ఊహల ఊట 1

బళ్ళోంచి వచ్చీరావడం పుస్తకాల్ని డస్కుపెట్టెలో పడేశా. పొడుగు గౌను తొడిగేశా. నా పొడుగ్గౌనుకి రెండువేపులా జేబులు ఉంటాయి. అమ్మ యిచ్చిన చేగోడీలని రెండు జేబుల్లో కుక్కేసుకొని వీధి చీడీగోడ గుర్రం ఎక్కా. అమ్మ చేసిన చేగోడీలు నూనెకారుతూ ఉండవు.

అదేంటో, నాగమణివాళ్ళమ్మ చేస్తుందా, అంతా నూనే! చేతులకీ మూతికీ నోరంతా నూనే! జేబులో ఏం పెట్టుకుంటాం? వాళ్ళమ్మకి ఏదీ రాదు.

నాగమణి వస్తే బాగుణ్ణు. చేగోడీ నములుతూ గేటు వేపు చూశా.

నాగమణికి పొడుగ్గౌనులు లేవు. వాళ్ళ నాన్న కుట్టించలేదుట. ఎలా అడిగితే కుట్టిస్తారో అలా అడగాలి. దానికి ఎలా అడగాలో తెలీదు పాపం!

‘నీ లాల్చీకి ఉన్నట్టు నాకూ పెద్ద జేబులున్న గౌను కుట్టించూ’ అన్నాను మా నాన్నతో.

‘నీ గౌనుకీ జేబు ఉందిగా!’

‘అదేం జేబూ? చెయ్యే దూరదు.’

‘చిన్న గౌనుకి చిన్న జేబే ఉంటుంది మరి.’

‘నీ లాల్చీలా పొడుగ్గా నాకూ కుట్టించు పెద్ద గౌను రెండువేపులా రెండు జేబులతో! మొగాళ్ళకేనేంటి పెద్ద జేబులూ పెద్ద లాగులూను! మొగాళ్ళకి మూడేసి జేబులు. లాక్కి రెండూ చొక్కాకొకటీనూ!’

‘మొగాళ్ళకి పెట్టుకోడానికి మరి చాలా ఉంటాయి కదా! కాయితాలు, ఉత్తరాలు, రూపాయి నోట్లు, పెన్నూ, డబ్బులు.’

‘మాకూ ఉంటాయి బోల్డు. పలకపుల్లలు, పెన్సిలు, రంగు గోళీలు, పిప్పర్‌మెంట్లు, బల్లి గుడ్లు.’

‘మాటకి మాటా ఠకీమని అంటుంది. నీ నోట్లోంచేగా ఊడిపడ్డాది. పట్టుపట్టిందంటే ఇంకొదలదు. ఆ పొడుగ్గౌనులోరెండు పెద్ద జేబులతో కుట్టించీ.’ అంది బామ్మ.

అదీ సంగతి! మాటకి మాటా అంటాన్ట! ఏంటో, ఎదురుగా కనబడుతున్నవే కదా నే చెప్పినవీ!

ఏదడిగినా అడ్డదిడ్డం ప్రశ్నలు అడక్కు అంటారు. ప్రశ్నలు అడ్డదిడ్డంగా ఉంటాయా? ప్రశ్నార్థకం కొక్కెంలా ఉంటుంది. అడ్డంగా ఉండదు. ప్రశ్నార్థకాన్ని తిరగేసి తాడుకట్టి మీదకి లాగితే జవాబు వస్తుంది. భలే భలే! నూతిలో గేలంకొక్కేనికి బాల్చీ తగిలి వచ్చేసినట్టు!

మరే, ఆవేళ బాల్చీ నూతిలో పడిపోయిందని ఒహటే గోల! నెత్తీనోరూ మొత్తుకుంది బామ్మ. తనే పడేసింది. చెయ్యిజారిపోయిందిట.

‘నుయ్యిలో నుయ్యుందిరా! లోతు ఎక్కువ. నీళ్ళా నిండా ఉన్నాయి. గేలానికి తగలదు. మరో బాల్చీ కొనాల్సిందే.’ అని లబోదిబోమంటూ ఒహటే గోల.

‘అటక మీద పందిరిగేలం ఓటి ఉంది. నే తీస్తాలే. దాంతో గాలిస్తే తగుల్తుంది. తాడుతో పడిపోయింది అన్నావు కదా! తాడు తగుల్తుంది. కొత్తదేం కొనక్కర్లేదులే!’ అన్నాడు నాన్న.

ఆవేళ చూశా పందిరిగేలం. పందిరికి పాదుకాయలు వేళ్ళాడినట్టు ఎన్నో కొక్కేలు వేళ్ళాడుతున్నాయి!

ఎంచక్కా ప్రశ్నలన్నిటినీ తిరగేసి పందిరి కొక్కేలతో బుర్రనూతిని గాలిస్తే కొక్కేలకి తగులుకొని జవాబులు వచ్చేస్తాయి. నాగమణి బుర్రనుయ్యి ఎంత లోతో ఏంపాడో, దాని కొక్కేనికి ఒక్క జవాబూ తగలదు!

నాకైతే తిరగీసిన ప్రశ్నార్థకాల పందిరి గేలం అక్కరలేదు. మూడు కొక్కేల గేలం కూడా అక్కరలేదు. ఒక్క కొక్కేం ఉన్నా నా బుర్రనూతిలో పడీపడ్డం జవాబు నా నోట ఊడిపడుతుంది ఠక్కని!

నాగమణిని మొద్దురాచ్చిప్ప అని పాపం వెక్కిరిస్తారు బళ్ళో. మొద్దు అయితేనేం మంచిపిల్ల. ఆ కామేశ్వరీ ఉంది, ఎంత గీరో, అన్నీ గొప్పలే! నాతో జతకట్టాలని చూస్తోంది. దాని గొప్పలూ డాబులూ బడాయిలు నేనెందుకు వింటానూ? ఒక్క నాగమణితోనే మాటాడతా. అదంటే నాకు జాలి. నిజానికి నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటా. అన్నీ నాతోనే నేను చెప్పుకుంటూ ఉంటా.

ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్ళి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు! మళ్ళా నా బుర్రలోకి రాదు. ఎగిరిపోయిందాన్ని పట్టుకోడం ఎలా? దొరకదు కదా! అమ్మని వెళ్ళి అడిగితే ‘పోవే, నువ్వూ నీ పిచ్చి ఊహలూనూ’ అంటుంది.

ఊహంటే ఏమిటీ అని అడిగితే ఊహ అంటే అంటే అంటూ ఉండిపోయింది అమ్మ. ఇంక పిచ్చి ఊహ ఏదో మంచి ఊహ ఏదో ఏం చెప్తుందీ!

ఒక్క పరుగులో నాన్న దగ్గరికి వెళ్ళి గబగబా అడిగేస్తా. పాపం నాన్న ఎంత పనిలో ఉన్నా చెప్తాడు.

ఊహ అంటే మనం ఏంటి అనుకుంటున్నామో అదన్నమాట! అన్నీ మంచి ఊహలేనుట నావి! పిచ్చివి కావుట! నాన్న చెప్పేడు. తెలివైన మంచి పిల్లలకి మంచి ఊహలే వస్తాయిట!

నేనే నయం. నాతో నేను లోపల మాటాడుకుంటాను. ఎవరి చెవినీ పడవు. నే చెపితే తప్ప! బామ్మ భలేది! అందరితోనూ ఎలా మాటాడుతుందో కుక్కలతోనూ కాకులతోనూ అలాగే మాటాడుతుంది.

‘పెరటి తలుపు గడియపెట్టి చావరూ! కుక్క రాదా? దాందా తప్పు? వెధవకానా, తిరగవే తిరుగు. ఫో ఫో, నీ మొహం మండా! నీ నెత్తి వాయించా! తిరుగూ తిరుగూ,’ అంటుంది. తిరగమంటే కుక్కకి ఎక్కడన్నా తెలుస్తుందా? నెత్తివాయించకుండా ఫో ఫో వెధవకానా అంటే అది పోతుందా?

‘వెధవముండా కాకులు! హుష్షు! హుష్షు! ఏబ్రాసివాళ్ళలా మెట్లమీద పడేశావ్ ఎంగిలికంచాలు! వంటింటి గడపమీద కూచుంది. ఎగురూ, ఎగురూ, ఎగరవే ఎగురూ!’ అంటుంది.

నవ్వొస్తుందా రాదా? నవ్వితే బామ్మకి కోపం రాదు. తనూ నవ్వేస్తుంది!

అన్నట్టు రేపు బామ్మతో గుడికి వెళ్ళాలి కదా!

పాపం గర్భగుడిలో చీకటే చీకటి! దేవుడు చీకట్లోనే ఉంటాడు. తను చీకట్లో ఉంటూ మనకి వెలుగునిస్తాడట! వెలుగుంటేనే కదా అన్నీ కనబడతాయి, చీకట్లో ఏం కనబడతాయి? ఏం తెలుస్తాయి? సెమ్మాలో నూని ఒత్తి వెలుగు అటూ ఇటూ కదులుతూ ఉంటే గమ్మత్తుగా పువ్వుల మధ్యలోంచి దేవుడు నల్లగా కనబడతాడు! వెలుగు అంటే తెలివి. చీకటి అంటే ఏదీ తెలియకపోవడం!

‘ఏడిసేవ్, నీ తెలివి తెల్లారినట్టే ఉంది.’ అంటుంది అమ్మ.

తెలివి తెల్లారితే ఇంకా తెల్లగా ఉండాలి మరి! తెల్లారితే అంతా తెల్లగానే ఉంటుంది కదా! అందుకే పెద్దవాళ్ళు నాకు బోధపడిచావరు! చావరు అనకూడదు అనుకో, కాని ఆమాటా వాళ్ళన్నమాటే!

‘ఎంత చెప్పినా వాడికి బోధపడి చావదూ!’ అంటుంది బామ్మ.

తెలివి ఉంటే బోధపడుతుంది. నాగమణికి ఏదీ బోధపడిచావదు. అదో మొద్దురాచ్చిప్ప. దానిలోంచి ఏదీ ఊరదు. మనమే రాచ్చిప్పలో బెల్లమావకాయ ఊట పొయ్యాలి. నాకో? ఊహలు బెల్లమావకాయ ఊటలా ఊరుతున్నాయి. ఎటొచ్చీ ఒక్కో ఊహ గభాలున నా బుర్రలోంచి మరో బుర్రలోకి ఎగిరిపోతూ ఉంటుంది. ఇంకో ఊహ దాన్ని తోసుకువచ్చేస్తే పాపం అది ఎగిరిపోక ఏంచేస్తుందీ??

నాగమణి ఇవాళ రాదు కాబోలు. రోజూ వస్తుంది. ఈరోజు రాలేదు. వాళ్ళమ్మ పొద్దున్నే వచ్చింది. కాఫీ పౌడరు కోసం బామ్మతో బాదరాబందీ చెప్పుకోడం ఆవిడకి అలవాటే.

బళ్ళోకి వెళ్ళే హడావిడిలో విన్లేదు కాని, బామ్మ చాలా గట్టిగా మాట్లాడుతుందిగా! వద్దనుకున్నా, మనం వేరే ఏదో పనిలో ఉన్నా చెవిలో ఆవిడ మాటలు పడితీరతాయి!

‘పోనిద్దూ రవణమ్మా! తప్పిపోయిందో బతికిపోయారు! మనపిల్ల అదృష్టవంతురాలు. లేపోతే ఆ రొంపిలో పడి కొట్టుకునేదీ’ అన్నాది!

ఏమిటో అది? నాగమణి వస్తే అడుగుదామనుకున్నా. బళ్ళో ఇలాంటివి అడక్కూడదు. అసలే దాన్ని అందరూ వెక్కిరిస్తూ ఉంటారు! బళ్ళోంచి వచ్చేక బామ్మనడగొచ్చు కాని అడిగేమే అనుకో, ఆ వెంటనే ‘అన్నీ చెవులో పోసుకుంటావ్, పెద్దవాళ్ళ భోగట్టాలు నీకెందుకే భడవా!’ అని కసురుతుంది.

అన్నీ చెవులో పోసుకుంటానట! నేను ఏదీ పోసుకోను. అవే వచ్చి నా చెవిలో పడతాయి. మాటలు నీళ్ళా పాలా? పోసుకోడానికి? మాటలు గట్టిగా ముక్కల్లా ఉంటాయని నాకనిపిస్తుంది. మాటలు కంటికి కనిపించవు. కనిపిస్తే నీళ్ళో పాలో ముక్కలో తెలుస్తుంది. ద్రవపదార్థం, ఘన పదార్థం అనాలి. టీచరు అలా చెప్పింది. అమ్మో! ఆవిణ్ణి ఇలాంటివి అసలు అడక్కూడదు! చెప్పదు సరికదా, క్లాసులో పిల్లలందరి ముందరా ఏమిటా పిచ్చి ప్రశ్నలు అంటుంది అమ్మలా! అందరూ నాన్నలా కాదు నా ఊహల ప్రశ్నకి జవాబు చెప్పడానికి! మాటలు కాయితం మీదా పలక మీదా కనబడతాయి. సరే పోనీ ద్రవపదార్థమే అనుకుందాం. అయితే ఎవరన్నా చెవుల్లో ద్రవపదార్థాన్ని పోసుకుంటారా? తాగాలంటే నోట్లో పోసుకుంటారు కాని? అవునా?

‘ఆవిడకి ఆ ముక్క చెప్పలేకపోయారూ?’ సాగదీస్తూ అమ్మ బామ్మతో అంటుంది.

ముక్క అంటే మాటల ముక్కన్నమాట! మాటల ముక్కలు జారుగా పోసుకునేటట్టు ఉండవుగా! గట్టిగానే ఉంటాయి!

అది కాదు బామ్మా అంటూ దీన్నే చెబ్దామనుకుంటే ‘గడుగ్గాయి గుంటా!’ అంటుంది.

అది తిట్టడం కాదు. ముద్దుగా అండం! నేను భలే తెలివైనదాన్నని దాని అర్థం!

ఈ పెద్దవాళ్ళు ఏదీ తిన్నగా చెప్పరు. అంతా తిరకాసు వ్యవహారం. ఈ మాటా నాది కాదు. బామ్మదే! అస్తస్తమానం ఎవరిగురించో ఒహరిగురించి వాడిదంతా తిరకాసు వ్యవహారం అంటుంది. అంటే ఏమిటి అని మరి అడక్కూడదు. అడిగితే ఏముందీ? మళ్ళీ పోవే భడవా! గడుగ్గాయి గుంటా! అంటుంది.

జేబుల్లో చెయ్యిపెట్టా. చేగోడీలు అయిపోయాయి. ఊహల్లో చేగోడీలు చేతిలోకి రావడం, నోట్లోకి వెళ్ళడం, నవలడం, పొట్టలోకి జారిపోవడం తెలీలేదు! ఒక ధ్యాసలో ఉంటే రెండోది తెలియే తెలీదు!

‘ఏ లోకంలో ఉన్నావ్? చీకటిపడిపోయింది. ఇంట్లోకి రా!’ అమ్మ కేకేసింది.

అందరూ ఎవరి లోకాల్లో వాళ్ళు ఉంటారు! నా లోకంలో నే ఉంటా. అదో పిచ్చిమాలోకం అంటారు. ఈ పిచ్చి మంచి పిచ్చేనట! నాన్న అందరినీ దెబ్బలాడుతూ నన్ను మెచ్చుకుంటూ ఉంటాడు!

నా పిచ్చి నాకానందం!