జనులా పుత్రుని కనుగొని

“ఈశ్వర్ లాంటి ఆప్తమిత్రుడిని కోల్పవడం నా దురదృష్టం. ఆయన భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడే కాదు, మానవ విలువల్ని నెత్తిన పెట్టుకు తిరిగిన ఓ ఆదర్శవాది… ఆయనను ఎప్పుడూ అన్నగారూ అనే పిలిచేవాణ్ణి. ఆయనంటే అంత ఆరాధన నాకు. ఇదిగో వీడికీ చెప్తుండేవాణ్ణి ఆయనెంత గొప్పవాడో, వీడెంత అదృష్టవంతుడో…” చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ చెప్పుకుపోతున్నాడు జాయింట్ కలెక్టర్ ఆర్కే అంకుల్. మధ్యలో స్టేజ్ మీద పక్కనే ఉన్న నావైపు, ఎదురుగా ఉన్న జనాల వైపూ మార్చి మార్చి చూస్తున్నాడు. ఆయన నావైపు చూసినప్పుడల్లా తల‌ ఊపడమో, దించుకోడమో‌ చేస్తున్నాను. నేనూ తీవ్రంగా బాధపడుతున్నట్టు అంతకన్నా ఏంచేసి నమ్మించగలనో తెలియలేదు. ఏడవచ్చు కానీ కన్నీళ్ళు దొరకట్లేదు!

ఆర్కే అంకుల్ అంటే చిన్నప్పట్నుంచీ చాలా ఇష్టం నాకు. నాన్నను పొగిడేప్పుడు చిరాకనిపించేది కానీ ఓ‌ సారి తన కొడుక్కి ఏదో కాంట్రాక్ట్ ఇప్పించబోయి దాదాపు సస్పెండ్ అవ్వబోయాడని తెలిశాక ఆయన మీద గౌరవం‌ పెరిగిపోయింది. నాన్న‌ అమ్మతో అనడం విన్నానో రోజు ‘ఎంత చెప్పినా ఆర్కేకి బుద్ధి రావట్లేదు. హీ ఈస్ ప్లేయింగ్ విత్ ఫైర్’ అని.

అఫ్‍కోర్స్ నాన్నా, ఆయన నిప్పుతో చెలగాటమాడతాడు, కొండమీంచి దూకుతాడు కావాలంటే కొడుక్కోసం. పరువు ముసుగులో అందరూ నీలా పిరికివాళ్ళలా ఉండరు కదా!


“రెండు వారాల క్రితం కలిసినప్పుడు కూడా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడారు నాతో. ఇలా హాఠాత్తుగా వెళ్ళిపోయి మనందరికీ తీరని వెలితిని మిగిల్చారు…” ఓ డైరెక్టర్ ఆవేదన మైక్‍ లో.

నాకూ వెలితిగానే ఉంది. ఏళ్ళ తరబడి మనసులో పేరుకుపోయిన బాధంతా ఒక్కసారిగా మాయమైనప్పుడు వచ్చే వెలితి. కొత్తగా రాయడానికి ఎక్కడా ఖాళీల్లేనంతగా గజిబిజిగా నింపేసిన బ్లాక్ బోర్డ్‌ని ఒక్కసారిగా తుడిపేసినప్పుడు కలిగే వెలితి!

వక్తలు మారుతున్నారు. సానుభూతి విషవాయువులా హాలంతా చుట్టుకుంటోంది. అది తగిలిన మొహాలన్నీ పాలిపోతున్నాయి. కింద ముందు వరుసలో అమ్మ నిర్లిప్తంగా చూస్తోంది నా వైపు. వయసుకి మించి ముసలిదానిలా కనపడుతోంది. ఆమె ముఖం మీద కన్నా మనసులో ముడతలే ఎక్కువ అనిపిస్తాయి. ఆమె సరిగా అర్ధం కాలేదు నాకు. ఏమో, అయ్యిందేమో! అసలు ‘అర్థం అవ్వడానికి’ నిర్వచనం లేనప్పుడు, అవ్వలేదనుకోవడం పొరబాటు.

“ఆయనంతటి నిస్వార్థపరుడిని ఈ ఇండస్ట్రీలో ఇంతకు ముందు‌ చూడలేదు, ఇక ముందు చూడబోం కూడా” అన్న మాటకి చటుక్కున పక్కకి చూశాను. నాన్నతో గొప్ప గొప్ప సినిమాలకి తక్కువ రెమ్యునరేషన్‍తో పనిచేయించుకున్న ఓ ప్రొడ్యూసర్!

ఎవరన్నా ఎవర్నన్నా నిస్వార్థపరులంటే నాకు నవ్వొస్తుంది. స్వార్థం మనం పీల్చే గాల్లో ఫిల్టర్ చేసినా పోనంతగా కలిసిపోయి, మనల్ని కమ్మేసి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే, ఊపిరి పీల్చకుండా పంతం పట్టుక్కూర్చున్న మూర్ఖుడ్ని మాత్రమే నిస్వార్థపరుడనచ్చు. నాన్న నిజంగా నిస్వార్థపరుడే, పోయినప్పటినుండీ!

అవును, ఆయన ‘వెంకట్‍కి బ్రేకిచ్చారు, అనుపమని పైకి తెచ్చారు, సూపర్ సింగర్ కిషన్ కైతే ఏకంగా గాడ్ ఫాదర్. ఆయనకి టాలెంటే ప్రధానం. సొంత కొడుక్కి కూడా ఏ మాత్రం ఫేవర్స్ చెయ్యకుండా పక్కనపెట్టగలిగిన నిస్వార్థపరుడు.’ అని అనిపించుకోవాలనుకునేంత స్వార్థపరుడు!


“…వీటన్నిటికన్నా మించి ఆయనొక మంచి‌ మనిషి. సహృదయుడు. ఓ రకంగా ఆయన ఈ కాలంలో చెడబుట్టాడనచ్చు!” అంటున్నారెవరో మైక్‍లో, జనాల్ని నవ్వించడానికి విఫల ప్రయత్నం చేస్తూ.

“నువ్వెందుకూ పనికిరావురా. ఈ సింగింగ్ కెరీర్ నీ వల్ల కాదు కానీ బిజినెస్ ఏదన్నా చూస్కో!” నాన్న కొన్ని వందలసార్లు నాతో అన్న మాట. అప్పుడప్పుడూ అమ్మ అడ్డం పడేది –

“వాడికింకో అవకాశం ఇవ్వండి. చిన్నప్పటి నుండి సంగీతమే జీవితమని చెప్పి, ఇప్పుడు బిజినెస్ చేస్కోమంటే ఎలా?”

“ఈ యువరాజు ఎక్కడోక్కడ సెటిలవుతాడనీ…”

“నేను చాలా ట్రై చేస్తున్నాను.” తడబడేవాణ్ణి ఆ రోజుల్లో.

“అవును, మిడాస్ టచ్ అంటే తెలుసుగా? మిడాస్ అనే వాడు ఏది ముట్టుకున్నా‌ బంగారమయ్యేదిట. తమరు దానికి రివర్సు. ఏది ముట్టుకున్నా…”

నాన్న చాలా ఇంటర్‍వ్యూల్లో చెప్పిన మాట: ‘అందరూ నన్ను ఇన్నేళ్ళగా మంచి సంగీతం ఎలా ఇవ్వగలుగుతున్నారని అడుగుతుంటారు. ఇదంతా దేవుడి అనుగ్రహం, నా చేతుల్లో ఏమీ లేదు.’

కానీ నా గొంతు, నా పాటలూ ఎక్కువమందికి నచ్చకపోవడం కూడా దేవుడి అనుగ్రహమే అని ఆయనెప్పుడూ నమ్మలేదు. అందుకే నా మొదటి నాలుగైదు సినిమాల తర్వాత ఆయనలోని సహృదయుడు కనబడడం మానేశాడు నాకు.

మూడు గంటలనుండి సాగుతున్న ప్రసంగాలు, పొగడ్తలు, ఏడుపులూ… నా కళ్ళు మండుతున్నాయి, నాలిక ఎండిపోతోంది, మెదడు మొద్దుబారుతోంది. వాటర్ బాటిల్ ఎత్తి గటగటా తాగాను. పని చెయ్యలేదు. మెల్లగా నా కుర్తా పాకెట్లో చెయ్యి దూర్చాను. చిన్న ప్యాకెట్ దొరికింది. లోపలే గోరుతో చిదిమాను దాన్ని. మెత్తటి పౌడర్ తగిలింది చేతికి. సుఖంగా ఉంది. పొడిని చూపుడు వేలికి పూశాను. పాకెట్ లోంచి బైటికి తీసి ఆ వేలిని హడావిడిగా ముక్కుకి రుద్దుకున్నాను జలుబు చేసినట్టు. వెచ్చటి మత్తు ఒళ్ళంతా పాకింది. అటూ ఇటూ చూశాను. పక్క సీట్లో ఉన్న అనంత్ చిన్నగా తలూపాడు. పాపులర్ యాక్టర్ నందకిషోర్ కొడుకతను. నవ్వాను నీరసంగా అతడ్ని చూసి. నేను చేసింది గమనించలేదతను లక్కీగా. అతనే కాదు సభలో ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. పదేళ్ళగా బానే ప్రాక్టీస్ అయ్యిందిది నాకు!

ఎదురుగా ఆడియెన్స్ మధ్య నుండి ‘నాకు తెలుసు నువ్వేం చేశావో’ అన్నట్టు నిర్లక్ష్యంగా చూస్తున్న ఓ ముఖం. చేతులు కట్టుకొని, కుర్చీలో కిందకి జారి కూర్చొని. రావద్దన్నాను కానీ ఎప్పుడొచ్చాడో తెలీదు. నవ్వాను వాడికి మాత్రమే తెలిసేంతగా. చిన్నప్పటినుండీ వాడు నాకో క్రయింగ్ షోల్డర్, పంచింగ్‌ బ్యాగ్! నేను చూస్తున్నానని తెలిశాక, తల అడ్డంగా ఊపుతున్నాడు కళ్ళు పెద్దవిచేసి. ‘మళ్ళీ చెయ్యన్లే’ అని సైగచేసి, తల పక్కకి తిప్పుకున్నాను.


“ఈశ్వర్ ప్రసాద్‍గారు లేకపోతే ఈ రోజు మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు. అయినా ఆయనకి అంతం లేదు. సంగీతం ఉన్న చోటల్లా ఆయన ఆత్మ తిరుగుతూనే…” వాగుతున్నాడా చీట్ వెంకట్‍గాడు. నాన్న పట్టించుకోకపోతే ఎక్కడో బేకరీ షాప్‍లో పనిచేస్కుంటూ బతికేవాడు. నా ఛాన్సెస్ కొట్టేసి పైకొచ్చాడు. వీణ్ణి పిలవద్దని ఈ సభ ఇన్‍ఛార్జ్‌కి చెప్పినా వచ్చాడంటే, ఆయన కాళ్ళావేళ్ళా పడుంటాడు. చీప్ ఫెలో!

“ఈశ్వర్ ప్రసాద్ అలా లేకపోయుంటే, నేనూ ఇలా ఉండేవాడిని కాదురా!” అనుకున్నాను వాడివైపు చూస్తూ.

“నా జీవితం ఆయన పెట్టిన భిక్షే…” వినడం మానేశాను వాడిని.

ఇంతలో వెనక నుంచి ఎవరో అన్నారు చెవి దగ్గర “బాబూ, నెక్స్ట్ మీరే. రెడీగా ఉండండి.”

భయం పుట్టింది. నాన్న గురించి నేను మాట్లాడ్డం! ఏం మాట్లాడాలి? ఏం పొగడాలి? హడావిడిగా పైకి లేచాను. బాత్రూమ్ వైపు‌ నడిచాను. ఒంట్లో వణుకు తగ్గట్లేదు. ఓ సిగరెట్ త్వరగా‌ రెండు పఫ్స్ తీస్కోని పడేశాను. వాష్ బేసిన్‌ దగ్గర మొహం కడుక్కొని ఇంకో పాకెట్లో ఉన్న చిన్న బాటిల్ కోసం వెతికాను. అది దొరకలేదు. టెన్షన్ ఎక్కువైంది. “ఎక్కడైనా పడేశానా? ఇంట్లో వాడాను, పాకెట్లో పెట్టుకున్నట్టే గుర్తు. బైటికెళ్ళి వెతికే టైం లేదు. అది లేకపోతే…” తల పట్టుకొని కింద వాష్ బేసిన్ వైపే చూస్తున్నాను.

“దీనికోసం వెతుకుతున్నావా?” అందో‌ గొంతు. చటుక్కున వెనక్కి తిరిగాను. నా‌ గ్లిసరిన్ బాటిల్ పట్టుకుని నిల్చునున్నాడు అనంత్. కిందకి కూరుకుపోతున్నట్టుంది.

“అది నాది కాదు.” అన్నాను.

“నీ కుర్చీలోనే పడుంది.”

“…”

“ప్లీజ్, ఐ కన్ అండర్‍స్టాండ్.” చెయ్యి ముందుకు చాచాడు.

“పోయిన పార్టీలో కలిసినప్పుడు నేనేమైనా బైటపడ్డానా?” ఆలోచిస్తున్నాను.

“తీస్కో” అంటూ బాటిల్ని ఇంకొంచెం నా మొహం మీదికి‌ తోశాడు. అడ్డు చెప్పలేదీసారి. “టూ ఇయర్స్ క్రితం‌ నాకూ ఈ సిచ్యుయేషనొచ్చింది. ఇట్ విల్ బి ఫైన్.” అని భుజం మీద చెయ్యేసి, జాలిగా చూస్తూ బైటికెళ్ళిపోయాడు.

అంతా బ్లర్‍గా ఉంది. బైటనుండి వెంకట్ గాడి పాట వినిపిస్తోంది. నాన్నకి డెడికేట్ చేసుంటాడు కన్నింగ్ ఫెలో. గ్లిసరిన్‍తో కళ్ళు మండుతున్నాయి.


బయట హాలంతా నాకోసం వెయిట్ చేస్తోంది. మైక్ ఖాళీగా ఉంది. దగ్గరికెళ్ళి నిలబడ్డానో క్షణం చుట్టూ చూస్తూ. కనురెప్పల కిందనుంచి కన్నీళ్ళు జారుతున్నాయి. మసకగా ఉంది. వాటినలాగే కారనిచ్చాను చెంపలమీద తుడుచుకుంటూ.

ఓ నిమిషం తర్వాత మొదలుపెట్టాను. పెద్దవాళ్ళు ముందే అంతా మాట్లాడేశారన్నాను. వాళ్ళకు మించి నాకు ఎక్కువ తెలిసిందీ నేను కొత్తగా చెప్పాల్సిందీ ఏమీ లేదన్నాను. నాన్న జీవితం ఓ తెరిచిన‌ పుస్తకం‌ అని అందరికీ గుర్తు చేశాను. నాకు ఆయనే మొదటి గురువు అని బల్లగుద్దాను.

హఠాత్తుగా పైకి చూశాను. “నువ్వు మళ్ళీ పుట్టాలి నాన్నా! నీ కోసం కాకపోయినా‌ మా అందరికోసం మళ్ళీ పుట్టాలి. ఈ తెలుగు నేలమీదే మళ్ళీ నీ సంగీత‌ ప్రయాణం సాగాలి.” అని దణ్ణం పెట్టాను ఊగిపోతూ. ‘నన్ను మాత్రం మళ్ళీ నీ కొడుకుగా కాదు, ఓ‌ అభిమానిగా మాత్రమే‌ పుట్టించు.’ అనలేదు, అనుకున్నాను.

ఒక్క క్షణం నాన్న పాటలు గుర్తొచ్చాయి. మైమరచిపోయి వాటిని విన్న రోజులు, ఆ ట్యూన్స్‌నే మొట్టమొదటి సిలబస్‍గా ప్రాక్టీస్ చేసిన రాత్రుళ్ళూ కళ్ళ ముందు కదిలాయి. ఉన్నట్టుండి నిజంగా ఏడుపొస్తోందిప్పుడు. ఎవరో వచ్చి భుజం మీద తట్టారు. ఇంకెవరో నీళ్ళు తెచ్చిచ్చారు.

‘ఎందుకింత ఎమోషన్?’ లైవ్‍లో నా వైపు గురిపెట్టిన కెమెరాల వైపు చూశాను. ఈ గోల్డెన్ ఛాన్స్ వదులుకోకూడదు. తేరుకున్నాను.

“నాన్న‌ ఎప్పుడూ ముందు తరాల గురించే ఆలోచించేవారు. కొత్త గాయకులని, సంగీత దర్శకులనీ తీసుకురావాలని పదేళ్ళగా ఆయన నిర్వహిస్తున్న ‘సింగింగ్ సెస్సేషన్’ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలుసు.”

చుట్టూ చూస్తూ ఆగానో క్షణం. చాలా తలలు ఊగుతున్నాయి హాల్లో.

“ఆయన దీన్ని ఇంకా పైస్థాయికి తీసుకెళ్ళేందుకు వేదిక మీదున్న‌ మన ఏస్ ప్రొడ్యూసర్ మణిరాజుగారితో కలిసి వచ్చే మూడు నెలల్లో ఇంకో ప్రోగ్రాం ప్లాన్ చేశారు” అంటూ స్టేజీ మీదున్న ఆయన వైపు చెయ్యి చూపించాను. హాలంతా చప్పట్లతో నిండిపోయింది. ఆయన ఆశ్చర్యపోతూ పైకి లేచి అందరికీ నమస్కరించాడు.

“నాన్న ఈ కొత్త షో విషయాలన్నీ నాతో షేర్ చేసుకునేవారు. అడిగిమరీ నా సలహాలని తీసుకునేవారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నేనూ నాన్నకి సపోర్ట్ చెయ్యగలగడం కేవలం నా అదృష్టం” అంటూ అమ్మ వైపు చూశాను.

ముక్కుతో కర్కశంగా చుట్టూ ఉన్న గుడ్డు పొరల్ని పొడుస్తూ, బైటికొస్తున్న పక్షిపిల్లని చూస్తున్నట్టు కుతూహలంగా ఉందామె ముఖం‌.

“ఇప్పుడు మన మీదున్న బాధ్యత నాన్నగారి ఆ కలని నెరవేర్చడం. మణిరాజుగారు తప్పకుండా ఈ షోని మరో మంచి వ్యక్తి చేతుల్లో పెడతారని, మనందరి ముందుకూ త్వరలోనే తెస్తారనీ ఆశిస్తున్నాను” అని ముగించబోయేంతలో ఒక్కసారి సభంతా గందరగోళంగా మారింది. లోపలికి ఎవరో సెలబ్రిటీ హడావిడిగా వస్తున్నాడు. చుట్టూ జనం, ఫొటోలూ. కొంత లోపలికి వచ్చాక స్పష్టంగా అందరికీ కనపడుతున్నాడు – ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ విశ్వమూర్తి. నాన్నకి బద్ధ శత్రువు!

అతడ్ని చూసి నా ముఖంలో రంగులు మారుతున్నాయి. స్టేజ్ మీదా కిందా తెల్లబోతున్న మొహాలు, చిన్నగా గొణుగుళ్ళూ! ‘విశ్వం ఇక్కడికెందుకొచ్చినట్టు?’, ‘బతికున్నప్పుడు తిట్టి, పోయినప్పుడు సానుభూతా?’, ‘అసలెవరు ఇతణ్ణి ఇన్వైట్ చేసిందిక్కడికి?’

హడావిడిగా స్టేజ్ దిగాను.

‘ఆ విశ్వమూర్తిగాడు నేను ట్యూన్స్ కాపీ చేశానని తెగ ప్రచారం చేస్తున్నాడు.’ పోయే ముందు వారం కూడా నాన్న ఇంట్లో పడిన ఆవేదన.

విశ్వమూర్తి నన్ను చూశాడు. ఎదురుగా వస్తున్నాడు. హాలంతా సైలెంట్‍గా మారింది. ఇద్దరం దగ్గరగా వచ్చి ఓ క్షణం నిలబడ్డాం. ఊపిరి బిగపట్టి చూస్తున్నారందరూ. పెద్దగా నవ్వుతూ కౌగిలించుకున్నాం. చప్పట్లతో మారుమోగింది చుట్టూ. నిలకడలేని జనాలు!


విశ్వమూర్తిని స్టేజ్ మీదకి స్వయంగా తీసుకెళ్ళి మైక్ ఆయన చేతికిచ్చాను మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తూ. నాన్న ఫ్యాన్స్ కొంత మంది నిరసనగా చూశారు నా వైపు. స్టేజ్ మీదా కొంతమంది ఇంకా తేరుకోలేదు. నేను పట్టించుకోలేదెవర్నీ.

“అగస్టు ఇరవై అయిదు మన తెలుగు జాతికో దుర్దినం. మనం గర్వించదగ్గ ఒక గొప్ప ప్రతిభని, అంతకు మించి ఓ గొప్ప మనిషినీ కోల్పోయాం ఆ రోజు!” అని ఆవేశంగా ఎత్తుకున్నాడు విశ్వం. “మీరందరూ అనుకున్నట్లూ, మీడియాలో వచ్చినట్లూ నాకూ ఈశ్వర్‍గారికీ శత్రుత్వం ఏమీ లేదు. అవన్నీ కల్పనలే. ఆయన నాకో మంచి మిత్రుడు. చాలా సార్లు నా విమర్శలవల్లే ఇంకా మంచి సంగీతాన్ని అందించగలిగానని నాతో స్వయంగా అంటుండేవారు.”

“నువ్వు అడిగే దాంట్లో ఏమైనా సెన్స్ ఉందా? మీ నాన్న సంస్మరణ సభకి నేను రావడమేంటి? నేను అతని శత్రువుల లిస్టులో మొదటివాడిని!” విస్కీ సిప్ చేస్తూ అన్నాడు విశ్వమూర్తి రెండ్రోజుల ముందు ఓ రాత్రి.

“కాదు. మొదటివాడు కాదు, రెండవవాడు మీరు” అన్నాన్నేను రెండో రౌండ్ గ్లాస్‍లో పోస్తూ.

విశ్వం కళ్ళు పెద్దవయ్యాయి, నా లోతులని కొలిచే భూతద్దాలలా.

“గుర్తుందా, లాస్ట్ యియర్ ఒక ఈమెయిల్ వచ్చింది మీకు నాన్న పైరసీ చేసిన సాంగ్స్ లిస్ట్‌తో? తర్వాత మీరు దాన్ని మీడియాలో…”

“యెస్, యెస్…సెస్సేషన్ అయ్యిందది, నీకెలా తెలుసా ఈమెయిల్ గురించి?!”

నవ్వాన్నేను వంకరగా.

ఆయనకీ అర్థమై పెద్దగా నవ్వుతూ ఛీర్స్ కొట్టాడు.

“వస్తా. తప్పకుండా వస్తా. నీ కోసం. డన్!”

“ఈశ్వర్ ప్రసాద్ మనకి వదిలెళ్ళిన గిఫ్టేంటో చెప్పగలరా” అన్నాడు విశ్వం అన్నివైపులా చూస్తూ.

“సంగీతం!”

“క్లాసిక్స్!”

“లెగసీ!” అక్కడక్కడా చిన్న అరుపులు కిందనుండి.

“వాటన్నిటికన్నా విలువైనది, ఇక్కడే మనెదుటే ఉందా నిలువెత్తు బహుమతి. అద్భుతమైన గాయకుడు, మనం ఇంతవరకూ వెలికితీయని వజ్రం!” అంటూ నా భుజం పట్టుకుని గట్టిగా ఊపేశాడు. వాట్ ఆన్ యాక్టింగ్!

అందరికీ దణ్ణం పెట్టాను సిగ్గుపడుతూ.

“ఇంత అద్భుతమైన గిఫ్ట్‌ని నేనైతే తీసుకోకుండా ఉండలేను. ఇట్స్ టూ గుడ్ టు రెఫ్యూస్. అందుకే నా రాబోయే రెండు మూవీస్‍లో ఇతనికి అవకాశం ఇవ్వబోతున్నాను.”

హాలంతా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిందా మాటలకి.

“ఈశ్వర్‍గారు చేసిన కళాసేవకి మనం తిరిగి ఇస్తోందీ ఇవ్వగలిగిందీ చాలా తక్కువ‌ అని నా‌ అభిప్రాయం. ఏం రాజుగారూ, మీరేమంటారు? మనమింకా‌ చాలా చెయ్యగలం కదా?” సూటిగా ఛాలెంజ్ చేశాడు ప్రొడ్యూసర్ కళ్ళల్లోకి చూస్తూ.

మణిరాజు ముందు తడబడ్డాడు. అందరి కళ్ళూ అతడ్నే చూస్తున్నాయి. ఉన్నచోటే నిలబడి మైక్ అందుకున్నాడు. చేతులు సన్నగా ఒణికాయి. మెల్లగా గొంతు సర్దుకుని “ఇంటోనే బంగారాన్ని పెట్టుకోని ఊరంతా ఎతికే బాపతు కాదు నేను. ఈ అబ్బాయిని చూస్తంటే అచ్చం ఈశ్వర్‍గారినే చూస్తన్నట్టుంది. ఇతనే, ఇతనే మన వచ్చే ప్రోగ్రాం అంతా దగ్గరుండి నడిపీబోయేది. వచ్చే సీజనే కాదు, తర్వాత ప్లాన్‌ చేస్తన్న రెండు సీజన్లకీ ఈ అబ్బాయే క్రియేటివ్ హెడ్డు!”

“థాంక్యూ సర్, థాంక్యూ వెరీమచ్! నాన్నగారి షూస్ చాలా పెద్దవి. వాటిని నింపడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను” అన్నాను పెదాలు సాగదీస్తూ.

హాల్లో చప్పట్లు ఆగట్లేదు. ముందు వరసలో నిలబడి చేతులు గట్టిగా జాడించి కొడుతోంది అమ్మ. ఆమె ముఖంలో ఏదో వెలుగు!


పాణిని జన్నాభట్ల

రచయిత పాణిని జన్నాభట్ల గురించి: 'తనలో నన్ను' , 'చెయ్యాల్సిన పని' కథా సంపుటులు, 'మనుషులు చేసిన దేవుళ్ళు' నవల. ...