ఏవో మాటలు కొన్ని

నవ్వే బొమ్మ

ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది. ఇంకో రెండ్రోజులు ఉండనియ్యండని అడిగితే నర్స్ రీడింగ్స్ రాసుకుని ఏం మాట్లాడకుండా టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది.

నిజం

అబద్ధం ఏం లేదు. ఇష్టం ఇష్టమే.

“ఒకసారి మాట్లాడాలనుంది. మరీ ప్రాణావసరమైతే తప్ప ఊరికూరికే అడగను.”

ఒకటే బ్లూ టిక్ కనపడుతుంది. మెసేజ్ కావాలనే చూడబడదు. ఎవరి ఇరుకిరుకు జీవితాలు వాళ్ళవి.

పట్టనట్లుండటం ఎలాగో అందరికీ పట్టుపడదు.

రావాల్సిన టైమ్‌కి ఫోన్ రాకపోవడం ఇది లెక్కలేనన్నోసారి. నీకు నిజంగా మాట్లాడాలని లేదా? అనే ప్రశ్న నోటి దాక వచ్చి ఆగిపోతుంది ఎప్పుడూ. అసలంటూ ఎప్పుడో ఒకసారి ఫోన్ వస్తుంది కదా, వాళ్ళకి వేరే ఏం తోచనప్పుడైనా, ఆ మాత్రమైనా పాడు చేసుకోవడమెందుకు అనీ…

మెరుపు

పాడుబడ్ద గుడి బయట చింకిగోతాం పరుచుకుని దేశదిమ్మరి ఒకడు కాసేపు నడుంవాల్చి ఆనక గోతాం దులుపుకొని వెళ్ళిపోయాడు.

గుళ్ళో పగుళ్ళుబారిన రాతిబొమ్మ గొంతుపెగుల్చుకు అరుస్తుంది- “దొరా! ఒక్కమారు వెనక్కొచ్చి మసితుడిచి దీపం ముట్టించిపో.”

ఆపాటికే వాడు పొలిమేర దాటిపోయాడు, శృతిలేని వాడి గాలిపాటతో పాటు.

కుక్కపిల్లల ఆట

“ఈ ఒక్క కథా రాసేసి ఇక మానేస్తాను.”

కొలనులోకి విసిరిన రాళ్ళు కొంగల చుట్టూ వృత్తాలు గీస్తుంటే ముంజేత్తో చెమట తుడుచుకుంటూ వాడన్నాడు. నా చేతిలోవి సగం గులకరాళ్ళు వాడి దోసిట్లోకి వదిలాను. కథ దేనిగురించని రెట్టించి అడిగాను. ఊరుకున్నాడు. ఊరికే ఏమనకుండా ఉన్నాడు కాసేపు. ఎగుడు దిగుడు కొండరాళ్ళలో నడుస్తూ అలుపొచ్చి ఆగినప్పుడు జేబులోనుంచి కాగితం బయటికి తీశాడు. చిన్నగా దగ్గి పైకి చదివాడు.

“ఏం జరిగిందో చెప్పుకోడానికి ఏ మనిషినీ నిర్లక్ష్యంగా నమ్మలేని వెలితిలోనుంచి ఈమాటలు రాస్తున్నా.”

మొదటి లైన్ బాగుందా అనడిగాడు.

ఆయాసపడుతున్నావు, కాసిని మంచినీళ్ళు తాగమని ఇచ్చాను.