స్పృహ

ఇన్నినాళ్ళ మౌనానికి మాటలొచ్చి కలుస్తాయి
చూపులకి హృదయం విచ్చుకుంటుంది

ఆకాశాన్నోడించగలనని
సాచిన రెక్కల శబ్దం శూన్యంలోనూ
లబ్డబ్ మని స్పష్టంగా వినబడుతుంది
ముక్కలుగా పడివున్న కాలం
శిశిరంలా రాలివున్న నిశ్శబ్దం
ఉన్నపళంగా వసంతంలా ఒకదానికొకటి పెనవేసుకుంటాయి
ఆనందమో, దుఃఖమో తేల్చుకోలేని సందిగ్ధంలో

ఆ నిముషం ఎవరికీ తెలీని రసహ్యమేదో గుసగుసలాడుతూ
ఊపిరి వేగం పెంచుతున్నప్పుడు
కునుకు మరచిన రేయి లాలనగా ఊ కొడుతుంది
ఎదురుచూపులు పలవరింతలైన వేళ
ఒక సూర్యోదయం చురకలు వేస్తూ సర్ది చెబుతుంది.

అది ఏదైనా కావచ్చు; కవిత్వమో, కధో, పాటో
దారులే వేరై పోవచ్చు, కానీ
గాయాన్ని నిన్ను నీకు కానుక చేసిన చెలిమి
ఒక‌ ఊహను చెంతనే వదల్లేక వదిలి
కదల్లేక కదిలి దిగంతాలు దాటిపోతుంది.

ప్రతి క్షణాన్నీ నీతో సరిపోల్చుకుంటున్నాను
కాలం నా రక్తనాళాల్లో కొలవలేనంత వేగంగా ప్రవహిస్తున్నది.