కొంతమంది రచయిత్రులు తమ రచనల్లో సంచలనాలు సృష్టిస్తారు. మరికొందరికి జీవనశైలే సంచలనం. వారి రచనలకంటే వారి జీవితమే ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి రచయిత్రే 19వ శతాబ్దికి చెందిన ఫ్రెంచి నవలాకారిణి జార్జ్ సాండ్ (George Sand). ఒక మధ్యాహ్నం ఒక నవలను ముగిస్తే, సాయంత్రానికల్లా మరో నవల ప్రారంభించేంత విరివిగా రచనలు చేసింది. నవలలతో పాటు నాటకాలు, వ్యాసాలు, ఆత్మకథ, శీర్షికలు, ఉత్తరాలు అన్నిటి ద్వారా తనను తాను నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా ఆవిష్కరించుకున్న ధీమంతురాలిగా పేరుపొందింది.
జార్జ్ సాండ్ అన్నది ఆమె కలం పేరు. అప్పట్లో చాలామంది లాగే ఆమె కూడ మగపేరుతో నవలలు రాసింది. ఆమె అసలు పేరు అమాఁతిన్-లుసీల్ అఱోర్ దుపీఁ (Amantine-Lucile Aurore Dupin). క్లుప్తంగా అఱోర్ అని పిలిచేవారు. 1804లో పారిస్‌లో జన్మించిన ఆమె 1876లో మరణించింది. రాజు ఫిలిప్ లూయీ కుటుంబంతో దూరపు బంధుత్వం ఉన్న ఆమె సంప్రదాయ, సంపన్న కుటుంబంలో జన్మించింది. కానీ తండ్రి త్వరగా మరణించడం, తల్లికీ నాన్నమ్మకీ పడక, తల్లి తనను నాన్నమ్మతో వదిలేసి, ఉద్యోగం నెపంతో వెళ్ళిపోవడం – నాన్నమ్మ ప్రేమగానే చూసుకున్నా, జీవితం ఒక నిర్దిష్ట ప్రణాళిక లేక, గాలివాటుగా కొనసాగడం–వీటితో అస్తవ్యస్తంగా నడిచిన బాల్యం ఆమెది. ఆమె జీవితం సంచలనం కావడానికి ముఖ్య కారణాలు:
- బహిరంగంగా మగవేషధారణలో తిరగడం,
- అవిచ్ఛిన్నంగా ప్రణయబంధాలు ఏర్పరచుకోవడం,
- నవలల్లోనూ, జీవితంలోనూ స్త్రీవాద ధోరణులు వ్యక్తం చేయడం.
అప్పట్లో ఫ్రాన్స్‌లో కొందరు యువతులు మగవాళ్ళల్లా పాంటూ షర్టూ ధరించేవారు. అయితే అలా వేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి పత్రం తీసుకోవాల్సివుండేది. క్రీడాకారులు, కొన్ని రకాల ప్రమాదకరమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలా అనుమతి పత్రం తీసుకుని పాంట్లు ధరించేవారు. కానీ జార్జ్ సాండ్ ఎవరి అనుమతి తీసుకోకుండానే మగదుస్తులు ధరించేది. ‘సౌకర్యంగా ఉంటాయి తిరగడానికి’ అన్నది ఆమె అభిప్రాయం. అప్పటి ఫ్రెంచి రాజరికకుటుంబ స్త్రీలు నేలపై జీరాడే గౌన్లు, బిగుతుగా ఉండే దుస్తులు ధరించేవారు. అవి నచ్చక, ఆమె ఎప్పుడూ మగవేషంలోనే బయటకు వచ్చేది. బహిరంగంగా సిగరెట్టు కాల్చేది. ఆమెలో పురుషప్రవృత్తి కలం పేరుకు, దుస్తులకే పరిమితం కాదని, రచనల్లోనూ తొంగి చూసేదని విమర్శకులు అనేవారు. ఈ ‘మగబుద్ధి, ప్రవర్తన’ అన్న అభిప్రాయాలు ఎంతవరకూ పోయాయంటే, ఆమె సమకాలికుడైన ప్రముఖ ఫ్రెంచి రచయిత, విక్టర్ యూగో (Victor Hugo: ల మిసరాబ్ల్, హంచ్‌బాక్ ఆఫ్ నోత్ర్‌డేమ్ నవలల రచయిత) ‘George Sand cannot determine whether she is male or female. I entertain a high regard for all my colleagues, but it is not my place to decide whether she is my sister or my brother’ అని వెక్కిరించాడు. కానీ, ఇదే హ్యూగో ఆమె మరణించిన తర్వాత, ‘George Sand was an idea. She has a unique place in our age. Others were great men… she was a great woman too’ అని కూడ అన్నాడు.
జార్జ్ సాండ్ ప్రస్తావన రాగానే, ఆమె వ్యక్తిగత జీవితమే ఎక్కువ చర్చకు రావడం ఆమె సాహిత్యం పట్ల అపరాధమే. కానీ, ఆమె జీవితం అంత వైభవంగా ఉండేది. ఎందరో ప్రముఖులతో ఆమెకు సన్నిహిత సంబంధాలుండడం, జీవిత చరమాంకంలో స్వలింగసంపర్కం ఇష్టపడినట్టు సూచించడం, తన అనుభవాలను వేటినీ సమర్ధించుకోడానికి గాని, దాచిపెట్టడానికి గానీ ఆమె ప్రయత్నించకపోవడం, తన ప్రియులను నవలలో పాత్రల్ని చేయడం–ఇలాంటి కారణాల వల్ల ఆమె ఎక్కువగా చర్చకు రావడంతో అసలు ఆమె ఎలాంటి రచనలు చేసిందీ అన్నది కొంత నిర్లక్ష్యానికి గురైందనే చెప్పాలి. రచయిత్రులందరిలాగే ఆమెను కూడ వ్యక్తిగత జీవిత ప్రమేయం లేకుండా విమర్శకులు అంచనా వేయలేకపోయారు.
జార్జ్ సాండ్ కేవలం నవలలు రాయడమే కాదు. సమకాలీన రచయితలతో సాహిత్య చర్చలు విరివిగా చేసేది. సుప్రసిద్ధ ఫ్రెంచి నవలాకారుడు గుస్తావ్ ఫ్లొబేర్ (Gustave Flaubert: మదామ్ బొవరీ నవలారచయిత) ఆమెకు మంచి మిత్రుడు. ఫ్లొబేర్ ఉద్దేశంలో ఈ సృష్టిలో దేవుడు ఎలాగైతే ఎవరి పక్షమూ వహించడో, అలాగే రచయిత కూడ తన రచనలో ఏ పక్షమూ వహించకూడదు. రచనను ఒక శిల్పంలా చెక్కడానికే రచయిత పరిమితమవ్వాలి. తను చెప్పదలుచుకున్నదానికి సరైన పదం కోసం వారాల పాటు వేచివుండే రచయిత అతను. జార్జ్ సాండ్‌కి ఈ వైఖరి అర్థమయ్యేది కాదు. నవల అన్నది నా మనసును విప్పడానికి. దానికి ఇంత తర్జనభర్జనలెందుకు? అనేది. రచయిత ఆబ్జెక్టివ్‌గా ఉండాలని, నవలలో తన హృదయాన్ని ఉంచకూడదనీ ఫ్లొబేర్ వాదన. అసలు సాహిత్య సృజనే హృదయసంబంధి అని, అందులో మెదడు ప్రసక్తి అనవసరమనీ ఆమె వాదన. 1862 నుంచి 1876లో మరణించేవరకు ఫ్లొబేర్, సాండ్‌ల మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు 19వ శతాబ్ది ఫ్రెంచి సాహిత్య వాతావరణాన్ని అర్థం చేసుకోడానికి చాలా విలువైన సమాచారం అందించాయని విమర్శకులంటారు. ఇలా తన సాహిత్య చర్చల ద్వారా, లేఖలు, జ్ఞాపకాల రచన ద్వారా, చివరికి ఆత్మకథ ద్వారా ఎంతో సమాచారాన్ని, తన గురించి తనే అందించిన అరుదైన 19వ శతాబ్ది రచయిత్రి జార్జ్ సాండ్.
జీవితం
1804లో జన్మించి, 1876లో మరణించిన అఱోర్ జీవితం సకలవర్ణసంశోభితమనే చెప్పాలి. పారిస్‌లో ఒక ఉన్నతకుటుంబంలో జన్మించిన ఆమె ఎక్కువకాలం నాన్నమ్మ వద్ద నొఆఁత్ (Nohant) పట్టణంలో పెరిగింది. తండ్రి, తల్లి వేర్వేరు కారణాలతో దూరమైనా, నాన్నమ్మ ప్రేమలో సేదదీరింది. అదే విధంగా సాహిత్యం, సంగీతం, నాటకం వంటివాటిలో నిమగ్నం కావడం, అన్నగారితో స్నేహం ఆమెను ఉత్తేజితురాల్ని చేశాయి. ఇక ఆ తర్వాత ఫ్రెంచి ఉన్నతవర్గాలతో కలిసిమెలిసి తిరగడం, రచయితలు, సంగీతకారులు, కళావేత్తలతో నిత్యం విందులు, వినోదాల్లో పాల్గొనడం ఆమె జీవితాన్ని మరింత రక్తి కట్టించాయి. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, జార్జ్ సాండ్ ఎందరో పురుషులతో అనుబంధాన్ని ఆకాంక్షించింది. సమకాలీన రచయితలు, నటులు, రాజకీయనాయకులు కలిపి, కనీసం ఆరుగురితో ఆమెకు ప్రణయసంబంధాలుండేవి.
18వ యేట ఒక సైనికుడిని వివాహం చేసుకున్న అఱోర్ పదేళ్ళ తర్వాత అతని నుంచి విడిపోయింది. ఆనాటికి ఫ్రాన్స్‌లో విడాకులు చట్టవిరుద్ధం కనక, ఇద్దరి అంగీకారంతో విడిపోయారు. కూతురి కస్టడీ ఆమెకే లభించింది. తర్వాత ఆమె అనుబంధాల్లో ముఖ్యమైనవి జూల్స్ శాన్‌డో (Jules Sandeau) అనే యువ మేధావితో, సుప్రసిద్ధ కవి ఆల్ఫ్రెడ్ డ ముసేతో (Alfred de Musset). మొదటి వ్యక్తి, ఆమె పేరుప్రతిష్టలకు అసూయపడి సంబంధం తెంచుకున్నాడు. కవి ముసేతో సృజనాత్మక అనుబంధం కూడా ఆమెకుండేది. కానీ అతనితో సంబంధాన్ని ఆమె తెంపుకుని మరో వ్యక్తి ప్రేమలో పడింది (ఇతను ముసేకు వైద్యం చెయ్యడానికి తరచు వారింటికి వచ్చిన వైద్యుడు).
అయితే అందరిలోకీ ప్రముఖుడు మాత్రం పాశ్చాత్య సంగీతంలో తొలివరసలో నిలిచే ఫ్రెడెరిక్ షొపాన్‌తో (Frédéric Chopin) ఒక దశాబ్ది పాటు ఆమెకున్న అనుబంధం (1837–1847). ఈ అనుబంధం గురించి ఇంప్రాంటూ (Impromptu) పేరిట బ్రిటిష్ అమెరికన్ నిర్మాణంలో సినిమా కూడ వచ్చింది. పోలండ్‌లో జన్మించిన షొపాన్ 19వ శతాబ్దిని ఉర్రూతలూగించిన సంగీతకారుల్లో ఒకరు. పియానోలో జీనియస్ అయిన అతను వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. క్షయవ్యాధితో పోరాడాడు. జార్జ్ సాండ్‌తో ప్రణయబంధం కూడా ఎత్తుపల్లాలలో సాగింది. కానీ వీళ్ళిద్దరి అనుబంధం కొనసాగిన రోజుల్లోనే ఇద్దరూ ఉత్తమ సృజనాత్మకతను ఆవిష్కరించారు. ఎంతో ప్రతిభావంతులైన వీరిద్దరి సంగీత సాహిత్య సహచర్యం అపార్థాలతో, సాండ్ పిల్లలకు సంబంధించిన కలహాలతో, విషాదంలో ముగిసింది. వీరు విడిపోయిన రెండేళ్ళకే షొపాన్ మరణించాడు.
రాజకీయాలు
1848లో ఫ్రాన్స్‌లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన విప్లవంలో ఉత్సాహంగా పాల్గొంది జార్జ్ సాండ్. విప్లవ సందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తంచేసే కరపత్రాలు రాయడంలో ఆమె గొప్ప సామర్ధ్యం చూపింది. విప్లవకారులు అనంతరం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినా, ఆమె మాత్రం ఫ్రాన్స్ లోనే ఉండిపోయి, లూయీ నెపోలియన్ ప్రభుత్వంతో ఒక స్థాయిలో సంబంధాలు కూడా నిలుపుకుంది. అప్పుడు కూడ ఆమె పరపతి ఎలా ఉండేదంటే, తన మిత్రులకు ప్రభుత్వ క్షమాభిక్ష సాధించడంలో, వారి శిక్షలు తగ్గించడంలో కృతకృత్యురాలైంది. రాజకీయాల్లో ఎంతో ఆసక్తి ఉన్న సాండ్, అవకాశం వచ్చినపుడల్లా క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొనేది. సమకాలీన రాజకీయ నాయకులు చాలాసార్లు ఆమె సలహాలు కోరేవారు. రాచరిక వ్యవస్థలోని లోపాలని విమర్శించినప్పటికీ 1871లో ఫ్రాన్స్‌ని ఊపేసిన రెండవ పారిస్ కమ్యూన్‌ని ఆమె హర్షించలేదు. దానికి వ్యతిరేకంగా పత్రికల్లో విరివిగా రాసింది. పారిస్ కమ్యూన్ కార్యకలాపాలను ఒక దారుణచర్యగా (horrible adventure) ఆమె అభివర్ణించింది. జార్జ్ సాండ్‌కు రాజకీయంగా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నట్టు తోచదు. కానీ తన చుట్టూ జరుగుతున్న అన్ని రాజకీయ, సాంఘిక పరిణామాలకూ ఆమె తప్పక స్పందించేది. కేవలం మాటల్లోనే కాక, చేతల్లోనూ తన అభిప్రాయాల్ని ప్రకటించేది.
సాహిత్యంలో దశలు
జార్జ్ సాండ్ సాహిత్య జీవితంలోని మూడు దశలను క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మొదటి దశ ప్రణయగాథలను చిత్రించింది. ప్రేమసంబంధాల్లో, ముఖ్యంగా వివాహవ్యవస్థలో స్త్రీలకు ఉండాల్సిన భావస్వేచ్ఛ ఆమె ప్రధాన వస్తువు. ఇష్టంలేని వైవాహిక బంధంలో స్త్రీలు ఉండనవసరం లేదని, వారికి లైంగిక స్వేచ్ఛ ఉండాలనీ ప్రతిపాదించిన ఈ నవలలు సహజంగానే సంప్రదాయవాదుల విమర్శకు గురయ్యాయి. ఇండియానా (Indiana, 1832), లేల్యా (Lélia, 1833), జ్యాక్ (Jacques, 1833) మొదలైనవి ఈ తరహా నవలలే. అదే సమయంలో సామాన్య పాఠకుల అభిమానాన్ని చూరగొన్నవి కూడ ఈ నవలలే.
రెండో దశలో సామాజిక, రాజకీయ, తాత్విక ప్రశ్నలకు, సమస్యలకు సంబంధించినవి రాసింది. ఈ నవలలు కాన్సుఏలో (Consuelo, 1842), ది మిలర్ ఆఫ్ ఆన్‌జిబోల్ట్ (The Miller of Angibault, 1845); వీటిపై ఫ్రెంచి తత్వవేత్తల ప్రభావం ఉంది. కానీ ఈ నవలల్ని ప్రజలు గానీ విమర్శకులు గానీ ఆదరించలేదు. ప్రేమకథల్ని ఎంతో ఉద్వేగంతో, స్త్రీల కోణం నుంచి చర్చించి విశేషంగా పాఠకులను ఆకట్టుకున్న ఆమె, ఈ నవలల్లో సైద్ధాంతిక చర్చలను సృజనాత్మకంగా చూపలేకపోయిందని, మరీ ఉపదేశాల్లా తయారయ్యాయనీ విమర్శకులు కొట్టిపారేశారు.
మూడో దశ – గ్రామీణ జీవనాన్ని చిత్రించిన నవలలు. ఫ్రాన్స్ లోని ‘బెఱీ’ పల్లెప్రాంతాన్ని, దాని సౌందర్యాన్ని జార్జ్ సాండ్ నవలల్లో అనుభవించగలమని విమర్శకులంటారు. ఒక పల్లీయప్రాంతాన్ని తన నవలావస్తువుగా స్వీకరించి, ఎంతో హృద్యంగా ఆ నవలలు రాసింది. ఈ నవలలకే ఆమెను ఈనాటికీ గుర్తుంచుకుంటారు ఫ్రెంచి సాహిత్యకారులు. ఫెమినిస్టులు మాత్రం ఆమె తొలి దశ రచనల్ని పునర్నిర్వచించి సరికొత్త వ్యాఖ్యానాలను అందిస్తున్నారు. ఆమె పల్లెలను, పల్లీయ ప్రకృతిని వర్ణించిన తీరును బ్రిటిష్ రచయితలు జార్జ్ ఎలియట్ (ఈమె అసలు పేరు మేరీ ఆన్ ఇవాన్స్), థామస్ హార్డీ అనుకరించారు.
తొలిరోజుల్లో ఆమె రాసిన నవలల్లో తన ప్రియుల ప్రభావంతో ఫక్తు ప్రేమకథలే ఉన్నాయి. కానీ రెండో దశలో ఆమె నవలావస్తువు మారింది. గ్రామీణ జీవితం, అక్కడ నివసించే పేదల గాథలు ఆమె కథావస్తువులయ్యాయి. ల మేర్ అ దియాబ్ల్ (La Mare au diable, 1846), ఫ్రాన్స్‌వాఁ ల షాంపి (François le Champi, 1848), ల పెటీట్ ఫడేట్ (La Petite Fadette, 1849) వంటి నవలల్లో ప్రేమే ప్రథాన వస్తువైనప్పటికీ వర్గవైరుధ్యాలను, స్త్రీపురుష సంబంధాల్లో మారుతున్న విలువలనూ ఆమె ఈ నవలల్లో చిత్రించింది. విచిత్రమేమిటంటే, తను సంప్రదాయవిరుద్ధమైన జీవితాన్ని గడిపినా, కొన్ని నవలల్లో మాత్రం స్త్రీపురుషుల నైతికతకు, సనాతన ఆలోచనావిధానికీ పెద్దపీట వేసింది. చివరి రోజుల్లో తన ఆత్మకథను, పిల్లలకోసం కథలను కూడ రాసింది.
తన 17వ యేటే తన డైరీలో రాసుకున్న వాక్యాలను చూస్తే ఆమె తదనంతర జీవితం, సాహిత్యం ఎలా ఉంటాయో తెలుస్తుంది. ‘పిరికివాళ్ళంటే నాకిష్టం లేదు. వివాహం విషయంలో నాకో అనుమానం. నిజంగా భర్త తెలివైనవాడైతే తన భార్య భీరువుగా ఉంటే సహించగలడా?’ అంటుంది. భయం, సంకోచం స్త్రీల లక్షణం అనే భావజాలాన్ని చాలా చిన్నతనం నుంచే ఆమె వ్యతిరేకించేది.
వివిధ కళల్లో నిష్ణాతులైన పురుషులతో అనుబంధం జీవితం గురించి ఆమెకు చాలా నేర్పింది. సాధారణంగా ‘ఆడ’లక్షణాలుగా చెప్పే అసూయ, పోటీ తత్వం, బేలతనం వంటి వాటితో పాటు, ‘పురుష’ లక్షణాలైన అహంభావం, చులకనభావం, ద్వేషం, పగ – ఇవన్నీ ఆమె తను ప్రేమించిన మగవాళ్ళలో చూసింది. ఆమె నవలల వస్తువుల్లో స్వీయప్రణయానుభవాలే అధికం. 1833లో రాసిన లేల్యా నవల అందుకు మంచి ఉదాహరణ. ఈ నవలలో కథానాయిక జార్జ్ సాండ్‌కు నకలే. విద్యావంతురాలు; బుద్ధిజీవి. సామాజిక సూత్రాల పట్ల గౌరవం లేని మహిళ. తన నియమాల ప్రకారమే నడుచుకునే అరుదైన వ్యక్తిత్వం ఆమెది. సాండ్ లాగే లేల్యా కూడ ఎన్నో అనుబంధాల్లో తలమునకలవుతుంది. తన స్వేచ్ఛను ఎవరి కోసమూ వదులుకోదు. ఎంతోమంది ప్రియులతో గడిపిన తర్వాత, ఆమెకు దైహిక వాంఛల పట్ల విరక్తి వస్తుంది. అందువల్ల తనను ప్రేమించిన యువకవి వద్దకు తను వెళ్ళక, సోదరిని పంపుతుంది. ఆమె చేసిన ఈ ‘మోసానికి’ విచలితుడైన ఆ యువకవి క్రమంగా జీవితేచ్ఛ నశించి మరణిస్తాడు. ఇందులో లేల్యా పాత్ర కొందరి విమర్శకు, కొందరి ప్రశంసలకు గురైంది. లేల్యా, సాండ్‌కు ప్రతిరూపమని అందరూ భావించారు. కానీ సాండ్ మాత్రం తనకు లేల్యాతో పోలిక లేదని కొట్టి పారేసింది.
జార్జ్ సాండ్ ఎక్కువ ప్రఖ్యాతి చెందింది మాత్రం ఆమె ప్రేమైక అనుబంధాలకు, ప్రణయనవలలకే. తొలి నవల ఇండియానా తోనే పాఠకుల అభిమానాన్ని చూరగొని, 19వ శతాబ్ది ఫ్రెంచి పాఠకులకు ‘అభిమాన రచయిత’గా స్థిరపడింది. ఆ నవలలోనే వివాహవ్యవస్థ పట్ల అసంతృప్తిని స్పష్టంగా చెప్పింది. కథానాయిక గురించి చెబుతూ, ‘ఆమెకు భర్త పట్ల ప్రేమ లేదు. దానికి కారణం భర్తలో లోపం కాదు. ప్రతి స్త్రీ తన భర్తను విధిగా ప్రేమించాలన్న నియమం ఉండడం. అనుబంధం శాసనంగా మారితే, తిరస్కరించాలనిపించడం సహజమే కదా’ అంటుంది. అక్కడి నుంచి ఆమె నవలలన్నిటిలోనూ ప్రేమ పట్ల గౌరవం, పెళ్ళి పట్ల అసహనం దాదాపు ఆమె ముద్రగా స్థిరపడ్డాయి.
ఆ యుగం నాటి ఇతర భాషా రచయిత్రులతో పోలిస్తే జార్జ్ సాండ్ చాలా వైవిధ్యభరితమైన రచనలు చేసింది (Romantic, Pastoral, Political novel) – వేర్వేరు ప్రక్రియల నవలల్ని ఆమె సమర్థవంతంగా రాసింది. ఆమెకు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ రాజకీయపక్షమన్నా చులకనే. 1537 నాటి విప్లవం వైఫల్యాన్ని చిత్రిస్తూ ఒక కుట్ర (Une Conspiration en 1537) అనే శీర్షికతో రాసిన నవలను అప్పటి తన ప్రియుడు, ప్రముఖ కవి ముసే కు బహుమానంగా ఇచ్చింది. (బ్రిటన్‌ను ట్యూడర్ వంశం పరిపాలిస్తున్న రోజుల్లో, ఒక చిన్న ఊళ్ళో, కేథలిక్ మతాలయాలకు మద్దతుగా కొందరు లేవదీసిన తిరుగుబాటు ఈ నవలకు వస్తువు). ఈ నవల ఆధారంగా అతను రాసిన నాటకం అతన్ని సాహిత్యకారుడిగా ఇంతెత్తున నిలబెట్టింది. కానీ అదే ముసేని తన ఆత్మకథాత్మక నవల ఎల్ ఎ లుయిలో (Elle et Lui, 1859) అధీరనాయక పాత్రగాచేసి, ఆమె అతని అభిమానుల నిరసనను ఎదుర్కొంది. అప్పటికే ముసే చనిపోయాడు. మరణించిన అతన్ని ఇలా నిందాపూర్వకంగా చిత్రించడమేమిటని పాఠకులు ఆమెను తిట్టిపోశారు. కానీ ఆమె మాత్రం అది కల్పిత పాత్ర అని, అతని గురించి తను రాయలేదనీ వాదించింది. Nothing is strong in me, but the necessity of love, అని స్పష్టంగా చెప్పుకున్న ఆమె, జీవితమంతా ప్రేమలో పడ్డం, లేవడం నిరవధికంగా చేసింది. దానిగురించి ఏ మాత్రం అపరాథభావాన్ని చెందలేదు. పురుషులకు సామాన్యమైనట్లే స్త్రీలకు కూడ ఎన్నోసార్లు ప్రేమించడం, అవి విఫలమై నూతన ప్రేమకోసం తహతహలాడడం సహజమని ఆమె వాదించేది.
జార్జ్ సాండ్‌కి స్వయంగా ఆదర్శప్రాయమైన పల్లీయ జీవితం, ప్రజాస్వామ్యిక జీవనం ఇష్టమైన విషయాలు. వాటిని స్ఫురింపజేస్తూ రాసిన నవలల్లో చెప్పుకోదగ్గవి హొరేస్ (Horace, 1842) ది డెవిల్స్ పూల్ (The Devil’s pool, 1851) అన్న నవలలు. ప్రజాస్వామ్య భావాలను పల్లెప్రజలు అర్థంచేసుకున్నంతగా నగరవాసులు, సంపన్నులు అర్థంచేసుకోలేరన్న అభిప్రాయంతో, ఈ నవలలో పల్లెలను ఆదర్శికరించింది ఆమె. పల్లెల్లో నివసించే సామాన్యుడిని ఆమె చిత్రించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘ఇక్కడ పల్లెవాసి అంటే కేవలం ఒక వ్యక్తి కాడు. అతనే జీవితం; అతనే ఫ్రాన్స్ దేశం, అతనే ఫ్రాన్స్ భవిష్యత్తు’ అని వ్యాఖ్యానించాడు ప్రముఖ బ్రిటిష్ విమర్శకుడు మాథ్యూ ఆర్నాల్డ్, జార్జ్ సాండ్ నవలల గురించి రాస్తూ.
సమకాలీనంగా ప్రచారంలో ఉన్న కాల్పనిక కవుల పల్లీయ వర్ణనకు, ఆమె చిత్రణకు తేడా ఉంది. కాల్పనిక కవులు తమ అంతర్ముఖీనతను, తమ ప్రకృతి మమేకత్వాన్ని మాత్రమే పల్లీయ జీవనంలో, అక్కడి ప్రకృతి చిత్రణలో ప్రదర్శించారు. కానీ జార్జ్ సాండ్ దృష్టి విశాలమైంది. ప్రకృతి అన్నది ఆమెకు ఆత్మాశ్రయం కాదు. సామాజికం. మానవసమాజంలోని వెతలకు ఒక దివ్యమైన ఔషధంలా ప్రకృతి పనిచేస్తుందని, ఆ ఔషధం విలువ మొట్టమొదట గుర్తించేది సామాన్యుడేననీ ఆమె భావిస్తుంది. పల్లీయప్రకృతిని మానవాళికి మేలు చేసే ఒక ఖజానాగా ఆమె చిత్రించింది. ఆమె పల్లీయజీవిత చిత్రణ మరీ ఆదర్శవంతంగా ఉందన్న విమర్శలు కూడ రాకపోలేదు. కానీ ఆమె మాత్రం తను ఇంకా గొప్పగా చిత్రించాల్సి వుండిందని, ఇటువంటి నవలలకు ప్రాతినిధ్య రచనగా చెప్పబడే డెవిల్స్ పూల్ నవలని ఇంకా బాగా రాయాల్సిందనీ భావించింది (నవలకు ఆమె రాసిన ముందుమాటలో).
ఒకరకంగా చెప్పాలంటే ఆమె కోరుకున్న ప్రేమ మొదట వ్యక్తిగతమైంది, తర్వాత సామాజికమైంది, ఇంకా ముందుకు వెళ్తే మానవాళికి సంబంధించిందీ. ఏ ప్రేమ అయినా ఆమెను నడిపించిన శక్తి భావోద్వేగమే కానీ సిద్ధాంతమో, ఆలోచనో కాదు. ఆమె జీవితంలో ప్రతి దాన్నీ ఆమె ‘ఉద్వేగమే’ శాసించింది. అందుకే ప్రణయ నవలలు రాసినా, పల్లీయప్రకృతి నవలలు రాసినా, రాజకీయ నవలలు రాసినా, అవేవీ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించవు. కొత్తగా ఆలోచనలు రేకెత్తించవు. కానీ మానవసంబంధాలు, మనిషికి ప్రకృతితో, సమాజంతో ఉన్న సంబంధాలను చిత్తశుద్ధితో, వాస్తవిక దృక్పథంతో వ్యాఖ్యానిస్తాయి.
అన్నిటినీ మించి ఆమె శైలి అసాధారణమైంది. కవి కాబోయి నవలాకారిణి అయిందనిపిస్తుంది. నిజానికి ఒక విమర్శకుడు ఆమెను అలాగే అభివర్ణించాడు. ‘ఈ శతాబ్ది ఫ్రెంచి నవలాకారుల్లో జార్జ్ సాండ్ మాత్రమే అతి గొప్ప కవి’ అని. వస్తుశిల్పాల్లో యూగో, బాల్జాక్, ఫ్లొబేర్ ఖచ్చితంగా 19వ శతాబ్దిలో అత్యుత్తమ ఫ్రెంచి రచయితలే. కానీ వారి మధ్య ఏ మాత్రం తేలిపోకుండా తన ఉనికిని చాటుకున్న రచయిత్రి జార్జ్ సాండ్. ఆమె నవలల్లో కొన్నిటిని ఆనాటి నాటకరచయితలు, నాటకాలుగా మలిచి గొప్ప విజయాలు సాధించారు. తన నవలల్ని మరొకరు నాటకాలుగా మలచడంతో ఉత్తేజితురాలై, జార్జ్ సాండ్ కూడా గ్రామీణ వస్తువు నేపథ్యంగా నాటక రచన చేపట్టింది. ఆమె నాటకాలు కూడ ప్రదర్శింపబడి, ప్రజాదరణ పొందాయి.
తను జీవించివుండగా, పాఠకుల ఆదరణను నిత్యం అందుకున్న జార్జ్ సాండ్‌ని, మరణించిన తర్వాత ఒక వర్గం ఫ్రెంచి విమర్శకులు నామరూపాల్లేకుండా చెయ్యడానికి ప్రయత్నించారు. వీరి పుణ్యమాని, కొన్నేళ్ళ పాటు ఆమెను ఎవరూ తలచుకోలేదు. కానీ అదెంతో కాలం సాగలేదు. ‘ఫక్తు కాల్పనిక రచయిత అలెగ్జాండర్ డ్యూమాకు, పూర్తి వాస్తవికవాది బాల్జాక్‌కీ మధ్య వంతెన వంటి రచయిత్రి జార్జ్ సాండ్’ అని 1950ల తర్వాత విమర్శకులు అంగీకరించారు. కాల్పనిక, వాస్తవిక రచనాధోరణులను ఆమెలా సమ్మిళితం చేసినవారు మరొకరు లేరని కొందరు అంగీకరించారు. 1950ల తర్వాత జార్జ్ సాండ్ జీవితచరిత్రల రచన మొదలైంది. వాటిలో రెండు ఆంగ్లంలోకి కూడ అనువదింపబడ్డాయి. దీనితో, ఆమెపై అమెరికన్లకు ఆసక్తి పెరిగింది. 19వ శతాబ్దిలోనే వివాహవ్యవస్థ స్త్రీలకు ఊపిరాడనివ్వకుండా చేస్తుందని, అందులోంచి స్త్రీలకు విముక్తి అవసరమనీ చెప్పిన ఆమెను ఫెమినిస్టులు గౌరవించారు. అయితే రాజకీయాల విషయంలో ఆమె అభిప్రాయాలు వీరికి నచ్చలేదు. తను స్వయంగా ఏ రాజకీయ పక్షంలోనూ చేరకపోవడం, స్త్రీలకు రాజకీయ భాగస్వామ్యం అవసరంలేదని అనడం ఫెమినిస్టులకు రుచించలేదు. 21వ శతాబ్ది నాటికి ఆమె పట్ల వ్యతిరేకత ఇంకా సమసిపోలేదు. ఇప్పటికీ షొపాన్ మరణానికి ఆమె తిరస్కారమే కారణమని భావించేవాళ్ళు, అందుకు ఆమెను క్షమించలేనివారూ లేకపోలేదు. షొపాన్ సంగీతసృజన ఆమె సాంగత్యంలోనే ఉత్కృష్టమైన స్థాయిని చేరుకుందన్న వాస్తవాన్ని వీరందరూ మరచినట్లే అనిపిస్తుంది. ఇప్పటికీ విమర్శకులు ఆమెను వ్యక్తిగా క్షమించలేరు. ఆమె మంచి ప్రేమికురాలు, మంచి తల్లి, మంచి స్నేహితురాలు కాలేకపోయిందని వీళ్ళ అభిప్రాయం. ఇక స్త్రీలందరి గురించి పురుషాధిక్య ప్రవచనాలు చేసే మహానుభావుడు, ఛాల్స్ బాదలేర్ అనుయాయులైతే ఆమెను రచయిత్రిగా కూడ కొట్టిపారేస్తారు.
ఎవరేమన్నా, జార్జ్ సాండ్ తన కాలానికంటే ఎన్నో విషయాల్లో చాలా ముందున్న స్త్రీ అని అందరూ అంగీకరించక తప్పలేదు. ప్రేమగురించి ఒకసారి ఇలా అంది: Once my heart was captured, reason was shown the door, deliberately and with a sort of frantic joy. I accepted everything, I believed everything, without struggle, without suffering, without regret, without false shame. How can one blush for what one adores? ప్రేమికులందరూ అంగీకరించే ఇలాంటి ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంది జార్జ్ సాండ్. అందుకే తన జీవితంలోనూ, నవలల్లోనూ దాపరికం లేని మోహావేశమే కనిపిస్తుంది.
కానీ జీవితం సాహిత్యం కంటే గొప్పదన్న విషయాన్ని ఒక్క వాక్యంలో ఇలా చెప్పింది సాండ్.
We cannot tear out a single page of our life, but we can throw the whole book in the fire.
సాండ్ నవలలు ఎన్నో ఉన్నా (ఒక లెక్క ప్రకారం ఆమె 90 నవలలు రాసింది) అన్నిటికీ ఆంగ్లానువాదాలు లభించడంలేదు. రెండు మూడు నవలలు మాత్రమే ఇప్పటికీ అనువాదంలో లభిస్తున్నాయి. 1872 వరకూ రచనలోనూ నాటకరంగంలోనూ, సామాజిక, రాజకీయ వ్యవహారాల్లోనూ ఎంతో క్రియాశీలకంగా గడిపిన జార్జ్ సాండ్, ఆ తర్వాత నోఆఁత్‌కు వెళ్ళి స్థిరపడింది. అక్కడ తన మనమరాళ్ళ ఆలనాపాలనలో సేదదీరుతూ, 1876లో కేన్సర్ వ్యాధితో కన్నుమూసింది.
‘Don’t walk in front of me, I may not follow. Don’t walk behind me, I may not lead. There is only one happiness in life, to love and be loved’ అని ప్రకటించిన జార్జ్ సాండ్‌ని ఫ్రెంచి పాఠకులు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు.