రామానుజం (1887-1920)

ఓడ కదులుతుంది
ఓడి పోలేదు.

కలలో కనిపించిన నామ
క్కల్‌  ఏమని నమ్మ
పలికింది?

చెంత చేరిన చీకటి
లాంతరు నీడలు
పలుసార్లు తుడిచిన
పలక మీద గరగర
బలపం చప్పుడు

ఫైలయిన పిదప
రైలెక్కుతావు..
ఎవరికీ బోధపడని
చివికిన పుస్తకానివి

ఎండసోకని నగరం
లండన్‌ జనావాసం
రసం మసిలే
వసంతకాలం

నిరూపించనంటావు
సరి కాదని హార్డీ
గణితం..కావేరినది
క్షణం..నిలువదు.

ఎవరూ
ఉత్తరాలు రాయరు
ఉత్త సిద్ధాంతాలు
చివరికి..

పొగిలి ఏడ్చే సముద్రం
పొగచూరిన గది
వగరెక్కిన జిహ్వ
పగలూ రాత్రి క్షయం

బాధించిన వనేకం
ఇంకా,అనంతంగా
అంకెలసంకెల తెంచి..
సాధించవలసినదేమి?

ఓడి పోలేదు..
ఓడ కదులుతుంది

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...