ప్రజానందులవారు కరమన ఏటి ఒడ్డున స్థాపించిన గురుకుల ఆశ్రమం అది.
అప్పటికే అక్కడ ఎంతమందో వీధి పిల్లలు నిల్చుని ఉన్నారు. కరమన ఏట్లో దిగి స్నానం చేసి పుళ్ళకు మందు వేసుకుని, వాళ్ళు ఇచ్చే మంచి బట్టలు వేసుకుని, అక్కడున్న పెద్ద కూటంలో కూర్చుని ప్రార్థనాగీతాలు పాడాలి. గంటసేపు వాళ్ళు నేర్పే పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత అన్నం పెడతారు. అప్పటికే వచ్చిన పిల్లలు కొందరు ఏట్లో దిగి ఇసుక తీసి ఒంటికి రాసుకుంటూ స్నానం చేస్తున్నారు. కాషాయం పంచెను మోకాలికి పైన మడిచి కట్టుకున్న ఒక యువ స్వాములవారు ఒడ్డున నిల్చుని ‘అరే, వాడ్నే… ఆ నల్లోణ్ణే… వాడు సరిగ్గా రుద్దుకోవడం లేదు… వాడిని ఇసుకతో బాగా తోమండ్రా’ అని కేకలు పెడుతున్నాడు.
నేను నీటిని చూడగానే ఆగిపోయాను. ఆయన నన్ను చూడగానే నేను పరుగు పెట్టాను. ‘రేయ్, వాడ్ని పట్టుకోండ్రా’ అని చెప్పగానే నలుగురైదుగురు పెద్దపిల్లలు వచ్చి నన్ను తరిమి పట్టుకుని లాక్కుంటూ ఎత్తుకుంటూ వచ్చి ఆయన ముందు కుదేశారు. స్వాములవారు నా చేతులు పట్టుకుని నన్ను ఎత్తి మెడలోతు నీళ్ళల్లో పడేశాడు. చేపలు నన్ను చుట్టేసుకుని నా చర్మాన్ని పొడవసాగాయి. నేను అల్లల్లాడిపోతూ పెద్దగా కేకలు పెట్టాను. ఆయన నన్ను ఎత్తి ఒక రాతి మీద కూర్చోబెట్టి కొబ్బరి పీచుతో పరపరా తోమాడు. నేను గట్టిగా ఏడుస్తూ ఆయన పట్టునుండి తప్పించుకుందామని ఆయన చేతిని గట్టిగా కొరికాను. అవేవి ఆయన పట్టించుకోలేదు.
ఒళ్ళంతా రక్తం కారుతూ నిల్చున్న నన్ను వదలకుండా లాక్కెళ్ళి నీలిరంగులో ఉన్న ఒక ద్రవాన్ని నా ఒళ్ళంతా రాశారు. అది నా ఒంటిని తాకగానే ఒక క్షణం చల్లగా అనిపించి వెంటనే నిప్పుతో కాల్చినట్టు మంట మొదలైంది. చేతిని విదిలించుకుని ఏడ్చుకుంటూ పరుగుతీశాను. ఆయన నా వెనకే వస్తూ “పరిగెడితే భోజనం లేదు… తెలిసిందా? పరిగెడితే భోజనం లేదు” అన్నాడు. నేను గబుక్కున ఆగిపోయాను. ఒక్క అడుగు ముందుకెయ్యలేకపోయాను.
“కాపడికి కూడు కావాలి… కూడు” అని అక్కడే నిల్చుని ఏడ్చాను.
నా ఒంటి మీద మంట తగ్గింది. పడుతూ లేస్తూ మెల్లగా ఆశ్రమానికి చేరుకుని అరుగు పట్టుకుని నిల్చుని “దమ్మదొరా కూడెయ్యి… దమ్మదొరా కూడెయ్యి… కూడు” అని దీనంగా ఏడ్చాను.
స్వాములవారు నన్ను ఎత్తుకుని వెళ్ళి లోపల పెద్ద కూటంలో కూర్చోబెట్టి నేను పడుకుంటే సరిపోయేంత పెద్ద ఆకు వేసి అందులో అన్నం వడ్డించాడు. నేను “యింకా” అన్నాను. మళ్ళీ పెట్టాడు నేను మళ్ళీ “యింకా” అన్నాను. “ముందు ఇది తినరా బక్కోడా… అయ్యాక పెడతా” అన్నాడు స్వామి.
నేను అన్నాన్ని ఆకుతో చుట్ట చుట్టుకుని లేవబోతుంటే నా తలమీద ఒకటి ఇచ్చి “ఇక్కడే కూర్చుని తినవోయ్” అన్నాడు. నేను అన్నాన్ని ముద్ద చేసుకున్నాను. దాన్ని నోట్లో పెట్టుకునేప్పుడు గద్దింపు కోసం చెవులు, తన్నుల కోసం వీపు ఎదురు చూశాయి. తొలి ముద్ద తిని ఎందుకని అలా జరగలేదు అనుకుంటూ లేవబోయాను. స్వాములవారు “తినరా” అన్నాడు. మళ్ళీ కూర్చుని వేడి వేడి అన్నాన్ని ముద్దలు చేసి నోట్లోకి కుక్కుకున్నాను.
అన్నం గుట్ట, అన్నం ఇసుకతిన్నె, అన్నం వెల్లువ, అన్నం ఏనుగు, అన్నం వాన… ప్రపంచం లేదు. పరిసరాలు లేవు. అన్నమూ నేనూ మాత్రమే ఉన్నాం అప్పుడు. ఒక స్థాయి దాటాక ఇక తినలేకపోయాను. నోటిలో, ఒంట్లో అన్నం మాత్రమే నిండి ఉన్నట్టు అనిపించింది. నా పొట్ట పెద్ద కంచు అండాలాగా మెరుస్తోంది. అక్కడున్న మీసాలాయన “అరే నీయబ్బ, నీ పొట్ట నిండిపోయింది కదరా! పొట్టమీద పేలు కుక్కచ్చులా ఉందే…” అన్నాడు.
నేను ఆయన నన్ను కొట్టబోతున్నాడు అనుకుని లేచి వారగా జరిగాను. “అరేయ్ అరేయ్ ఉండు, ఉండు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. ఇక్కడే ఉండు. ఇంకా అన్నం కావాలా?” అని అడిగాడు. అవును అన్నట్టు తల ఊపాను. “ఇంకా అన్నం తిన్నావంటే నీ పొట్ట పగిలి బూరగదూదల్లే అన్నం బయటకు వస్తుంది! రేపు అన్నం కావాలా?” అని అడిగాడు. అవును అని తల ఊపాను.”రేపు కూడా రా. ఇక్కడికి వచ్చి స్వాములవారు నేర్పించే పాటలు, చదువూ నేర్చుకున్నావంటే ఎంత అన్నం కావాలన్నా పెడతారు” అన్నాడు.
అలా నేను ప్రజానందులవారి ఆశ్రమానికి రోజూ వెళ్ళాను. అక్కడ ముప్పైమందికి పైగా వీధిపిల్లలకు పాటలు, చదువు నేర్పుతున్నారప్పుడు. ఆశ్రమానికి పిల్లలు రావాలనే అన్నం పెట్టేవాళ్ళు. అలా వచ్చే పిల్లల్ని స్వామి బోధానందులవారు బడిలో చేర్పించేవారు. బడిని ప్రజానందులవారు స్థాపించినప్పటికీ బడి నిర్వహణ మాత్రం బోధానందులవారే చేసేవారు. నిగనిగలాడే నల్లని గడ్డం, భుజాలమీద జారిపడే జుట్టు, పొట్టిగా పహిల్వాన్ లాంటి ఒంటి తీరుతో ఉండే యువకుడు బోధానందులు.
ఆ వయసులో నాకు ఆయన కండపుష్టి చాలా ఆకర్షణీయంగా ఉండేది. నాకు తొలిసారి స్నానం చేయించాక ఆయన నన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటాడా అని తపించేవాడిని. ఆయన దాపుల్లో తచ్చాడుతూ ఆయన కంటపడేలా నిల్చునేవాడిని. ఆయన పట్టించుకోకుంటే నన్ను పట్టించుకోవాలి అన్నట్టు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళకు రాసుకుంటూ అటూ ఇటు తిరిగేవాడిని. నన్ను చూశారంటే వెంటనే నవ్వి నన్ను నడుము దగ్గర పట్టుకుని పైకి ఎగిరేసి కిందకు దించేవారు. బరువు కోల్పోయిన పక్షిలా ఆకాశానికి ఎగిరి కిందకి దిగేవాడిని. నవ్వుతూ ‘యింకా యింకా’ అని మారాం చేసి ఆయన వెనకే తిరిగేవాడిని.
నన్ను బడిలో చేర్చుకున్నారు బోధానందులవారు. కొన్ని రోజులు పూజల్లో పాల్గొని ‘దైవమా కాపాడుము, విడువకిటు మము…’ అన్న నారాయణగురు పాట పాడుతుండేవాడిని. ఆ తర్వాత పూజ పూర్తయ్యాక చక్కెర పొంగలో గుగ్గిళ్ళో ఇచ్చేవారు. పూజకు మాత్రం స్వామి ప్రజానందులవారు వచ్చి కూర్చునేవారు. తెల్లటి చుట్టవెంట్రుకల గడ్డం పూజలో వాడే పెద్ద శంఖంలా ఉండేది. తలనుంచి జుట్టు తెల్లగా అంగవస్త్రంలా భుజాలమీద వేలాడేది. బక్కపలచగా, చిన్నగా ఉండేవారు. నెమ్మదిగా మాట్లాడేవారు.
ప్రజానందులవారి ఆ గురుకులం సఫలం అయిందా విఫలం అయిందా అని నేను చెప్పలేను. అయితే ఎప్పుడూ అక్కడ కనీసం ముప్పైమంది పిల్లలు ఉండేవాళ్ళు. రోజూ వందమంది దాకా భోజనాలు చేసేవాళ్ళు. అయితే సక్రమంగా, పదిమందైనా చదువుకోలేదు. చాలామంది పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తగవు పెట్టుకుని అక్కడనుండి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కొందరు పిల్లలు కొన్నాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకే చిరాకేసి వెళ్ళిపోయి, మళ్ళీ కొంత కాలం తర్వాత ఒళ్ళంతా గజ్జిపుళ్ళతో, మురికి బట్టలతో, జబ్బుతో, ఆకలితో తిరిగి వచ్చేవాళ్ళు.
నేను అక్కడ చేరిన నాలుగోరోజే మా అమ్మ వచ్చి అక్కడినుండి లాక్కుని వెళ్ళింది. ఆమెతో నగరం అంతా తిరిగాను. నగరం అంతా ఒకప్పుడు పాయిఖానా పోవడం కోసం ఇద్దరు మనుషులు పట్టే వెడల్పుతో ఒక సన్నటిదారి ఉండేది. ఏటి దగ్గరో కాలువదగ్గరో మొదలయ్యే ఆ దారి పెద్దవీధులకు సమాంతరంగా ఇళ్ళకు వెనకవైపు నగరమంతా ఉండేది. మా వాళ్ళు అందరూ ఆ దోవలోనే తిరిగేవాళ్ళు. మాకోసం పడేసే ముష్టి ఆహారం అక్కడే దొరికేది. చెత్త, పందికొక్కులు, హోటల్ ఎంగిలి విస్తర్లు…
ఆ రోజుల్లో తిరువిదాంగూర్ స్టేట్‌లోని నాయాడులందరూ తిరువనంతపురం నగరానికి వచ్చేసుండాలి. నిజానికి నాయాడుల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నాయాడులకు కూడా. నాగం అయ్య మా కులం వాళ్ళని కళ్ళతో చూసి మైలపడుండే అవకాశమే లేదు. ఇతరుల అభిప్రాయాలను, చెప్పిన గురుతులనే ఆధారంగా చేసుకుని మేన్యువల్ రాశాడు. అయినప్పటికీ మా గురించి వివరమైన రికార్డ్ ఆయన రాసినదే. ఎడ్గర్ థర్స్‌టన్ కూడా కొన్ని లైన్లే రాశాడు. 1940లో మరో విస్తారమైన మాన్యువల్ తయారుచేసిన శతస్యతిలకన్ దీవాన్ వేలుపిళ్ళై కూడా నాగం అయ్య రాసిన అవే వాక్యాలను తీసుకుని కలిపేశాడు. సంఖ్యను మాత్రం డెబ్బైవేలు అని పెంచి రాశాడు.
అయితే అప్పటికే మావాళ్ళలో ఎక్కువశాతం మంది చనిపోయి ఉండాలి. ఆ రోజుల్లో కలరా వ్యాధి సోకి తిరువిదాంగూర్ స్టేట్‌లో జనం గుంపులు గుంపులుగా చనిపోయేవారు. ప్రభుత్వపు లెక్కల్లో పేరు, ఊరు వంటి వివరాలున్న పన్ను కట్టేవారే చనిపోయి అనాథ శవాల్లా కుళ్ళిపోతుంటే నాయాడులు ఎందరు చచ్చారన్నది ఎవరు పట్టించుకుంటారు. మట్టిలోపలే చనిపోయి అందులో మగ్గిపోయే పందికొక్కుల్లా ఎందరో చచ్చి కనుమరుగయ్యుంటారు.
మిగిలినవాళ్ళు తిరువనంతపురం, కొల్లం వంటి పెద్ద పట్టణాల్లోకి వలస వెళ్ళి ఉండాలి. అప్పటికే ఆ పట్టణాల్లో, వీధుల్లో బతుకుతున్న ఎన్నో యానాదుల తెగల్లో మరో తెగగా కలిసిపోయుండాలి. సగానికి పైగా వలసవచ్చిన వాళ్ళతో నిండిపోయిన పెద్ద పట్టణాల్లో నాయాడుల గురించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలిసుండదు. పగటి పూట వెలుతురులో భిక్ష అడుక్కోవడం అన్నదే పెద్ద అభివృద్ధిగా, సామూహిక గౌరవంగా మా పూర్వీకులు భావించి ఉండవచ్చు. నగరం అన్నది నిర్విరామంగా చెత్తను బయటపడేస్తూనే ఉంటుంది. ఆ చెత్తకుప్పల్లో పురుగుల్లా మావాళ్ళు పిల్లల్ను కని వంశాన్ని ఉద్ధరించారు.
కొన్ని రోజులకు అన్నం గుర్తురాగానే అమ్మ దగ్గర్నుండి తప్పించుకుని ఆశ్రమానికి వెళ్ళాను. బోధానందులవారు నన్ను మళ్ళీ కరమన ఏట్లో పడేసి స్నానం చేయించి ఆకేసి అన్నం పెట్టారు. క్రమేణా ఆయనకు నా మీద ఒక ప్రత్యేకమైన మమకారం కలిగింది. నేను పాటలు తొందరగానే వల్లెవేశాను అన్నది దానికి ముఖ్యమైన కారణం కావచ్చు. ఆశ్రమంలో నాకు ధర్మపాలన్ అని పేరు పెట్టారు. ప్రార్థనకోసం ప్రజానందులవారు వచ్చి కూర్చోగానే బోధనందులు “ధర్మా, పాట పాడరా” అనేవారు. నేను లేచి నిల్చుని చేతులు జోడించి గట్టిగా ‘దైవమా కాపాడుము…” అని పాడేవాడిని.
పదేపదే మా అమ్మ ఆశ్రమానికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడం మొదలు పెట్టినప్పుడు బోధానందులు ఆపేశారు. అమ్మ చేతులు జోడించి ‘సాఁవీ, బిడ్డను పంపించు సాఁవీ’ అని ప్రాధేయపడుతూ ఆశ్రమం మెట్లమీదే కూర్చునేది. ఆమెకు ఏం చెప్పినా అర్థం అయ్యేది కాదు. ‘బిడ్డను పంపించు సాఁవీ’ అని ఏడుస్తూ ఉండేది. ఆమెకు బోలెడంతమంది పిల్లలు పుట్టి చనిపోయారు. నన్ను చేతులు పట్టుకుని నడిపించిన అక్క కూడా ఒక శ్రావణమాసం వర్షంలో ఒక అరుగుమీద పడి చనిపోయింది. కాబట్టి నన్ను వదులుకోవడం అమ్మవల్ల కాలేదు.
అమ్మకు తెలియకుండా నన్ను నారాయణగురువుగారి ఆలువా అద్వైత ఆశ్రమానికీ అక్కడినుండి పాలకాడులోని రెసిడెన్షియల్ పాఠశాలకూ పంపించారు. కొన్నేళ్ళలో నేను పూర్తిగా మారిపోయాను. కాళ్ళు చేతులు బలంగా దృఢంగా మారి, రింగుల జుట్టు, పెద్ద పళ్ళతో పుష్టిగా తయారయ్యాను. నా ఆకలంతా చదువు మీదకు మళ్ళింది. దాదాపు మాట్లాడటం అన్నది మానేశాను. నాకు ‘మూగోడు’ అన్న పేరు కూడా ఉండేది బడిలో. ‘గుడ్లగూబ’ అని కూడా. అంటే తరగతిగదిలో కళ్ళు తెరుచుకుని కదలకుండా కూర్చునే నల్లటి ఆకారం.
బోధానందులవారు కోళికోడు సముద్రతీర ప్రాంతంలో కలరా బారిన పడినవారికి సేవలు చెయ్యడానికి వెళ్ళి అక్కడే మరణించారు. ప్రజానందులవారి పాఠశాలను ప్రభుత్వ ఆదివాసీ సంక్షేమ శాఖ తన ఆధ్వర్యంలోకి తీసేసుకుంది. ప్రజానందులవారి ట్రస్టునుండి నాకు ప్రతినెలా కొంత డబ్బు వచ్చేది. నా కులానికి ప్రభుత్వం ఇచ్చే శిక్షణా సహాయనిధితోబాటు మరికొన్ని సదుపాయాలు ఉచితంగా లభించేవి. నేను ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవాడిని. మా ట్రైబల్ హాస్టల్లో ఉన్న అందరూ ఏదో ఒకటి చదువుకుంటూనే ఉండేవారు. చదువు ఆపేస్తే ఉద్యోగం వెతుక్కోవలసి ఉండేది. చదువుకునేప్పుడు అన్నం పెట్టడానికి ఉపయోగపడిన కులముద్ర, ఉద్యోగం వెతుక్కునేప్పుడు అడ్డుగీతగా ఉండేది. దొరికితే ప్రభుత్వ ఉద్యోగం, లేదంటే ఏ ఉద్యోగమూ దొరకదు.
హాస్టల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేవాడిని. ట్రైబల్స్ కోసం ఉన్న ఆ హాస్టల్లో ఉన్న ఏకైక నాయాడిని నేనే. నాతో గది పంచుకోడానికి ఎవరూ లేరు. నాకొక్కడికి మాత్రం అక్కడి మరుగుదొడ్డి వాడుకోవడానికి నిషేధం. వేకువ జామునే లేచి రైలు పట్టాలవైపుకు వెళ్ళి వచ్చేవాడిని. లఘుశంకకు కూడా పక్కనున్న బీడులోకి వెళ్ళాల్సిందే. నాతో మాట్లాడే ఎవరికైనా సహజంగానే ఒక గద్దింపు స్వరం వచ్చేస్తుంది. ఎలాంటి గద్దింపునైనా సహజంగా తీసుకునే స్థితికి అలవాటుపడిపోయాను.
ఆ చదువుకునే రోజుల్లో నేను అమ్మను చూడనేలేదు. ఆమె గురించి పెద్ద తలచుకున్నది కూడా లేదు. నన్ను నేను ఒక ఎలుకలా భావించుకుని జీవించిన రోజులవి. దాక్కుని, తప్పుకుని ప్రాణం నిలుపుకోడానికి సురక్షితమైన చోటును చూసుకునే జీవి. పరిగెట్టేప్పుడు కూడా నక్కినక్కి ఉండేట్టుగా గూని వీపుతో సృష్టించబడినది. ఎలాగో ఒకలా ఎవరి కళ్ళల్లోనూ పడకుండా అన్నివేళలా జాగృదావస్థలో ఉండటం గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉండేవాడిని.
ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ ముగించాక ప్రజానందులవారు నన్ను చూడాలనుకుంటున్నట్టు కబురు పంపారు. నేను తిరువనంతపురం వెళ్ళాను. అప్పటికి ఆయన ఆశ్రమంలో ఎక్కువమంది లేరు. ఒకరిద్దరు విదేశీయులున్నారు. ఆయనకు బాగా వార్ధక్యం వచ్చేసింది. చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాను. ఒక విదేశీ యువకుడు ఆయన్ని తన పెద్ద చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆయన తల వణుకుతూ ఉంది. జుట్టంతా రాలిపోయి తలమీద మచ్చలు కనబడ్డాయి. గూని కారణంగా ముఖం బాగా ముందుకు చొచ్చుకుని వచ్చేసింది. ముక్కు నోటివైపుకు ఒంగి పెదవులు పూర్తిగా లోపలికి ఎండిపోయి నోరు ఒక చిన్న మడతలా మాత్రమే కనబడుతోంది.
“బాగా పెద్దవాడివిగా ఎదిగిపోయావు… కదా!” అని ఆశ్చర్యపోయారు. నేను మాట్లాడేది తమిళం అనుకున్నట్టున్నారు. నేను కూడా ఏ కారణం చేతనో వీలైనంతమేరకు మలయాళానికి దూరంగా ఉన్నాను. నా రంగు, ఆకారం ఇవి నన్ను తమిళవాడిగా చూపించుతుంటాయేమో. ఆయన చేతులూ తలా ఎక్కువగా వణుకుతున్నాయి. ఆయన ఇంగ్లీష్‌లో “ఎమ్. ఏ. ఫలితాలు ఎప్పుడు వస్తాయి?” అని అడిగారు.
“జూన్‌లో” అన్నాను.
“ఏం చెయ్యబోతున్నావు?”
నేను మాట్లాడలేదు.
“నువ్వు సివిల్ సర్వీసెస్‌కు వెళ్ళు,” అని అన్నారు. నేను మాట్లాడాలనుకున్నా నాకు మాటలు రాలేదు. “మాట్లాడవేం?” అన్నారు.
నేను తడుముకుంటున్నట్టు “క్షమించాలి గురువుగారూ” అన్నాను.
“నీ నోట్లో ఇంగ్లీషు పలకడం లేదు. అందుకే ఏదో వాగుతున్నావు. ఇంగ్లీష్ మాట్లాడితేనే నువ్వు మనిషిగా చూడబడతావు. లేదంటే నువ్వెంత చదివినా నువ్వు కేవలం నాయాడివే. నారాయాణగురువు అందర్నీ ఇంగ్లీష్ చదువుకోమన్నది ఊరికే కాదు. ఇంగ్లీష్ చదువు. వీలైతే నలభై దాటాక సంస్కృతం కూడా చదువు…” అని అన్నారు. నేను సరేనన్నాను. మాట్లాడటంవల్ల మరింతగా అలసిపోయిన స్వాములవారి చేతులు వేగంగా వణకసాగాయి. వాటిని తొడలకింద పెట్టుకున్నారు. ఇప్పుడు మోచేతులు కొట్టుకుంటున్నాయి. “సివిల్ సర్వీసెస్ రాయి. ఊరికే పాస్ అయితే చాలదు. రేంక్ రావాలి. నీ ఆన్సర్ షీట్ చూసి ఎవరూ ఏమీ వంక పెట్టకూడదు, సరేనా?” అన్నారు.
“అలాగే గురువుగారూ” అన్నాను.
“జేమ్స్‌కు చెప్పాను. ట్రస్ట్ నుండి నీకు నాలుగేళ్ళకు డబ్బులు ఇస్తారు.”
“నాలుగేళ్ళు అవసరం లేదు. రెండేళ్ళు చాలు.” స్పష్టంగా అన్నాను.
ఆయన నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుని మెల్లగా నవ్వారు. అవును అన్నట్టు తల ఊపి, దగ్గరకు రా అన్నట్టు చేయి చూపించారు. నేను దగ్గరకు వెళ్ళగానే నా భుజాలు పట్టుకుని మెడచుట్టూ చేతులు వేసి వాటేసుకున్నారు. ఆయన చేతులు నా భుజాలమీద ఈకలు రాలిన ముసలి పక్షి రెక్కల్లా అల్లల్లాడాయి. నేను మోకాళ్ళమీద కూర్చుని ఆయన ఒడిలో తలపెట్టుకున్నాను. నా తలని నిమురుతూ వణికే గొంతుతో “ధైర్యం కావాలి. వందలాది తరాలుగా నిర్విరామంగా పరిగెడుతూనే ఉన్నారు. ఇకనైనా కూర్చోవాలి” అన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. నా కళ్ళలో నీటిధార ఆయన కాషాయ ధోవతిని తడిపింది.
ఆయన చేతులు మెల్లగా నా చెవులని పట్టుకుని విడిచిపెట్టాయి. నా బుగ్గలు నిమిరాయి. “అమ్మను వదిలేయకు. అమ్మను నీతోనే ఉంచుకో. అమ్మకు ఇప్పటివరకు మనం చేసింది చాలా పెద్ద అన్యాయం, పాపం. ఆమె అన్నెంపున్నెం ఎరుగని అమాయక జంతువు. జంతువుల బాధను ఓదార్చడం అసాధ్యం. కాబట్టి అది అంతులేనంత లోతుగా నిలిచిపోతుంది. అమ్మకు చేసిన అన్యాయానికి అన్ని విధాలా ప్రాయశ్చిత్తం చెయ్యి…” అని అన్నారు.
నేను నిట్టూర్చి కళ్ళు తుడుచుకున్నాను.
“నేను త్వరలోనే గురువుల పాదాలకు చేరుకుంటాను. నువ్వు రానక్కర్లేదు” అని అన్నారు. నేను తల పైకెత్తి చూశాను. మైనపు బొమ్మలా కవళికలే లేకుండా అనిపించింది ఆయన ముఖం. నేను సరేనన్నాను.
ఆరోజు తిరువనంతపురంలో అమ్మను వెతికి పట్టుకోవాలి అనుకుంటూ రాత్రంతా నగరపు వీధుల్లో తిరిగాను. ఆమెను పట్టుకోవడం చాలా సులువైన పనే. ఎవరో ఒక నాయాడిని అడిగితే చాలు. అయితే వెతికి పట్టుకుని ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఎదురైంది. మనసు అల్లకల్లోలంగా ఉండటంచేత ఎక్కడైనా కుదురుగా కూర్చోడానిక్కానీ నిల్చోడానిక్కానీ వీలు కాలేదు. తెల్లవార్లూ వీధులు, సందులు నడిచాను. చీకట్లో కదలాడుతూ కనిపించిన ఒక్కో దేహమూ నన్ను నిలువునా కుదిపేసింది. చెమ్మలేని ఒకచోట గోనెసంచీ పరుచుకుని పసిబిడ్డతో ఒక ఆడామె పడుకుని ఉండింది. ఆ పసిపాప తలెత్తి మెరిసే చిన్న కళ్ళతో నన్ను చూసినప్పుడు ఆ పసిబిడ్డలో నన్ను నేను చూసుకున్నాను.
మరుసటి రోజు తెల్లవారేసరికి నేను పాలకాడు చేరుకున్నాను. అక్కడ్నుండి మదరాస్. పరీక్షల ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ఆ రోజుల్లో స్వాములవారు చెప్పిన మాటలను తరచూ గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. అమ్మకు నేను ఎలా ప్రాయశ్చిత్తం చెయ్యగలను! రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి తేరుకోలేని దుఃఖంతో నన్ను వెతికి ఉంటుంది. ఆశ్రమం వాకిట్లో నీళ్ళు నిండిన కళ్ళతో ఎన్నాళ్ళు పడిగాపులు కాసిందో! నాకు ఏమైందోనని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పలేక వాళ్ళు అల్లాడిపోయుంటారు. అయితే నేనేం చెయ్యగలను!
స్వాములవారు మామూలుగా చెప్పలేదు. వయసు మీదపడి దేహం కృశించిపోయినట్టే ఆయన మాటలు కూడా చాలా క్లుప్తంగా ఉన్నాయి. ఒక్కో మాటనూ ఆయన ఎంతో కాలం నుండి చెప్పాలనుకుని దాచుకున్నట్టు తోచాయి. ప్రతి వాక్యాన్నీ నేను మళ్ళీ మళ్ళీ విడదీసి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను ఇంటర్‌వ్యూకు వెళ్ళాల్సిన రోజున స్వాములవారు తిరువనంతపురంలో సమాధి అయ్యారని వార్త అందింది. ఆయన నన్ను రావద్దు అని అన్నదానిలో ఉన్న కిటుకు అర్థం అయ్యి నివ్వెరబోయాను. ఆయన చెప్పిన ఒక్కో మాటా రాబోయే రోజుల్లో నా జీవితపథంలో అర్థం చేసుకుంటాను అని అనిపించింది.
మదురైలో పదవి చేపట్టిన మరుసటి వారం తిరువనంతపురం వెళ్ళాను. పోలీసు శాఖతో చెప్పి ఒకే రోజులో అమ్మను వెతికి పట్టేసుకున్నాను. పోలీస్ జీప్‌లో వెనకవైపు మొత్తుకుంటూ ఏడుస్తూ వచ్చిన ఆ వికారమైన ముసలావిడే మా అమ్మ అని చూసిన ఆ మొదటి క్షణం ఆమెను వెనక్కి పంపించేయాలి అని నాలో కలిగిన ఆ ఆలోచనని జయించడానికి నాకు సర్వశక్తులూ కావలసివచ్చాయి. పొలుసుకట్టిన చర్మంతో క్షీణించి, బక్కచిక్కిన దేహంతో చిరిగిపోయిన బట్టలతో చేతులు జోడించుకుని రోదిస్తూ కుర్చున్న ఆమెను లాటీతో లాగిపెట్టి కొట్టి ‘దిగవే పీనుగుదానా!’ అని కాన్‌స్టేబుల్ గద్దించాడు. ఆమె ‘వద్దు దమ్మదొరా… నేనేం చెయ్యలేదు దమ్మదొరా… వద్దు దమ్మదొరా…’ అని కేకలు పెట్టి రెండు చేతులతో జీప్ కడ్డీ పట్టుకుంది.
‘లాగి కింద పడేయ్‌రా!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. “ఇదిగోండి సార్ అక్యూజ్డ్. సార్ చూస్తే కనుక్కోగలుగుతారు కదా?” నేను తల ఊపాను. ఆమెను ఇద్దరు కాన్‌స్టేబుల్స్ లాక్కుని వచ్చి నా గెస్ట్‌హౌస్ ముందున్న పూలకుండీల పక్కనే పడేశారు. జబ్బు చేసిన కుక్కలా చేతులు, కాళ్ళు వణుకుతూ ‘దమ్మదొరా… దమ్మదొరా, సంపొద్దు దమ్మదొరా’ అని ఏడుస్తూ పడుంది.
“మీరు వెళ్ళొచ్చు” అన్నాను.
“సార్, ఈ కేస్…” అన్నాడు ఇన్‍స్పెక్టర్.
“నేను చూసుకుంటాను. యూ మే గో” అని వాళ్ళను పంపించాను. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ పక్కన కూర్చున్నాను.
వణుకుతూ పూలమొక్కల మీద వాలిపోయి ఆకుల చాటున దాక్కునేదానిలా ముడుచుకుంది.
“అమ్మా, నేనమ్మా. కాప్పన్” అన్నాను.
చేతులు జోడించి ఏడుస్తూ “దమ్మదొరా… దమ్మదొరా…” అంటూనే ఉంది.
నేను ఆమె జోడించిన చేతిని పట్టుకున్నాను. “అమ్మా, నేనమ్మా. నేనే కాప్పన్ అమ్మా. నీ కొడుకు కాప్పన్” అన్నాను.
“దమ్మదొరా… దమ్మదొరా” అంటూ వీలైనంతగా ముడుచుకుంది. నేను నిట్టూర్చి లేచాను. నాకు ఏం చెయ్యాలో తోచలేదు.
నేను ఆమె కొడుకుగా ఉన్న రోజులు గుర్తు చేసుకున్నాను. నాకు గుర్తున్న భాష ఒకటే. నేను లోపలికి వెళ్ళి పనివాడితో అమ్మకు ఆకేసి అన్నం వడ్డించమన్నాను. వాడు పెద్ద ఆకు తీసుకొచ్చి ఆమె ముందు పరవగానే ఆమె ఏడుపు ఆపేసింది. ఆశ్చర్యంగా చూసింది. పనివాడు తీసుకొచ్చిన అన్నాన్ని ఆమె ఆకులో నేనే పెట్టాను. పులుసు పోసేలోపే ఆమె తీసుకుని తినసాగింది. మధ్యలో ఆకును చుట్టి అన్నం తీసుకుని వెళ్ళిపోడానికన్నట్టు లేవబోయింది.
“ఆగు. తిను, తిను” అని కూర్చోబెట్టాను.
ఆమె తిన్నాక కొంచం శాంతించింది. నేను ఆమెను తాకి “అమ్మా, నేను కాప్పన్ మా” అన్నాను. సరేనన్నట్టు తల ఊపి అక్కడనుండి బయటకు వెళ్ళే దారికోసం వెతికింది.
“అమ్మా, నేను కాప్పన్ మా. నీ కాప్పన్” అంటూ ఆమె చెయ్యి తీసి నా ముఖం మీద పెట్టుకున్నాను. నా ముఖాన్ని ఆమె చేత్తో నిమిరేలా చేశాను. ఆమె చెయ్యి ఠక్కున వెనక్కి లాక్కుని అదిరిపడుతూ నా ముఖాన్ని మళ్ళీ తాకింది. ఆవేశంతో నా ముఖాన్ని గోళ్ళు చుట్టుకుపోయిన ఆ చేతులతో తడిమింది. నా చెవుల్నీ ముక్కునీ పట్టుకుని చూసింది. కేక వేసినట్టు “రేయ్! కాప్పా” అంది. హఠాత్తుగా లేచి నన్ను గట్టిగా వాటేసుకుని నా తలను రొమ్ములమీద అదుముకుని నా తలవెనుక పటపటా కొడుతూ “కాప్పా! కాప్పా!” అని అరిచింది.
ఆమె నన్ను కొడుతోంది అనుకుని పరిగెట్టుకు వచ్చిన పనివాడు నేను ఏడవటం చూసి ఆగిపోయాడు. నేను వాడిని వెళ్ళిపొమ్మన్నట్టు సైగ చేశాను. అమ్మ నా చేతులు తీసుకుని తనముఖం మీద కొట్టుకుంది. నా జుట్టు పట్టుకుని ఊపింది. మళ్ళీ ఆవేశం వచ్చినట్టు లేచి నన్ను తీసుకుని గట్టిగా వాటేసుకుంది. మెడ బిగుసుకుపోయిన మేకలాంటి స్వరంతో ఏడ్చింది. నా బుగ్గను కొరికింది. ఎంగిలి, కన్నీరుతో తడిసిన నా ముఖాన్ని పదేపదే ముద్దులు పెట్టుకుంది. ఒక గొప్ప అడవిజంతువుతో పూర్తిగా ఆక్రమించుకోబడి ఏదీ మిగలకుండా తినేయబడ్డవాడిలా అనిపించింది.
బయట మాటలు వినిపించాయి. శుభ వచ్చినట్టుంది. నేను లేచి చొక్కా సర్దుకున్నాను. డాక్టర్ ఇందిర, శుభ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు. నన్ను చూడగానే డాక్టర్ నవ్వి “నౌ ఐ గాట్ ఇట్. అప్పుడే నాకు అనుమానం వచ్చింది…” అంది. నేను ఏమీ మాట్లాడలేదు. ఆమె అమ్మను పరీక్ష చేస్తున్నప్పుడు నేను శుభను చూశాను. ఆమె మామూలుగా నిల్చుని ఉంది. డాక్టర్ “ఏ ఇంప్రూవ్‌మెంటూ లేదు. చూద్దాం” అని శుభ చేతిని తాకి బయటకు వెళ్ళిపోయింది.
నేను శుభతో “మీటింగ్ లేదా?” అని అడిగాను.
“మినిస్టర్ రాలేదు,” క్లుప్తంగా చెప్పింది. “మీరు రోజంతా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు… అది మరో గాసిప్ అయిపోతుంది. గమ్మున ఆఫీసుకు వెళ్ళండి.”
నేను తల ఊపాను.
“నా మాట వినండి. ఇక్కడ కూర్చుని ఏం చేస్తారు? మీ స్టేటస్‌లో ఉన్న ఒకరు ఇక్కడ కూర్చోవడం వాళ్ళకు ఇబ్బంది.”
“సరే.”
ఆమె నెమ్మదిగా “డోంట్ బి రిడిక్యులస్” అంది.
నేను ముఖం తిప్పుకున్నాను.
శుభ అమ్మకేసి చూస్తూ “పూర్ లేడీ. ఐ రియల్లీ కాంట్ అండర్‌స్టాండ్ హర్. రియల్లీ! ఆల్ ది ఫస్ షీ మేడ్… మై గాడ్!” అని భుజాలు ఎగరేస్తూ “నౌ అయామ్ లీవింగ్. ఇప్పుడు మునిసిపల్ ఆఫీసులో ఒక మీటింగ్ ఉంది. సీ యూ” అంది. నేను ఆమెతో వెళ్ళి కార్లో ఎక్కించి నేను నా కారెక్కాను. ఆఫీసుకు వెళ్ళాలనే అనుకున్నాను. అయితే ఆఫీసు దాటుకుని పార్వతీపురం వెళ్ళి అలా పొలాలు కొండలు ఉన్న రోడ్డు వైపుకు కారు నడిపాను.
అప్పుడు తిరువనంతపురం ఒక్కసారి వెళ్ళి రావాలి అనిపించింది. అక్కడ ఏమీ లేదు. ప్రజానందులవారి సమాధి ఆయన కుటుంబ శ్మశానంలో ఉంది. అక్కడికి ఒక్కసారి వెళ్ళాను. పట్టించుకునేవారు లేక ముళ్ళ కంపలు అల్లుకున్న ఒక ఇటుకల పీఠం, దానిమీద నూనె జిడ్డెక్కిన మట్టి దీపాలు, చుట్టూ పెండలంగడ్డ మొక్కలు, అరటి చెట్లు. ఆయన జీవించిన ఆనవాళ్ళేవీ లేకుండా అయిపోయింది. బహుశా నాలాంటి ఏ కొందరో మాత్రమే తలచుకుంటూ ఉండచ్చు.
కారు కుమారకోయిల్ మలుపులోకి తిప్పాను. గుడిదాకా వెళ్ళి గుడి లోపలికి వెళ్ళకుండా కోనేటి మెట్లమీద చిట్టి చిట్టి నీలి అలలను చూస్తూ కూర్చున్నాను. వాటిలానే అలలు అలలుగా ఆలోచనలతో మనసు పరుగులు తీసింది. సిగరెట్ కోసం వెతికాను. లేదు. కారుదాకా లేచి వెళ్ళాలని అనిపించలేదు. అమ్మ ముఖం మనసులో వస్తూ వెళ్తూ ఉంది. ఉద్యోగం వచ్చాక తిరువనంతపురం వెళ్ళి తొలిసారి అమ్మను చూసేంతవరకు మనసులో ఉన్న అమ్మ ముఖం మరోటి. అది వేరే ముఖాలతో కలిసి అప్రయత్నంగా పెద్దదవుతూ వెళ్ళింది. పెద్దగా, ఉగ్రమైన ఒక పిల్లలపందిలానే అమ్మను ఊహించాను.
అమ్మను నేరుగా చూసినప్పుడు నేను చూసింది శాంతంగా ఉన్న వేరే ఒక మనిషిని. అయితే చూసిన క్షణమే ఈమే మా అమ్మ అని అంతరాత్మకు తెలిసిపోయింది. నన్ను పసిగట్టాక ఆమె కూడా అంతే ఆశ్చర్యంతో అర్థం చేసుకున్నట్టుంది. ఆశ్చర్యం, ఆనందం పట్టలేక తల్లడిల్లిపోయింది. ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నపళంగా అరుపులు మొదలుపెట్టేసి మూర్ఛబోయింది. బ్రాందీ తాగించి నిద్రపుచ్చాను. పనివాడిని పంపించి కొత్త చీర కొనుక్కురమ్మన్నాను. పొద్దున ఆమె లేవగానే ఆమెను కొత్త మనిషిగా మార్చి నాతో తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఆ రాత్రంతా నేను కట్టుకున్న గాలిమేడలు, కన్న కలలు తలచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు అవమానంతో కుంచించుకుపోతుంది.
అమ్మ ఆ చీరకట్టుకోడానికి చచ్చినా ఒప్పుకోలేదు. అంతే కాదు, నేను కూడా నా చొక్కా తీసి పడేసి ఆమెతో రావాలని పట్టుబట్టింది. “నాయాడికి ఎందుకురా దమ్మదొరల సొక్కాలు? విప్పి పడేయ్… వద్దురా… తియ్యి రా… రేయ్ బిడ్డా” అని నా చొక్కా చించడానికి వచ్చింది. తన శిశువుమీద హాని కలిగించే ఏదో వస్తువు అంటుకుని ఉండటం చూసిన పిల్లలపందిలా నన్ను నా దుస్తులనుండి బయటకు తీసి రక్షించాలని చూసింది. నేను ఆమెతో ఏదీ చెప్పలేకపోయాను. ఆమె నా మాటలేవీ వినే దశలో లేదు. ఆమెకు ఇన్నేళ్ళ తర్వాత దొరికిన బిడ్డతో తిరువనంతపురం చెత్తకుప్పలకు తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంది.
మాట్లాడుతూ నేను వెళ్ళి కుర్చీలో కూర్చోగానే భయం నిండిన కళ్ళతో కంగారుపడిపోతూ బయటకు వెళ్ళి తొంగి చూసి వచ్చి “దమ్మదొరలు కూర్చునే సోట కూసుంటావురా? అయ్యో అయ్యో” అని భయంతో కేకలు పెడుతూ “లే రా లే… సంపేస్తార్రా” అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని గుండెల మీద కొట్టుకుంది. నేను చాలా పెద్ద పాపం చేసినట్టు భావిస్తోందని అర్థం అయింది. ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళి నేను ఆమెను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. మురికి కాలువ దాటుకుని బయటకు వస్తేనే రాళ్ళదెబ్బలు ఎదుర్కొనే ఒక నాయాడికి కుర్చీ అంటే ఏమనిపిస్తుంది? తనపైకి రాళ్ళు రువ్వి, తనను విరగదన్నే అనుభవాలన్నిటికీ అదొక గురుతు. అది ఒక రక్తకాంక్ష కలిగిన నరహంతక మృగం.
ఆరోజు అమ్మకు బ్రాందీ తాగించి స్పృహకోల్పోయిన స్థితిలో బట్టలు మార్పించి మదురైకు తీసుకుని వచ్చాను. నాతో పన్నెండు రోజులే ఉంది. గూటిలో బంధించిన మృగంలా అల్లాడిపోయింది. ఆమెను బయటకు పంపించకూడదు అని గేట్లన్నిటికీ తాళం వేయించి కాపలావాళ్ళకు చెప్పి ఆఫీసుకు వెళ్ళాను. అయినా రెండుసార్లు తప్పించుకుని వెళ్ళిపోయింది. పోలీసుల్ని పంపించి వీధిలోనుండి ఆమెను వెనక్కి తీసుకొచ్చాను. ఆమెకు ఇంట్లో ఉండటం అన్నది నరకంలా ఉంది. ఇంట్లో అన్నం అన్న ఒక్క విషయం తప్ప మరెందులోనూ తీపిలేదు ఆమెకు.
నేను కనిపించనప్పడు నా పేరు చెప్పి అరుచుకుంటూ ఇంట్లో తిరుగాడింది. మూసిన తలుపుల్ని ఢమ ఢమా గట్టిగా బాదింది. నేను కనబడితే నా చొక్కా తీసేసి తనతో వచ్చేయమని బతిమలాడేది. కుర్చీలో కూర్చోవద్దు అని పదేపదే గింజుకునేది. నేను కుర్చీలో కూర్చోవడం చూస్తే ఆమె ఒంట్లో చలి జ్వరం వచ్చినట్టు వణుకు మొదలయ్యేది. నేను చొక్కా వేసుకున్న దృశ్యం ఆమెను ప్రతిసారీ భయపెట్టేది. చూసి భయపడి ఒక మూల ముడుక్కుని నక్కినక్కి కూర్చుండిపోయేది. నేను వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకుని మాట్లాడించే వరకు ఆ వణుకు అలా కొనసాగేది. తాకినప్పుడు నన్ను చిన్న పిల్లాడిగా తాకిన భావన మళ్ళీ ఆమెకు కలిగేదో ఏమో “కాప్పా, కాప్పా… బిడ్డా సొక్కా వద్దు… కుర్చీ వద్దు బిడ్డా” అని అరుస్తూ నా చొక్కా చించాలని ప్రయత్నించేది.
పన్నెండోరోజు ఆమె మూడోసారి ఇల్లు వదిలి పారిపోయింది. రెండు రోజులైనా ఆచూకీ దొరక్కపోయేసరికి లోలోపల కొంచం ఓదార్పు పొందాను. ఆమెను ఏం చెయ్యాలో తెలియలేదు. ఎవరిని అడిగినా ఆమెను గదిలో బంధించవచ్చు లేదా ఏదైనా హోమ్‌లో చేర్చవచ్చు అనే అంటారు. అయితే నాకు ఆమె తన ప్రపంచంలో ఎలా బతికేదో తెలుసు. చెత్తకుప్పల్లో తిని నిద్రపోయి బతికే జీవనవిధానంలోనే ఆమెకు వేడుకలు సంతోషాలు ఉన్నాయి. ఆమెకు అక్కడ దగ్గరివాళ్ళు ఉన్నారు. అది మరో జీవన విధానం, వేరే సమాజం. మురికి కాలవలో జీవించే పందికొక్కుల్లా బంధాలతో పగలతో అల్లుకున్న పెద్ద సమాజం అది.
చాలా రోజుల తర్వాత ఆమె తిరువనంతపురం చేరుకుంది అన్నది ఖాయం చేసుకున్నాను. ఆమె అంత దూరం వెళ్ళడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాయాడులకంటూ ప్రత్యేకమైన యుక్తులున్నాయి. వాళ్ళకు దారులు, మార్గాలు తెలుసుకునే పద్ధతి ఉంది. నేను ఆమెను నా జ్ఞాపకాలనుండి మెల్లమెల్లగా చెరిపేసుకోసాగాను. ఉద్యోగపరంగా నా రోజువారి జీవితంలో కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్న రోజులవి. నా ఉద్యోగాధికారం గురించి అప్పటివరకు నాకున్న ఊహలన్నీ సంవత్సరం లోపే చెల్లాచెదరయ్యాయి. వ్యవస్థ, యంత్రాంగం కలిసికట్టుగా తన బలంకొద్ది తొక్కి నన్ను అధికారం అనే మహా పెద్ద యంత్రంలో నేనొక ముఖ్యంకాని చిన్న భాగాన్ని మాత్రమే అన్నట్టు మార్చి కూర్చోబెట్టేసింది.
అధికారం అన్నదాన్ని ప్రతి అధికారీ తానే చలాయిస్తున్నట్టు భావించినా అది ఎప్పుడూ ఒక సమష్టి నిర్వహణే. ఎవరి మీద అధికారం చలాయిస్తున్నామో వారు ఆ అధికారానికి లొంగేందుకు అంగీకరించాలి. వారికి ఆ వ్యవస్థకున్న అధికారబలం గూర్చిన భయం కచ్చితంగా ఉండాలి. కాబట్టి వ్యవస్థకున్న కట్టుదిట్టాలతో తనని సరిగ్గా ఇముడ్చుకున్నప్పుడు మాత్రమే ఒక్కో అధికారికీ తనదైన అధికారం తన చేతికి వస్తుంది – స్థాయితో నిమిత్తంలేదు. వ్యవస్థనుండి విడివడితే అధికారం అర్థంలేనిది అవుతుంది.
నిర్వహణలో పాలుపంచుకోవడం ప్రారంభించాక అధికారి మొదటిసారిగా అధికారపు రుచిని తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆ అధికారం ఎలా వస్తుంది అన్నదీ కనుక్కుంటాడు. ఇంకా ఇంకా అధికారానికి వాడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసం తనను తాను మార్చుకుంటూ పోతాడు. కొన్నేళ్ళలో వాడు అధికార వ్యవస్థలో ఉండి మిగిలినవాళ్ళలాగా మూసలోకి సరిపడేలా మారిపోతాడు. వాడు ఎంతో కాలంగా కలలుగని తెచ్చుకున్న లక్ష్యాలన్నీ ఎక్కడో తప్పిపోతాయి. భాష, భావన, నమ్మకాలే కావు, ముఖం కూడా మిగిలినవారిలా మారిపోతుంది.
అయితే నేను ఆ సమష్టి అధికారంలోకి ప్రవేశించడానికి నిషేధించబడ్డాను. నాకు నియోగించబడిన పనులు మాత్రమే చెయ్యగలను గానీ ఒక గుమాస్తాని కూడా నేను ఆజ్ఞాపించలేను అని తెలుసుకున్నాను. పైగా నాకు పైనా కిందా ఉన్న అధికార వ్యవస్థంతా కలిసికట్టుగా నన్ను బయటే ఉంచింది. నేను చెప్పే ఏ మాటా వాళ్ళ చెవులకు ఎక్కనేలేదు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను సహనం కోల్పోయి పిచ్చిపట్టినవాడిలా అరుస్తుంటే కూడా ఆ గాజు తెరకు అవతల వాళ్ళు చిన్న చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉండేవారు.
నట్టనడి నగరంలో గూటిలో బంధించిన పేరు తెలియని అడవి మృగంగా అయ్యాను. నేను కోపంతో వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు అదే నా సహజమైన సంస్కారహీనతగా తీసుకుని క్షమించబడ్డాను. పోరాడినకొద్ది అది నా పరిధిని అతిక్రమించే పేరాశగా తీసుకుని పక్కనపెట్టేశారు. నా పరిస్థితిని నేను అంగీకరించి మాట్లాడకుండా ఉంటే అది నా కులానికి సహజంగా గల అసమర్థతగా ఎత్తిచూపి జాలిగా చూసేవాళ్ళు. నా పశ్చాత్తాపం నా ఒంటరితనం నాలోని మానసిక రుగ్మతలుగా చూడబడ్డాయి. ప్రతిక్షణమూ మోదుకుని నా దేహాన్ని కష్టపెట్టుకుని నేను చేరుకున్న ఆ గూటిని, అడ్డదారిలో ఎక్కి కూర్చున్న అంబరపు సింహాసనం అన్నట్టు చెప్పుకునేవాళ్ళు.
నేను శుభని పెళ్ళి చేసుకున్నది కూడా అలాంటొక పోరాటంలోని భాగమే అయుండచ్చు. వరదలో బర్రెను పట్టుకుని ఏరు దాటినట్టు ఆమె నన్ను తన ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అనుకున్నాను. ఆమెను నేను పొందినది ఆమె అగ్రవర్ణపు ప్రపంచం మీద నా విజయంగా చూడబడుతుంది అని నమ్మాను. మునిమాపటి వేళ వేడుకలు, గార్డెన్ విందులు, ఉల్లాసాలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, నవ్వులు, ఆతిథ్యాలు, కరచాలనాలు, కుశలోపరులు…
అయితే జాలి అనబడే దయాదాక్షిణ్యం లేని ఒక మారణాయుధంతో నేను మళ్ళీ మళ్ళీ ఓడించబడ్డాను. పరితాపంతో నన్ను వేరు చేసి నాకు తగిన చోట కూర్చోపెట్టేవారు. ఎంతో ఇబ్బందితో నేను అక్కడనుండి లేస్తే మరింత కరుణతో నన్ను ఇంటికి పంపించేవారు. ఆమె నన్ను ఎందుకు పెళ్ళి చేసుకుంది అని అప్పడు నేను ఆలోచించలేదు. నా మగతనానికి యోగ్యతాపత్రంగా ప్రపంచం అంగీకరించకపోయినా నా లోపల ఉన్న ప్రేమికుడి విజయంగా అప్పుడు నేను భావించాను. నేను జీవితంలోని గొప్పతనాన్ని ఆస్వాదించిన దశ ఆ ఒకటిన్నర నెల రోజులు. ఆ మూర్ఖత్వం లేకపోయుంటే ఆ కనీసపాటి ఆనందం కూడా నాకు దక్కేది కాదు.
ఆమెకు జీవితంలో ముందుకు ఎదగాల్సిన అవసరం ఉండింది. చేతికి దొరికిన ఓడని నేను. పౌర సమాచార శాఖలో ఒక మామూలు అట్టడుగు స్థాయి ఉద్యోగిగా చేరిన ఆమె ఇవాళ ఉన్న స్థాయి, హాదా అన్నీ నా మూడక్షరాలు ఆమెకు ఇచ్చినవి. ఆమె వెళ్ళే దూరం ఇంకా ఎక్కువే. ఆ లెక్కలతో ఆమె తనమీద కప్పుకున్న అభ్యుదయం అన్న దుప్పటి. విశాల మనస్తత్వంగల నవయుగ వనిత. ఇక ఎప్పుడూ ఆమె ఆ దుప్పటిని తీసి చూసుకోదు.
అధికారానికిగల నైతిక బాధ్యతలన్నిటికీ ఒప్పుకుని అధికారం లేకుండా బతకాల్సిన నరకంలోకి వచ్చిపడ్డాను. నేను పని చేసిన ప్రతి ఆఫీసులోనూ నాకు కింద ఒక అధికారి వచ్చి చేరేవాడు. అతను ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆధిపత్యపు కులస్తుడిగానో, ఆ ప్రాంతంలోని రూలింగ్ పార్టీకో పై అధికారులకో దగ్గరివాడుగానో ఉంటాడు. కొన్ని రోజుల్లోనే అధికారం మొత్తం అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అతను ఆదేశించినట్టే అన్నీ జరిగేవి. అతను నా దగ్గర ఒక చిన్న వినయం–నేను అతనికి కట్టుబడినవాడిని అన్నదాన్ని ప్రతిక్షణమూ గుర్తు చేసేటటువంటి వినయం –చూపించి ప్రతిదానికీ నా అంగీకారాన్ని, సంతకాన్నీ తీసుకునేవాడు.
మదురైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రేమ్ పుట్టాడు. వాడికి ఎనిమిది నెలలు ఉన్నప్పుడు అమ్మను కలిశాను. అమ్మ మరో ఇద్దరు ముసలోళ్ళతో కలిసి నన్ను వెతుక్కుంటూ మదురైకు వచ్చింది. నన్ను ఆఫీసుకు వచ్చి కలిసింది. నేను పబ్లిక్ మీటింగ్ అనే ఒక పెద్ద చిత్రహింసలో మునిగిపోయి కూర్చుని ఉన్నాను. దేవుడి సన్నిధానానికి వచ్చిన భక్తుల్లా జనం చేతులు జోడించుకుని వణుకుతూ ఏడుస్తూ అర్జీలు పట్టుకుని వస్తుంటారు. కాళ్ళమీద సాష్టాంగంగా పడిపోయే ముసలివాళ్ళు. ఒంటరైన ఆడవాళ్ళ మౌనం; అన్యాయానికి లోనైన బడుగుల అహంకారం, కోపం; పొలం లాక్కుని కొట్టి తరిమేయబడి ఏ వివరాలూ తెలియక ఎవరివల్లో తీసుకురాబడి ఎవరో రాసిచ్చిన అర్జీలను చేత బట్టుకుని నిల్చునే ఆదివాసుల వక్కాకు నవ్వు; పెద్ద కళ్ళతో వేడుక చూస్తూ పెద్దవాళ్ళ దుస్తులను పట్టుకునే పసి పిల్లలు… ఇలా జనం వస్తూనే ఉంటారు.
నన్ను భేటీ అవ్వగానే సమస్యలు తీరిపోతాయని నమ్మి నా ముందుకు రావడానికి తోపులాటలు జరుపుకుంటుంటారు.
‘ఒక్కొక్కరుగా వెళ్ళండి! తోసుకోకండి! ఒక్కొక్కరుగా… చెప్పానా?’ అని మాయాండి వాళ్ళపై అరుస్తూనే ఉంటాడు. వాళ్ళలో ప్రతి ముఖమూ నాకు దిగులు కలిగించేది. ఏ ఒక్కరితోనూ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోయేవాణ్ణి. వాళ్ళు ఇచ్చే కాగితాలను చూస్తూ వాళ్ళను నేరుగా చూడటం అన్న కష్టం నుండి తప్పించుకునేవాడిని.
“సరే” “చెప్పారుగా” “సరే” “చూస్తాం” “చేస్తాం” “చేస్తాం వెళ్ళిరండి” అని మళ్ళీ మళ్ళీ అవే మాటలను చెప్పేవాడిని. ఆ మాటలను చెప్పే ఒక యంత్రంలా నన్ను నేను భావించుకునేవాడిని.
ఆ ప్రజలకోసం నేను ఏదీ చెయ్యలేను అన్నది వాళ్ళకు చెప్పడం గురించి నేను పగటి కలలు కన్న రోజులున్నాయి. చెప్తే ఏమవుతుంది అని వెంటనే అనిపించేది. మళ్ళీ మళ్ళీ అణిచివేయబడి రాశులుగా పోయబడే చెత్తకుప్పల్లాంటి మనుషులు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న నమ్మకమే వాళ్ళను జీవింపజేసే శక్తి. ఆ నమ్మకాన్ని నేను ఎందుకు లాగేసుకోవడం? అయితే నేను ఈ అర్జీలు తీసుకోవడం వల్ల వారి నమ్మకాలను మరింతగా పెంచేసి చివరికి ఇంతకంటే పెద్ద నిరాశనే ఇవ్వబోతున్నాను కదా? చివరికి ఏదో మంచి జరుగుతుందని కాచుకుని, కన్నీటితో నమ్ముకుని, మళ్ళీ నిరాధారులై…
అయితే అలా జాలీ దయా లేకుండా నిరాధారులుగా అవ్వడం వాళ్ళకు అలవాటేగా! వందలాది ఏళ్ళుగా అదేగా జరుగుతోంది! గింజుకుని, బతిమిలాడి, ప్రాధేయపడి, కాళ్ళు పట్టుకుని, చేతులు జోడించి ‘దమ్మదొరా’ ‘అయ్యగారూ’ ‘దేవుడా’ అని మొరపెట్టి, విసిరేసినదాన్ని పరుగుతీసి ఏరుకుని, ప్రాణాలతో బ్రతకడమే హీనం అన్నట్టు, తరతరాలుగా బ్రతుకుని కొనసాగిస్తున్న ప్రాణాలు కదా అవి! వాళ్ళను నేరుగా కళ్ళల్లోకి చూడగలిగితే అక్కడే నా షర్టూ పేంటూ తీసి పడేసి గోచీ పెట్టుకుని ఒక నాయాడిలా వీధుల్లోకి దిగి ఆకాశం కింద ఒక మామూలు మనిషిగా నిల్చునేవాడినేమో…
అప్పుడే జనాల రద్దీనుండి లోపలికి వచ్చిన మా అమ్మ “వీడు నా కొడుకు! నా కొడుకు కాప్పన్!” అని గట్టిగా అరిచింది. ఆమెతో వచ్చిన ఇద్దరు ముసలివాళ్ళూ “కాప్పా కాప్పా” అని అరిచారు. పోలీసు ‘ఏయ్, ఏంటిక్కడ గొడవ? నోరు ముయ్యండి! ఒక్కటిస్తాను! నోరు ముయ్యండ్రా పందుల్లారా!’ అని గద్దించాడు.
నేను “షణ్ముఖం, వాళ్ళని వదిలేయ్” అన్నాను.
అమ్మ చక్కగా ఏదో పార్టీ జండాని పైటలా వేసుకుని పాత లంగా కట్టుకుని ఉంది. కాకిబంగారు ముక్కెర, చెవి పోగులు పెట్టుకుని ఉంది. ముగ్గురూ నా గదిలోకి పరిగెట్టుకుంటూ వచ్చారు.
అమ్మ గట్టిగా “వీడు నా కొడుకు కాప్పన్, నా కొడుకు… నా కొడుకు… ఒరేయ్ కాప్పా… కాప్పా” అని నా ముఖం తడుముతూ బుగ్గలపై ముద్దు పెట్టుకుంది. ముద్దంటే ఆమెకు మృదువుగా కొరకడమే. నా ముఖంపై వక్కాకు ఎంగిలి కారింది. జనం అంతా విస్తుపోయి నిల్చున్నారు.
“నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నేను వస్తాను” అని అన్నాను.
“నువ్వు రా… రా బిడ్డా రా” అని నా చేయి పట్టుకుని లాగింది అమ్మ.
ఒక ముసలాయన జనం వైపుకు తిరిగి “వీడు కాప్పన్. మా నాయాడి కాప్పన్. మా వాడు! అందరూ పొండి పొండి! ఈ పొద్దు ఇక్కడ కూడు దొరకదు. కూడు దొరకదు. పొండి!” అని చేతులు ఊపుతూ చెప్పాడు.
నేను లేచి అమ్మను చేయిపట్టుకుని బలవంతంగా తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరు వెంట వచ్చారు.
“మేము నిన్ను ఎక్కడెక్కడో వెతికాం. కాప్పా నువ్వు సొక్కాయి ఏసుకోనుండావు రా… అయితే ఇక్కడ బాగా కూడు పెడతారేమో కదా?” అని అడిగాడు ఒక ముసలాయన.
“అరే నువ్వూరుకో, వాడు ఎంత తిన్నా ఇక్కడ ఏమీ అనరు తెలుసా… వాడు ఆపీసరు ఇక్కడ” అన్నాడు మరో ముసలాయన.
“అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. కాసేపట్లో వచ్చేస్తాను” అని చెప్పి ముఖం కడుక్కుని ముందు గదికి వచ్చాను. వచ్చి కూర్చోగానే ఒకటి స్పష్టం అయింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన వారి బాడీ లేంగ్వేజ్ మారిపోయింది. నేను అధికారవర్గపు ముక్కని కాదు అని అందరికీ తెలిసిపోయినట్టుంది. ఆశ్చర్యం కలిగింది. వాళ్ళలో ఒక్కరు కూడా ఇదివరకులా ప్రాధేయపడలేదు. కొందరు మాత్రం ఏదో ఒకటీ అరా మాటలు చెప్పారు. అలా అర్జీ నా చేతికిచ్చి వెళ్ళిపోయారు.
అమ్మ ఆ విడత ఇరవై రోజులు నాతో ఉండిపోయింది. వాళ్ళ ముగ్గురికీ ఇంటివెనక భాగంలో ఉండటానికి చోటిచ్చాను. అయితే వాళ్ళకు పైకప్పున్న చోట ఉండిన అలవాటు లేదు. కేంప్ ఆఫీస్ షెడ్‌లో ఉన్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా గట్టిగట్టిగా తగాదాలు పడుతూ ఉండేవారు. ఒకరినొకరు రాళ్ళతో కొట్టుకుంటూ పరిగెట్టేవారు. రాత్రివేళ తోటలో ఎక్కడపడితే అక్కడ దొడ్డికి కూర్చునేవారు. తోటను శుభ్రంచేసే అరుణాచలం లోపలలోపలే గొణుగుతూ శపించడం గమనించాను.
అమ్మకు తొలిచూపులోనే శుభ నచ్చలేదు. శుభ తెల్లటి రంగు జబ్బు చేసిన లక్షణంగానే అనిపించింది అమ్మకు. ఆమెను చూస్తే వసారా నుండి దిగి వాకిట్లో నిల్చుని నోటిమీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసుకుని చూసేది. శుభ ఏదైనా చెప్పగానే ‘తుపుక్’మని ఉమ్మేది. శుభని చూసి “అది ఒక గబ్బుకుక్కరా… గబ్బుకుక్కరా” అంటూ ఉండేది అమ్మ.
శుభ అమ్మని చూడాలంటేనే భయపడి తప్పుకునేది. అమ్మ శుభ కనిపించినప్పుడు తన చేత ఏదుంటే దాన్ని శుభ మీదకు విసిరేది. కట్టుకున్న బట్ట పైకెత్తి చూపించి బూతులు తిట్టేది.
“పాల్, ప్లీజ్ నా మీద కొంచమైనా ప్రేమ ఉంటే ఆమెను ఎక్కడికైనా పంపించేయండి. నేను మిమ్మల్ని నమ్మి మీ వెనక వచ్చాను. నాకోసం మీరు చెయ్యగల లీస్ట్ హెల్ప్ ఇదే… ఆమెను నేను భరించలేకపోతున్నాను, పాల్. ప్లీజ్…” అని వెక్కి వెక్కి ఏడుస్తూ అలా పరుపు మీద వాలిపోయింది శుభ.
ఏడుస్తున్న శుభను చూస్తూ నిశ్చేష్టుడిగా నిల్చున్నాను. కాన్పు తర్వాత అప్పటికింకా ఆమె ఉద్యోగానికి వెళ్ళలేదు.
“చెప్పండి పాల్, ఊరికే ప్రతిదానికీ శిలలా నిల్చుంటే ఎలా?” అని ఏడుపు గొంతుతో అంది.
“శుభా, ప్లీజ్. నేను చూస్తాను. ఏదో ఒకటి చేస్తాగా… మెల్లగా పంపించేస్తాను” అన్నాను.
“నో! మీరు పంపించరు. యూ సీ… ఆమెను మన దారికి తీసుకురాలేం. ఆమె ఒక రకమైన జీవితానికి అలవాటుపడిపోయారు… ఆమెను ఇంక మనం మార్చలేం. ఆమె ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటే చాలు. దానికి మనం ఏదైనా చెయ్యొచ్చు” అంది శుభ.
నేను ప్రజానందులవారు చెప్పినదాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అమ్మకు పెద్ద అన్యాయం చేసేశాను, నా జీవిత కాలమంతా దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆమె ఆజ్ఞను నేను మీరలేను. ఆమె ఏది ఇష్టపడితే అదే నా ఆజ్ఞ. అమ్మ ఏం కోరుకుంటుందో తెలియడం లేదు. నా ఇంటిలో ఏదీ ఆమెకు అవసరం అనిపించలేదు. అన్నం కూడా కొన్ని రోజులకే వెగటయిపోయింది. అయితే శుభ మీదున్న ద్వేషం తనని మరింత ఉసిగొలిపి ఉగ్రంగా మారుస్తోంది. ఆమెలాంటి వాళ్ళ ప్రేమకు ఎలాగైతే హద్దులుండవో ద్వేషానికీ హద్దులుండవు. తర్వాత కొంత కాలానికి ఆలోచిస్తే అర్థం అయింది. శుభ మీద ఆమెకున్న ద్వేషం ఎంత గాఢమైనదో, లోతైనదోనని. ఎన్ని శతాబ్దాల చరిత్ర ఉందో దానికి!
అమ్మ వంటగదిలోకి వెళ్ళి దొరికింది తీసుకుని బొక్కేది. ఇల్లంతా వక్కాకు ఎంగిలి ఉమ్మేది. ఇంట్లోపలే మూత్రం పోసేసేది. శుభ చీరలు, నైటీలు, జాకెట్లు, బ్రాలుకూడా తీసుకుని వేసుకుని “ఒసేయ్… ఇవన్నీ నా కొడుకు కాప్పానువి… నువ్వు నీ కొంపకుపోవే పందిదానా” అంటూ శుభ గది ముందు నిల్చుని తిట్టేది.
శుభ రెండు చేతులతోనూ చెవులు మూసుకుని ఏం చెయ్యాలో తెలియక తలవంచుకుని కూర్చుండిపోయేది. అయితే అమ్మ తన మురికి చేతులతో ప్రేమ్‌ను ఎత్తుకోవడాన్ని మాత్రం శుభ సహించలేకపోయేది. అమ్మ బిడ్డవైపుకు వస్తే శుభ బిడ్డమీద వాలిపోయి పొదువుకునేది. అమ్మ ఆమె వీపుమీద బాది, జుట్టు పట్టుకుని లాగి, రక్కి, ఉమ్మి, బిడ్డను తీసుకునేందుకు యుద్ధం చేసేది. నేను రెండుసార్లు అమ్మను గట్టిగా పట్టుకుని ఆపి బరబరా లాక్కుని వెళ్ళి బయట పడేసి తలుపేశాను. క్రీస్తుదాసుకు, చెల్లమ్మకూ గట్టిగానే చెప్పాను అమ్మ బిడ్డ దగ్గరకు రాకుండా చూసుకోమని. అయినా వాళ్ళ కళ్ళు కప్పేసి కొన్నిసార్లు అమ్మ లోపలికి వచ్చేసేది.
ఒకసారి బయటనుండి ఏరుకొచ్చిన కుళ్ళిన ఆహారం ఏదో ప్రేమ్‌కు తినిపిస్తూ ఉంది. స్నానం చేసి బయటకు వచ్చిన నేను అది చూసి విస్తుపోయాను. నా చేతులు కాళ్ళు వణకసాగాయి. అమ్మను లాక్కెళ్ళి బయట పడేసి చెల్లమ్మను తిట్టాను. చెల్లమ్మ వంట గదినుండి నాకు వినబడేలా ఏదో గొణుగుతూ ఉండటం విన్నాను. ‘యానాది లక్షణం’ అన్న మాట చెవిన పడగానే మంత్రదండం తాకి శిలనైపోయినట్టు అయ్యాను. శక్తులన్నీ కోల్పోయి ముందుకు వంగి కుర్చీలో కూలబడ్డాను.
అమ్మను ఏ సందర్భంలోనూ తరిమేయకూడదు అనుకున్నాను. చివరిసారిలానే ఈసారి కూడా అమ్మే ఇల్లు వదిలి పారిపోతుంది అని చూస్తున్నాను. ఆమె అలా వెళ్ళిపోతే నాకంటూ ఎలాంటి పశ్చాత్తాపమూ ఉండదు కదా అనుకున్నాను. స్వాములవారి మాటను నిలబెట్టినవాడిగానే ఉండిపోతాను. అయితే ఈ సారి అమ్మకు ఇక్కడే ఉండాలన్నదానికి శుభ మీదున్న ద్వేషం బలమైన కారణంగా ఉంది. శుభని వేధించేది, బూతులు తిట్టేది. ఇంటి బయట రోడ్డుమీద నిల్చుని ‘తెల్లపంది, గబ్బుకుక్క… కాలిపోయిన దుంపలా ఉంటూ నా మాటకడ్డు చెప్తావా? బయటకు రావే ఊరకుక్కా’ అని పెద్ద గొంతుకతో గంటల తరబడి నిర్విరామంగా అరుస్తూ ఉండేది. అంతులేని ఆమె శక్తి నన్ను ఆశ్చర్యపరిచేది. కుక్కలు, కొన్ని జంతువులూ గంటలతరబడి అరుస్తుండటాన్ని అప్పుడు అర్థం చేసుకోగలిగాను.
ఆ ఇద్దరు ముసలివాళ్ళకీ డబ్బు ఇచ్చి అమ్మను తీసుకుని వెళ్ళమన్నాను. వాళ్ళు డబ్బుతో పారిపోయారు. అమ్మ ఇంకా ఎక్కువ అహాన్ని ప్రదర్శించసాగింది. రాత్రివేళ బయటకు వెళ్ళి నగరమంతా తిరిగి తెల్లవారేసరికి చెత్తంతా ఏరుకుని వచ్చేది. బయటపడేసిన ఆహారపదార్థాలు. పాత చిరుగు బట్టలు. చెత్తలో మెరుస్తూ ఏ వస్తువు కనిపించినా తీసుకొచ్చేసేది. వాటన్నిట్నీ కార్ షెడ్డులో ఒక వైపు రాశి పోసిపెట్టేది. కుళ్ళిన ఆహారపదార్థాలని విప్పి ఆమె నాకి నాకి తినడాన్ని ఒకసారి శుభ కిటికీలోంచి చూసి వాంతి చేసుకుంది.
ఒక రోజు పేపర్లు, అట్టలు, ప్లాస్టిక్‌లు అంటించి ఆ మంటలో పందికొక్కును కాల్చుతోండటం చూసి నేను పరిగెట్టుకెళ్ళి దాన్ని తీసి పడేసి ఆమెను గద్దించాను. ఆమె నన్ను కొట్టడానికి నా మీదకు వచ్చింది. నేను ఆమెను అడ్డుకుంటుంటే వెల్లకిలా పడిపోయింది. అప్పుడు అమ్మ బాత్రూమ్ టర్కీ టవల్ తీసి కట్టుకుని ఉంది. అది ఊడిపోయి పడిపోయింది. అదేమీ పట్టించుకోకుండానే లేచి ఒక రాయి తీసి నా మీద విసిరింది.
బలమంతా కూడదీసుకుని ఆమెను కార్ షెడ్ పక్కన ఉన్న గదిలోకి తోసి తలుపుకు బయట గడియ పెట్టాను. కాసేపు రొప్పుతూ నిల్చుండిపోయాను. చుట్టు పక్కలవారి అందరి కళ్ళూ కిటీకీలనుండి నన్నే చూస్తున్నాయని తెలుస్తోంది. నేను నేరుగా బాత్రుమ్‌కు వెళ్ళి తలుపేసుకుని కుళాయి తిప్పి వెక్కివెక్కి ఏడ్చాను. నీటి చప్పుడులో నా ఏడుపు కలిసిపోయింది. తలా ముఖమూ బాదుకుంటూ వెక్కిళ్ళుపడుతూ ఏడ్చాను. తర్వాత ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కుని బయటకు వచ్చాను.
శుభ కళ్ళనిండా నీళ్ళతో తలుపు బయటే నిల్చుని ఉంది. “నేను వెళ్తాను… నా బిడ్డను తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను” అంది. నేను మాట్లాడకుండా ముందుకు నడిచాను. నా వెనకే వచ్చి “నావల్ల కాదు… ఇంకా ఇదంతా చూస్తూ ఉండలేను. సిటీ మొత్తం అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇక నేను ఎక్కడ తలదాచుకోను? పనివాళ్ళు కూడా చూసి నవ్వుతున్నారు… నా వల్ల కావడం లేదు. ఉంటే నేనుండాలి లేదా మీ అమ్మ ఉండాలి” అంది.
నేను ఆమెతో “మా అమ్మను వదిలేయలేను. అది నా గురువుకిచ్చిన మాట. నువ్వు వెళ్ళిపోతే బాధపడతాను. ఆ బాధను భరించలేను. అయితే అమ్మకు తనకేది నచ్చుతుందో అలానే చేస్తుంది” అన్నాను.
తను వణికిపోతూ ఏడ్చి ఎర్రబడి వాచిన కళ్ళతో, కందిపోయిన చెంపలతో నన్ను కొన్ని క్షణాలు చూస్తూ నిల్చుని హఠాత్తుగా తన తలమీద బాదుకుంటూ నేల మీద కూలబడి గట్టిగా ఏడ్చింది. నేను నా గది లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెరిచి పట్టుకుని కూర్చున్నాను. అక్షరాలేవీ చూడకుండా ఆమె ఏడుపునే వింటూ ఉన్నాను.
రాత్రి దాకా అమ్మ లోపలే ఉంది. నేను బయటకు వెళ్ళి గమ్యం లేకుండా ఎక్కడెక్కడో తిరిగి నడిరాత్రి ఇంటికి వచ్చాను. బట్టలు మార్చుకుని కార్ షెడ్ పక్కనున్న గదికి వెళ్ళి తలుపు తీశాను. లోపలనుండి మూత్రము, మలమూ కలిసిన దుర్వాసన గుప్పుమని వచ్చింది. అమ్మ లేచి నాపై దాడి చేస్తుందనుకున్నాను. ఆమె ఒక మూల చేతుల మీద తల ఆనించుకుని కూర్చుని ఉంది.
“అమ్మా, అన్నం కావాలా?” అని అడిగాను. అవునన్నట్టు తల ఊపింది.
ఆమెకు అన్నం పెట్టాను. ఆవేశంగా ఆమె ముద్దలు చేసి తినడం చూస్తూ ఉంటే నాకు ఒక క్షణం గుండె ఆగిపోతున్నట్టు తోచింది. మరుక్షణం పిడుగు పడిన తాడి చెట్టులా నా ఒళ్ళు కాలిపోతున్నట్టు అనిపించింది. ఒక రోజైనా ఆకలిని కాక అమ్మ రుచిని ఎరిగుంటుందా? ఆమెను అలా దగ్గరకు తీసుకుని గట్టిగా అరవాలనిపించింది. తనకు అన్నం తినడం ఆపడం తెలియదు. ఆకు ఖాళీ అయిపోవడం కూడా భరించలేదు. “పెట్టు పెట్టు” అని చేతితో ఆకును కొడుతూనే ఉంది. ఇలాగే ఉండేవాడిని నేను కూడా. ఆ నా దేహం కూడా ఈ దేహంలోనే ఉంది.
తినటం పూర్తవ్వగానే చేతిని ఒంటికి తుడుచుకుని అక్కడే కాళ్ళు జాపి పడుకుంది. నేను లోపలికి వెళ్ళి ఒక గ్లాసులో బ్రాందీ తెచ్చి ఇచ్చాను. తీసుకుని గటగటమని తాగేసి పెద్దగా త్రేన్చింది. పొట్ట నిండిపోగానే అంతకు ముందు ఏం జరిగిందో మరిచిపోయినదానిలా “ఏరా కాప్పా!” అంటూ నా చేయి నిమరసాగింది. ఆమెకు ఎన్నో చేప్పాలని, ఆమెను ఎన్నో అడగాలని అనుకున్నాను. అయితే ఆమెను చూస్తూ ఉంటే చాలు అనిపించింది.
“అరే బిడ్డా, కాప్పా! ఆ తెల్లపంది దెయ్యంరా. అది ఎందుకట్టా ఉంది తెలుసా? అది నీ రక్తాన్ని జుర్రుకుని తాగేస్తుంది రా… నీ బెల్లం నుండి…” అని చటుక్కున నా బెల్లం పట్టుకుని “రేయ్! దీన్నుండి అది రక్తం తాగుతోందిరా” అంది. నేను వెనక్కు లాక్కున్నాను. “అరే బిడ్డా, నీకు ఈ సొక్కాలు, బట్టలు వద్దురా, నువ్వు దమ్మదొరల కచేరీలో ఉండకు, వద్దు. ఈ దమ్మదొర్లు నిన్ను సంపేస్తార్రా! నువ్వు రేపు నాతోనే వచ్చేయి. మనం మన ఊరికి పోదాం. నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను. వస్తావా బిడ్డా? అమ్మను పిలుస్తున్నాను కదా?” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
కళ్ళు సోలిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంది. మళ్ళీ మళ్ళీ కుర్చీ వద్దంది. ఇది దమ్మదొరల కుర్చీ నువ్వు కూర్చుంటే నిన్ను చంపేస్తారు అంది. నిన్ను చంపేయడానికే ఈ తెల్లపందిని మంతిరించి పంపించారు అని ఏడిచింది. నేను లేచి నా గదికి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని పైకప్పుకేసి చూస్తూ ఉండిపోయాను. పిచ్చిదాన్లా మాట్లాడినా అమ్మ మాటల్లో నిజముందేమో అనిపించింది. నేను యజమానుల కుర్చీలో కూర్చుని ఉన్నానా? అందుకే నన్ను చంపేస్తున్నారా? ఈమె నా రక్తాన్ని జుర్రుకుంటోందా? నన్ను వశపరచుకున్న ఈ మాయలకు బయట నిల్చుని, ఈ మాయల్లో పడిపోని మృగంలా, అమ్మ వాస్తవాన్ని పసిగడుతోందా?
నేను నా ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి నాలుగున్నర అయింది. నా గది లోపలికి వెళ్ళి కూర్చుని కుంజన్ నాయర్‌ను టిఫిన్ తీసుకు రమ్మన్నాను. నా చేతగానితనానికి నేను సాకులు వెతుక్కుంటున్నానా? శుభ అలానే అంటుంది. నా అసమర్థతలకు బయట కారణాలు వెతుక్కుంటున్నాను. ‘నువ్వు ఎందుకు తెగించకూడదు? నువ్వు అనుకుంటున్న అడ్డంకులన్నీ నీ ఊహలు. నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలిస్తే ఎందుకు చెయ్యట్లేదు? చేసి చూడు…’
చెయ్యాలంటే ఉన్నది ఒకటే. నేను నాలాంటివాళ్ళ గొంతుకగానూ చెయ్యిగానూ ఈ వ్యవస్థలో ఉండాలి. నాలాంటివాళ్ళు అంటే పాకీవాళ్ళు ఊడ్చి తీసుకొచ్చి, గాడిదసంత హాస్పిటల్‌లో మనుషుల చెత్తగా రాశి పోయబడినవాళ్ళు. ప్రజారోగ్యం కోసం కోట్లను ఖర్చుబెట్టే ఈ ప్రభుత్వం అక్కడ చావుబతుకుల్లో మగ్గిపోతున్న వారి ప్రాణాలకోసం ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆ డాక్టర్లనెందుకు వాళ్ళనూ మనుషులుగా భావించేలా చెయ్యకూడదు? వీలు కాదు అనేవాళ్ళని దండించండి. మీలో ఒకడికి ఆ హాస్పిటల్లో సరిగ్గా చూసుకోలేదంటే మీ గొంతులు వినిపిస్తారే, మీ ధర్మగుణం పైకి ఉబుకుతుందే!
ఆవేశంతో చేతులు వణుకుతూ రాయడం మొదలుపెట్టాను. నా రిపోర్టును టైపు చేశాను. గాడిదసంత హాస్పిటల్లో నేను చూసిందంతా వివరంగా రాసి వెంటనే చర్యలు తీసుకోమని ఆర్డర్ వేశాను. తీసుకున్న చర్యలకుగానూ మూడురోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. లేదంటే నాకున్న అధికారంతో దానికి బాధ్యులైన వారిమీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించాను. జిల్లా వైద్యాధికారికి డైరెక్ట్ కాపీ, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి నకలు తయారుచేశాను. పిళ్ళైని పిలిచి వెంటనే వాటిని పంపేందుకు ఏర్పాటు చేసి ఒక సిగరెట్ వెలిగించుకున్నాను.
సాయంత్రం మళ్ళీ హాస్పిటల్‌కు వెళ్ళాను. డాక్టర్ ఇందిర “ఎటువంటి డెవలప్‌మెంటూ కనిపించలేదు. కావాలంటే రేపు డయాలిసిస్ చేసి చూడొచ్చు” అంది. అమ్మ అలాగే పడుకుని ఉంది. హాస్పిటల్ వారి పచ్చ దుస్తులు వేసుకొని ఉంది. చేతులు కాళ్ళల్లో వాపు తగ్గి నీళ్ళు ఎండిన బురదలా చర్మంలో ముడతలు కనిపిస్తున్నాయి. నేను ఇంటికి వచ్చి పడుకోగానే నిద్రపోయాను. శుభ అమ్మ గురించి నాతో ఏదో ‘మాట్లాడాలనుకుంటున్నాను’ అంది. అయితే ఆ సమయంలో నాకు ఏ మాటలూ వినాలనిపించలేదు.
గంట నిద్రపోయాక మెలకువ వచ్చింది. శుభ మంచి నిద్రలో ఉంది. ఎ.సి., గోడగడియారం రెండూ రాగమూ తాళమూలాగా వినిపించాయి. బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నాను. సిగరెట్ ఎక్కువ కావడం వల్ల నిద్ర చెడిపోతోందా అన్న ఆలోచన వచ్చింది. మళ్ళీ నిద్రలోకి జారుకునే ముందు వచ్చిన చివరి ఆలోచన రేపు ఆఫీసుకు వెళ్ళగానే నా రిపోర్ట్ గురించి డి.ఎమ్.ఒ.తో నేనే స్వయంగా మాట్లాడాలి అన్నదే. ఏం చెయ్యబోతున్నాడు అని అడిగి తెలుసుకోవాలి. వీలైతే ప్రెస్‌తో వెళ్ళి ఒక విజిట్ చేయించి సంబంధించినవాళ్ళను ఎండగట్టడానికైనా వెనకాడకూడదు.
వీళ్ళు ఏమంటారో నాకు తెలుసు. ఈ ఏడాదిన్నరగా నేను అన్నీ చూసేశాను. గౌరవం, అవమానం అన్న మాటలకు అర్థాలనే నా మనసు మర్చిపోయింది. వాటి చివరి ఆనవాళ్ళను కూడా అమ్మ చెరిపేసే వెళ్ళింది. మదురైలో ఉన్నప్పుడు ఒక రోజు పొద్దున ప్రేమ్‌ని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. శుభ మూర్చ వచ్చి పడిపోయింది. నేను ఎస్.పి.కి ఫోన్ చేసి చెప్పాను. పోలీసువాళ్ళు నగరం అంతా గాలించారు. నలభైయైదు నిముషాల్లో పట్టేశారు. నగరంలోని ప్రసిద్ధి చెందిన హోటల్ వెనక ఎంగిలి ఆకులు ఏరుకుంటూ ఎంగిలి ఆకుల్లో దొరికినదాన్ని వాడికి తినిపిస్తూ కనిపించిందట.
బుల్లెట్ దెబ్బ తిన్న మృగంలా శుభ బయటకు ఉరికి ఎస్.ఐ. చేతుల్లోనుండి బిడ్డను లాక్కుంది. బిడ్డ నోట్లో ముఖంలో ఒంట్లో అంతా పాచిపోయిన ఆహారం. ఆమె బిడ్డను గట్టిగా గుండెలకు అదుముకుని ముద్దులు పెట్టుకుంటూ నేలమీద కూర్చుండిపోయింది. నేను నిశ్చేష్టుడనై నిల్చుండిపోయాను. జీపునుండి దిగి నన్ను చూసి “ఒరే కాప్పా” అంటూ వచ్చిన అమ్మను చూడగానే నాలో ఏదో ఆవేశం కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. అక్కడ కింద పడున్న హోస్ తీసుకుని “వెళ్ళిపో ఇక్కణ్ణుంచి… కుక్కా… ఇంకెప్పుడూ ఈ ఇంటివైపు రావద్దు. వెళ్ళిపో ఇక్కణ్ణుంచి” అని ఇష్టమొచ్చినట్టుగా కొట్టి తరిమాను. ఆమె పొలికేకలు పెడుతూ నేలమీద పడి చేతులూ కాళ్ళూ కొట్టుకుంటూ విలవిలలాడింది. ఆమెను గట్టిగా తన్నాను.
నన్ను ఎస్.ఐ. వచ్చి పట్టేసుకున్నాడు. అమ్మ లేచి వీధిలోకి వెళ్ళి నిల్చుని “అరే కాప్పా! నువ్వు నాశనం అయిపోతావు. సస్తావు. తెల్లపంది నీ రక్తం తాగేస్తుంది. రేయ్ పాపిష్టోడా! కుక్కా! పాపీ!” అని గుండెలు బాదుకుని శాపనార్థాలు పెడుతూ ఏడ్చింది. నడుముకున్న బట్ట విప్పి పడేసి నగ్నంగా నడిచి చూపిస్తూ, చేతులు విప్పి రకరకాల సైగలు చేస్తూ బూతులు తిట్టింది.
“సార్, మీరు లోపలికి వెళ్ళండి” అన్నాడు ఎస్ఐ.
నేను లోపలికి వెళ్ళి తలుపుకు గడియ పెట్టుకోగానే వచ్చిన తొలి ఆలోచన ఉరేసుకోవడమే. నాకు మరింత ధైర్యం ఉన్నట్టయితే ఆరోజే ఈ అవస్థంతా ఒక కొలిక్కి వచ్చుండేది.
ఆ రోజు ఎస్.ఐ. అమ్మను పట్టి జీపులో ఎక్కించుకుని ఒక పెద్ద క్రిస్టియన్ మిషన్‌వాళ్ళు నిర్వహించే వృద్ధుల ఆశ్రమంలో అతనే డబ్బు కట్టి చేర్చి వెళ్ళాడట. మరుసటి రోజు నేను డబ్బు పంపించాను. మళ్ళీ అమ్మను చూసే ధైర్యం నాకు రాలేదు. నాలో ఒక్కో క్షణమూ ఒక అగ్నిజ్వాల రగులుతూనే ఉంది. నా అవయవాలన్నీ కాలిపోతూ పొట్టలో ఆమ్లంలా మరుగుతూ ఉంది. మరుసటి రోజు ప్రేమ్‌కు విరోచనాలూ జ్వరమూ మొదలయ్యాయి. అవి మరింత తీవ్రమయ్యాయి. పన్నెండు రోజులకు కానీ కోలుకోలేదు. మీనాక్షి మిషన్ హాస్పిటల్లో పది రోజులు ఉంచాము. రెండుసార్లు జ్వరం తారాస్థాయికి వెళ్ళినప్పుడు ప్రాణం దక్కుతుందన్నది కూడా అనుమానమే అన్నారు.
శుభ రాత్రింబవళ్ళు వాడితోనే ఉంది. చెదిరిన జుట్టుతో, వడలిన ముఖంతో నిలువునా బాధని, కోపాన్ని, భయాన్నీ మోస్తూ గడిపింది. అప్పుడు నేను ఆమెతో మాట్లాడటానికి కూడా ధైర్యం చెయ్యలేకపోయాను. ఒక మాటతో నా గొంతు నులిమేసి కొరికేసి చంపేస్తుందేమో అని భయపడ్డాను. పిల్లాడి లేత కాళ్ళనూ జ్వరంతో పీల్చుకుపోయిన ముఖాన్నీ చూస్తూ రాత్రంతా హాస్పిటల్ వార్డ్‌లో ఇనప కుర్చీలో కూర్చుని గడిపాను. పిచ్చి బిడ్డ, చేతులు చాపుకుని ఎదురు రొమ్ము పైకి కిందకి ఎగిసెగిసి పడుతూ నిద్రపోతున్నాడు. చర్మమంతా తడిలేక ఎరుపెక్కిపోయింది. ఎదుర్రొమ్ములోని పక్కటెముకలు కనబడుతూ వేరే ఎవరో పిల్లవాడిలా మారిపోయాడు. మరణం వాడికి దగ్గరగా వచ్చి వెళ్ళింది. ఈ గదిలోనే ఏదో వస్తువు రూపంలో మరణం ఇక్కడే ఉందా? కొంచం ఏమరుపాటుతో కునుకు తీస్తే చేతులు చాచి వాడిని తీసుకెళ్ళిపోతుందా?
వాడిని ఆ స్థితిలో చూస్తున్నంతసేపూ పెద్ద ఇనుప రేకొకటి పొత్తికడుపులో దిగుతున్నట్టు అనిపించింది. అయితే ఆ బాధ కావాలి అనిపించింది. ఆ బాధను నిశబ్దంగా అనుభవించాను. త్రాసులోని ఒక తట్టలా మనసులోని మరోవైపును అదిమేస్తున్న ఒక బాధ నన్ను సమస్థతికి తీసుకొచ్చింది. నిర్విరామంగా సిగరెట్లు కాల్చాను. సిగరెట్లు ఎక్కువ కాల్చినందువల్ల నా పెదవులు మండాయి. నా గుండె మండి పొడి దగ్గు వచ్చింది. ఏ తిండి తిన్నా, ఎంత ఆకలితో ఉన్నా రెండో ముద్దకే డోకొచ్చేది. ఒక్కో క్షణంగా జీవించాను. ఒక్కో శ్వాసగా కాలాన్ని వెనక్కి నెట్టా ను.
ఒక రాత్రి వాడిని చూస్తుండగా నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. వీడున్న ఇదే వయసులో నేను ప్రతిరోజూ ఆ పాచిపోయిన ఎంగిలి కూడే తిని బతికాను. ఎలా బతికానో మరి. నా వయసున్న పిల్లలు ఎందరో వర్షాకాలాల్లో చనిపోయేవారు. మా అమ్మ పదిమందినైనా కని ఉంటుంది. తొమ్మిదిమంది చనిపోయారు. చచ్చిపోయిన పిల్లల్ని కాళ్ళతో పట్టి ఎత్తుకుని బిరబిరమని సాగే కరమన ఏటిలో పడేసేవాళ్ళు. అలా పడేసేముందు చనిపోయి పడి ఉన్న మా చెల్లెల్ని చూశాను. నల్లటి చిన్న ముఖంలో ఆమె చివరిగా ఏం ఆలోచించిందో అది నిలిచిపోయి ఉంది. ‘కూ… కూ…’ ఆ మాట మాత్రమే ఆమె మాట్లాడగలిగేది. ఆ మాట పెదవులపై ఉండిపోయింది.
ఆ క్షణం నా మనసులో వచ్చిన ఒక క్రూరమైన ఆలోచనని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ తెల్ల బిడ్డ అలాంటి తిండి తినడంవల్ల చచ్చిపోయేట్టయితే చచ్చిపోనీ. చెత్తకుండీలోని ఆహారం తినడంవల్లో లేక పస్తులవల్లో చచ్చిపోయిన పిల్లలున్న ఆ పైలోకపు బ్రహ్మాండమైన స్వర్గంలో ఈ బిడ్డను చూడాలని ఎదురుచూస్తూ ఈ బిడ్డ బంధువులు ఎంతమంది ఉంటారో! మరుక్షణమే ఆ ఆలోచన వచ్చినందుకుగానూ నన్ను నేనే తలమీద కొట్టుకున్నాను. మంచం మీద కూర్చుని నా చిన్నారి కాళ్ళను ముద్దులు పెట్టుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ ఏడ్చాను.
అమ్మ మదురైలోని హోమ్ నుండి కొన్ని రోజులకే పారిపోయిందని తెలిసింది. నేను పట్టించుకోలేదు. అయితే ఆ రోజునుండి నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను క్రూరుడిగా మారాను. క్షమించనివాడిగా, ఎప్పుడూ కోపంతో ఉండేవాడిగానూ మారాను. రోజూ నా కింద ఉద్యోగులకు హెచ్చరిక లేఖలు, శిక్షల మెమోలూ ఇచ్చాను. వాళ్ళు దాన్ని నా పై అధికారి దగ్గరకు తీసుకెళ్ళి రద్దు చేయించుకునేవారు. నా ముందు హేళన నిండిన ముఖంతో నిలబడి ఎడంచేత్తో తీసుకునేవారు. బయటకు వెళ్ళి గట్టిగా మాట్లాడుకుని నవ్వుకునేవారు.
కొన్ని రోజులకు నా ఆఫీస్ గోడలమీద నా గురించి పోస్టర్లు కనబడ్డాయి. మా అమ్మ చేతిలో ప్లాస్టిక్ గిన్నె పట్టుకుని భిక్ష అడుక్కుంటున్న బొమ్మ ఉంది వాటిల్లో. కన్నతల్లిని వీధుల్లో భిక్ష అడుక్కుని తిననిస్తూ అధికార భోగాలు అనుభవిస్తున్న దుర్మార్గుడి చేతుల్లోనా జిల్లా బాధ్యతలు? నేను ఆ పోస్టర్లను ఆఫీసు లోపలికి వచ్చేప్పుడు చూశాను. వరుసగా అంటించి ఉన్నారు. అన్ని పోస్టర్లను దాటుకుని మలుపులో తిరిగేప్పుడు దాన్ని చదివాను. నా కాళ్ళు బలం కోల్పోయాయి. బ్రేక్ కూడా తొక్కలేక పోయాను. కారు ఆపేసి దాదాపు పరుగెట్టుకుంటూ నా గదిలోకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అందరి కళ్ళూ నా మీద మూగాయి. నేను గది తలుపు వేసుకోగానే ఆఫీసంతా గొల్లుమన్న ఆ నవ్వు చప్పుడు నన్ను గట్టిగా వచ్చి మోదింది.
రెండు రోజుల తర్వాత అమ్మను ఎవరో ఆఫీసు కేంపస్‌కే తీసుకొచ్చేశారు. అమ్మ నా ఆఫీసు ముందున్న రేల చెట్టుకింద కూర్చుని, నా ఆఫీసులో మధ్యాహ్న భోజనం చేసినవారు మిగలగా ఇచ్చిన ఎంగిలి మెతుకుల్ని ప్లాస్టిక్ పేపర్లో పెట్టుకుని ఆనందంగా తింటోంది. నా గది కిటికీ నుండి నేను చూసే చోటే ఆమెను కూర్చోబెట్టారు. భోజనం ముగించి చేతులు కడుక్కోడానికి వాష్‌బేసిను వైపుకు వెళ్ళిన నేను ఇది చూశాను. కొన్ని క్షణాలు నేను ఎక్కడ ఉన్నానన్నది మరిచిపోయాను. అక్కడినుండి దిగి కారు కూడా తీసుకోకుండా పిచ్చివాడిలా రోడ్డు మీద పరిగెట్టాను.
పొద్దున నేను ఆఫీసుకు వెళ్ళి పేరుకుపోయున్న ఫైళ్ళన్నీ చూసి పదిన్నరకు హాస్పిటల్‌కు వెళ్ళాను. మధ్యలో ఫోన్ చేసి కనుక్కున్నాను. అమ్మ పరిస్థితిలో ఏ మార్పూ లేదన్నారు. నేను హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ వరండాలో డాక్టర్ మాణిక్యం నిల్చుని ఉన్నాడు. నాలో ఉన్నపళంగా మొదలైన అలజడి అతను నా దగ్గరకు వచ్చి నమస్కారం చెప్పినప్పుడు ఎక్కువైపోయింది.
“చెప్పండి మాణిక్యం” అన్నాను.
అతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మళ్ళీ దండం పెట్టాడు. నేను ఇంకా కటువుగా ఉండాలి అనుకున్నాను.
“సార్, మీరు నేను చెప్పిన ఏదీ నమ్మినట్టు లేరు. నేను చెప్పినవీ చేసినవీ అన్నీ నా తప్పును కప్పిపుచ్చుకోడానికే అనుకుంటున్నారు కదా… ఏంటి సార్ ఇది! నేను…” అతని గొంతు పూడుకుపోతూ “నేను ఎప్పుడూ దేవుడికి భయపడే అన్నీ చేస్తుంటాను సార్. ఆ ఎరువుల దిబ్బలో నా వల్ల అయినంత వరకు పాటుపడుతూనే ఉన్నాను సార్. పొద్దున ఎనిమిది గంటలకు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి రాత్రి తొమ్మిదో పదో అవుతుంది సార్. మందులు కూడా ఉండవు. మాత్రలుండవు. పుళ్ళకు పెట్టి కట్టడానికి గాజ్‌గుడ్డ ఉండదు. సార్, చెప్తే మీరు నమ్మరు, పక్కనుండే వెటర్నరీ హాస్పిటల్‌కు వెళ్ళి అక్కడి మిగిలిపోయిన మందులు యాంటీబయాటిక్‌లు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు వైద్యం చేస్తుంటాను సార్. ఇరుగు పొరుగు ఇళ్ళకు మా ఇంటావిడను పంపించి చిరిగిన చీరలవీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి వాటితో పేషంట్లకు కట్లు కడుతుంటాను సార్… మనసెరిగి నాలుగైదు రోజులు లీవ్ కూడా తీసుకున్నది లేదు.”
నేను ఊరడిస్తున్న స్వరంతో “నేను మిమ్ముల్ని తప్పు పట్టడంలేదు. పరిస్థితి ఇలా ఉంది అని రిపోర్ట్ ఇచ్చాను. అది నా బాధ్యత కదా? అది నేను చెయ్యకుంటే ఇలానే ఉండనీ అని వదిలేసినట్టే కదా?” అన్నాను.
“మీరు అనుకున్నది న్యాయమే సార్. నేను మిమ్నల్ని నిందించడంలేదు. అయితే…” ఆ పైన అతనికి మాటలు రాలేదు.
“ఐయామ్ సారీ!” అని చెప్పి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను.
“ఆగండి సార్. ఇది మాత్రం విని వెళ్ళండి. మీరూ నాలాంటివారే. సార్, నాకు ఏడేళ్ళుగా ప్రమోషన్ డ్యూ. ఏవేవో తప్పులు తడకలు చెప్పి ఎక్స్‌ప్లనేషన్ అడిగి అలా పక్కన పెట్టేస్తూవచ్చారు. ట్రిబ్యునల్ వరకు వెళ్ళి తీర్పు తెచ్చుకుని ఆ తీర్పుని అప్లై చెయ్యడానికి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుని ఇప్పుడే పేపర్ వచ్చింది. నేను సీనియర్‌ని సార్. ఇప్పుడు మీ లెటర్‌ని చూపించి నన్ను సస్పెండ్ చేసేశారు. ఇక ఆ ఆర్డర్‌ని రద్దు చేసిగానీ నన్ను తీసుకోరు. మళ్ళీ పదేళ్ళే అవుతుందో అంతకంటే ఎక్కువ అవుతుందో… వస్తాను సార్” అని వేగంగా వెళ్ళిపోయాడు.
నేను అతని వెనకే నడిచాను. అతను బయటకు వెళ్ళి తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. నేను నీరసపడి హాల్లో కూర్చున్నాను. ఇలానే జరుగుతుంది, ఇలా కాకుండా మరోలా ఏం జరిగినా ఆశ్చర్యమే. తెలిసీ నేను ఎందుకిలా చేశాను? ఎవరికి ఏం నిరూపించడానికోసం చేశాను? నాకు కొన్ని రోజులుగా పొట్టలో తిప్పేస్తున్న ఆమ్లం గొంతులో పుల్లగా మండింది. వాంతి చేసుకోవాలనిపించింది. తలను చేతులతో పట్టుకుని కూర్చుని ఉన్నాను.
నర్స్ వచ్చి “సార్” అంది.
నేను లేచాను.
“అవ్వ కళ్ళు తెరిచింది. తెలివి వచ్చింది” అంది.
నేను గబగబా అమ్మ గదిలోకి వెళ్ళాను. అమ్మ కళ్ళు తెరిచి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉంది. చేతిలో గుచ్చిన సెలైన్ గొట్టం లాగి పడేసి ఉంది. గుచ్చిన చోటునుండి రక్తం కారుతోంది.
నర్స్ వచ్చి “అయ్యయ్యో… ఇలా లాగకూడదు అవ్వా… పడుకోండి పడుకోండి” అని ఆమెను పట్టుకుంది. నర్సుని అమ్మ పట్టి దూరం తోసింది. ఆమె కళ్ళు కలియజూసి నన్ను దాటుకుని బయటకు చూశాయి.
“కాప్పా… ఒరేయ్ కాప్పా” అంటూ లేవబోయింది.
నేను “అమ్మా… నేనే. అమ్మా…” అని అన్నాను.
“కాప్పా… రే కాప్పా… సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా… కాప్పా…”
అమ్మ కళ్ళకు నేను కనబడనే లేదు. నర్స్ ఆమెను లాగి పడుకోబెట్టింది. అమ్మకు మూర్ఛ వచ్చినట్టు చేతులు కాళ్ళు కొట్టుకోసాగాయి. నోరు ఒక పక్కకు తిరిగిపోయి పెదవులు వేగంగా వణుకుతున్నాయి.
“డాక్టర్‌ను పిలుచుకొస్తాను” అని నర్స్ పరిగెట్టింది. నేను అమ్మను పట్టుకుని పడుకోబెట్టాను. బిగుసుకుపోయిన చేతులు మెల్లమెల్లగా సడలిపోసాగాయి. డాక్టర్ వచ్చేప్పటికి అమ్మ మళ్ళీ స్పృహ కోల్పోయింది.
నేను బయట నిల్చుని చూస్తూ ఉన్నాను. ఇందిర బయటికి వచ్చి “డయాలిసిస్ చేస్తే మంచిది. షీ ఇజ్ సింకింగ్” అంది.
“చెయ్యండి.”
“చేసినా పెద్ద మార్పేమీ ఉండకపోవచ్చు. షీ ఈజ్ అల్మోస్ట్ ఇన్ హెర్ ఫైనల్ మినిట్స్” అంది.
నేను నిట్టూర్చాను. లోపల వాళ్ళందరు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఏవేవో చేస్తున్నారు. నేను మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నాను. తల తడుముకుంటూ కూర్చున్నాను. వాచ్ విప్పి మళ్ళీ కట్టుకున్నాను.
శుభ ఫోన్ చేసి పిలిచింది. నేను “హలో” అనగానే “హౌ ఈజ్ షీ?” అంది
“ఇంకా కాసేపే అన్నారు”
“ఓ!” అని “నేను ఇప్పడక్కడికి వస్తున్నాను. పది నిముషాలు పడుతుంది” అంది. నేను ఫోన్ పెట్టేశాను. ఆ ఫోన్ క్లిక్ అని వినిపించిన క్షణం ఒకటి నిర్ణయించాను. అవును, అదే. ప్రజానందులవారు చెప్పింది అదే. ఆయన మాటలు నా చెవులకు దగ్గరగా వినిపించాయి. “అమ్మకు చేసిన అన్యాయానికి నువ్వు అన్ని ప్రాయశ్చిత్తాలూ చెయ్…” ఆయన చెప్పింది ఇదేనా? ఇది నేను చెయ్యను, నాకు ఆ ధైర్యం రాదు అని ఊహించే ధైర్యంగా ఉండు అని అన్నారా?
నేను లేచి వెళ్ళి అమ్మను చూశాను. లోపల నర్స్ మాత్రమే ఉంది.
“కళ్ళు తెరిచిందా?” అని అడిగాను.
“లేదు. డయాలిసిస్ చెయ్యాలి. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాం” అని అంది.
అమ్మ కళ్ళు తెరవాలి అని ఆ క్షణం నా మనస్పూర్తిగా కోరుకున్నాను. ప్రార్థన చెయ్యడానికి నా తలలో పదాలు ఏమైనా ఉన్నాయని అనిపించలేదు. ఆ సమయాన, ఆ గదిలో లోషన్ వాసనతో నిండిన గాలిని, కిటికీలోనుండి వచ్చిన వెలుగుని, అక్కడ చుక్కచుక్కలుగా జారిపోతున్న కాలాన్నీ వేడుకున్నాను. అమ్మ కోసం వేడుకున్నాను. అమ్మ కళ్ళు తెరవాలి అని. కొన్ని నిముషాలు చాలు.
ఆమె పక్కన కూర్చుని ఆమె చేతులను నా చేతుల్లోకి తీసుకుని చెప్పాలి. ఆమె ఇన్ని ఏళ్ళు ఆవేశంగా ప్రాధేయపడినందుకు జవాబు చెప్పాలి. “అమ్మా, నేను నీ కాప్పన్. నువ్వు కోరుకున్నట్టే నేను చొక్కా తీసేస్తాను. దమ్మదొరల కుర్చీలో కూర్చోను. లేచేస్తాను. నేను నీ కాప్పన్” అని చెప్పాలి.
అయితే అమ్మ ముఖం క్రమంగా మైనపు ముద్దలా మారడం చూశాను. మరో నర్స్ వచ్చి అమ్మ బట్టలు మార్చింది. అమ్మ దేహం ఇప్పుడు శవంలా ఊగుతోంది. ఆమె కూడా ఒక శవంలాగే హేండిల్ చేస్తోంది.
సమయం గడుస్తోంది. అర్ధగంట దాటినా శుభ రాలేదు. అయితే వైరుబుట్ట పట్టుకుని కుంజన్ నాయర్ వక్కాకు నవ్వుతో జారిన భుజాలతో నడిచి వచ్చాడు.
“నమస్కారం సార్. ఆఫీసుకు వెళ్ళాను. మెడ్రాస్ నుండి ఫోన్ వచ్చింది. వివరాలన్నీ రమణి రాసి ఇచ్చి పంపించింది” అని ఒక కాగితం నా చేతికి ఇచ్చాడు. నేను దాన్ని చదవకుండానే జేబులో పెట్టుకున్నాను. అతన్ని వెనక్కి పంపించాలనుకున్న అదే సమయానికి అమ్మ “కాప్పా” అంది.
నేను లోపలికి వెళ్ళేలోపే కుంజన్ నాయర్ లోపలికి వెళ్ళాడు. అతన్ని చూసి అమ్మ భయపడి రాయిని చూసిన వీధి కుక్కలా తన దేహాన్నంతా ముడుచుకున్నట్టు వెనక్కి లాక్కుని రెండు చేతులు జోడించి “దమ్మదొరా, గంజి ఇవ్వు దమ్మదొరా” అని హీన స్వరంలో వేడుకుంది. ఆమె ఒళ్ళు ఒకసారి అలా కుదేసినట్టు వణికింది. కుడి కాలు చాచి బిగుసుకుని సడలిపోయింది. ఎంగిలి కారిన ఆమె ముఖం దిండుమీద ఒక పక్కకు ఒరిగిపోయింది. నర్స్ ఆమెను మెల్లగా కుదిపి పల్స్ చూసింది. ఇంతలోపే నాకు అర్థం అయిపోయింది.
అవును ప్రజానందులవారు చెప్పింది ఇదే… కూర్చోవాలి. ఈ భిక్షగత్తె ముసలమ్మను మట్టిలో పూడ్చేసి ఆమె హృదయం అన్ని పరితాపాలతోనూ మగ్గి మట్టి అయిపోవాలి అంటే నాకు ఇంకా వంద కుర్చీలు కావాలి.
(మూలం: నూఱు నాఱ్కాలికళ్)
జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్ అనే నవల అకిలన్ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.