తిరస్కృత

నిన్ను చూసినప్పుడల్లా
నీ ఆకలి గుర్తొస్తుంది నాకు
నన్ను చూసినప్పుడల్లా
నా అజ్ఞానం వేధిస్తుంది నిన్ను

బిస్మిల్లాఖాన్‌నో
ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మినో
కిశోర్ కుమార్‌నో
నువ్వు ఆస్వాదించే వేళ

బుజ్జిగాడి హోమ్‌వర్క్‌తోనో
మాసిన బట్టలతోనో
నేను కుస్తీ పడుతుంటాను

ఉషా కిరణాల నులివెచ్చని స్పర్శని
సుమబాలల మీది తుషార బిందువుల సోయగాన్ని
పున్నమి చంద్రుని వెన్నెల వానని
రేరాణుల పరిమళ వీచికలని
నువ్వు అనుభూతించే వేళ

కాలం నన్ను చెర్నాకోలతో తరుముతుంది
బాధ్యతల గుర్రాన్ని స్వారీ చేస్తూ
అందరి అవసరాలు తీర్చడానికి
నేను పరిగెడుతుంటాను

కళాత్మక దృష్టి నీది
కర్మకు లోబడిన మనసు నాది
అభిరుచుల ఆరాధన నీది
బంధాల ఆలాపన నాది

చివరికి ఒకే నీడన
రెండు ప్రపంచాలు.
నీ ప్రపంచం తిరస్కరించిన
అజ్ఞానినై నేను.