ఒక్కోసారి
యుగాల సహజీవనం కూడా
దగ్గరితనాన్ని వెక్కిరిస్తుంది
కలిసి నడవడం కూడా
చట్రంలో బిగించినట్టు
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
మురిసిపోతూ భ్రమలలోనే
ముణిగింది చాలనిపించే కాలమొకటుంటుంది.
పచ్చదనాలను చీల్చుకుని చొరబడిన
నీరెండ పాయల నులివెచ్చనితనాలతో
సంతోషం ఎంతంటే ఏం చెప్పగలను?
ఘడియలు గడిచే కొద్దీ
వేడిలో తేడాలను
సుఖం జాడలనూ వెతకమంటే
ఇంకా ఏమని వివరించగలను?
ఏ గుండెకా రాగాన్ని రచించుకునే చోట
పరితపించిన పాట
ఎవరికీ వినిపించదు
ఇపుడు జీవించాలన్న తలపు
తొలిచేస్తోంది
ఓపినన్ని కలలున్న ఎడారిని నేను
ఒయాసిస్సులను మొలిపించుకోగలను
ఏమో, పాడుకుంటూ పరవళ్ళు తొక్కే
ఒక సెలయేరూ దారిలో ఎదురవ్వచ్చు.