మనది కాదనుకుని
మన కథను రాస్తూ
ప్రతి చోటా
మనం కనబడేలా చూసుకోవడమే
కవిత్వమంటే
కవిత్వం
చాలా సార్లు కుండపోత వాన
అప్పుడప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడి
చూసీ చూసీ
కొంగ చటుక్కున చేపపిల్లను పట్టుకున్నట్టు
వస్తువును పట్టుకుంటాను
పిట్ట పుల్లలేరుకుని గూడు చేసినట్టు
పద్యాన్ని అల్లుకుంటాను
సోకైన వాక్యాలు
పగలన్నా దొరుకుతాయి
చీమూ నెత్తురున్న వాక్యాల కోసం
రాత్రులను కాల్చుకుతింటాను
పద్యం నాతోపాటే నిద్రపోతుంది
దాని ఊపిరి వేడికి
కళ్ళు మూతలు పడవు
తేటకళ్ళతో చూస్తే
జీవితం దొరుకుతుంది
వాక్యం చిక్కదు
పద్యం కావడానికి ముందు
కళ్ళకు దీపాల్ని వేలాడదీసుకోవాలి
కవిత్వమంటే
అదృశ్య సముద్రం మీద వేట
కనబడని అరణ్యంలో
కావాలనే తప్పిపోయి
భుజానికి ఒక వాక్యాన్ని తగిలించుకుని
ఇల్లు చేరడం