కుందాపన: దిగులు పువ్వు

సుదీర్ఘమైన చర్చ
ఓ కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటి వెలుగుల్ని ఒడుకుతున్న కాలం చేతుల్లో
రంగు మారిన దారం

వెన్నెలతో కచేరీ కోసం కాబోలు
వెలుగుతూ ఆరుతూ
చుక్కలు ఏదో రాగాన్ని
ట్యూన్ చేసుకుంటున్నాయ్.

అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.

ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా

ఇక
ఈ రాత్రి కొమ్మకు పూసిన
దిగులు పువ్వు
ఇప్పుడప్పుడే రాలిపోయేట్టు లేదు.