విశ్వమహిళా నవల: 11. రష్యన్ బ్రాంటీలు

19వ శతాబ్ది రష్యన్ రచయితలు అనగానే గుర్తుకు వచ్చేవారు మేధావులైన అలెక్సాన్ద్ర్ పుష్కిన్, లియో తోల్‌స్తోయ్, ఫియదోర్ దోస్తోవ్యస్కీ, నికొలాయ్ గొగోల్, ఇవాన్ తుర్గెనేవ్… అది పెద్ద జాబితా. ఇలాంటి పేర్ల మధ్య ఒక్క రచయిత్రీ మన దృష్టికి రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, 19వ శతాబ్ది ఇంగ్లీషు నవలారచయితల్లో మాత్రం పురుషులతో పాటు, స్త్రీలు కూడా చాలామందే గుర్తుకు వస్తారు. అలాంటి వారిలో బ్రాంటీ సోదరీమణులు (ఎమిలీ, షార్లట్ బ్రాంటీ) ప్రసిద్ధులు. వీరిలాంటి సోదరీమణులే రష్యాలోనూ అదే కాలంలో ఉండేవారన్న విషయం చాలాకాలం వరకూ–ప్రపంచం సంగతి దేవుడెరుగు–రష్యన్లకే తెలీదు. వారి పేర్లు నడేజ్డ (1822-1899), సోఫియా (1824-1865) క్వొష్జిన్‌స్కాయా (Nadezhda-, Sophiya- Kvoshchinskaya).

వీళ్ళు నిజానికి ముగ్గురు అక్కచెల్లెళ్ళు. ముగ్గురూ రచనలు చేసేవారు. కానీ చిన్నమ్మాయి కంటే అక్కలిద్దరూ చాలాబాగా రాసేవారు. వీళ్ళు సామాజికంగా ఉన్నత కుటుంబానికి చెందిన వారే కాని, తండ్రి సైన్యంలో పనిచేసి పదవీవిరమణ చేశాక వారి కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడింది. కొంతకాలానికి తండ్రి మరణించాడు కూడా. కొడుకులెవరూ లేనందువల్ల ఇంటి బాధ్యత పెద్దదైన నడేజ్ద పైనే పడింది. ఈ అక్కచెల్లెళ్ళ మధ్య చాలా గాఢమైన అనుబంధం ఉండేది. ముఖ్యంగా సోఫియా, నడేజ్డల మధ్య. తండ్రి మరణానంతరం, సోఫియా మరో ఊళ్ళో ఉద్యోగం చెయ్యడానికి ప్రయత్నించింది. కానీ అందుకు ఒప్పుకోని అక్క, ఇంటిబాధ్యతలు తన నెత్తిన వేసుకుని, రకరకాల ఉద్యోగాల ద్వారా, రచనల ద్వారా ఇంటిపోషణ చేసింది. అక్కచెల్లెళ్ళిద్దరూ సృజనాత్మక రచనలే కాక, రాజకీయ, సామాజిక వ్యాసాలు కూడా రాసేవాళ్ళు. ఈ వ్యాసాలకై నడేజ్డకు పేరు కూడ వచ్చింది. వీళ్ళు ఇతర యూరోపియన్ భాషల నుంచి అనువాదాలు కూడ చేసేవారు. జాన్ స్టువర్ట్ మిల్ (J. S. Mill) ఆన్ లిబర్టీని సోఫియా రష్యన్ భాషలోకి అనువదించింది.

అయితే ఇద్దరికీ రచయితలమని చెప్పుకునే ధైర్యం లేక, తమ రచనలను మగపేర్లతో రాసేవారు. సోఫియా అయితే తన వ్యాసాలు, అనువాదాల ప్రచురణకు అభ్యంతరం చెప్పకున్నా, తన నవలలను ప్రచురించడానికి కూడా సిద్ధపడలేదు. దురదృష్టవశాత్తు సోఫియా, క్షయవ్యాధితో 41 ఏళ్ళకే మరణించింది. ఆ బాధను మరవడానికి నడేజ్డకు చాలా కాలం పట్టింది. తన తృప్తికోసం చెల్లెలి నవలల్ని మరణానంతరం ప్రచురించింది. అప్పట్నుంచే ఇద్దరి అసలు పేర్లు బయటకు వచ్చాయి. వీరిద్దరి నవలలు ఇంగ్లీషులోకి అనువదింపబడటానికి చాలా కాలం పట్టింది. నడేజ్డ నవల ది బోర్డింగ్ స్కూల్ గర్ల్‌ని కేరెన్ రోస్నెక్ 2000 లోనూ, సోఫియా నవల సిటీ ఫోక్ అండ్ కంట్రీ ఫోక్‌ని నోరా సెలిగ్‌మాన్ ఫావ్రోవ్ 2017 లోనూ ఇంగ్లీషులోకి అనువదించేవరకూ ఇతర ప్రపంచానికి ఈ రచయిత్రులతో పరిచయం కలగలేదు.

వీరిద్దరి నవలలు పరస్పరం ఏ మాత్రం పోలిక లేనివి. నడేజ్డ రాసిన ది బోర్డింగ్ స్కూల్ గర్ల్, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కుటుంబంపై ఒక ఆడపిల్ల తిరుగుబాటుకు సంబంధించిందైతే, సోఫియా రాసిన సిటీ ఫోక్ అండ్ కంట్రీ ఫోక్‌, గ్రామీణ పేదలకు నగర భూస్వాముల నుంచి ఎదురయ్యే మానసిక, సామాజిక అవహేళనను చిత్రించినది. మొదటి నవలను, అందులోని పురుషపాత్రను బట్టి చూస్తే మనోవైజ్ఞానిక నవల అనడానికి సాహసించవచ్చు. రెండోది సమకాలీన చరిత్రను వ్యాఖ్యానించిన సామాజిక నవల.

ది బోర్డింగ్ స్కూల్ గర్ల్

ది బోర్డింగ్ స్కూల్ గర్ల్ (1861) మానసిక అలజడికి లోనైన ఒక యువకుడు ఒక అమాయకురాలిని అవహేళన చేయబోయి, ఎలా ఆమె జీవితాన్నే మార్చేశాడో చెప్పే విలక్షణమైన రచన.

లొలెంకా అనే 16 ఏళ్ళ అమ్మాయి తన ఇంటి పెరట్లో పరీక్షలకు చదువుకుంటూ, పక్కింటి పెరట్లో ఊరికే తిరుగుతున్న వెరితిత్సిన్ అనే యువకుడితో సంభాషించడంతో కథ మొదలవుతుంది. లొలెంకా పేదకుటుంబానికి చెందింది. తల్లిదండ్రులు సంప్రదాయబద్ధులు. ఆరుగురు సంతానంలో పెద్దదైన లొలెంకా తెలివైంది కనక ఆమెను స్కూలు వరకూ చదివిస్తారు. అ తర్వాత పెళ్ళి చేద్దామని నిర్ణయం. తన కుటుంబ వాతావరణానికి అలవాటుపడిన లొలెంకా జీవితంలోకి, ప్రభుత్వనిషేధానికి గురై, మానసిక అలజడితో ఒంటరిగా నివసిస్తున్న వెరితిత్సిన్ ప్రవేశిస్తాడు. కంచెకు ఇటువైపు ఆమె పుస్తకం చదువుకుంటూ, ఆ అమ్మాయిని చూస్తూ అటువైపు అతను, కొంతకాలం గడుపుతారు. క్రమంగా వారి మధ్య సంభాషణ మొదలౌతుంది. ఈ పాఠ్యపుస్తకాలు, చదువులు, స్కూళ్ళు, తల్లిదండ్రుల నియమాలు, కుటుంబ సంప్రదాయాలు అన్నీ చెత్త అని అతను చెప్పడం, రోజూ అవి వింటూ లొలెంకా మనసు క్రమక్రమంగా మారడం జరుగుతాయి. నిజానికి వెరితిత్సిన్ ఆ అమ్మాయితో మాట్లాడ్డానికి కారణం అతనికి తన జీవితం బోరు కొట్టడం; భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం. తనకు పొద్దుపోక, తనను పోషించే కుటుంబం లేక, ఆ పిల్ల ప్రశాంతంగా ఉండడం చూడలేక, ఆమెపై ఈర్ష్యతో లేనిపోని కబుర్లు చెప్తాడే తప్ప అతనికి ఆమెను గానీ, స్త్రీ జాతిని గానీ ఉద్ధరించాలన్న ఆశయమేదీ లేదు. కానీ లొలెంకా సంగతి వేరు. అంతవరకూ పరాయి మగవాడితో ఆమె మాట్లాడిందే లేదు. అందులోనూ ఇంత విప్లవాత్మకమైన ఆలోచనలు చెప్పే వ్యక్తితో ఆమెకు పరిచయం కూడ ఊహకు అందనిది. అతను ఏ ఉద్దేశంతో ఆమెకు తిరుగుబాటు ఆలోచనలు కలిగించినా, ఆమె నిజంగానే తల్లిదండ్రులపై, చదువుపై తిరగబడుతుంది. అతను ఇచ్చిన పుస్తకాలు చదువుతూ, తన చదువు పాడుచేసుకుంటుంది. పరీక్షలో ఫెయిలవుతుంది. దాంతో తల్లిదండ్రులు ఇక చదివింది చాలని కట్నమిచ్చి మరీ పెళ్ళి చేయడానికి బేరసారాలు మొదలుపెడతారు. అప్పటికే అతని మాటలతో మనసు, బుద్ధి పదునెక్కిన లొలెంకా ఇంటినుంచి పారిపోతుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న విద్యావంతురాలైన ఒక అత్త దగ్గరికి చేరుతుంది.

అలా ఎనిమిదేళ్ళు గడుస్తాయి. రెండో భాగంలో లొలెంకా ఒక ధీమంతురాలైన యువతిగా దర్శనమిస్తుంది. ఇప్పుడు ఆమె పేరు ఎలీనా. లొలెంకా కాదు. ఆమె బహుభాషలు నేర్చుకుంది; చిత్రలేఖనంలో ప్రావీణ్యం సాధించింది. మ్యూజియంలోని చిత్రాల నకళ్ళను తయారుచేసి అమ్మే ఉద్యోగం సంపాదించింది. ధైర్యంగా, స్వావలంబనతో, ఆనందంగా జీవిస్తూంటుంది. అప్పుడు మళ్ళీ ఆమెకు ఒకరోజు తటస్థపడతాడు వెరితిత్సిన్. అతనితో ప్రేరణ పొందిన ఆమె జీవితం చాలా మారింది. అతను ఇంకా అలాగే ఉన్నాడు. ప్రభుత్వాధికారులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఎదుగూబొదుగూ లేని జీవితం. ఇప్పటికీ ఎవరు ఆనందంగా ఉన్నా సహించలేని తనం. లొలెంకా వృద్ధిని, సుఖమయ జీవితాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. నిజానికి అతనిచ్చిన ఆలోచనలు, చైతన్యం వల్లే ఆమె అలా మారిందని అతనికి తెలిసేవుండాలి. కానీ ఎవరి ఆనందాన్నీ సహించలేని విచిత్రమైన మనస్తత్వం ఉన్న అతను ఆ అమ్మాయిని చూసి మండిపడతాడు. మళ్ళీ బోధ మొదలుపెడతాడు. ఎనిమిదేళ్ళ క్రితం తను చెప్పినదానికీ ఇప్పటి ఉపదేశానికీ ఏ పోలికా ఉండదు. ‘ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, ఇంటిని చూసుకోవడంలోనే వాళ్ళ జీవితం సార్థకమౌతుంది కానీ ఇలా ఉద్యోగాలు చేస్తూ, ఒంటరిగా ఉండడం వల్ల కాద’ని ఆమెకు కొత్తరకమైన ఉపన్యాసాలు మొదలుపెడ్తాడు. కానీ తొలి పరిచయంలో అతని మాటలకు ముగ్ధురాలైన లొలెంకా వేరు; ఇప్పుడు స్వావలంబనను అలవరచుకున్న ఎలీనా వేరు. ఇతరుల మాటలకు లొంగే అమాయకత్వాన్ని ఎప్పుడో అధిగమించింది. అతని మాటలు విని ఊరుకుంటుంది. తన స్వేచ్ఛామయ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇంతకూ ఆమె నిర్ణయం సరైనదా కాదా, కుటుంబాన్ని వదిలేసుకున్న ఆ అమ్మాయి తర్వాత ఎలా జీవించింది? అన్న విషయాలు రచయిత్రి చర్చించదు. వెరితిత్సిన్, లొలెంకా పాత్రల చిత్రణలో రచయిత్రి చూపిన ప్రతిభ అసాధారణమైంది. మొదట్లో ఆ పిల్లకు రోమియో & జూలియట్ బహూకరించినప్పుడు, అతను బహుశా ఆమెతో ప్రేమాయణం జరపాలనుకున్నాడేమో అని పాఠకులకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆరోజుల్లో అన్ని భాషల్లోనూ స్త్రీల రచనల్లో ఎక్కువభాగం ప్రేమకథలే ఉండేవి. కానీ ఈ నవలలో కాగడాపెట్టి వెతికినా ప్రణయం కనిపించదు. యుక్తవయస్కురాలై, ప్రపంచమంటే తెలీని లొలెంకా అతని మాటలతో ఉత్తేజితురాలవుతుంది; ఆత్మావలోకనం చేసుకుంటుంది; తన జీవనమార్గాన్ని, గమ్యాన్ని తనే నిర్ణయించుకుంటుంది. అంతే తప్ప అతని ఆకర్షణలో పడదు. కానీ ఐరనీ ఏమిటంటే, తను చెప్పిన ఆ విప్లవాత్మక ఆలోచనను అతను ఏనాడూ ఆచరించలేదు. అందుకే అలాగే నిస్తబ్దంగా ఉండిపోయాడు. దోస్తోవ్యస్కీ నవలల్ని మనోవైజ్ఞానిక నవలలుగా పరిగణించి, అధ్యయనం చేసిన రష్యన్ విమర్శకులు ఈ నవలపై క్రీగంటి చూపు కూడ ప్రసరింపజేయలేదు కనక ఈ నవలలోని పాత్రల మానసిక విశ్లేషణ ఇంతవరకూ అకడమిక్‌గా జరగలేదు. 2000లో ఇంగ్లీషు అనువాదం వచ్చాకే ఈ నవలపై కొంతైనా విమర్శ, అది కూడ మహిళావిమర్శకుల నుంచి మొదలయింది.

సిటీ ఫోక్ అండ్ కంట్రీ ఫోక్

రెండో నవల చెల్లెలు సోఫియా రాసిన సిటీ ఫోక్ అండ్ కంట్రీ ఫోక్ ఒక సునిశిత హాస్యంతో కూడిన సామాజిక వ్యాఖ్యానం. ఆలస్యంగా గుర్తింపు వచ్చినా రష్యన్ మహిళల నవలల్లో అగ్రస్థానంలో నిలిచిన రచన ఇది. ఒకరకంగా బ్రిటిష్ నవలల్లో జేన్ ఆస్టిన్ అద్భుతంగా మలచిన కామెడీ ఆఫ్ మేనర్స్ తరహా రచనే ఇందులోనూ కనిపిస్తుంది. కానీ దానితోపాటే అప్పటి రష్యా రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై విసుర్లూ ఉంటాయి. 1861లో రష్యాప్రభువు రెండో అలెగ్జాండర్ బానిసత్వాన్ని రద్దు చేశాడు. ‘It is better to abolish serfdom from above than to wait until the serfs begin to liberate themselves from below.’ అని తెలివిగా ప్రకటించిన రాజు అతను (1855-1881 వరకు పరిపాలించాడు). కనక అప్పుడప్పుడే ఆ వర్గానికి చెందినవారికి చదువుకునే అవకాశాలు, గౌరవప్రదమైన ఉద్యోగాలు వెతుక్కునే అవకాశాలు పెరిగాయి. అప్పటివరకూ వారిచేత పనులు చేయించుకున్న వర్గాలు రెండు: బతికి చెడ్డ ఉన్నత వంశస్తులు, సంపన్నులైన భూస్వాములు. వీరు ఈ బానిసత్వపు రద్దును ఎలా పరిగణించారన్నది నవలలో కనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా నగరాల్లో నివసిస్తూ, ఉబుసుపోకకు గ్రామాలకు వచ్చి తమ భూములను చూసివెళ్ళే ధనికులు, ఆ పల్లెల్లో, చాలీచాలని ఆదాయంతో, కేవలం పరువు ప్రతిష్టలే సంపదగా బతుకుతున్న మధ్యతరగతివారిని ఎలా శాసించారన్నది నవలలో ప్రధాన విషయం.

బానిసత్వ రద్దు చట్టం ప్రకారం, అలా విముక్తమైన బానిసలకు పనులు కల్పించడం, వారి ద్వారా పని చేయించుకోలేకపోతున్న భూస్వాములకు పరిహారం చెల్లించడం – ఇవి రెండూ ప్రభుత్వం చేయాల్సిన పనులే. కానీ సదుద్దేశంతో బానిసత్వాన్ని రద్దుచేసిన ప్రభుత్వం, ఈ విషయాలపై శ్రద్ధపెట్టకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. గ్రామాల్లో ఈ రద్దును పెద్దగా పట్టించుకోని మధ్యతరగతి భూస్వాములు (వీరు ఉన్నతవంశీయులే కానీ సంపన్నులు కారు) అలవాటుకొద్దీ పరిచారికలను పెట్టుకుని, వారిని కుటుంబసభ్యులుగానే చూసుకుంటూ వాళ్ళచేత పనులు చేయించుకుంటారు. కానీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆర్థిక విధానాల వల్ల వీరికి ఆదాయం పెరిగే మార్గం లేదు. అటు నగరాల్లో ఉన్న సంపన్నులైన భూస్వాములు తమకు బానిసలు లేక, ప్రభుత్వం పరిహారమూ ఇవ్వక నష్టపోతున్నామనే దుగ్ధతో అందరిమీదా కసి పెంచుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ రైతుల మీద. అటు తాము అంతవరకూ అనుభవించిన హోదాలూ వదలుకోలేరు. ఇటు తమ పనులు చేసుకోవడమూ చేతకాదు. ఇవన్నీ కలిసి ఒక అసంతృప్తితో కూడిన జీవితం వారిది. అటువంటి నగరసంపన్నులు, పల్లెలో, పరిచారికలను ప్రేమగా చూసుకుంటూ, వారి గౌరవాన్ని పొందుతున్న ఒక తల్లీకూతుళ్ళ కుటుంబాన్ని మానసికంగా వేధించడం ఇందులోని విషయం. రచనలో గొప్పతనం ఎక్కడుందంటే నగర ప్రాణులు, ఈ పల్లెవాళ్ళను వేధిస్తున్నట్టు రచయిత్రి తనంతటతాను ఎక్కడా చెప్పకపోవడం. సంపన్నులను ప్రతిబింబించే మూడు పాత్రలూ -ఎరాస్త్, ఆనా, కేటరీనా- తాము ఈ పేద తల్లీకూతుళ్ళను ఉద్ధరిస్తున్నామనీ, వారికి తమవల్లే మనుగడ సాధ్యమనీ పూర్తిగా విశ్వసించడం. ఒక లేఖలో ఎరాస్త్ అంటాడు కూడా: ‘ఇక మన సంపన్నులూ, ఉన్నతవంశజుల రోజులు ముగిశాయి. మనం అంతరించిపోతాం. భవిష్యత్తు అంతా ఈ గ్రామీణ భూస్వాములదీ; సామాన్యులదే. వాళ్ళకు సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలీదు కనక మనం చెప్దాం. నేర్పిద్దాం. వారికి ‘సోఫిస్టికేషన్’ అలవరచాల్సింది మనమే!’ అని డంబాలు పలుకుతాడు. అలా వాళ్ళకు నేర్పించే నెపంతో వాళ్ళ జీవితాల్లో నిరంతరజోక్యం కల్పించుకుంటారు.

ఈ క్రమంలో తల్లి నతాస్యా, కూతురు ఒలెంకాల జీవితంలో అలజడి మొదలవుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ తల్లీకూతుళ్ళ మధ్య వీళ్ళ వల్ల కొన్ని విభేదాలు కూడ వస్తాయి. ఎందుకంటే మొదట్లో తల్లి నతాస్యా కూడ నిజంగా ఈ సంపన్నులు తమకు మేలు చేస్తున్నారనే అనుకుంటుంది. వాళ్ళ పట్ల అత్యంత వినయంగా ఉంటుంది. కానీ పదిహేడేళ్ళ ఒలెంకా అసలు సిసలు కొత్తతరం యువతి. వాళ్ళది సహకారం కాదని, అధికారంతో కూడిన జోక్యమనీ ఆ అమ్మాయి అతితొందరగానే గ్రహిస్తుంది. ఆ జోక్యం నుంచి బయటపడాలంటే తాము తిరగబడాలని, మా మంచి మాకు తెలుసునని వారికి ఢంకా బజాయించి చెప్పాలనీ తల్లీ కూతుళ్ళు నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.

నలభయ్యోపడిలో ఉన్న భూస్వామి, ఎరాస్త్ సెర్గెయవిచ్, ఆరోగ్యం కోసం వైద్యుల సలహాపై స్నేత్కీ అనే పల్లెకు వస్తాడు. అతను ఈ తల్లీకూతుళ్ళ ఇంటి ఆవరణలోని బేతింగ్ హౌస్‌లో నివాసం ఏర్పరచుకోవడంతో నవల మొదలవుతుంది. వచ్చినప్పటినుంచీ వాళ్ళను నాగరీకులను చెయ్యడానికి కంకణం కట్టుకుంటాడు అతను. తన కూతురు వయసున్న ఒలెంకా పట్ల ఆకర్షితుడౌతాడు. ఇద్దరూ ఒకరోజు నడుస్తూండగా, చిన్న కాలవ వచ్చేసరికి ఆమెను ఎత్తుకుని దాటడానికి ప్రయత్నిస్తాడు. ఒలెంకా అతన్ని ఎగాదిగా చూస్తుంది. ‘ఇంకా చెప్తే నేనే మిమ్మల్ని మోసుకుని కాలవ దాటగలను. ఎంత అర్భకంగా ఉన్నారో!’ అంటుంది. ఆ తొలి సన్నివేశంలోనే ఒలెంకా స్వభావం మనకు అర్థమయ్యేలా చేస్తుంది రచయిత్రి.

మొత్తంగా ఈ నవలలో – మతం, దెయ్యాలు పూనడం, భవిష్యత్ చెప్పగలగడం వంటివాటితో అందర్నీ మభ్యపెట్టే ఆనా ఇలినిష్నా, ప్రపంచంలోని ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటరీనా పెత్రోవ్నా, పల్లెవాసులందరినీ ‘నాగరీకులుగా’ చెయ్యదలుచుకున్న ఎరాస్త్ సెర్గెయవిచ్, వారి మాయలోపడి ఎప్పుడూ ఆందోళనలో ఉండే తల్లి నతాస్యా, వాళ్ళ నిజస్వరూపాన్ని ముందే గుర్తించిన నతాస్యా కూతురు ఒలెంకా, –ఈ మొత్తం క్రమంలో తమకు అనుకూలంగా ఉన్నవాళ్ళ పక్షం వహించే తెలివైన పనివాళ్ళు– వీరే పాత్రలు; వీళ్ళ మధ్య జరిగే సన్నివేశాలే ఈ నవల. నవల చివర్లో ఒలెంకాకు బలవంతంగా ఆమెకు ఏ మాత్రం నచ్చని యువకుడితో కేటరీనా, సర్గెయవిచ్‌లు కలిసి వివాహం నిశ్చయించినపుడు, అంతవరకూ వారికి విధేయంగా ఉన్న తల్లిలో వచ్చిన మార్పు గొప్ప ముగింపు. కూతురు ఎప్పుడూ తిరగబడుతూనే ఉంది. కానీ సంప్రదాయాన్ని గౌరవించడం, తనకంటే సాంఘికహోదాలో ఎక్కువ స్థానం ఉన్న కుటుంబాలకు వంగి వంగి సలాములు చేయడం అలవాటైపోయిన నతాస్యా మారడమే చక్కని మలుపు. తల్లీకూతుళ్ళు ఇద్దరూ కలిసి తక్కిన ముగ్గుర్నీ ఇంటి నుంచి తరిమేసే ఆఖరి సన్నివేశం చదువుతూంటే లేచి నిలబడి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది.

నవలలో ఎక్కడా ఒక ఆదర్శం, ఒక తిరుగుబాటు జరుగుతున్న సూచనలుండవు. చాలా సాఫీగా నడుస్తుంది కథ. ఒక మామూలు కుటుంబగాథగా, సునిశితమైన హాస్యనవలగా కనిపిస్తూ, ఒక చరిత్రాత్మకమైన సామాజిక పరిణామాన్ని సూచించిన గొప్ప నవల ఇది. ఒక రష్యన్ విమర్శకురాలు అన్నట్టు ’19వ శతాబ్ది రష్యన్ సాహిత్యవిమర్శకుల అభిప్రాయంలో, స్త్రీల చిత్రణ రెండే రకాలుగా ఉండాలి; ఉంటుంది కూడా. అయితే సాధ్వి, లేదా పతిత.’ స్త్రీల పాత్ర చిత్రణ ఇంతకంటే విశేషంగా ఉండనక్కర్లేదని ఆనాటి విమర్శకులు భావించేవారట. కానీ అదే శతాబ్దిలో వచ్చిన ఈ రెండు నవలల్లోనూ ఆ రెండు రకాల పాత్రలూ లేవు. ఏ మూసలోనూ ఒదిగిపోకుండా, స్వాభావికంగా, చైతన్యవంతంగా ఉండే స్త్రీలనే ఈ అక్కచెల్లెళ్ళు సృష్టించారు.

ఒక్క స్త్రీపాత్ర చిత్రణే కాదు. సిటీ ఫోక్ అండ్ ది కంట్రీ ఫోక్‍లో ఒక్కొక్క పాత్ర వ్యక్తిత్వాన్ని సోఫియా వ్యాఖ్యానించిన వైనం అద్భుతం. కథలో ప్రధాన పురుష పాత్ర ఎరాస్త్ గురించి అంటుంది: Nowhere did he leave a strong impression; he was easily liked and easily forgotten. With women, in love and hate, he played only an incidental role; among serious people his presence brought on a slight sense of boredom; and through his entire life he had failed to attain a single devoted friend. ‘అతను గదిలో ఉన్నంత సేపు అందరూ బాగానే మాట్లాడతారు. బయటకు వెళ్ళాక ఎవ్వరికీ అతను గుర్తుకు కూడ రాడ’ని అంటుంది మరో సందర్భంలో. కానీ తను పురప్రముఖుడినని, తనని ఎవ్వరూ నిరాకరించలేరని, 17 ఏళ్ళ ఒలెంకా కూడ తన ప్రేమకు తపిస్తోందనీ మభ్యపెట్టుకునే వెర్రి వెంగళప్ప అతను. ఇంతాచేసి, అతను దుర్మార్గుడేమీ కాదు. సమాజంలో తనకు ఇష్టం లేని పరిణామాలు వస్తున్నా అంగీకరించగల వివేకం కూడ ఉంది. మంచి రచయిత. తన అవసరాలకోసం ఇంకొకర్ని ఇబ్బంది పెట్టడు. చేయించుకున్న పనికి వెంటనే డబ్బులు చెల్లిస్తాడు. ఇలాంటి మంచి అలవాట్లున్నవాడే. కానీ దానికి తగ్గ లోపాలూ ఉన్నాయి. ఇలాంటి సహజమైన పాత్రలు, ఎంతో సరళంగా ఉంటూ, లోతైన అర్థం సూచించే సంభాషణలు ఈ నవలను ఒక మంచి నవలగా తీర్చిదిద్దాయి.

అన్నిటికంటే విశేషం ఈ రెండు నవలలూ ఆనాటి ఇతర భాషల్లోని స్త్రీల నవలల్లా ప్రణయం వస్తువుగా ఉన్నవి కావు. రెండిటిలోనూ అసలు ప్రేమ ప్రసక్తే లేదు. జీవన వాస్తవికత మాత్రమే ఉంది. ఆడవాళ్ళంటే ప్రేమగాథలే రాస్తారన్న అభిప్రాయానికి ఈ అక్కచెల్లెళ్ళు అపవాదమే. ఈ నవలలో స్త్రీల సామాజిక ప్రతిపత్తిని గురించిన చర్చలు అక్కడక్కడా జరుగుతాయి. ‘Reason and judgment are our domain—while yours is humble faith.’ అంటాడు స్త్రీజనోద్ధారకుడిగా ప్రకటించుకున్న ఎరాస్త్ సెర్గెయవిచ్. ‘ఒకనాటి స్త్రీల మూర్ఖత్వమే వారి సౌందర్యంగా ఉండేది; ఇప్పటి స్త్రీలలో ఆ మూర్ఖత్వం లోపించేసరికి ఆ అందం కూడ పోయిందని’ వాపోతాడు. తనతో ఢీ అంటే ఢీ అని మాట్లాడే ఒలెంకాను మాటల్లో గెలవలేక, మగవాడిగా తన శారీరక బలాన్ని చూపించడానికి దిగజారిపోయి, ఇద్దరూ గుర్రంబండిలో వెళ్తూండగా కౌగలించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆమె ఒక్క తోపు తోసేసరికి దిమ్మదిరిగి, తెలివిలోకి వస్తాడు. అప్పటినుంచి ఆమెకు కేటరీనా ‘ఆశ్రయంలో’ ఉన్న సైమన్ అనే ఒక తలమాసినవాడితో పెళ్ళి చెయ్యడానికి పూనుకుంటాడు.

ఆనాటి రష్యన్ సమాజంలో స్త్రీల ప్రతిపత్తి గురించి నడేజ్డ నవలలో నర్మగర్భంగానూ, సోఫియా నవలలో ప్రత్యక్షంగానూ వ్యాఖ్యానాలున్నాయి. కానీ వ్యాఖ్యానాల కంటే విలువైనది కథావస్తువు. ఈ రెండు నవలల్లోనూ మనకు కనిపించే కథానాయికలు ప్రేమ, పెళ్ళి పట్ల అసలు ఏ మాత్రం ఆసక్తిలేనివారే. ఎంతో గొప్ప నవలలు రాసిన జేన్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంటీ, షార్లెట్ బ్రాంటీ, జార్జి ఎలియట్, ఎలిజబెత్ గాస్కెల్ వంటివారు ప్రణయానికి తమ నవలల్లో పెద్దపీట వేశారు. కానీ ఈ రష్యన్ అక్కచెల్లెళ్ళు మాత్రం సమాజంలో తమ స్థానానికీ, ఎదుగుదలకూ పోరాడే స్త్రీ పాత్రలనే సృష్టించారు తప్ప ప్రణయమనే కోణాన్ని ఎక్కడా చూపించలేదు. ఆ రకంగా చూస్తే, మహిళల నవలల్లోనే ఇవి రెండూ చాలా ప్రత్యేకమైన నవలలు.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...