రాత్రి ఎప్పుడు నిద్రపట్టిందో!
కనురెప్పలు తెరవబోతే పాత చెక్కతలుపు చప్పుడు.
ఆరిన తడి చారలు చెంపల మీద, బురద నేలలో బండి చక్రాల గుర్తుల్లా.
బయట తెల్లవారినట్టుంది.
లేవబోతే బాధ, సగం మనిషి-సగం రాయి కథ: ఆర్థరైటిస్.
కిటికీలో పావురాలు రెక్కలాడిస్తున్నాయి అక్కడక్కడే కదులుతూ.
రాత్రి బలవంతంగా బయటకు నెట్టిన పిల్లి, దూరంగా
ఎక్కడో మూలుగుతోంది “అమ్మా” అన్నట్టే!
పక్కకు పొర్లడమే ఇవాళ్టికి ఆరోగ్యంగా ఉన్నట్టు.
తన ముఖం గుర్తొస్తుంది,
నీటి సరఫరా మీట నొక్కినట్టు. బుర్ర పనిచేయడం మొదలుపెట్టినట్టుంది.
తుప్పు పట్టిన విడిభాగాలన్నీ కలిపి కూడదీసుకుని నాలుగడుగులు వేశాక,
గుడ్డి దీపం కూడా గాలికి ఆరినట్టు- జ్ఞాపకం వస్తుంది
ఇవాళ ‘శెలవు’ అని.
పొద్దున్నే ఆనకట్ట మీద హెచ్చరిక చేసే ఉంటారు
తీరిక దొరికితే గేట్లు ఎత్తివేస్తారనీ – జ్ఞాపకాలు ముంచేస్తాయనీ!
పని కావాలిప్పుడు ప్రాణం నిలుపుకోవాలంటే!
చైతన్యం అత్యాశగానూ చలనం అత్యవసరంగానూ తెల్లవారుతుంది.
స్పృహ కంటే శిక్ష లేదు నాబోటి వారికి.
చీర కొంగు నడుం చుట్టూ బిగించి – ఊఁహూఁ.
చీర’ మాట మరెప్పుడైనా చెప్తాను – ఈ ప్రమాదం దాటాలి ముందు.
నిటారుగా నిలబడి నేను సిద్ధంగా ఉన్నాను
అందరూ లేవండి
నిశ్శబ్దంగా ఉండకండి
ఏదోక పని చెప్పండి
ఖాళీగా ఉంచకండి
ఇక్కడ – ఆగితేనో, వెనక్కి తిరిగి చూస్తేనో తల వేయి ముక్కలవుతుందట!
ఎందరి లాగానో నాకూ దక్కిన శాపం ఇది.
‘బాంబూ స్పైన్’ కట్టెలాగా అయిన వెన్నుపూస, వీపు పీకుతోంది,
చేతి వేళ్ళ చివర ముగ్గుపిండికి తోడు ఫైబ్రోమయాల్జియా కూడా.
అయినా ఏదోకటి చేయాలి.
ఎవరైనా సాయం పట్టండి
ఈ మంచం అటు వేసి
ఆ పూలకుండీలు ఇటు తీసి పెడదాం
పోనీ పరదాలు మారుస్తాను
కాస్త మనసుకు ఈ చోటు కొత్తగా ఉండాలి.
ఎవరైనా ఇటు రండి, కవిత్వం చదువుకుందాం.
ఏం చేయను?
ఏం చేయనింకా?
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా?
అల్మారాలో పుస్తకాలు సర్దాలని, అన్నీ తీసి
పోగు పోసుకుంటాలే- ఒకపూట బ్రతుకు దాటేయనూ!
ఎన్నాళ్ళయింది ఇవి తాకి?
దుమ్ముగొట్టుకుపోయాయి.
దుమ్ము?
నేనూ… దుమ్ముగొట్టుకుపోయానా ఇప్పుడు?
అబ్బా, ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు
ఎవరయ్యుంటారు?
ఎవరు అన్నీ అయ్యి ఉంటారు?
అయిన వాళ్ళందరూ ఉండిపోతారా?
లంకెలేని మాటలు కనుకనే లోపలే ఉంటాయి ఈ తర్జనభర్జనలు.
ఊఁహూఁ ఎవరూ లేరు ఎవరూ రాలేదు.
ఎవరొచ్చినా ఎదురుచూస్తున్న ఆ ఒక్కరూ రారు.
ఇలా కూర్చున్న చోట కూర్చున్నట్టు కూరుకుపోతే ఎట్లా?
పని కావాలి పని
బుర్రకి పని కావాలి
ఆఁ! ఆ అద్దం తుడవాలి, నీటి మరకల
మీద ధూళి అంటుకొని, అబ్బా!
ఎన్నాళ్ళయింది అద్దం చూసుకొని?
“యు ఆర్ లుకింగ్ గ్రేట్!”
ఎవరది?
ఎందుకలా చెప్పారు?
అది నిజమైతే అద్దం అబద్ధమా?
సమాధానం ఎవరు చెప్తారు, తోసుకొచ్చే ప్రశ్నలకు?
ఎవరు తోస్తున్నారు ప్రశ్నల్ని గుండెలో నుంచి గొంతు లోకి?
తుడిచింది చాలు, ఎట్లా ఉంటే ఏం? ఈ అబద్ధపు అద్దాన్ని తుడవను గాక తుడవను.
పెరట్లోకెళ్ళి మట్టి తవ్వుకొని, విత్తనాలు చల్లుకొని
మొక్కలొస్తే చూసుకొని మురిసిపోయి,
నీళ్ళు పట్టి కలుపు తీసి పందిరేసి పూలు పూసిన రోజు…
ఆఁ, పూలు పూసిన రోజు?
ఈ పూలే కదా అతని దోసిట్లో అంత సుకుమారంగా ఒదిగిపోయాయి,
మరి నన్నెందుకు ఇంత కటువుగా విడిచిపెట్టాడు?
తానెవరు? నేనెవరు?
అయ్యో, నన్ను తప్పించండి ఎవరైనా
ఈ అడవినుండి, ఈ ఆలోచనల నుండి…
ఎందుకిట్లా పరిగెడుతున్నాను పని కావాలని?
ఊరికే కూచుంటే తలపులు ముంచేస్తున్నాయని కదూ?
మాటలేమయ్యాయి? పాటలేమయ్యాయి?
ఆశలేమయ్యాయి?
ఆ కళ్ళూ ఆ అరచేతులూ జ్ఞాపకమొచ్చి
దహించుకుపోలేక కదా పని వెతుక్కుంటున్నాను?
పని చేస్తూ, చేస్తున్న పనిలో అతనిని వెతుక్కుంటూ,
తప్పించుకుంటూ మళ్ళీ మళ్ళీ కాలిపోవడం లేదూ?
నిజం చెప్పు, పరిగెడుతుంటే మాత్రం ఆలోచనలు ఆగుతున్నాయా?
అలసిపోకు, విశ్రాంతిగా ఉండు, ఎంత ముంచుతాయో అంత మునుగు,
ఎదురీతలెందుకు?
ప్రాణం డస్సిపోయింది చూడు, దారిలో ఉన్నాడనుకో.
ఇట్లాగేనా అతనొచ్చేరోజుకి నువ్వుండాల్సింది?
తోట బాగు చేసుకో, కవిత్వం రాసుకో, మట్టి పిసికి బొమ్మలు చేసుకో
ప్రేమ లేదు అనుకున్నట్టే ప్రేమ ఉందనుకో.
అనుకోవడమేగా ఇప్పుడు అంతా.
అతను వచ్చే వరకూ వేదిక ఖాళీగా ఉంచలేం కదా,
ఓపికున్నంత వరకూ ఏక పాత్రాభినయం చేయాలి కదూ!
మంచం పక్కనే మందుల పెట్టె, నీళ్ళ సీసా.
అరచేతిలోకి ఇంద్రధనుస్సు ఒంపుకోవాలి
పూటకి ఏడు మాత్రలుగా!
ఉపవాసమేనా ఇవాళ కూడా.
కిటికీ ఆవల పొర్ణమి, కళ్ళలో యమున, వెన్నెల ప్రతిఫలిస్తోంది.
బియ్యపుగింజంత మాత్ర పెద్ద కనురెప్పల లంగర్లు దించుతోంది దయగా,
అదిగో నెమ్మదిగా ఒక నవ్వు ముఖం స్పష్టమవుతోంది
మసకవుతోంది
స్పష్టమవుతోంది
మసకవుతోంది!