కంపిని వారు వేశిన అరడబ్బు

చాలా మందికి ఈ కథ పెద్ద ఆసక్తికరమైనదేమీ కాకపోవచ్చు. పాతనాణేల గురించి, వాటి కోసం నాలాంటి వాళ్ళ వెంపర్లాట గురించి వాటి వెనుక ఉండే ఉద్వేగాల గురించి, మోసాల గురించి నేనే మర్చిపోయిన అనేక సంవత్సరాల తరువాత మళ్ళీ ఉప్పెనలాంటి అలజడికి కారణమైన ఈ రాగి నాణెం నా చేతిలో లేకుంటే ఈ కథ సాధ్యమయ్యేదే కాదు. ఆ అలజడిని ఎలా చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా.

“నీ జ్ఞానం నిన్ను మరింత మూర్ఖుడిగా మారుస్తుందిరా అబ్బాయ్” అని సుబ్బారావు మాస్టరు గారన్నప్పుడు “జ్ఞానం కాదు వ్యామోహం కదా” అన్నాను నేను. “జ్ఞానం లేకుంటే వ్యామోహమే కలగదబ్బాయ్” అని నవ్వుతూ ఆయనన్న మాటను ఆ రోజు నవ్వుతూ కొట్టిపారేశాను కాని, తరువాత కాలంలో చాలాసార్లు ఆ మాట నన్ను వెంటాడుతూనే ఉండేది.

ఈ నాణేల సేకరణ వెనుక చోదకశక్తిగా పనిచేసే అంశం ఏమిటనేది ఎన్నోసార్లు ఆలోచించే వాడిని. మళ్ళీ మళ్ళీ దానిలోనే కొట్టుకుపోతుండే వాడిని. జీవితంలో సుదీర్ఘమైన పదిహేను సంవత్సరాల కాలం వెతుకులాట, ఆశ, తృప్తి, నిరాశ, ఆందోళన ఇలాంటి ఎన్నో భావనలు ఆ పాత నాణేలతో ముడిపడిపోయాయి. ఒక్కో నాణెం చేతికి చేరుతున్న కొద్ది నాలో ఆనందం పెల్లుబికేదో లేదా మరో నాణెం ఎప్పుడు దొరుకుతుందో అనే బాధ గుండెల్లో చేరేదో అర్థమయ్యేది కాదు. నా జీవితంలో ఏవీ ఇవ్వలేని ఉద్వేగాలను ఈ ప్రాణం లేని పాత నాణేలు ఎందుకు ఇస్తాయో కూడా. మంచంపైన నా చుట్టూ పేర్చుకున్న నాణేలు చూసి క్రింద చాపవేసుకొని పడుకుంటూ ‘ఎప్పుడో పిచ్చివాడివై పోతావురా’ అని నా భార్య నాతో ఎన్ని సార్లు చెప్పిందో. నాకు పిచ్చిపట్టడం ఏమో కాని ఓ రకంగా నా ప్రవర్తన ఆమెకు బయటకు చెప్పుకోలేని తీవ్రమైన మానసిక వ్యథగా మారి ఆమెపై అనేక ప్రభావాలు చూపిందనే మాట నిజం. ఏ రోజూ నన్ను కాని, నా సేకరణను కాని ఆమె ఎప్పుడూ ఒక్కమాటైనా అనడం నేను వినలేదు. మా కుటుంబపు ఆస్తి, ఆమె వంటిపైన నగలు, ఆమె కట్నం తాలుకు పొలాలలో చాలా భాగాన్నే కాదు, నేను నా జీవితంతోపాటు నా కుటుంబాన్ని కూడా ఈ నాణేల సేకరణ అనే వ్యసనానికి బలిచ్చానేమో అనిపించేది.

నాణేల గురించి మరిచిపోయిన ముప్పై సంవత్సరాల తరువాత, మొక్కలకి నీళ్ళు పడుతున్న నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా మనవడు, “తాతా! ఈ కాయిన్ ఆ చెక్కపెట్టెలో దొరికింది. చూడు దీనిపైన తెలుగు అక్షరాలు ఎంత పెద్దగా ఉన్నాయో!” అంటూ. వాడు ఏడో తరగతిలో చేరి వారం రోజులైందేమో, మొన్న వాళ్ళ అమ్మ ఇంట్లో వెనక గదిలో పడేసి ఉన్న పాత రంగూన్ పెట్టెను వాడు పుస్తకాలు పెట్టుకోవడానికి ఇచ్చింది. సుబ్బారావు మాస్టరు దగ్గరున్న ఆ పెట్టెను ఒకప్పుడు నా కాయిన్స్ పెట్టుకోడానికని ఇష్టంగా కొనుక్కున్నాను. దానిలో ఎక్కడో ఇరుక్కుపోయి నా దగ్గరున్న తెలుగు నాణేల సామూహిక నిమజ్జనం నుంచి బయటపడి ఇన్నాళ్ళ తరువాత నన్ను వెక్కిరించడానికో, నన్ను నాకు గుర్తుచేయడానికో లేదా నన్ను పరీక్షంచడానికో నా చేతికి వచ్చినట్లుంది అది.

‘కంపిని వారు వేశిన అరడబ్బు’ – ఆ అక్షరాలు నాణెంపైన పడుతున్న ఎండకి మెరుస్తున్నాయి. 1807లో ఈస్టిండియా కంపెనీవారు ముద్రించిన మద్రాసు ప్రెసిడెన్సీ కాయిన్ అది. ఆ సిరీస్‌కి చెందిన నాణేల సేకరణలో నా దగ్గరకు చేరిన మొదటి నాణెం. రెండు మూడు పేపర్లలో చుట్టి జాగ్రత్తగా దాచిపెట్టడం వల్లనేమో ఇప్పటికి దాదాపు అన్ సర్క్యులేటెడ్ కండిషన్‌ లోనే ఉంది. దానికోసం నేను విక్టోరియా రాణి వెండి రూపాయి నాణేలు రెండు, విజయనగరం రాజులు వేసిన ఒక బంగారు వరహా నాణాన్ని ఎక్స్‌ఛేంజ్ క్రింద ఇచ్చిన సంగతి గుర్తుంది. ఆ రోజు ఈ నాణెం విలువ ఎంతో నాకు తెలియదు కాని, రకరకాల నాణేలు బస్తాల కొద్ది సేకరించిన సుబ్బారావు మాస్టారు వద్ద కూడా ఆ నాణెం లేదు అనేది నాకు దాన్ని నేను పొందేలా చేసిన ముఖ్యమైన కారణం. ఆ కాయిన్ నా చేతికి వచ్చిన రెండు రోజులు నా శరీరమంతా ఓ జ్వరంతో ఉన్నట్లు ఉండేది. ఆ కాయిన్ సంపాయించిన విషయం కొంతకాలం సుబ్బారావు మాస్టరుకు కూడా చెప్పలేదు. నాలుగు తెలుగు నాణేలు సేకరించాక తీసుకెళ్ళి ఆయనకు చూపించాను. వాటిని చూసి ఆయన చాలా ఉద్వేగ పడ్డారు. ఈ రోజు మనం వాడే డబ్బులు, రూకలు అనే పదాలు ఈ నాణేల వలనే ఎక్కువగా చెలామణిలోకి వచ్చాయి. అంతే కాదు కాష్ అనే ఇంగ్లీష్ మాట కాసులుగా, ఫానం అనే మాట ఫణంగా తెలుగులోకి వచ్చాయంటారు. ఇవి చాలా అరుదైన నాణేలు, ఈ థీమ్ తో కాయిన్స్ కలెక్ట్ చేయడం అంత సులభమేమి కాదు. ఆలోచించి నిర్ణయించుకో అని మాత్రం సలహా ఇచ్చారు.

నా నాణేల సేకరణ వ్యసనాన్ని రెండు భాగాలుగా చేయచ్చు. ఆ నాణెం నాచేతికి రాకముందు, వచ్చిన తరువాత అని. మొదట ఎందుకు సేకరణ మొదలుపెట్టానో తెలియదు. ఇంట్లో ఎప్పటి నుంచో బీరువాలో ఓ చిన్న ఇనుప డబ్బాలో పాత నాణేలు కొన్ని ఉండేవి. నా పెళ్ళయిన కొత్తల్లో ఓ రోజు మా పెద్దనాన్న ఎడ్వర్డ్ వెండి రూపాయి నాణెం తెచ్చి ఇచ్చి ‘దీన్ని కూడా నీ దగ్గరే ఉంచుకోరా’ అని చెప్పి దాన్ని ఇచ్చి వెళ్ళాక నా దృష్టి నాణేల సేకరణపైన పడింది. ఇక వాటి కోసం పాత ఇనుపకొట్లు, స్టీల్ సామాను అంగళ్ళు, వెండి బంగారు దుకాణాల చుట్టూ తిరిగేవాడ్ని. ఎప్పుడైనా పేపర్లలో నాణేలు సేకరించే వారి గురించి వచ్చే వార్తలను కత్తిరించి ఓ పుస్తకంలో అతికించుకునే వాడ్ని. వాళ్ళలో ఎవరైనా వెళ్ళి కలవగలిగేంత దూరంలో ఉంటే వెళ్ళి కలిసే వాడ్ని. కొన్ని నాణేలను ఎక్స్‌ఛేంజ్ ద్వారా మార్చుకునే వాడ్ని. డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాడ్ని. అలా కలిసిన వాళ్ళలో సుబ్బారావు మాస్టారు నా సేకరణను ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళాడు. జిల్లాలో పెద్ద సేకర్తగా ఆయనకు పేరు. పేపరులో ఆయన గురించి వచ్చిన వ్యాసం చదివి ఆయన్ను కలిసి పరిచయం చేసుకున్నాను. ఆయన దగ్గరే బ్రిటిష్ ఇండియా వెండినాణాలను ముద్రణ తేదీల వరుసలో కొనుక్కున్నాను. నెలకు ఓ సారైనా ఆయన్ను కలవడం తప్పని సరి. వరల్డ్ కాయిన్స్ బుక్‌ను తొలిసారిగా చూసింది కూడా ఆయన దగ్గరే. ప్రపంచంలో అనేక దేశాల నాణేలు ఆయనతో కలిసి సేకరించాను. చాలా మంది నాణేల డీలర్లతో ఆయనకు పరిచయాలు ఉండేవి. ఆయనెప్పుడూ ఓ మాట చెప్పేవాడు: “దీన్ని వ్యాపారంగా ఎప్పుడూ చూడకు, చూశాక ఇక నాణేలను సేకరించకు.”

నా సేకరణ ఎంత పిచ్చిగా ఉండేదంటే భారత దేశానికి సంబంధించి నాణేలు సంవత్సరాల వారీగా మింట్ వారీగా సేకరించేవాడిని. బ్రిటిష్ ఇండియా, స్థానిక సంస్థానాలు, రాజుల నాణేలు, పంచ్ మార్క్ నాణేలు, వేరే దేశాల నాణేలు, స్వతంత్ర్యం వచ్చాక భారతదేశం వేసిన నాణేలు – ఏవి పడితే అవి సేకరించే వాడిని. సుబ్బారావు మాస్టారు “ఇలా పిచ్చిగా అన్నీ రకాల నాణేలు సేకరించకురా, ఏదైనా థీమ్ అనుకొని వాటి వరకు మాత్రమే పరిమితం అవ్వు” అని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ వినిపించుకోలేదు. ఈ కాయిన్ వచ్చాక మాత్రం కేవలం మద్రాసు ప్రెసిడెన్సీలో పగోడా సిరీస్‌గా పిలవబడ్డ వాటిలో తెలుగు అక్షరాలలో ముద్రించిన ఇరవై ఆరు రకాల నాణేల సేకరణకే నా మొత్తం శ్రమనంతా వినియోగించాను ఈ రెండో దశలో నేను ఎనిమిది సంవత్సరాలపాటు సేకరించిన వేలకొద్ది నాణేలు క్రమంగా కరిగిపోయి, చివరకు డెబ్బై ఆరు నాణాలుగా మిగిలిపోయాయి. వాటి కోసం నేను చేసిన శ్రమ ఏడు సంవత్సరాలు. భార్య, కూతురు, సంపాదన – అన్నీ మర్చిపోయి బతికిన రోజులు అవి.

వాటిపైన ముద్రించిన తెలుగు అక్షరాలు నన్ను ఎందుకు అంతగా ఆకర్షించాయో నాకు తెలియదు. నా చుట్టూ ఉన్న ప్రపంచంలో వాటికంటే అద్భుతమైనవేమీ లేవు అనుకునేవాడిని. వాటినే చూసుకుంటూ రోజుల తరబడి ఉండిపోయే వాడ్ని. ఈ నాణేలలో రూక, రెండు రూకలు, అయిదు రూకలు, రెండు అనాలు, నాలుగు అనాలు, అయిదు కాసులు, పది కాసులు, ఇరవై కాసులు, నలభై కాసులు, డబ్బు, రెండు డబ్బులు, అరడబ్బు, కాలు డబ్బు, మూడు కొత్త డబ్బులు, ఒక చిన్నరూక, రెండు వరహాని, వరహాని, అరవరహాని, పావు వరహాని అనే పగోడాలు ఉండేవి. పగోడా నాణేలపైన ఒక పక్క పెద్ద గాలిగోపురం, మరోపక్క విష్ణుమూర్తి బొమ్మ ఉండేవి. ఈ సీరీస్‌ను మద్రాసు ప్రెసిడెన్సీలో మాత్రమే 1807 నుంచి 1817 మధ్యకాలంలో ముద్రించారు. వీటిలో కొన్నింటిని కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ముద్రించారు. అందువల్లనేనేమో పెద్ద కాయిన్ కలెక్టర్స్‌లో కూడా చాలా మంది వీటిలో చాలావాటిని చూసి కూడా ఉండరు.

వీటిని సేకరించడానికి దక్షణ భారత దేశంలో ఎక్కడో చిన్నచిన్న ఊర్లలో ఉండే చిన్న చిన్న కాయిన్ కలెక్టర్స్‌ను కూడా కలిసేవాడిని. దాదాపు నేను సంపాయించిన మొదటి పదిహేను నాణేలు చిన్న చిన్న కలెక్టర్స్ వద్దే నాకు దొరికాయి. కాని వాళ్ళని కలవడం, మాట్లాడం, వాళ్ళను ఒప్పించి ఆ నాణేన్ని సొంతం చేసుకోవడం అంత సులభంగా ఉండేదేమీ కాదు. గోవా, డిల్లీ, కలకత్తా లాంటి చోట్ల ఏర్పాటు చేసే డీలర్స్ మీట్, కాయిన్ ఎగ్జిబిషన్స్‌కి సుబ్బారావు మాస్టర్‌తో వెళ్ళేవాడిని. కాని సుబ్బారావు మాస్టారు డీలర్ల దగ్గర కాయిన్స్ కొనడాన్ని ఇష్టపడే వారు కాదు. వాళ్ళు నీ అవసరంతో ఆడుకుంటారు. వారి దగ్గర వేయి రూపాయిలకు కొన్న కాయిన్, మళ్ళీ అయిదు నిమిషాల తరువాత అమ్మాలనుకున్నా రెండొందలు మించి రావు. నీకు అవసరం అనుకుంటున్నావు కాబట్టి వేయికి అమ్ముతారు. నువ్వు వదిలించుకోవాలనుకుంటున్నప్పుడు రెండొదలు మించి ఇవ్వరు. నీ వ్యామోహమే వాళ్ళ వ్యాపారం అనేవాడు. నేను ఆ మాటలు లెక్కచేసేవాడిని కాదు. అక్కడ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్స్ ఉన్నాయని తెలిస్తే దాని కోసం వాళ్ళని వెంటాడేవాడిని. రూకల నాణేలు మూడింటి కోసం, కింగ్ విలియమ్ బంగారు నాణం, వెండి రూపాయి, అర్థరూపాయి, పావలా అన్నీ ఎక్స్‌ఛేంజ్‌గా ఇచ్చేశాను, వాటి విలువ చాలా ఎక్కువ అని తెలిసినా కూడా. కేరళలో ఉన్న ఓ చిన్న కలెక్టర్ దగ్గర నలభై కాసులు, రెండు డబ్బులు నాణెం ఉందని తెలిసినప్పుడు దాని కోసం నా దగ్గర ఉన్న మొత్తం తొంభై ఆరు దేశాల కాయిన్స్ ఇచ్చేశాను.

వీటి వ్యామోహంలో పడ్డాక, నేను విలువ గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కూడా లేను. నేను మోసపోయాను అనేదాని కంటే నా కోరికను తీర్చుకోవడం కోసం నష్టపోయాను అనేది నిజం. కొన్ని సార్లు కొంతమందిని మోసం కూడా చేశాను. వాటి విలువకంటే తక్కువ వాటిని ఎక్స్‌ఛేంజ్‌కి ఇచ్చి. ఒకసారి ఎంత బతిమిలాడినా ఇవ్వని ఓ వ్యక్తికి మందు పోసి పోసి చివరకు కాలుడబ్బు అనే చిన్న నాణేన్ని చేజిక్కించుకున్నాను. పగోడాలు ఉన్న ఓ వ్యక్తి నుంచి వాటిని పొందడానికి ఓ పూజారికి డబ్బులు ఇచ్చి అలాంటి కాయిన్స్ ఇంట్లో ఉంటే అరిష్టమని అనేక సార్లు చెప్పించాల్సి వచ్చింది. ఇలాంటి సమయాలు చాలా కష్టంగా అనిపించి నన్ను ప్రశ్నిస్తున్నట్లుగా ఉండేవి. నా దగ్గర ఉన్న నాణెం మళ్ళీ దొరికినా, వాటిని కూడా సేకరిస్తూనే ఉండేవాడిని. అలా మూడు నలభై కాసులు, పదహారు అరడబ్బులు, ఎనిమిది పదికాసులు, నాలుగు కాలు డబ్బులు అలా చేరుతూనే ఉండేవి. ఇలా ఉన్నవే మళ్ళీ మళ్ళీ చేరేకొద్ది లేని వాటి కోసం మరంత ప్రయత్నించే వాడిని. చేరినవి ఇచ్చే ఆనందంకంటే నా దగ్గరకు చేరకుండా ఊరించే నాణేలు నన్ను స్తిమితంగా ఉండనిచ్చేవి కావు. దేశమంతా తిప్పుతూనే ఉండేవి. తిరుమల, తిరుపతి దేవస్థానం వారు వేసిన వేలంపాటలో నేను, సుబ్బారావు మాస్టారు డెబ్బైవేలు పెట్టి కొన్న రెండు లాట్లలో నాకు కావలసిన ఒక్క నాణెం కూడా దొరకకపోవడం నన్ను చాలా నిరాశపరిచింది.

సుబ్బారావు మాస్టారు మరణించాక ఓ ఐదారు నెలలు ఎందుకో ఏ నాణెం కోసం ప్రయత్నించకుండా స్తబ్దుగా ఉండిపోయాను. వాళ్ళ పిల్లల్లో ఎవరికి నాణేల పట్ల ఆసక్తి లేకపోవడంతో ఆయన సేకరించినవన్ని బస్తాల్లో కట్టించి ఓ గదిలో పడేశారని తెలిసింది. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేకపోవడం వల్ల అవి కాపాడబడ్డాయి అని మాత్రం కొంచెం ఆనందించాను. నాకు కావలసిన నాణాలు ఏవి ఆయన దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి నేను మళ్ళీ వెళ్ళే అవసరం రాలేదు.

అప్పటికి నా కలెక్షన్‌లో ఇంకో మూడు నాణాలు మాత్రమే చేరాల్సి ఉంది. వాటి కోసం దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సిరీస్‌లో ఊరించి ఊరించి చివరగా చేరిన నాణెం మూడు కొత్త డబ్బులు ఒక చిన్న రూక నాణెం. ఆ రోజు నా ఆనందం చెప్పనలవి కానిది. అన్ని నాణాలు వరసగా పెట్టుకొని కొన్ని వందల సార్లు చూసుకొని ఉంటాను. నన్ను నా కూతురు దూరం నుంచి బిక్కుబిక్కుమంటూ చూడటం గుర్తుంది. ఆ పిల్ల పుట్టిన పన్నెండేళ్ళలో ఎప్పుడూ దగ్గరకు పిలిచి మాట్లాడని నేను మొదటిసారి దగ్గరగా పిలిచి కూర్చోబెట్టి వాటిని చూపించాను. బహుశా చాలా కాలం తరువాత నా భార్యా పిల్లలతో కొంచెం ప్రశాంతంగా గడిపాననుకుంటా.

ఆ చివరి కాయిన్ వచ్చిన సంవత్సరంలోపే నా భార్య కాన్సర్‌తో మరణించింది. ఆమె ఆరోగ్యం గురించి నేనే కాదు, ఆమె కూడా పట్టించుకోలేదనుకుంటా. ముప్పై ఏడేళ్ళ వయసులోనే చనిపోతానని తెలిసినా ఆమె ముఖంలో ప్రశాంతత చెక్కుచెదరలేదు. చనిపోయే ముందు ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట: “నాణాలు గురించి కొంచెం పక్కన పెట్టి, కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు.” కనీసం ఆమె కళ్ళలో నా పట్ల కోపాన్ని కూడా చూడలేకపోయాను. ఆమె నన్ను తిట్టి ఉంటే బావుండేదేమో.

నా భార్య నడిపే అంగడినే ఇంకొంచెం పెంచాను. వ్యాపారం బాగానే సాగేది. నా కూతురు గురించి పట్టించుకోవడం ప్రారంభించా. క్రమంగా నాణేల పట్ల ఆసక్తి తగ్గిపోవడం ప్రారంభించింది. నేను అనుకున్న అన్ని రకాలు నా దగ్గరకు చేరడమో, నా భార్య నాకు దూరం కావడమో, ఆమె ముఖంలోని ప్రశాంతతో ఏది కారణమో తెలియదు కాని ఇక నాకు అవి వద్దు అనిపించింది. అలా అని వాటిని ఎవరికైనా ఇచ్చేయలని కూడా అనిపించలేదు. నా భార్య అస్తికలను నదిలో కలిపే సందర్భంలో నా దగ్గర ఉన్న అన్నీ నాణాలను నీటిలో వదిలేశా. అది పెద్ద బాధను కూడా కలిగించలేదు. వాటి గురించి కూడా ఎలాంటి ఆలోచనలు రాలేదు. నా కూతురు మంచి ఉద్యోగంలో స్థిరపడింది. అల్లుడు కూడా నా పట్ల ఆప్యాయంగా ఉండేవాడు. నేను వాళ్ళ దగ్గరే ఉంటూ ఇంటిని చూసుకుంటూ, మిద్దెపైన చిన్న తోటను పెంచుకునేవాడ్ని.

మళ్ళీ ఇన్నీ రోజుల తరువాత, ఈ కాయిన్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏదో భయం నాలో.

ఇంతలో మళ్ళీ మనవడు సెల్ తీసుకొని “చూడు తాతా, ఈ కాయిన్ చాలా కాస్ట్‌లీ” అంటూ వచ్చాడు. అప్పటికే వాడు ఆ నాణేల గురించి నెట్లో చాలా సమాచారం సేకరించాడు. “నేను సోషల్‌లో నెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తా తాతా. ఆ కాయిన్ ఇవ్వు, ఇంకొన్ని కలెక్ట్ చేస్తా” అన్నాడు. “అవునా!” అని పెద్దగా నవ్వుతూ “అవేమి వద్దులేరా” అంటూ ఆ నాణెం చేతిలో అటూ ఇటూ తిప్పుతూ ఆ వీధి చివరి వరకూ వచ్చాను. అన్ని కాయిన్స్ పారేసేటప్పుడు కూడా వాటి వైపు ఓసారి చూడలనిపించలేదు కాని, దీన్ని మాత్రం అరచేతిలో ఉంచుకొని దాని వైపు కాసేపలా చూస్తుండి పోయాను.

“కంపిని వారు వేశిన అరడబ్బు. ఆ నాణెం నా గురించి ఏదైనా ఆలోచిస్తుందా?” ఆ ఆలోచనకే నవ్వొచ్చింది.

పక్కనే తుప్పుపట్టి ఎప్పటి నుంచో పనిచేయని చేతి బోరుకి ఉన్న రంధ్రంలో ఉంచి దేవుడి హుండీలో వదిలినట్లు ఆ కాయిన్ని వదిలేశాను.

బహుశ ఎక్కడినుంచో చూస్తున్న ప్రశాంతమైన నా భార్య ముఖంలో ఓ చిన్నపాటి నవ్వు ఉండి ఉంటుందేమో!

ఇప్పుడు ఆ నాణేల పట్ల ఎలాంటి ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. కాని నా దగ్గర ఉంచుకునే ధైర్యం లేదు.