దేవగిరి

మనకొచ్చే అనేకానేక సందేహాలకు చరిత్ర సమాధానం చెప్పదు, ఎందుకంటే అదంతా ఎవరో ఒకరు వారి పరిధి మేరకు రాసిందే కాబట్టి. కొన్ని సమాధానాలను మనమే వెతుక్కోవాలి. మనం దొరకబుచ్చుకున్న అంశాలను విశ్లేషించి మనదైన వ్యాఖ్యానంతో తృప్తిపడాలి.


దాదాపు యాబై యోజనాల ప్రయాణం. వారం రోజులుగా ఎక్కడా సరైన పూటకూళ్ళ ఇల్లు కూడా దొరకలేదు. ఉదయం నుంచి ఆగకుండా దౌడుతీసి అలసిన గుర్రాలను పచ్చికకు వదిలి, పెద్దవేపచెట్టు నీడలో మానుకి ఆనుకొని, కాళ్ళు బారజాపుకొని కనిపిస్తున్న కొండల వైపు తదేకంగా చూస్తూ, పక్కనే ఉన్న వీరబాహుడితో అన్నాడు రామాచారి, “కొద్ది దూరంలోనే ఉన్నాం వీరా, సాధించగలమా కార్యాన్ని?” అని. తన సంచిలోని పరికరాలను తీసి, ఒక్కోటి చూసుకొని పక్కన పెడుతూ “ఖచ్చితంగా స్వామీ!” అన్నాడు వీరబాహు నవ్వుతూ. వెనకకు వాలి విశ్రాంతిగా పడుకున్న రామాచారిని అలసట అతనికి తెలియకుండానే నిద్రలోకి జోకొట్టింది.


హఠాత్తుగా రాజమందిరం నుంచి పిలుపు, ఉన్నపళంగా రమ్మని. వెళ్ళేసరికి రుద్రసేనాపతి తనకు అత్యంత ఆంతరంగికుడైన మంత్రి విశ్వేశ్వరయ్యతో కూర్చొని ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. వారిద్దరికి నమస్కరించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు రామాచారి.

“రామాచారీ, కోటల నిర్మాణంలో ప్రణాళికల్లో మీకున్న సమర్థత, ఆలయశిల్పాల పట్ల మీకున్న అవగాహన మాకు తెలుసు. అలాగే ఈ రాజ్యం పట్ల మొక్కపోని మీ విశ్వాసం కూడా. కొంతకాలం సైన్యంలో పనిచేసిన అనుభవం కూడా ఉండటం వల్ల మన రాజ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పనిని మీకు అప్పగించాలని నిర్ణయించాం” అంటూ ఆగాడు, మంత్రి విశ్వేశ్వరయ్య.

“ఇప్పుడు రాజ్యంలో చెలరేగుతున్న కల్లోలం, అనిశ్చితి ఎక్కువ కాలం కొనసాగడం రాజ్యానికి క్షేమం కాదు. రుద్రసేనుడు రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆ విషయంలో అనేక మాటలు కూడా ఎదుర్కుంటున్నాడు. ఇంతకాలంగా ఎంత ప్రయత్నించినా గణపతిదేవులవారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను.”

రుద్రదేవ మహారాజును చంపి యువరాజైన గణపతిదేవుడిని బందీగా తీసుకువెళ్ళిన సెవణులపై యుద్ధం ప్రకటించిన మహాదేవ మహారాజు ఏనుగుపైనుండి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తప్పనిసరై రుద్రసేనుడు రాజప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నాడు. రామాచారికి తెలియని విషయాలేమీ కావు ఇవి. మంత్రి మాటలు వింటూ అలాగే మౌనంగా నిలబడ్డాడు రామాచారి.

“యాదవులు తమ కోటను మరింత పటిష్టపరిచేందుకు మరమ్మత్తులకు, కొత్త నిర్మాణాలకు పూనుకుంటున్నారని, దానికొరకై నిపుణులైన పర్యవేక్షకులను, పనివాళ్ళను ఎంపిక చేయబోతున్నారని దేవగిరిలోని మన మనిషి నుంచి ఒక వర్తమానం అందింది. మాకెందుకో ఇది మంచి అవకాశం అనిపించి, ఈ కార్యనిమిత్తం మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. కోట నిర్మాణంలో కొంత ప్రవేశం ఉన్న మన గూఢచారదళ సభ్యుడు వీరబాహుడు మీతో పాటు వస్తాడు. మీరు ఇరువురూ నిర్మాణ నిపుణుడు, పనివాడుగా కోటలోకి ప్రవేశించాలి. గణపతిదేవరాజుల ఆచూకీ తెలుసుకోవాలి. అది గణపతిదేవులను రక్షించడంలో తొలి అడగవుతుంది.”

“మీమీద ఎంతో నమ్మకంతో మీకు అప్పగిస్తున్న మహాకార్యమిది.” రామాచారి భుజంపై చేయి వేసి కళ్ళలోకి చూస్తూ అన్నాడు మంత్రి విశ్వేశ్వరయ్య.

“యాదవరాజు జైత్రపాలుడు సామాన్యుడు కాదు. రుద్రదేవుడి లాంటి యోధుడి సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు. ఎందువల్ల గణపతిదేవుని విషయంలో ఇలా అంతుచిక్కకుండా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవడం కష్టంగానే తోస్తుంది. ఈ సెవణుల బలమంతా వారి కోటలోనే దాగుంది. శత్రుదుర్భేద్యమైన వారి కోటలోని రహస్యాలు కనుక్కోవడానికి ఇదొక మంచి అవకాశం. రేపే మీరు ఈ ప్రయాణానికి సిద్దం కావాలి. మీ కుటుంబపు రక్షణభారం ఇక మాది.” అన్నాడు రుద్రసేనాని తన ఆసనంపై నుంచి లేస్తూ.


ఇద్దరూ కోట దగ్గరకు చేరుకొనేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. ఎంపికకు వచ్చిన వందలమంది గుమిగూడి ఉన్నారు. మిగతా రాజ్యాలతో పోలిస్తే దేవగిరిలో వేతనాలు హెచ్చుగా ఇస్తారని ఎలాగైనా పనిని దక్కించుకోవాలనే ఉత్సాహంలో ఉన్నారు అందరూ. ఒకచోట వివరాలు నమోదు చేస్తున్నారు, మరొక పక్క ఇంకొంతమంది వారి దేహదారుఢ్యాన్ని, నైపుణ్యాలను పరిశీలిస్తున్నారు. పొడవాటి వరసలు చూసి, అక్కడే కూర్చున్నాడు వీరబాహు.

జైన తీర్థంకరుడి చేతి వేళ్ళను చెక్కుతున్న ఒక యువశిల్పిని చూసి అతనివైపు నడిచాడు రామాచారి. “ఆగు, అటు నుంచి చెక్కితే ఆ శిల విరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి రాయిని శిల్పంగా మలుస్తున్నప్పుడు మనం చేసే ఏ చిన్న తప్పయినా మొత్తం విగ్రహాన్ని పనికిరాకుండా చేస్తుంది.” అన్నాడు రామాచారి. తలెత్తి చూసిన అతని చేతిలోంచి సుత్తి, ఉలి తీసుకొని ఎలా చెక్కాలో చూపించాడు.

“ఎవరు మీరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? శిల్పకళలో, రాతి అంచనాలో మంచి ప్రవేశం ఉన్నట్లుంది మీకు.”

వినబడిన ప్రశ్నకు వెనుతిరిగి చూసిన రామాచారికి దాదాపు 70 సంవత్సరాల వయస్సుతో, తెల్లటి ముఖవర్చస్సుతో మెరిసిపోతున్న దేవగిరి ప్రధాన శిల్పాచార్యుడు కనిపించాడు. అతనికి వినయంగా నమస్కరించాడు.

“నన్ను రామాచారి అంటారు. మాది వెలనాటి సీమ. నా శిష్యుడు వీరబాహుతో కలిసి దేశాటనకు బయలుదేరాము. దేశాలు తిరుగుతూ ఎక్కడైనా దుర్గనిర్మాణం, శిల్పసంబంధమైన పనులను చేస్తూ కాస్తంత ధనాన్ని సంపాదించుకొని మళ్ళీ దేశాటన మొదలుపెడతాము. ఇక్కడ చాటింపు విని ఇటుగా వచ్చాము.”

“శిల్పులకు దేశాటన ఎందుకు?”

“రకరకాల శిల్పాలను పరిశీలించి తెలుసుకోవాలని, వివిధ ప్రాంతాల శిల్పుల నైపుణ్యాలను గమనిస్తూ వాటిని చూసి తరించాలనే కోరిక ఆచార్యా”.

“మరి ఇక్కడ ఆరునెలలపైన పని, ఉండగలరా?” అని సమాధానం కోసం ఎదురుచూడకుండానే “వీరి బసకి ఏర్పాటు చేయండి!” ఆదేశించాడు ఆచార్యులవారు.


సాయంత్రం చల్లగా గాలివీస్తుంది, యువతులు కుండల్లో తెచ్చిన మజ్జిగ తాగి అందరు విశ్రాంతిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పూర్తయిన రెండవ కోటగోడ పనిని చూసి తృప్తిగా నిట్టూర్చాడు రామాచారి. పని అనుకున్న సమయంకంటే ముందే పూర్తవ్వడం అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఏనుగులు దూరంగా విశ్రాంతిగా నిలబడి, మావటీలు పెట్టిన గడ్డిని తొండాలు ఊపుకుంటూ తింటున్నాయి. రామాచారి ఇక తరవాత చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ కోట నుంచి క్రిందికి జారిపోతున్న సూర్యుడిని చూస్తున్నాడు. ఇంతలో పెద్దగా కలకలం వినిపించింది. ‘శ్రీశ్రీశ్రీ జైత్రపాల మహారాజులుగారు వేంచేస్తున్నారహో’ అంటూ. ఎక్కడివారక్కడే లేచినిలబడి నమస్కరిస్తున్నారు. మహారాజు నేరుగా రామాచారి దగ్గరకు వచ్చి ఆగాడు. నిలువెత్తు స్ఫురద్రూపం, శాంతమైన ముఖం. ‘ఈయనేనా ఇన్ని యుద్ధాలు చేసి అన్ని వందలమంది వీరుల తలలను నరికింది!’ అనుకుంటూ వినయంగా నమస్కరించాడు రామాచారి. ఆచార్యులవారు ముందుకి వచ్చి చెప్పాడు. “ఈయనే మహారాజా నేను చెప్పిన నిర్మాణ పర్యవేక్షణాధికారి, ఎంతో నిబద్ధతతో ఎంతో సమర్థవంతంగా, ఎంతో వేగంగా కోటగోడ మరమ్మత్తుల్ని పూర్తిచేస్తున్నాడు.”

మహరాజు అభినందన పూర్వకంగా రామాచారి వైపు తలపంకించి ‘మీ సేవలు ఈ రాజ్యానికి చాలా అవసరం’ అంటూ ముందుకు వెళ్ళిపోయాడు.

జైత్రపాల మహారాజు వెళ్ళిన వంకే చూస్తుండిపోయిన రామాచారి కళ్ళకు మూడో ప్రాకారం, దానికి అవతల నిలువుగా చెక్కి ఉన్న దేవగిరి దుర్గం కనిపించాయి. రేపే మొదటిసారి ఆ నల్లరాతి కోటగోడను దాటి, దుర్గగర్భం లోనికి అడుగు పెట్టబోతున్నాడు రామాచారి. గత ఆరు మాసాలుగా తమకు వీలున్న ప్రాంతాలన్నింటిని ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వీరబాహు ఎంత గాలించినా ఎక్కడా గణపతిదేవుల ఆచూకి దొరకలేదు. రాజమందిరానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కోట లోపలిభాగం చిత్రవిచిత్రాలతో నిండి ఉంటుందని అందరూ చెప్పుకుంటుంటే వినడమే సరిపోయింది ఇంతకాలం. ఆచార్యులవారు కేవలం తనను మాత్రమే రమ్మని చెప్పారు. ఎందుకోసమో అర్థంకాలేదు.


వేకువ తొలిరేకులు అప్పుడే ఆకాశంలో విచ్చుకుంటున్నాయి. మూడవ ప్రాకారం అత్యంత పటిష్టంగా నల్లరాతితో నిర్మించబడి ఉంది. ఏనుగులు కూడా దాడి చేయలేని బలమైన ఇనుప మేకులు గుచ్చిన దృఢమైన చెక్కలతో తయారుచేసిన కోటగుమ్మం దగ్గర సాయుధులైన భటులు కావలికాస్తున్నారు. రామాచారిని చూడగానే, ‘ఆచార్యులవారు మిమ్మల్ని కందకం వద్ద ఉండమన్నార’ని చెప్పి చిన్నద్వారాన్ని తెరిచి ఓ భటుడు రామాచారి ముందు నడిచాడు. అక్కడి నివాసాలను, కట్టడాలను జాగ్రత్తగా గమనిస్తూ భటుడి వెనుక నడిచాడు రామాచారి. మూడు గుమ్మాలు దాటాక నల్లరాతిలో నిలువుగా చెక్కబడ్డ దేవగిరి దుర్గం క్రమంగా దగ్గరయ్యింది. ‘ఇక్కడే వేచి ఉండండి. ఆచార్యులు కాసేపటిలో వస్తారు’ అని వెళ్ళిపోతున్న భటుని మాటలు కూడా అతనికి చెవిలోకి చొరబడనంతగా ఎదురుగా కనిపిస్తున్న కందకం దిగ్భ్రాంతికి గురిచేసింది.

దాదాపు ముప్పై అడుగుల వెడల్పున్న కందకం. నల్లరాయిని క్రమంగా తొలచుకుంటూ వంద అడుగులపైన నిలువైన గోడలుగా మార్చిన విధానం చూసి అతను నిశ్చేష్టుడైపోయాడు. కందకంలోని నీరు కూడా నల్లగా మెరుస్తుంది. కందకం తవ్వి ఎత్తి తీసిన రాయినేనా ఇంతకాలం తను వాడినది? కందకంలో పెంచే మొసళ్ళ గురించి, హఠాత్తుగా పైనబడే వేడి నూనెల గురించి, గూళ్ళలాంటి గుహల్లో దాగుండి దాడిచేసే భటుల గురించి, చీకటి సొరంగాలలో చిక్కుకుపోయి అక్కడక్కడే తిరుగాడే సైనికుల గురించి, వెలుగు చూసి దారి దొరికింది కదా అని దూసుకుపోతే నేరుగా కందకంలో పడి చావడం గురించి ఈ మధ్యకాలంలో కథలుకథలుగా ఎవరెవరో చెప్పిన విషయాలు రామాచారి మనసులో మెదిలాయి. ఇంతకాలం గణపతిదేవుడిని, ఈ దుర్గంలో ఎక్కడైనా బంధించి చిత్రహింసల పాలుచేస్తున్నారా అనే ఆలోచన అంత ప్రశాంతతలో కూడా అతని రక్తాన్ని చల్లబరిచింది. ఇంతలో ఆచార్యులవారు రావడంతో నమస్కరించాడు రామాచారి.

కందకం ఆవైపునుంచి బరువైన వలలాంటిదేదో లోలకంలాగా ఊగి ఇటువైపుకు వచ్చింది. దానిని లాఘవంగా పట్టుకున్న భటుడు ఒక కొక్కేనికి తగిలించి తాళ్ళు ఒదులు చేయగానే ఆ కందకంపైన ఒక వంతెన ఏర్పడింది. ఆవలి వైపుకు చేరగానే ఆ గిరికి చేతులెత్తి నమస్కరించాడు ఆచార్యుడు.

“ఈ కోట ఉన్న పర్వతాన్ని సాక్షాత్ కైలాసమని భావించి పూజించేవారు. ఆ పూజలే ఈ దేవగిరికి రక్ష” అంటూ ఎదురుగా కనిపిస్తున్న సన్నటి సొరంగ మార్గంలోకి ప్రవేశించాడు ఆచార్యుడు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. రాతిలో చెక్కిన సొరంగాలలో సాగుతున్న ఆ బాటను రామాచారి జాగ్రత్తగా పరిశీలిస్తూ సాగుతున్నాడు. నడుస్తూ నడుస్తూనే మార్గాల కొలతలను మధ్యలో అక్కడక్కడ గూళ్ళలాగా కనిపిస్తున్న గుహలను వాటిలోని ఎతైన మెట్లను చూస్తూ మదిలో ముద్రించుకుంటున్నాడు. ఎక్కడైనా కారాగారంలాంటిదేదైనా కనిపిస్తుందేమోనని తరచితరచి చూస్తున్నాడు. కాసేపటిలో వారు ఒక ద్వారం వద్దకు చేరుకున్నారు. ఆ ద్వారం లోపలంతా చీకటి. అగమ్యగోచరంగా తోస్తున్నది. రామాచారి వెన్నులో చలితో సన్నగా వణికాడు.

“దీన్ని నిశాచర మార్గం అంటారు రామాచారీ, శతృదుర్భేద్యమైనది ఈ మార్గం. ఈ దుర్గం మా రాజ్య రక్షణ కవచమే కాదు, నాలాంటివారికిది ఓ దివ్యదేవస్వరూపం. ఈ నిశాచర మార్గానికి పక్కగా ఇంకో సన్నని మెట్లదారి ఉండాలని, ఎప్పుడైనా కోటపై దాడి జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండ శిఖరంలో ఒక రక్షణ భవంతిని యుద్ధవిడిదిగా నిర్మించాలని, కందకం దగ్గర కొన్ని గోడలు నిర్మించాలని, ఈ సొరంగ మార్గంలో కొన్ని కొత్త ఉచ్చులు సిద్దంచేసి శత్రువులు కోటవైపు కన్నెత్తి చూడనంత దుర్భేద్యంగా మార్చాలని మన మహారాజు ఆకాంక్ష. అది కేవలం నేను చేయగలిగినది కాదు. కానీ నీ సహకారంతో సాధ్యం కాగలదు. చుట్టూ చూసి ఓ ఆలోచనకు రా రామాచారీ, ఒక నెల రోజులలో ఏదైనా ప్రణాళికను సిద్ధం చేద్దాం.”


వీరబాహు కోటగోడల నిర్మాణంలో ఆరితేరి, పనిని చేయించే స్థాయికి వచ్చాడు. అంత వేగంగా అతను ఈ రంగంలో పట్టుసాధించడం రామాచారికి ఆనందంగా అనిపించింది. కోటగోడల నిర్మాణం నుంచి వెసులుబాటు దొరకడం వల్ల తన ఆలోచనను కేవలం లోపలి దుర్గంలోని మార్పులకు పరిమితం చేసి, తన పరిశీలనకు వచ్చిన అంశాలు అన్నింటిని చూసుకుంటూ, చేయాల్సిన మార్పులు, కొత్తగా నిర్మించాల్సిన గోడల గురించి సమగ్రమైన ప్రణాళికను తయారుచేశాడు రామాచారి. ఆచార్యులతో కలిసి వెళ్ళి మహారాజుకి తన ప్రణాళికను వివరించాడు. ఆనందంగా అనుమతినిచ్చాడు మహారాజు జైత్రపాలుడు. ఎలాపురంలోని చరణధారి పర్వతపంక్తుల్లో వెలసిన విశ్వకర్మ ఆలయంలో పూజలు చేసి పని మొదలుపెట్టాలని ఆచార్యుడి ఆలోచన.

“ప్రతి వైశాఖ పూర్ణిమనాడు విశ్వకర్మ ఆలయంలో నిద్రచేయడం నా అలవాటు. వచ్చాక దుర్గపు పని మొదలుపెడదాం” అన్నారు ఆచార్యుడు.

పక్కరోజు ఉదయం కొద్దిమంది భటులను తీసుకొని బయలుదేరారు. వెళ్ళేకొద్దీ అడవి దట్టమైపోయింది. కొండ అంచునే సాగుతున్న అడవి బాటలో గుర్రాలు నెమ్మదిగా పరుగుతీస్తున్నాయ్. దాదాపు రెండు యోజనాల ప్రయాణం తరువాత ఓ కొండచరియకు చేరువయ్యారు. అక్కడ కొండను తొలిచి నిర్మించిన అనేక బృహత్‌నిర్మాణాలు కనిపించాయ్. వాటిపై పాకి అల్లుకున్న తీగలు, ఎండిపోయి పచ్చగా మెరుస్తున్న గడ్డి. స్వేచ్ఛగా విహరిస్తున్న నెమళ్ళు, పారుతున్న నది ఒడ్డున నీరు తాగుతున్న జింకల గుంపులు. ఎక్కడినుంచో లీలగా పులి గాండ్రింపు. ఒక్కసారిగా భయోద్విగ్నత చుట్టుముట్టింది రామాచారిని.

“ఇక్కడ దాదాపు వందకుపైగా గుహాలయాలు ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ళ క్రిందట వీటిని నిర్మించారని చెబుతారు. వీటిలో బౌద్దులవి, శైవులవి, బ్రాహ్మణ దేవతలవి, జైనులవి అన్నీ కలగలిసి ఉన్నాయి. మన మహారాజు జైనాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు. అందుకే ఇప్పటికీ జైన గుహాలయాల్లో శిల్పాలు చెక్కబడుతూనే ఉన్నాయి. వాటిని మా సోదరుడి కుమారుడు పర్యవేక్షిస్తున్నాడు. నువ్వు శైవుడివి కదా, మొదట నీకు కైలాస దేవాలయాన్ని చూపిస్తాను.” అంటూ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద దేవాలయం వైపుకి దారితీశాడు ఆచార్యుడు. బయట గోడలపై విష్ణువు అవతారాలు చెక్కి ఉన్నాయి. శివాలయమా ఇది అనుకుంటూ విస్మయంతో లోపలికి అడుగుపెట్టాడు రామాచారి. ఎదురుగా గోడమీద చెక్కిన గజలక్ష్మి విగ్రహం దర్శనమిచ్చింది. అటు ఇటు దాదాపు 12 అడుగుల ఎత్తైన రాతి ఏనుగులు, పక్కన ధ్వజస్తంభంలా కనిపిస్తున్న ఓ ఎత్తైన స్తంభం.

ప్రదక్షిణాపథంలో నడుస్తూ తలెత్తి చూశాడు రామాచారి. పైన గదులుగదులుగా నిర్మాణాలు. చుట్టూ మండపంలాగా స్తంభాలతో కట్టడాలు. ఆధారపీటం పైన ఆలయాన్ని మోస్తున్నట్లు ఏనుగులు. వాటిపైన గుర్రాల వరస, దేవకోష్టికలు, కిటికీలు… ఇవన్నీ ఒకే కొండను తొలిచి కట్టినవా? ఆశ్చర్యం, అద్భుతం! అనుకునేంతలోనే అతనిలో ఏదో అనుమానం పొడసూపింది. కోటగోడలాగా చెక్కిన రాయిని చూడగానే రామాచారికి దేవగిరి కందకంలో నిలబడ్డ భావన, అలాగే నిలబడిపోయాడు. ఇక ఏ శిల్పమూ అతనిని ఆకర్షించలేకపోయింది. “దేవగిరి కందకం చెక్కిన శిల్పులూ వీరేనా?”

ఆ ప్రశ్న విన్న ఆచార్యుల ముఖంలో చిరునవ్వు వెలిగింది. “ఇవన్నీ మొదట బౌద్ద గుహాలయాలుగానే మొదలయ్యాయట. తరువాత కాలంలో కొన్ని శైవ, ఇంకొన్ని జైన ఆలయాలుగా మార్చబడ్డాయట. ప్రత్యేకంగా ఈ ఆలయం విషయంలో మా తాతగారు చెప్పేవారు, దీని అసలు ప్రణాళిక భారీ స్తూపమై ఉండచ్చని. చుట్టూ ఉన్న గదుల్లో బౌద్ద బిక్షువులు ఉండేవారని ఆయన ఊహ. నువ్వు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. నిజమే, ఇప్పుడు ఈ ప్రదక్షిణాపథమంతా కందకంలానే అనిపిస్తుంది. నువ్వు చెప్పిన విధానం చూస్తే దేవగిరి పర్వతమంతా కూడా ఓ స్తూపంలా చెక్కే ప్రయత్నం జరిగి ఉండాలి. బహుశా ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెక్కలేనంత బృహత్ స్తూపం!” అంటూ ముందుకు నడిచాడు ఆచార్యులవారు.

శివాలయం నుంచి కుడి వైపుకి రెండు మూడు అంతస్తుల భవంతులు దాటక, మసక చీకటిలో వున్న ఓ రెండతస్తుల భవంతిని చూపిస్తూ, “అదే విశ్వకర్మ ఆలయం. ఈ రాత్రికి మన బస అక్కడే” అంటూ పగలకొట్టబడిన ప్రహరీలా ఉన్న గోడ నుంచి లోపలికి దారితీశాడు ఆచార్యులవారు. భటులు అప్పటికే వెలిగించి పెట్టిన కాగడాలు ఆ ఆలయాంతర్భాగాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి. దాదాపు ఎనభై అడుగుల పొడవు, నలభై అడుగుల వెడల్పు, ముప్ఫై అడుగుల ఎత్తుతో ఒకే రాయిలో తొలిచిన పెద్ద ఆలయం అది. చివరలో ఒక పాతిక అడుగుల స్తూపం. ఎత్తుగా సింహాసనం మీద కూర్చొని ఉన్న బుద్ధ విగ్రహం ఆ దీపకాంతిలో ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆచార్యులవారు బుద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చాడు. రామాచారి ఆశ్చర్యంగా అడిగాడు, “ఈయన బుద్ధుడు కదా! మరి దీన్ని విశ్వకర్మ ఆలయం అని ఎందుకు అన్నారు? మీరు జైనులు అని చెప్పారు, మరి మీరు బుద్దుడ్ని పూజించడం ఏమిటి? ఇక్కడ ఇన్ని మతాల దేవుళ్ళు ఒక దగ్గరే ఉండటం ఎలా సాధ్యమైంది?”

“ఈయనే మన విశ్వకర్మ అని, శిల్పిగా ఆయనను గౌరవించడం మన బాధ్యత అని మా తాతగారు చెప్పేవాడు. ప్రాంతీయంగా ఈ ఆలయం గురించి కొన్ని కథలు చెబుతారు. ఈ ఎలాపురం అంతా ఒకప్పుడు నాగులు ఉండేవారట. వారు సాధారణంగా బౌద్ధ అనుయాయులు. ఒక్కరోజులోనే విశ్వకర్మ ఈ గుహానిర్మాణాన్ని పూర్తి చేశాడని వాళ్ళు నమ్మేవాళ్ళట. బుద్ధుడు ఇక్కడ వ్యాఖ్యాన ముద్రలో కూర్చొని ఉంటాడు, మనకున్న సమస్త సందేహాలను తీర్చే ఉపాధ్యాయుడి మాదిరిగా. వీటిని చెక్కడం మొదలుపెట్టిన బౌద్ధబిక్షువులు తరువాత వీటిని కొనసాగించడానికి అనేకమంది శిల్పులను తయారుచేశారనేవారు మా తాతగారు. ఒక్కో మతం దాని ఆధిపత్యాన్ని కోల్పోతూ, మనుషులు మరొక మతానికి మారే క్రమంలో కొన్నిసార్లు విశ్వాసానిది పైచేయి అయి దుఃఖం కలుగుతుంది, భక్తిది పైచేయి అయినప్పుడు దుఃఖం ఉపశమిస్తుంది. ఇదంతా ఒక పెద్ద సంఘర్షణ. ఒక్కో రాజు, ఒక్కో మతం, ఒక్కో అలజడి ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనదొక నిమిత్తమాత్రత అంతే. ఒక మతం నుంచి ఇంకో మత ప్రాబల్యం పెరిగేకొద్దీ మిగిలిన మనుషులకంటే ఎక్కువ ఘర్షణకు గురయ్యింది, శాస్త్రాన్ని విశ్వసించి నిరంతరం భగవంతుడితో మమేకమైన శిల్పులే. ఒక్కో విగ్రహాన్ని కొంచెం కొంచెం మార్పులతో వేరే మతానికి బదిలీ చేయగల సమర్థతా మనదే. శిల్పులు ఎన్నో మతాలపై నుంచి ప్రయాణిస్తూనే ఉంటారు. మనం మాట్లాడిన మాటలు, మన జీవితం మనతో ముగిసిపోతాయి. కాని మనం కట్టిన గోడలు, చెక్కిన శిల్పాలు కొన్ని తరాలపాటు మాట్లాడతూనే ఉంటాయి. ఎవరు దేన్ని ఎలా అర్థంచేసుకుంటారో అది వారి సంస్కారం. కాని ఒక పని చేసుకుంటూ పోయే క్రమంలో దాన్ని మనం ఎంత శ్రద్దగా, ఇష్టంగా, నైపుణ్యంగా చేశామనేదే మనకు మిగిలే సంపద. శిల్పం చెక్కేవారు ఆ స్వరూపాన్నే కాదు, ఆ లక్షణాలను కూడా ఆవాహన చేసుకోవాలి. అది నిష్టగా, భక్తిగా చేసే ఓ తపస్సులాంటిది. ఎంత తపస్సు చేస్తే శిల్పి ఇలాంటి ఆలయాన్ని చెక్కగలడు! అతని ఆత్మ ఇక్కడే కదా పరిభ్రమిస్తూ ఉండేది, మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూ ఉండేది. ఆయన్ని నువ్వు బుద్ధుడని సంఘర్షణ పడతావు, నేను విశ్వకర్మ అని ప్రశాంతంగా నమస్కరిస్తాను. ఆయననే శివుడు అనుకుంటే నీ మనసు అలజడులులేని నిర్మల తటాకమవుతుంది.”

దేవగిరి పర్వతమంతా బంగారు స్తూపమై సూర్యకాంతిలో మెరిసిపోతోంది. ఆ కందక ప్రదక్షణాపథంలో రామాచారి, ఆచార్యులు, వీరబాహులు ప్రదక్షణ చేసి స్తూపానికి మొక్కుతున్నట్లు ఓ విచిత్రమైన కల. హఠాత్తుగా మెలుకువ వచ్చిన రామాచారికి పైన ఉన్న కిటికీలోంచి పడుతున్న వెన్నెలలో వెండిలాగా మెరిసిపోతూ తథాగతుడు నవ్వుతూ కనిపించాడు.


దేవగిరికి మూడు క్రోసుల దూరంలో కొండల్లో నిర్మించాలనుకున్న ఓ రక్షణ స్ధావరానికి ప్రణాళికను రూపొందించడానికి, మహారాజుతో కలిసి ఆచార్యులవారు వెళ్ళాల్సింది. కాని ఆయన ఆరోగ్యం సరిగా లేనందువలన, రామాచారిని వెళ్ళమని కోరాడు. పదిమంది అంగరక్షకులు, నలభైమంది భటులతో బయలుదేరారు. మధ్యాహ్నానికి ఆ ప్రాంతాన్ని సందర్శించి నీటి సదుపాయాలను, ఆయుధాగారాది భవనాల నిర్మాణానికి అనుకూలతలను, ప్రతికూలతలను అంచనా వేశాడు రామాచారి. ఆ రాత్రికి అక్కడే గుడారాలు నిర్మించి బస ఏర్పాట్లు చేసుకున్నారు. పక్కరోజు ఉదయాన్నే లేచి, నిర్మించాల్సిన గోడ, భవంతులకు ఎంత రాయి కావాలో, దాన్ని పక్కనే ఉన్న కొండ నుంచి ఎలా తరలించాలో ఆలోచనలు చేసి, గదులకు సంబంధించిన గీతలను గీసుకొని, గోడ నిర్మాణం ఎంతవరకు చేపట్టాలో చూద్దామని మహారాజుతో కలిసి ఇంకొంచెం ముందుకు నడిచాడు రామాచారి.

కొద్ది దూరం వచ్చారో లేదో, అడవిలో పెద్ద పెద్ద అరుపులు కేకలతో వాళ్ళపైన దాడి మొదలైంది. అంగరక్షకులు అప్రమత్తమయ్యే లోపే ఎక్కడి నుంచో బలంగా విసిరిన బరిసె మహారాజు పైకి దూసుకొచ్చింది. పక్కనే ఉన్న రామాచారికి ఏమి చేయాలో పాలుపోలేదు, తనపైన నమ్మకంతో మహారాజుని పంపిన ఆచార్యులవారి మొహం గుర్తుకొచ్చింది. అంతే! రాజుకి అడ్డంగా నిలబడ్డాడు. అది బలంగా రామాచారి గుండెలను చీల్చుకొనిపోయింది.

“నేను నీ ఋణాన్ని ఎలా తీర్చుకోగలను రామాచారీ! నా ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డువేసి కాపాడుకున్నావ్. ఎక్కడో సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి మా కోసం ఎంతో సేవే కాదు, ప్రాణాల్ని కూడా ఒడ్డుతున్నావ్!” కొన ఊపిరితో కొట్టుకుంటున్న రామాచారిని ఆవేదనతో చూస్తూ గద్గదమయిన గొంతుతో అన్నాడు మహారాజు.

“మహారాజా! నా ఒక్క కోరికను తీర్చండి, గణపతిదేవులను విడిచిపెట్టి, కాకతీయప్రభువుగా చేయండి.” అంటూ ప్రాణాలు వదిలేశాడు రామాచారి.

తన ప్రాణాలు కాపాడినది గణపతిదేవుడి మనిషా! విస్మయపడిన జైత్రపాలుడికి గతం గుర్తుకొచ్చింది. ఎత్తుకొచ్చిన కాకతీయ రాజ్యవారసుడు గణపతిని వధించాలనే ఆలోచనలో ఉన్న అతని ఆలోచనలకు రెండుమూడుసార్లు వేరువేరు కారణాల వల్ల విఘాతం కలగడంతో జైత్రపాలుడు ఆశ్చర్యపోయి తన గురువైన సిద్దభూపాలునికి కబురంపాడు. సిద్దభూపాలుడు బాలుడ్ని పరిశీలించి, “జైత్రపాలా, ఈ బాలుడు నీ రాజ్యానికి తూర్పున సముద్రంలా రక్షణగా నిలబడతాడు. ఇతన్ని బందీగా చూడకు. రాజమందిరంలో దూరంగా ఓ భవంతిని ఇతనికోసం నిర్మించు. తనకి నేర్పాల్సిన క్షత్రియోచిత విద్యలన్నీ నేర్పించు. నీకు శుభం కలుగుతుంది. ఒకానొక దుర్ఘడియలలో నీ ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. అలాంటి రోజు ఇతని కారణంగా నువ్వు నీ ప్రాణాలను దక్కించుకుంటావు. ఆ రోజు ఇతన్ని వారి రాజ్యానికి గౌరవంగా పంపించు.” అని చెప్పి వెళ్ళిపోయాడు.

రామాచారికి అక్కడే శైవమతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, రాజ్యానికి చేరుకున్న జైత్రపాలుడు ఆచార్యులవారికి విషయమంతా విన్నవించాడు. వీరబాహుని పిలిచి విషయాలు తెలుసుకున్నాడు. తన రాజ్యానికి వేగులుగా రావడం లోపల కొంచెం ఆగ్రహంగా అనిపించినా, తన ప్రాణాలు కాపాడిన రామాచారి, తన గురువు సిద్దభూపాలుడి మాటలు గుర్తొచ్చి శాంతపడి వీరబాహుడిని ఆచార్యులకు సహాయకుడిగా నియమించాడు. మంత్రులతో సంప్రదించి రుద్రసేనానికి వర్తమానం పంపించాడు, సరిహద్దుల వద్దకు వచ్చి గణపతిదేవుని తోడ్కొని వెళ్ళమని.

సకలదేశ ప్రతిష్టాపనాచార్య బిరుదును స్వీకరించి సమస్త కాకతీయ రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకొన్నాడు గణపతిదేవమహారాజు. ఇంత కాలము తన రాజ్యభారాన్ని మోసి, భద్రంగా తనకు అప్పగించిన రుద్రసేనాపతికి కాకతీరాజ్య భారధౌరేయ బిరుదునిచ్చి సత్కరించాడు.


చదువుతున్న కథ పేపర్లు పక్కన పెట్టింది రాజి. “ఈ కథ చెప్పిందంతా ఇప్పుడు మనం కూర్చున్న దేవగిరి కోట ఒక బౌద్దస్తూపమై ఉండచ్చు అని చెప్పడానికా?”

దౌలతాబాద్ కోట పైభాగంలో ఫిరంగి కోసం కట్టిన వేదిక గోడపైన కూర్చొని ఉన్నారు ఇద్దరూ. గాలి బలంగా వీస్తోంది. ఒకరిద్దరు వచ్చి ఆ ఫిరంగి దగ్గర ఫోటో తీసుకుంటున్నారు.

అతను నవ్వుతూ అన్నాడు. “ఏమో ఈ కోటను చూస్తున్నప్పుడల్లా బహుశా దేవగిరి మధ్యలో ఆగిపోయిన అతి పెద్ద స్తూపం అనిపిస్తుంది. తరువాత కాలంలో దీని జెయింట్ స్ట్రక్చర్ కాలక్రమేణా చోటుచేసుకున్న ఎన్నో మార్పులతో పటిష్టమైన కోటగా మార్చడానికి కారణమై ఉండచ్చు. ఏ రాజు కూడా ఒక కొండను ఇంత లోతుగా తొలచి కోటను నిర్మించాలని అనుకున్నాడని అనుకోను. దీనికి ఉన్న రక్షణ ఏర్పాట్లు అన్నీ కృత్రిమమైనవి, ఎక్కువభాగం శిల్పులతో చెక్కబడినవే. ఔరంగాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక బౌద్ధ గుహాలయాలను చూసినప్పుడు ఇది కూడా ఆ కాలంలోనే ఆ శిల్పులతోనే చెక్కబడింది అని అనిపించేది. ఈ కోట రూపం, దీని క్రింది భాగంలో ఉన్న బౌద్ధగుహలు నా ఆలోచనలకు ఊతమిచ్చాయ్. ఏ బిక్షువో కలగని ఉంటాడు దీన్ని స్తూపంగా మార్చాలని. కొన్ని వేలమంది శ్రమించి ఉంటారు. ఎల్లోరా గుహాలయాల్లో మొత్తం ఎంత రాతిని తొలిచి బయటవేశారో ఇక్కడ అంతకంటే ఎక్కువ తొలిచారు. నిజానికి ఇక్కడ శ్రమ ఎక్కువ. కొట్టిన రాతిని పైకి లాగాలి.”

“దేవగిరి కోట, ఎల్లోరాలోని కైలాస దేవాలయం రెండూ స్తూపం పనులకోసం మొదలైనాయని భావిస్తున్నావా?”

“హాఁ, అవును. అయ్యుండచ్చు. తరువాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల వాటి రూపు మారిపోయుండచ్చు.”

“మరి నువ్వే వాటిపైన పరిశోధనచేసి హిస్టరీ కాంగ్రెస్‌లో ఏదైన పేపర్ ప్రజెంట్ చేస్తే పేరు వస్తుంది కదా! ఇలా కథ రాసి వదలివేయడం కంటే.”

“అందరికీ అంత ఓపిక ఉండదు రాజీ. ఆ దిశగా నా ఆలోచనను ప్రపంచానికి తెలియచేస్తే, ఎవరైనా పరిశోధన చేయచ్చు. అది నిజమని తేలితే ఈ కందకంలోనే ప్రపంచంలోని మూలమూలలనుండి బౌద్ద బిక్షువులు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ, స్తూపానికి పూజలు చేయచ్చు. ఒకవేళ మనం కూర్చున్న ఈ స్థానం క్రిందకూడా ఇటుకలతో కట్టిన ఓ స్తూపమో, అశోకుడు వేయించిన ఓ శాసనస్తంభమో బయటపడినా నేను ఆశ్చర్యపోను. కైలాస దేవాలయం రూపం పూర్తిగా మారిపోయింది కాబట్టి దాన్ని స్తూపంగా ప్రారంభమైందా లేదా అని నిర్ణయించడం కష్టం. మనదేశంలో ఒక ఆలయం ఇంకో ఆలయంగాను, ఒక విగ్రహం ఇంకో విగ్రహంగాను, ఒక శాసనం ఇంకో శాసనంగాను మారడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతేం కాదు. అనేక మతాలు ఇక్కడ అనేక వైరుధ్యాలతో సహజీవనం చేశాయి. మనిషిలో మతం కూడా అనేక తెరలతో అలా కప్పబడుతూనే ఉంటుంది. తరాలు మారే కొద్ది బౌద్ధుడు జైనుడుగా తరువాత శైవుడిగా తరువాత ముస్లింగానో, క్రిష్టియన్‌గానో, సిఖ్‌గానో మారిపోవచ్చు. ఏ ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఈ మతంలో ఉన్నానని తెలుసుకునే స్థితి దాదాపుగా ఏ మనిషికి ఉండదు. ఓ యాభై తరాలు వెనక్కిపోతే ఈ రోజు నువ్వు పూజించే దేవుడ్ని అప్పటి నీ వాళ్ళు పూజించి ఉండకపోవచ్చు. అంత చారిత్రకదృష్టి ఉంటే మతాల మధ్య ఇంత ఘర్షణే ఉండేది కాదు.”

“మరి గణపతిదేవుడ్ని ఎందుకు తీసుకున్నావ్ ఈ కథలో?” అడిగింది రాజి కొంచెం ఆసక్తిగా.

“గణపతిదేవుడి బాల్యంలో కొంత మనకు తెలియని చరిత్ర ఉంది. ఆయన ఈ కోటలో యాదవుల చేతిలో బందీగా ఉన్నాడంటారు. అతన్ని ఎందుకు, ఎలా విడిచిపెట్టారు అనేది తెలియడంలేదు. ఆ తరువాత కాలంలో గణపతిదేవుడు యాదవులతో ఎప్పుడూ ఘర్షణపడినట్లు కూడా లేడు. ఈ అంశాలకు సంబంధించి సరైన చారిత్రిక ఆధారాలు లేవు. అందుకే ఆ మిస్సింగ్ లింక్ నుంచి నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను.”

“హ్మ్!” నిట్టూరుస్తూ లేచినిలబడింది రాజీ, అతను అందించిన చేతిని అందుకుంటూ.