ఇద్దరు కథకులు – రెండు చెదిరిన బ్రతుకుల కథలు

ప్రేమ్‌చంద్ పేరు భారతదేశంలో చాలా మందికి తెలుసు. ఆయన సాహిత్యం తెలుగులోకి కూడా విరివిగా అనువాదమయింది. 1880లో పుట్టిన ప్రేమ్‌చంద్ 1936లో తన 56 ఏళ్ళ వయసులోనే మరణించారు. ప్రేమ్‌చంద్ పుట్టిన ముప్పై అయిదేళ్ళ తరువాత తెలుగుగడ్డ మీద రచయితలకే రచయిత అని పేరు పొందిన చాగంటి సోమయాజులు పుట్టారు. ప్రేమ్‌చంద్ రాసిన ఆఖరి కథ కఫన్. ఈ కథ ఇటీవలి కాలం వరకూ చర్చనీయంగానే ఉన్న వివాదాస్పదమైన కథ. ఈ కథ గురించిన వివాదాలు పక్కన పెడితే, చాసో 1968లో రాసిన బండపాటు కథకు, ప్రేమ్‌చంద్ 1936లో రాసిన కఫన్ కథకు, కొన్ని పోలికలు కనిపిస్తాయి. మనుషులు అమానుషమయే తీరును, దానికి దారి తీసిన పరిస్థితులనూ ఈ ఇద్దరు అభ్యుదయ రచయితలు తమ ఈ రెండు కథల్లో పరిశీలించారు.

చాసో తన రచనాకాలపు మధ్య దశలో ఉండగా ‘బండపాటు’ను రాశారు. ప్రేమ్‌చంద్ తను చనిపోయిన సంవత్సరమే ‘కఫన్’ రాశారు. స్థూలంగా చూస్తే, ప్రేమ్‌చంద్, చాసోల రచనల్లో ముఖ్యమైన పోలిక: ఇద్దరూ, జీవితంలో మనం ఉన్నాయనుకునే విలువలన్నీ కూడా ఆర్థిక చట్రాన్ని దాటినవి కావు అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ నిరూపిస్తూ రచనలు చేసినవారే.

బతుకు సూక్ష్మాన్ని గ్రహించి కథలు రాసిన రచయిత చాసో. అందుకే చాసో కథలు నిండుగా ఉంటాయి. వైవిధ్యభరితంగా ఉంటాయి. ఉదాహరణకు గ్రామీణ జీవితపు కులాల అంతరువులు, లేమి, బుగత దాష్టీకం (కుంకుడాకు); లేనివాళ్ళ బతుకుతెరువు మార్గాలు (ఎంపు, కుక్కుటేశ్వరము); సంగీతం ద్వారా లభించే జీవన మాధుర్యపు రుచినెరుగని తెలుగువారి రసజ్ఞతారాహిత్యం (వాయులీనం)… ఇలా మన సమాజపు ఒక్కొక్క పార్శ్వం మీదా ఒక్కొక్క కథ వెలుగును చూపుతుంది. ఈ వైవిధ్యంతోబాటు చాసో కథల్లో దొరికే అంతస్సూత్రం ఒకటే. పరిస్థితులను తట్టుకుంటూ, అలవాటుపడుతూ, బయటపడే మార్గాలు వెదుకుతూ, మనిషి పోరాడతాడు. ఈ పోరాటంలో ఆర్థిక శక్తుల ప్రభావం కీలకమైనది. ఇంకా మన నమ్మకాలు కూడా. అవి మనల్ని నడిపిస్తాయి. నమ్మకాలు ఏర్పడే, పని చేసే తీరు మీద కూడా ఆర్థిక శక్తుల ప్రభావం మామూలుది కాదు. మన మోసాలు, చేతకానితనాలు, భయాలు… ఇవన్నీ బైటపడతాయి చాసో కథల్లో.

కథకుడిగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి పరిణతి సాధించిన మేధావి ప్రేమ్‌చంద్. దేశమంతా ఉన్నట్టు గానే ప్రేమ్‌చంద్ కాలం నాటి హిందీ సాహిత్యం కూడా మబ్బుల్లోనే విహారం చేస్తుండేది. ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా కథను కిందకి దించి నేలమీద నడిపించిన రచయిత ప్రేమ్‌చంద్. పేద రైతులూ కూలీలూ గ్రామీణ జీవితం… వీటి మీద ప్రేమ్‌చంద్ దృష్టి పెట్టారు. దేశానికి స్వాతంత్యం రావాలంటే గాంధీ నాయకత్వం అవసరమని నమ్మి, తను గాంధీ శిష్యుడినని చెప్పుకున్నారు. కానీ గాంధీ చెప్పిన ధర్మకర్తృత్వం – ధనికుడు తన డబ్బుకి సొంతదారుడిగా కాదు ధర్మకర్తగా వ్యవహరించాలి – అనే కీలకమైన చిక్కుముడి దగ్గర గాంధీని ఒప్పుకోలేదు ప్రేమ్‌చంద్. అలాగే మతం, ఆచారాలు గ్రామీణుల అమాయకత్వం మీద ఆడుకుంటున్నాయని కూడా గ్రహించారు. ఉత్తర భారతదేశంలో భూమి, డబ్బు, చేతుల్లో ఉన్నవాళ్ళు వడ్డీ వ్యాపారం లోకి దిగి పేదలను పీడించడం, మతాచారాల పేరుతో అజమాయిషీ, వాటి ప్రకారం నడచుకోకపోతే నరకానికి పోతామనే నమ్మకంతో ఉండే అమాయకమైన రైతులూ… ఇలాటివాళ్ళంతా ఉన్న గ్రామీణ సమాజాన్ని చూశారు ప్రేమ్‌చంద్. జమీందార్లూ దోచుకునేవాళ్ళూ లేని గ్రామీణ భారతం కావాలని ఆశించారు. రైతులు పటిష్టంగా ఉండే భారతదేశం కావాలని కోరుకున్నారు.

చాసో, ప్రేమ్‌చంద్ ఇద్దరూ కూడా మనం బ్రతుకుతున్న మార్గానికి మించిన ఉన్నత మార్గం, అందరూ సౌఖ్యంగా బ్రతికే ఇంకేదో మార్గం ఉంది, అది మనకి కావాలి అని ఆశించిన వాస్తవికవాదులే. చాసో ఆ మార్గం మార్క్సిౙమ్ అని నిర్ధారణకు వచ్చారు.

చాసో రాసిన బండపాటు కథ టూకీగా ఇదీ: కొండల్లో బండలు కొట్టుకుంటూ బతికే జనం. ఆ కూలీల్లో రామిగాడు ఒకడు. అతనో పెద్ద బండ నెత్తి మీద పడి అక్కడికక్కడే చనిపోతాడు. సత్యం మేస్త్రీ తెలివైనవాడు. లోకం తీరు తెలిసినవాడు. ఇలాంటి చావులను చూడటం, వాటిని లాభానికి వాడుకోవటం అతనికి అలవాటయిపోయింది. రామిగాడు చచ్చిపోగానే కాంట్రాక్టర్ మీద దెబ్బలాటకి వెళ్ళి లోపాయకారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఆ డబ్బులో ఓ మూడు వందలు రామిగాడి భార్య పార్వతికి ఇస్తాడు. శవదహనం అయాక అందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. తానో రెండువందలు నొక్కేస్తాడు. అక్కడ ఏమేం జరుగుతున్నాయో ‘కనిపెడుతూ’ ఉండే కనకమ్మ అనే మరో కూలీ తనకో కోక కొనిమ్మని డిమాండ్ చేస్తుంది సత్యాన్ని. కథ పొడవునా కనకమ్మ, సత్యం మేస్త్రీల మధ్య జరిగే మాటల్లో మహా కటువైన సత్యాలు బండరాళ్ళలా దొర్లుకొచ్చి భయపెడతాయి. వీళ్ళిద్దరి మాటల్లోనే పార్వతికో ప్రియుడున్నాడనీ భర్త చావు వల్ల పార్వతికి దక్కిన డబ్బుని పెట్టి గేదెని కొనబోతున్నాడనీ మనకి తెలుస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలో రామిగాడి చావుతో ఎంతమంది ఎలా లాభపడ్డారో వివరిస్తుంది ఈ కథ.

కఫన్ కథను ప్రేమ్‌చంద్ 1936లో రాశారు. కథ క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఒక ఊర్లో ఇద్దరు తండ్రీ కొడుకులు. చమార్ అనే దళిత కులానికి చెందిన వాళ్ళ పేర్లు ఘీసూ, మాధవ్. సోమరిపోతులు. పనిదొంగలు. మాధవ్‌కు పెళ్ళవుతుంది. భార్య పేరు బుధియా. బుధియా పురుటినొప్పులు పడుతుండగా కథ మొదలౌతుంది. కాన్పు కష్టమై ఆమె చచ్చిపోతోందని తెలిసి కూడా వీళ్ళిద్దరూ ఏమీ పట్టించుకోకుండా, గొప్పవాళ్ళ ఇళ్ళలో జరిగే పెళ్ళి విందుల గురించి మాట్లాడుకుంటూ, బంగాళాదుంపలు కాల్చుకు తింటూ, ఇలా గుడిసె బయటే కాలం గడిపేస్తారు. రాత్రంతా బాధపడి, కనలేక, తెల్లారేసరికి ఆమె చచ్చిపోతుంది. దహనసంస్కారం కోసం అందర్నీ అడిగి ఒక అయిదు రూపాయలు సంపాదిస్తారు తండ్రీకొడుకులు. శవానికి కొత్తబట్ట కప్పి దహనం చెయ్యాలి. (ఆ బట్టను కఫన్ అంటారు.) ఆ కఫన్ కోసం దుకాణాలు తిరుగుతూ మద్యం దుకాణం దగ్గరికి వస్తారు. ఇంకేముంది, ఇద్దరూ ఆ డబ్బుతో శుభ్రంగా తిని తాగి పడిపోతారు.

ప్రేమ్‌చంద్ కఫన్ కథ రాసిన ముప్ఫైరెండేళ్ళ తరువాత చాసో బండపాటు కథ రాశారు. రెండిటిలోనూ కథ ఒక దుర్మరణం చుట్టూ తిరుగుతుంది. ‘కఫన్‌’లో కనలేక చచ్చిపోయిన బుధియా, ‘బండపాటు’లో రాయి మీదపడి చచ్చిపోయిన రామిగాడు. ప్రేమ్‌చంద్ కథలో చావు పర్యవసానంగా పుట్టిన డబ్బును తాగి తిని ఖర్చు చేసేస్తారు ఘీసూ, మాధవ్. చాసో కథలో ఆ డబ్బును పంచుకుంటారు. అది రకరకాలుగా ఉపయోగపడుతుంది. పార్వతికో గేదె, అందరి నోళ్ళూ నొక్కి పని గప్‌చుప్‌గా చేయించినందుకు సత్యం మేస్త్రీకి రెండొందలు, ఆడవాళ్ళ నోళ్ళు నొక్కి వెనకసాయం చేసినందుకు కనకమ్మకో కోక, మిగతా పనివాళ్ళకు చావువిందూ దక్కుతాయి.

రెండు కథల్లోనూ చచ్చిపోయిన మనుషుల గురించి పెద్దగా ఉండదు. వాళ్ళ చావు గురించే వర్ణన. రామిగాడి చావుని అక్కడున్న వాళ్ళెవరూ తప్పించలేరు. పనివాళ్ళ జీవితాల గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాంట్రాక్టరేమో ఆ పని చెయ్యడు. ఇక్కడేమో బుధియా చావుని తప్పించే ప్రయత్నమైనా కనీసం జరగదు. ఘీసూ మాధవ్‌లు నలుగురినీ కేకెయ్యటం, డబ్బుకోసం ప్రయత్నించటం లాంటివేవీ చెయ్యరు. ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూస్తూ కూచుంటారు.

ఈ కథలు చదివితే ‘అమ్మో ఇంత మానవత్వం లేకుండా మనుషులు బతుకుతారా!’ అని సగటు మధ్యతరగతి మనుషులకు వెగటు పుట్టొచ్చు. కానీ, మనుషుల్లో అమానుష లక్షణాలని వేటిని అనుకుంటామో అవి చావు సందర్భాల్లో బాగా బైటపడతాయి. ఎకనామిక్ ఈక్వేషన్స్ అంతో కొంతో లేకుండా ఒట్టి దుఃఖమయంగా ఏ చావూ వెళ్ళదు. మనిషి బతుకులాగే మనిషి చావు కూడా లాభనష్టాల లెక్కే.

ఈ చావు కథలు రెండిటినీ చాలా కటువైన స్వరాలతోనే చెప్పారు రచయితలిద్దరూ కూడా.

బండ నెత్తిమీద పడినంత వేగంతో నడుస్తుంది ‘బండపాటు’ కథనం. చావు తరువాతి సంఘటనలన్నీ జోరుగా జరిగిపోతాయి. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతూ లాభం పొందటానికి చేసే ప్రయత్నాలను చాసో తీవ్రంగా ఉద్విగ్నంగా అన్నిటినీమించి వ్యంగ్యంగా ధ్వనింపజేస్తారు. మనిషితనం నశించినవాళ్ళ ప్రవర్తన ఎంత హీనంగా ఉండగలదో మనం ఊహించలేనంత పదునైన వ్యంగ్యంతో వర్ణిస్తూ బాధాకరంగా నెమ్మదిగా ‘కఫన్‌’ను నడిపిస్తారు ప్రేమ్‌చంద్.

రెండు కథలూ కూడా ఆ మనుషుల ప్రవర్తన వెనకున్న వ్యవస్థ తాలూకు అమానుషత్వాన్ని చూడమంటాయి. రెండు కథల్లోనూ ఉన్న బీభత్సకరమైన వాస్తవికవాదం, అమానవీకరణ జరిగిపోయిన తీరు, ఇవి మనం నమ్ముతున్న వ్యవస్థ పట్ల సందేహాలను పెంచి, మన ఆలోచనలను పొరలు పొరలుగా చీల్చి, ఉద్విగ్నతను రేకెత్తిస్తాయి. ప్రశ్నలు ఎలా వేసుకోవాలో తెలుసుకొమ్మని సవాలు చేస్తాయి.

భూస్వామ్య సమాజం నేపథ్యంలో కఫన్ కథ చెప్తారు ప్రేమ్‌చంద్. అప్పటికి బ్రిటిష్‌వాళ్ళ పాలనలోనే ఉంది దేశం. చిన్న రైతులు రైతుకూలీలుగా మారిపోయే పరిస్థితులున్న కాలం. కష్టించి పని చేసేవాళ్ళ జీవితం ఏమంత మెరుగ్గా లేని సమాజం అది. పని చేసేవాడికి ఒళ్ళు విరుచుకోవటమే తప్ప, ఆ పనికి తగ్గ ఫలితం లేదు. కఫన్‌ను మృణాల్ సేన్ అనే బెంగాలీ దర్శకుడు 1977లో ఒకవూరి కథ అనే పేరుతో సినిమాగా తీశాడు. అందులో తండ్రి, ‘పనిదెయ్యం పట్టుకుంటే వదలదురా’ అని కొడుకుతో చెప్పి పని చెయ్యకుండా బతకటంలోనే సుఖం ఉందని బోధిస్తాడు. ప్రేమ్‌చంద్ 1920 ప్రాంతాల్లో ఇంకో కథ రాశారు. సవాసేర్ గేహూ అనే ఆ కథలో పావుశేరు గోధుమలు అప్పు తీసుకున్న ధార్మికుడైన ఒక చిన్నరైతు క్రమంగా ఒక వడ్డీవ్యాపారికి వెట్టికూలీగా ఎలా మారాడో వివరిస్తారు ప్రేమ్‌చంద్. సవాసేర్ గేహూ కథలోని చిన్నరైతుకు తార్కికమైన కొనసాగింపుగా (logical extension) ఘీసూ మాధవ్‌లను చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆ చిన్నరైతు కంటే ఎక్కువ స్వేచ్ఛాజీవులు. కానీ ఆ స్వేచ్ఛ కోసం వాళ్ళు పణం పెట్టిన విలువలు ఎన్నెన్నో. కఫన్‌ కథలో ప్రేమ్‌చంద్, ‘పనిచేసే రైతుల బలహీనతలను కనిపెట్టి, వాళ్ళను మోసం చేస్తూ సుఖంగా హాయిగా బతగ్గలిగేవాళ్ళున్న సమాజం మనది. ఇలాంటి పరిస్థితులున్నచోట ఘీసూ మాధవ్ లాంటివాళ్ళు తయారవటంలో ఆశ్చర్యం లేద’ని అంటారు. ఈ నిజాన్ని నిరూపించటం కోసమే ఇంత ఘోరమైన తండ్రీ కొడుకులని సృష్టించారా ప్రేమ్‌చంద్ అనిపిస్తుంది. ఒకరకంగా వీళ్ళిద్దరిదీ దోపిడీ మీద చేసిన తిరుగుబాటే. కానీ అది పరమ వంకరబుద్ధితో కూడిన వ్యక్తిగతమైన తిరుగుబాటు.

పనికి దొరక్కూడదనే అతితెలివితో సోమరితనం మరీ పెరిగిపోయి, వాళ్ళకు తిండి పెట్టి సాకుతున్న ఆడమనిషి ప్రాణాలు పోతున్నా తింటూ కూచుని జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. వీళ్ళిద్దరి ఇంత నీచమైన ప్రవర్తనలో వాళ్ళ సోమరితనానికున్న వాటా కూడా తక్కువదేమీ కాదని గమనించొచ్చు. ఘీసూకి తెలివి ఎక్కువకాబట్టి కష్టించి పనిచేసే రైతాంగంతో చేరకుండా ఏ పనీ చేయకుండా కూర్చుని కుట్రలుపన్నే మనుషుల జాతిలోకి చేరిపోయాడని అంటారు ప్రేమ్‌చంద్. కానీ ఆ జాతి జనంలాగా డబ్బు సంపాదించే తీరూ దాని సూత్రాలూ తెలీక ఘీసూ ఇలా మిగిలిపోయాడు. అవన్నీ చేయగలిగినవాళ్ళు ఊరి పెద్దలూ నాయకులూ అయిపోయారని వివరిస్తారు ప్రేమ్‌చంద్.

చాసో బండపాటు కథ రాసేనాటికి కాలం మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చేసింది. అభివృద్ధి ప్రణాళికలు జరిగిపోతున్నాయి. పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టి ప్రకృతిని ధ్వంసం చేయటం, అన్ని స్థాయిల్లో అవినీతి, చట్టాల్లో లొసుగులను వాడుకుని మోసాలు చేసే పద్ధతులు కనిపెట్టటం… ఇలాంటివన్నీ బాగా పెరిగిపోయాయి. ఇవన్నీ మనం చాసో కథలు బండపాటు, వజ్రహస్తం, ఆహాహా లాంటి కథల్లో చూస్తాం. బండపాటు కథ కొండలు పగలేసే వలస కూలీలది. కఫన్ లాగానే ఇది కూడా బీభత్సప్రధానమైన కథ. ఒక్క ఆ కొండే ఏడాదికి అయిదారుగుర్ని బలి పుచ్చుకుంటున్నాది. ‘బండలపాటు బండగా చేస్తారు. బండపాటుకి చచ్చేవాళ్ళు చస్తారు’ అంటారు చాసో. ‘ఇంతమందిలోనూ రామిగాడికే ఎందుకు బండ తగలాలి? చావుంది. చచ్చాడు. పడవలసి ఉంది. పడ్డాడు. జాగ్రత్తలు తీసుకోటానికి ప్రభుత్వం కొండల మీదికి వస్తుందా?’ అని చెప్తూ కర్మసిద్ధాంతం మీద బాణం వేసేస్తారు. ఎప్పుడెవరు బండలు మీదపడి చస్తారో తెలియని పరిస్థితుల్లో అలాంటి చావులు ఘోరమని కూడా అనిపించని స్థితికి చేరతారు అక్కడున్న వాళ్ళు చాలామంది. ఇంక మిగిలేది ఏమిటి? ఏ చావుకి ఎంత నష్టపరిహారం వచ్చింది, ఏ చావు విందు ఎంత ఘనంగా జరిగిందీ అనే లెక్కలే. కానీ మేస్త్రీ సత్యం, కనకమ్మల మాటల్లో ‘ఈ పరిస్థితిలో ఇంతకంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇదిలాగే జరుగుతుంది.’ అనే సమర్థింపు ఉంటుంది. ఈ వలస కూలీలకు మనుగడే పెద్ద సమస్య అయిపోయి అందులోనే కొట్టుకుంటూ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ ఆ దోపిడీ వ్యవస్థ కొనసాగటానికే ఎలా సహకరిస్తూ ఉంటారో బండపాటు కథలో చూస్తాం. ఈ కొత్తరకం దోపిడీ విధానాల చిన్నచిన్న గుట్లు కనిపెట్టే సత్యం మేస్త్రీ లాంటివాళ్ళు అందరికీ ఎంతో కొంత విదిలించి, నాయకులుగా ఎదిగి డబ్బు సంపాదిస్తారు.

ఏ క్షణంలో అయినా చావు మీదపడే చోట బతికే మనుషులంతా అలాంటి భయంకరమైన చావుల గురించి మాట్లాడుకునే మాటలు కూడా విపరీతంగానే ఉంటాయి. చావు విందులో పీకమొయ్యా తాగేసిన ఒక ముసిలాడు ‘సత్తెం ఈ సావుకి మాబాగా సేసినాడు’ అని మెచ్చుకుంటాడు. ఇంకా జరగబోయే చావుల్లో మరింత ఎక్కువ డబ్బూ రావచ్చు. సత్యానికి బుద్ధి పుడితే చావు విందులు ఇంతకంటే బాగా కూడా చేయించొచ్చు. కఫన్‌లో ఘీసూ కూడా తనకీ తన కొడుక్కీ చావు విందు చక్కగా ఏర్పాటు చేసుకుంటాడు. తెలివీ తార్కికజ్ఞానం ఉన్న ఘీసూకి సోమరితనానికి బదులుగా సమర్థతా సామాజిక స్థాయీ తోడైతే సత్యం మేస్త్రీ లాగా లీడర్ అయివుండేవాడు, ప్రేమ్‌చంద్ చెప్పినట్టుగానే.

‘కఫన్‌’లో లోకవిరుద్ధంగా ఉన్న ఇలాంటి తండ్రీకొడుకుల ఇంటికి బుధియా లాంటి పనిచేసే తత్వం ఉన్న మనిషి కోడలుగా వచ్చింది. దీనితో వీళ్ళు ఆమె మీద ఆధారపడి, ఇంకా సోమరిపోతులైపోతారు. బుధియాకి పురిటినొప్పులు వస్తుంటే ఏ ఆడతోడూ లేకపోవటం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బైటకు వెళ్ళి గడ్డి కోసి, పిండి విసిరి, పనిచేసి, వీళ్ళిద్దర్నీ పోషించే మనిషికి బైటి మనుషుల నుంచి కూడా ఏ సాయమూ అందని పరిస్థితి ఎందుకుందో కథలో ప్రేమ్‌చంద్ వివరించరు. ‘కఫన్‌’ను వాస్తవికవాద కథ అని కూడా పూర్తిగా అనలేం. మార్మికత, తీవ్రమైన నిరాశావాదం, వ్యవస్థలో ఉన్న వంకర్లన్నిటి మీదా ఘీసూ వేసే విసుర్లూ… వీటన్నిటితో కూడిన ఈ కథను మొదటిసారి చదవటం చాలా షాకింగ్‌గా ఉంటుంది. కథనం గురించి తార్కికంగా ఏ అనుమానాలూ కలగనంత షాక్ వేల్యూ ఉంది ‘కఫన్‌’కు. చాసో రాసిన ‘పరబ్రహ్మము’ కూడా మార్మికమైన కథే. కఫన్‌ కథలో తండ్రీకొడుకుల కడుపులు, మండే కూపాల వంటివని రాస్తారు ప్రేమ్‌చంద్. బుధియా ప్రాణం పణంగా పెట్టాకే ఆ నరకకూపాలు పూర్తిగా చల్లారతాయి. ‘కఫన్‌’లో తిండి యావ, వర్ణన చాలా ఉంటుంది. అలాగే, పరబ్రహ్మము కథ పిచ్చివాడి ఆకలితో మొదలై ఆకలి స్వరూపాన్ని అన్వేషించి, చెత్తకుండీ దగ్గర మిలిటరీ హోటల్ వాళ్ళు విసిరిన ఎంగిలాకుల దగ్గర సత్యాన్ని కనుక్కుంటుంది. ఆకలి విశ్వరూపాన్ని ‘కఫన్‌’ లోనూ, ‘పరబ్రహ్మము’ లోనూ మనం చూడవచ్చు.

మళ్ళీ ‘బండపాటు’కు వద్దాం. బండపాటు పూర్తి వాస్తవికవాద కథ. వలస బతుకుచిత్రం. ఈ కథలో బతుకూ చావూ కూడా తీరుబాటుగా ఉండవు. పైగా అందరూ ఈ బండపాటు చావు గురించి ఎక్కువ ఆవేశపడి ఆలోచించకుండా ఉండాలంటే తొందరగా శవాన్ని దహనం చేసెయ్యాలని సత్యం మేస్త్రీకి కంగారు. హడావుడిగా అన్నీ ముగించి తాగుడుకి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకుంటాడు. పార్వతికి డబ్బు ముట్టిందని తెలిశాక ఆమె అత్త చామాలు వచ్చేస్తుంది. చామాలు గురించి కూడా చాసో సూక్ష్మంగా ఒక మాట అంటారు. అదేమిటంటే, పుట్టిన దగ్గరనుంచి రామిగాడు పెద్దవాడయీ వరకూ వాడి కబుర్లెన్నో ఏడుపుతో మిలాయించి చెప్పిందని. పోయినవాడు ఎలా ఉండేవాడో తలుచుకుని వర్ణించి ఏడ్చే సంప్రదాయం చామాలుకి బాగావచ్చు. ఇది మళ్ళీ పార్వతికి చేతకాదు. వలస కూలీల జీవిత వేగం పల్లెటూరి పద్ధతులను వదలగొట్టేస్తుంది. ‘నానే సెర్లో పడ్డం దేముడో’ అనటం తప్పించి వేరేలా ఏడవలేక పోతోందని వ్యాఖ్యానిస్తారు చాసో. చాసో వ్యంగ్యపు వ్యాఖ్యల మధ్యనుంచీ పాత్రల స్వభావాలూ సామర్థ్యాలూ ప్రాంతీయతా తెలుస్తాయి.

‘కఫన్‌’లో తండ్రీకొడుకులు కూడా చామాలు లాగే ఛాతీలు బాదుకుని ఏడుపులు మొదలు పెట్టి అందరి దగ్గర డబ్బులు దండుకుంటారు. ఆ డబ్బుతో పూర్తిగా తాగేశాక అప్పుడు మాధవ్‌కి కాస్త అపరాధభావన వస్తుంది. కఫన్ కొనలేదని బుధియా పైలోకాల్లో తనను నిలదీస్తుంది గదా దానికేం జవాబు చెప్పాలని ఘీసూని అడుగుతాడు. ‘డబ్బు పోయిందని చెప్దాం. అప్పుడు ఊళ్ళోవాళ్ళే కఫన్ కొనే ఏర్పాట్లు కూడా చేస్తార’ని ఘీసూ ధీమాగా చెప్తాడు. అలా ఆ బాధ్యతను కూడా ఊరిమీద పెట్టేస్తాడు. బతికి వున్నప్పుడు పట్టించుకోకపోయినా, ఈ ఆచారాలు పాటించాలనే నమ్మకం అందరికీ ఉండి తీరుతుంది, అందువల్ల కఫన్‌ను ఊరివాళ్ళే కొంటారని ఘీసూకి ధీమా. దేనినీ ప్రశ్నించకుండా తిరగబడకుండా ఉండే అమాయకమైన కూలీమనిషైతే ఇంత సులువుగా బాధ్యతను తన మీదనుంచి తోసేసుకోలేడు.

శవదహనం చేసేముందు కఫన్ కొనటం చాలా ముఖ్యం. దీనిని కూడా ఘీసూ తర్కిస్తాడు. బతికున్న మనిషికి ఒళ్ళు కప్పుకునేందుకు చిన్న పీలిక దొరకదు గానీ చచ్చిపోయిన మనిషికి కప్పటానికి కొత్త బట్ట దేనికని విసుక్కుంటాడు. మనిషి బతికి వున్నప్పుడు పట్టించుకోని సమాజం మనిషి పోయాక చేసే తంతులకు చెయ్యి విదిల్చి దానం చేస్తుంది. ఇలాంటి బూటకపు ధార్మికత ఉన్నచోట ఘీసూ మాటలను కాదనలేం.

ఘోరమైన చావులు జరిగినప్పుడు ఎవరైనా సాధారణంగా ఒక మాట అనుకుంటారు. కనకమ్మ కూడా ఇదేమాట అంటుంది, డబ్బుపోతే డబ్బొస్తాది. మనిషి పోతే మనిషొస్తాడా – అని. ఆ చావు తెచ్చిన నిర్వేదంతో అలా ఒకసారి అనుకున్నా, ఏ పరిస్థితీ అనుకూలంగా లేక కష్టం చేసుకు బతికేవాడికి అలాంటి మాటను నిలబెట్టుకునే అవకాశం ఉండదు. అందుకే, ‘డబ్బుపోతే డబ్బురాదు. పార్వతి వయసులో ఉంది కాబట్టి మొగుడు పోతే మరో మొగుడొస్తాడు’ అనేస్తాడు సత్యం.

సమస్త పార్శ్వాలనుంచి జీవితాన్ని దర్శించటంతోబాటు, పారిశ్రామికీకరణ జరిగే క్రమంలో భద్రత కరవై మానవత్వం ఎలా మారిపోయిందో చాసో చూశారు. వలస పాలన తెచ్చిన కొత్త ఫ్యూడల్ వ్యవస్థలో గ్రామాల్లో సామాజిక ఆర్థిక మానవీయ సంబంధ సూత్రాల లొంగుబాటూ కుంగుబాటూ క్రమంగా ఎలా జరిగిపోయిందో ప్రేమ్‌చంద్ ఆవిష్కరించారు. ఇప్పటికీ ఇలాంటి అమానవీయ సంబంధాలు కొనసాగుతూనే ఉండటం మనం చూస్తున్నాం. అందుకే ఈ కథలకు కాలం చెల్లదు.

‘బండపాటు’కూ ‘కఫన్‌’కూ ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, ‘బండపాటు’లో ఉన్న మనుషులంతా చాతనైన విధంగా బతుకు కోసం పోరాడుతున్నవాళ్ళు. అందువల్ల బండపాటు కథను బ్లాక్ కామెడీ అనొచ్చు. ‘కఫన్‌’లో బతుకుపోరాటాన్నే వదిలేసి కూర్చుంటారు ఘీసూ, మాధవ్. తాము నాశనం కాకుండా ఉండగలిగామన్న మిథ్యానందాన్ని నాటకీయంగా కూడగట్టుకుంటూ ముత్యం లాంటి తమ ఆడమనిషి చావుకు కారణమౌతారు. అలవికాని బీభత్సం. అందుకే కఫన్ కథ ఒక బ్లాక్ ట్రాజెడీ.