రెక్కల కింది గాలి

చేతిలో చేయి వేసుకుని
అందమైన లోయలోకి అడుగుపెట్టగానే
సన్నగా బుసలు కొడుతూ జరజరా పాకివచ్చి
అతని కనురెప్పల కింద మాటు వేసినట్టున్నాయి ఆలోచనలేవో

రాజీకి ఉన్న అన్ని రంగుల్ని ఇంటిగోడలకు పులిమినా
వెన్నెలను కురిపించే ఆకాశాల గురించి ఆశపడి
కొన్ని నీడల్ని మిగుల్చుకోవడం తప్ప ఇంకేమీ ఒరగదు

ఇసుమంతైనా ఊపిరాడక,
హోరెత్తే గుండెతో మూయలేని కళ్ళతో
కదలలేక భయపడుతూ
చీకట్లోకి చూస్తూ ఎంతసేపు ఉన్నానో

మగత వీడి సూర్యపుష్పం విచ్చుకునే వేళ
దిగంతాన్ని కమ్మేసిన జిలుగు నీడలు చెదిరిపోయాయి
పిడికిలెత్తిన రంగు రెక్కల చిట్టి సీతాకోక చిలుక ఒకటి
మొండిగోడలపై ఇంద్రధనుస్సును అద్దుతూ
తన గూడును లోయకు ఇచ్చేసి ఎగిరిపోయింది

విశ్వమంతా అలుముకున్న ఉన్మత్త మహా నిశ్సబ్దంలో
ప్రేమంటే ఏమిటో నాకు తెలిసిపోయింది
ప్రేమకన్నా మధురమైనదేదో నా రెక్కల కింది గాలి అవుతోంది