలననే ఈ ఊరు విశాఖ అయ్యిందేమో అని చాలాసార్లు అనిపిస్తుంది నాకు.”

“అది సరే మర్చిపోయాను, బుద్ధుని భిక్షాపాత్ర అన్నావ్ కదా అది ఏమయ్యింది, శ్రీలంక చేరిందా?”

“ద్యుతగామనుడనే రాజు అనురాధపురాన్ని గెలిచిన సందర్భంలో ఆ భిక్షాపాత్ర కోసం మహాస్తూపాన్ని నిర్మించాడని చెబుతారు. సరే పద ఇక వెళ్దాం లేటయ్యింది ఇప్పటికే” అంటూ లేచాను.

“ఆగబ్బాయ్ వస్తున్నా” అని, చెప్పులు పక్కన విప్పి ఆ నేలకు నమస్కరించి వచ్చి నాతో అడుగులు కలిపింది మాధవి.