అదిగో
అప్పుడొకసారి ఓ మిణుగురుల పొద
కాస్తంత కాంతి ధూపాన్ని విసిరి వెళుతూ
ఇలా చెప్పింది కదా…
గాలంటే
ఎప్పటి స్పర్శను అప్పుడే
ఎక్కడి స్పర్శని అక్కడే
పరదాలుగా కప్పే అనుభవమనీ,
నిప్పురవ్వని దాచుకున్న మంచు ముద్దలా
తనకోసమంటూ ఒక రోజును
ఏ సీతాకోక రెక్కల కిందనో దాచుకుని
ఇప్పటికిలా జీవ ఇంధనమవుతోందనీ.
ఏ ఔషధీ అరణ్యాలనుండో
తనని తాను నింపుకొచ్చి
కొన్ని ఊపిరుల స్పర్శ కోసం
అన్ని అస్తిత్వాల సాంద్రతని నింపుకుని
తనని తాను ఉగ్గబట్టుకుంటూ
ఈ గాలి చేసే జాగరణ ఉంది చూశావూ…
అది కొన్ని స్వప్నాలని
యదార్థ స్థిరత్వంలోకి
లాక్కొని వచ్చే తపన!
ఏ మొహమాటాలకు పోయిందో ఏమో
ఇప్పుడిలా
కాస్తంత రంగులూ వాసనల రుచిలో
చిక్కుకుని పోయింది.
నువ్వు కొద్దిగా మేల్కొంటే…
ఏ రంగూ రుచీ వాసనా లేని
తన యదార్థాన్ని తనకిచ్చేసి
రేపటి మన శ్వాసల వెచ్చదనానికై
కాస్తంత ఊపిరి పోసుకుందాం!