ఖాళీలను పూరించుము అని ఎవరో చెప్పినట్టు
నవ్వులూ నాలుగు చుక్కల కన్నీళ్ళూ తదితరాలూ
ఎంత ఓపిగ్గా నింపినా నిండదు
నిరతం అసంతృప్తం జీవితం
జీవితమూ ఏ ఖాళీనీ పూరించదు
నల్ల మబ్బుల నీడల్లోనూ,
నీటి బుడగల మెరుగుల్లోనూ
ఎంత వెతికినా కనపడదు
జారిపోయిన ఎనిమిదో రంగు
పగటికీ పగటికీ మధ్య
రాత్రి మడతల్లో దాచుకున్న
కర్పూరపు వాసనలన్నీ ఆవిరవుతాయి
ఆవురావురుమని కావిలించుకున్నవన్నీ
జూదంలో ఒక్కో ఉదయాన్నీ వొడ్డి వోడి
చెల్లని మొహాన్ని చీకటితో కప్పుకుని
తలవంచుకుని ఎవరికీ తెలీకుండా తప్పుకుని
మూసిన గుప్పిటలో ఒక్కో వేలూ తెరిచినట్టు
ఒక్కో రోజూ విచ్చుకుని ఏదీ మర్మమేదీ
లేదన్న గుట్టు విప్పుతుంది
కొలతలకందని వెలితి కలత పెడుతుంది
చలికాలపు చాలీ చాలని దుప్పటిలా
ఒక బొంగురుగొంతు పాటో
బొగ్గుగీతల బొమ్మో
ఆపై అసలేమీ ఎరగనట్టూ ఇంకేమీ పట్టనట్టూ!