ఇద్దరు కవయిత్రులు – రెండు అభివ్యక్తులు

కవులందరూ అనువాదకులే. ఒక అపూర్వమైన సందర్భానికి తమలో కలిగిన భాషాతీతమైన స్పందనని అప్పటికప్పుడో, తర్వాత తీరికగానో భాషలోకి అనువదించుకునేవారే! అదికూడా నిజానికి దగ్గర కాదు. రెండంచెల దూరంలో ఉన్న ప్రతీకాత్మకమే కవితావేశం అనుభూతించినదానికంటే తక్కువ; ఎంత గొప్ప పదప్రయోగమైనా నూటికి నూరుపాళ్ళు అనుభూతిని మాటలలోకి ఒంపలేదు. కనుక అది ఇంకా దిగువ.

దేశ, కాల పరిమితులను మినహాయించి మానవులందరి అనుభూతి ప్రేరకాలయిన వస్తుసంచయం ఒక్కటే అయినపుడు, సహస్రాబ్దాలుగా వెలువడుతున్న కవిత్వంలో, శ్రీశ్రీ చెప్పినట్టు మనకంటే ముందరి కవులు మనకంటే గొప్పగా ఆ భావాలని అందంగా వ్యక్తీకరించినపుడు, మనం కొత్తగా చెప్పేదీ, చెప్పగలిగేదీ ఏముంటుంది? అన్న సందేహం రావొచ్చు.

అంతేకాదు. ఈ కొత్తగా వచ్చే కవిత్వం జనసామాన్యానికి ఏ రకంగానైనా పనికొచ్చేదా? వారిని తమతో కలుపుకుని పోతుందా? అని కూడా అనిపించవచ్చు. మరికొందరు ఈ కొత్త కవిత్వం కంటే పాత కవిత్వమే మెరుగు అని నిశ్చయించుకుని అర్థంకాని మాటలని నిఘంటువులు చూసుకుని మరీ సంతోషించవచ్చు.

కాని అసలు విషయం – నిజమైన కవిత్వం ఎప్పుడూ సమకాలీన పోకడలకి భిన్నంగా ఉంటూనే, మన చేతనని స్పృశిస్తుంది. మన మనసుని దానివైపు తిప్పుకుంటుంది. శ్రీశ్రీని, కృష్ణశాస్త్రిని, దేశ విదేశాలకు చెందిన మరొకరినీ మరొకరినీ అనుకరిస్తూ వేలమంది కవులు కవిత్వం రాస్తూనే ఉండొచ్చు గాక! ఇప్పటికీ పాత తరాలకు చెందిన కవుల్ని అందరూ అభిమానంగా చదువుకుంటూ ఉండొచ్చు గాక! కానీ, వారిని భాషలోగాని, భావంలో కాని, ఆవేశంలో కాని అనుకరించకుండానే, వారినుండి ఏదో ఒక వారసత్వాన్ని తీసుకుని కవిత్వం రాస్తున్న కొత్త తరం కవులు ఎందరో ఉన్నారు. ఈ తరానికి ప్రతినిధులుగా – ఈ తరంలో వచ్చిన, వస్తున్న మార్పుల్ని ఒడిసిపట్టుకుని సంప్రదాయబద్ధంగానో, అధునాతనంగానో చెబుతున్నప్పటికీ – ఈ కాలపు ఛాయలు అందులో ప్రస్ఫుటంగా కనిపించేలా శ్రద్ధ తీసుకుని మరీ చెబుతున్నారు. ఇందులో ఏ వాదాలూ ఉండకపోవచ్చు. నీతిశతకాలు వల్లెవేయకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ కవిత్వం సమకాలీన జీవితానికి దర్పణంగా ఉంటుంది. పాత తరానికి చెందిన వాళ్ళు కూడా, నేటి కవిత్వంలో పొడచూపే తమ అనుభూతిఛాయలను కాదనలేరు. ముఖ్యంగా ఇందులో కనిపించేది ప్రతి కవీ తనదైన ముద్రని అందులో ప్రతిఫలించడం; అనుభూతిని మించిన శబ్దాడంబరం చెయ్యకపోవడం.

ఇలాంటి కవిత్వం ఈ మధ్య నేను రెండు పుస్తకాల్లో గమనించేను.

ఒకటి చామర్తి మానస సంకలనం పరవశ. రెండవది వసుధారాణి నదివెంట నేను సంకలనం. వీటిలో కొన్ని కవితలు, డైరీలో అపురూపంగా దాచుకున్న జ్ఞాపకాల్ని చదివి వినిపించినట్టు, మనతో ఆత్మీయతతో పంచుకున్నట్టు ఉంటాయి. నాగరిక సమాజంలో పిల్లలతో సహా అందరి నోటిలో నానే మాటలని సందర్భానికి తగ్గట్టు ఒడుపుగా వాడుకుని తన పరవశ సంకలనంలో మానస, పాతమాటల్నే హైకూలంత పొదుపుగా వాడుకుని నది వెంట నేను సంకలనంలో వసుధారాణీ చక్కని కవిత్వాన్ని అందించారు.

బాల్యం, యౌవనం, ప్రేమ, అమ్మా నాన్నల ప్రేమ, గత అనుభూతులపై మోహం, జీవితంలోని తీపి, చేదు సంఘటనలూ, చరాచర ప్రకృతి సౌందర్యం, జ్ఞాపకాలని తిరగదోడే వస్తువులు, సందర్భాలు, ఏకాంతం, నిశ్శబ్దం, రోదసి, దేవుడు – మొదలైనవన్నీ ఏ కవిత్వానికైనా, ఏ కాలంలోనైనా ముడి సరుకులు. రసానుభూతి కలిగించే సామగ్రీ.


సమకాలీన ఉపమలలో సార్వజనీనమైన అనుభూతిని చెప్పటంలోనే మానస కవిత్వం ప్రత్యేకత ఉంది.

ఉదాహరణకి ‘సెర్చ్ ఇంజన్లకు దొరకని ప్రేమ’ అన్న మాట తీసుకుంటే, ‘ఏది తెలియకపోయినా వెంటనే గూగుల్ సెర్చ్ చేసే’ పాఠకుడికి ఆ మాట వెనుక భావం ఇట్టే అర్థం అవుతుంది. ‘బేక్ స్పేస్’ చెప్పని కథలు, రింగ్‌టోన్, ఎమోటికాన్స్… ఇవన్నీ 21వశతాబ్దపు పదప్రయోగాలు. కొత్త ప్రతీకలు. కొత్త ఉపమానాలు. కవిత్వానికి కొత్త హంగులు.

అమ్మ గురించి ఎవరు ఎంత చెప్పినా చెప్పడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎన్ని వారసత్వ సంప్రదాయాలు కొనసాగినా సాగకున్నా, అమ్మదనం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే, తను తల్లైనప్పటికీ తన తల్లిని, తల్లి చేసిన త్యాగాన్నీ కూతురు ఎన్నడూ మరిచిపోదు.

‘ఆరలేదని అమ్మ వదిలిన చీర చెంపలమీది తడిని ముద్దాడి పోతుంది.’ కవిత్వానికి గంభీరమైన పదబంధాలు అక్కరలేదు. ఉన్నదున్నట్టూ చెప్పగలిగిన కొన్ని సందర్భాలు ఏ అలంకరణలు లేకపోయినా అందగిస్తాయి. అందుకే ‘అలవాటైన అమ్మ పిలుపు వినపడక ఖాళీతనమొకటి చెవులు హోరెత్తిస్తుంటే, తనుమాత్రం పిలిస్తే పలికే ఇళయరాజా పాట రింగ్‌టోన‌లా ఇల్లంతా మోగిపోతుంది’ (అమ్మ వెళ్ళిన రాత్రి.) అన్నపుడు వివరణలు అక్కరలేదు.

కొన్ని తలపులు అన్నిటినీ తోసిరాజని తామే సర్వస్వం అయి కూచుంటాయి. యవ్వనంలో ఈ అనుభూతికి గురికాని వ్యక్తి ఎక్కడా ఉండరు. దానిని “స్టాపర్‌ను తోసుకు తోసుకు / మూతపడాలనుకునే తలుపులా / నీ తలపు తోసీ, తోసీ, లోకాన్నంతా నెట్టేస్తుంది… ఊపిరి.” అంటారామె.

మరొకచోట ‘మాటల్ని చిన్నబుచ్చే ఎమోటికాన్స్’ అని పదప్రయోగం. ఎమోటికాన్స్ మాటల్ని చిన్నబుచ్చడంలో రెండర్థాలున్నాయి. ఒకటి విస్తృత భావాన్ని సంక్షిప్తం చేసి చెప్పగలగడం; రెండవది తక్కువలో ఎక్కువ భావాన్ని చెప్పడం.

‘చప్పుడు చెయ్యని సౌందర్యప్రవాహాలను చకచకా పిక్సెల్స్‌లో కుదుర్చుకునే నీ కళ్ళలో(పరవశ) – ఇది సౌందర్యాన్వేషి తృష్ణని అక్షరాలలోకి ఒంపడమే.

‘ఎన్ని మెమరీ కార్డులు ముడిస్తే ఒక మనసు’ అన్న మాటలు, ‘ఎన్ని చుక్కలైతే ఓ చంద్రుడయ్యేను?’ అని వసుధారాణి కవితను (93) గుర్తు చేస్తున్నాయి.

‘ఊబిలాంటి దైనందిన జీవితం’ లోని ఉపమానాన్ని చూడండి. ఊబిలో ఉన్నవాడు నిశ్చలంగా ఉన్నప్పుడే బయటపడగలిగే అవకాశం ఉంది. అంతే గాని, ఎంత పెనుగులాడితే అంత త్వరగా ఊబిలో కూరుకుపోతాడు. మన దైనందిన జీవితం ఊబి అనడంలో సందేహం లేదు.

‘చిరంజీవి’ కవితలో ఒక మాయని గాయాన్ని చాలా సటిల్‌గా సూచిస్తారు మానస.


ఆధునిక కవిత్వంలో ఎక్కువగా కనిపించే లోపాలలో ఒకటి పాఠకుడిని తక్కువ అంచనా వేసి చెప్పవలసినదానికంటే ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించడం, రెండవది, ‘కదా, అవును కదా, లేదు కదా’ అని పాఠకుడి అంగీకారానికి వెంపర్లాడటం. కవి అనుభూతికి పాఠకుడి ఆమోదముద్ర అక్కరలేదు: కవి నిరంకుశుడు; చెప్పదలచినది చెప్తాడు. కవి చెప్పిన దానిలో తన అనుభూతుల సారూప్యాన్ని పాఠకుడు అసంకల్పితంగా వెతుక్కుంటూనే ఉంటాడు. క్లుప్తత కవిత్వానికి అందాన్ని, ప్రకటించిన భావానికి గంభీరతనీ ఇస్తుంది.

వెండికొండలపై వెలుగు బంగారమయ్యింది
వెలుగంతే!
స్పర్శతోనే విలువ పెంచేస్తుంది! – 15

సూర్య శతకంలో మయూరుడు ఇలా అంటాడు: రాత్రి అన్ని కొండలూ చీకటిలో ఒకే ఎత్తులో కనిపిస్తాయి. సూర్యకాంతి కొండలలో ఏది ఎత్తైనది అన్నది (శేఖరత్వాన్ని) నిరూపిస్తుంది.

ఉదయాన్ని ఏమైనా అడగాలనిపిస్తుంది
అస్తమయానికి ఏదైనా ఇవ్వాలనీ
అందుకే రోజును అడిగి ఇచ్చేస్తుంటాను. – 36

ఒక కవితలో రాత్రిని చక్కగా వర్ణించిన తర్వాత, కవిమిత్రులు యెరికలపూడి సుబ్రహ్మణ్యశర్మగారు, దానికి ‘ప్రాతః సూర్య దీపాంజలి’ సమర్పిస్తున్నానని హృద్యంగా ఒకచోట చెబుతారు. వసుధారాణి దాన్ని చదివి ఉండే అవకాశం లేదు.

కళ్ళు చెమర్చటం ఆగిపోయి చాలా రోజులైంది
అంటే ముళ్ళుగుచ్చుకోవడం లేదని కాదు. – 4

దీపం వెలుగుతోందన్న స్పృహలేకుండా
ఆ వెలుగులోనే కూర్చుని
చీకటిని తలుచుకుంటే
దీపం చిన్న బుచ్చుకోదా? – 28

నిన్నటి కలచివేత
నేటికి తేరుకుంటుంది.
దులిపేసుకుంటే పోని తడి ఇసుక దుఃఖం
సమయం కాస్త ఆరబెట్టినాక
దానంతట అదే రాలిపోతుంది
ఏదీ అంటని ధవళ వస్త్రజీవితం
ఉద్వేగాల గాలులు అల్లల్లాడుతూ
కాలం కంచెకు తడుస్తూ ఆరుతూ జీర్ణమైపోతుంది. – 29

నదిని తాకి చూశాను.
తడితోపాటుగా చేతికందిన చరిత్ర.
కొత్త నీటితో పాతనది. – 23

ఈ వెన్నెలదీపం వెలిగించే వారెవరోకానీ
పున్నమి రోజున మాత్రమే సరిపడా చమురు పోస్తున్నారు. – 24

భారాన్ని ఎలాగో ఎంతో
కొంత తూచవచ్చును
ఈ శూన్యాన్ని ఎంతకని
కొలవటం? – 49

ఏమేమి సంయోజనాలతో
ఏర్పడిందో
ఎంతదూరం ప్రయాణం చేసిందో… – 50

అన్నవి చాలా లోతైన ఆలోచనలు. వీటిలో గంభీరమైన తాత్త్విక చింతనతోపాటు, కొన్నిచోట్ల లౌకికమైన కార్యసాధకమైన సలహాకూడా పరోక్షంగా సూచితమై ఉంది.

తొలిప్రేమకున్న అనుభూతి
తర్వాత ఆ వ్యక్తితోనైనా, మరొక వ్యక్తితోనైనా
అంతటి వివశత్వాన్ని కలుగ జెయ్యదు.

ఒకే నదిలో మీరు రెండుసార్లు అడుగుపెట్టలేరు అన్న ఇంగ్లీషు నానుడికి జీవితం నుండి మరొక ఉదాహరణ.

“ఇక్కడ అందరం స్వప్నాలను ఉట్లమీద పెట్టొచ్చిన వాళ్ళమే.
ఒకలా అనుకుని మరొకలా బతుకుతున్న జీవితాలే. – 59

పోర్చుగీసు కవి ఫెర్నాండో పెసోఆ చాలా చక్కని మాట అంటాడు: మనందరం ఒక రకమైన జీవితాన్ని ఆశించి, జీవనసాగరంలో నౌకాభంగానికి గురై, ఏదో ద్వీపానికి కొట్టుకుపోయి, పాత జీవితాన్ని చేరుకోలేక, మనదంటూ ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకుని… దానికి రాజీ పడి బ్రతుకుతున్నవాళ్ళం, అని.

ఒక మంచి పుస్తకాన్ని చదివిన తర్వాత కొన్ని ఆలోచనలూ, వాక్యాలూ మనల్ని వెంటాడాలి. అలా వెంటాడే వాక్యాలూ ఆలోచనలూ ఈ రెండు పుస్తకాల్లోనూ చాలా ఉన్నాయి.


పుస్తకం: పరవశ
ప్రచురణ: అనల్ప, 2022
వెల: ₹150.00
ప్రతులకు: అనల్ప.

పుస్తకం: నదివెంట నేను
ప్రచురణ: స్వీయ ప్రచురణ.
వెల: ₹120.00
ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్, హైదరాబాద్.